Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

అవయవదానం చేయండి... మరోసారి జీవించండి

దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. అవయవదాన ప్రాధాన్యం, కొన్ని అపోహలూ, వాటిని తొలగించుకోవాల్సిన ఆవశ్యకత వంటి అంశాల సమాహారమే ఈ కథనం.

ఆధునిక వైద్యశాస్త్రంలోని పురోగతి వల్ల ఇప్పుడు అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెట్టగల సామర్థ్యం మన వైద్యులకు ఉంది. అయితే జీవించి ఉన్నవారు తమ అవయవాలను ఎలా ఇవ్వగలరు? అందుకే జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్ పర్సన్స్) నుంచి అవయవాలను సేకరించే అవకాశాన్ని కల్పించేలా మనం చట్టబద్ధమైన మార్గదర్శకాలనూ ఏర్పాటు చేసుకున్నాం.

ఈ మార్గదర్శకాలైతే ఉన్నాయిగానీ... మరణానంతరం అవయవదానాలపై ప్రజల్లో ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. అందుకే 2013 జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ 14 వరకు జీవన్మ ృతుల బంధువుల్లో దాదాపు 300 మందికి పైగా కౌన్సెలింగ్ నిర్వహించినా... ఆ మధ్యకాలంలో అవయవదానానికి ముందుకు వచ్చిన వారి సంఖ్య కేవలం 83 మంది మాత్రమే.

83 మందితో 383 మందికి ప్రాణదానం...

పైన పేర్కొన్న వ్యవధిలో అవయవదానం చేసిన వారు 83 మందే అయినా లబ్ధిపొందింది మాత్రం 383 మంది. ఇందులో 151 మందికి మూత్రపిండాలు, 79 మందికి కాలేయం, ముగ్గురికి గుండె, మరోముగ్గురికి ఊపిరితిత్తులు, 83 మందికి గుండె కవాటాలు, ఇక 65 మందికి నేత్రాలు లభించాయి. (నేత్రాలను మరణానంతరం కూడా స్వీకరించే అవకాశం ఉంది). ఈ లెక్కన చూస్తే 83 మంది 383 మందిని బతికించారన్నమాట.

బ్రెయిన్‌డెడ్ అంటే ఏమిటి, ఎలా నిర్ణయిస్తారు?

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బతగిలి మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోయినా... శరీరం కొద్దిసేపు జీవంతోనే ఉంటుంది. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టిపరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఆ పరిస్థితినే బ్రెయిన్‌డెడ్ కండిషన్‌గా పేర్కొంటారు.

ఒకరు జీవన్మృతుడని నిర్ణయించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతో పాటు, సదరు ఆసుపత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం, కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్‌డెత్‌కు గురైన వారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ‘జీవన్‌దాన్’ బృందం సభ్యులు కలిసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు. ఈ ‘జీవన్‌దాన్’ కార్యక్రమానికి ప్రధాన కార్యక్షేత్రం నిమ్స్ కాగా... అవయవదానం పట్ల అవగాహన పెంచే బాధ్యతలను గాంధీ ఆసుపత్రి, రోగి బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన బాధ్యతలను ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి అప్పగించింది.

అర్హులైన వారికే... అర్హమైన అవయవం...

ఇలా అవయవదానం చేసే సమయంలో ధనికులూ, పేదలూ; గొప్పవారూ, సామాన్యులూ అనే విచక్షణ ఏదీ లేకుండా అర్హులైన వారికే అర్హమైన అవయవం దక్కేలా ఏర్పాటు చేశారు. ప్రతి అవయవ ప్రదానానికి అవసరమైన నిబంధనలను ఆ స్పెషాలిటీకి చెందిన ఒక నిపుణుల బృందం మార్గదర్శకాలను నిర్దేశించింది. దానికి అనుగుణంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని వల్ల ఎలాంటి అవకతవకలకు గాని, ఎలాంటి ఒత్తిళ్లు, సిఫార్సులకు గాని లోనుకాకుండా కేవలం అర్హులైన వారికే ఆయా అవయవాలు అందేలా చూస్తారు.

డిమాండ్ ఎక్కువ... లభ్యత తక్కువ

ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటి లభ్యత తక్కువగానూ ఉన్నందున జీవన్‌దాన్ కార్యక్రమం నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆసుపత్రులకు రొటేషన్ పద్ధతుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇలాంటి ఆసుపత్రులు 30 ఉన్నాయి. ఒత్తిడి వల్లనో, పలుకుబడితోనో అవయవాలు పొందాలన్నా పొందలేని విధంగా ఈ 30 ఆసుపత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్య క్రమాలూ... అన్నీ అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరబాటుకు తావుండదు.

రెండు రాష్ట్రాల్లో కలిపి మూప్ఫై ఆసుపత్రులకే ఎందుకు...?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించే అర్హత, అవయవమార్పిడి చేసే అర్హత ఉన్నాయి. మరిన్ని ఆసుపత్రులకు ఈ వసతి కల్పిస్తే మరింత చావు నీడన బతుకీడుస్తున్న మరింత మందికి అవయవాలు చేరే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ... ఒక వ్యక్తిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించడం చాలా నిబద్ధతతో, నిష్ణాతులైనవారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ముందు చెప్పుకున్నట్లుగా న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థీషియా, జనరల్ ఫిజీషియన్ స్పెషాలిటీలతో పాటు... మరెన్నో సౌకర్యాల, ఉపకరణాల లభ్యత వంటి అంశాలుండాలి.

నైపుణ్యం ఉన్న సిబ్బంది ఉండాలి. వీరంతా ఉన్న ఆసుపత్రులకే ఈ సర్టిఫికేట్ లభిస్తుంది. పైగా ఆ నిపుణుల బృందం పొరబాటుకు తావివ్వకూడదనే ఉద్దేశంతో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి మరీ నిర్ధారణ చేస్తారు. ఇంత జాగ్రత్త, ఇన్ని సౌకర్యాలూ, ఇంత నైపుణ్యం అవసరం కాబట్టే... అన్ని వసతలూ, అన్ని స్పెషాలిటీస్ ఉన్నప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి వారు ఒక బ్రెయిన్‌డెడ్ కేసును నిర్ణయించడమన్నది ఈ నవంబర్ 6న జరిగింది.

అపోహలు తొలగాలి...

అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయి. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే... కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ‘‘ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు జీవన్‌దాన్ కార్యక్రమం ఇన్‌ఛార్జి డాక్టర్ స్వర్ణలత.

ఆధారము: సాక్షి

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free