కాన్పులకు వ్యవధి
కాన్పులకు వ్యవధి అనే సమాచారాన్ని అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే – ఎక్కువ సంఖ్యలో కాన్పులు జరగటం, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం (కనీసం రెండేళ్లు) లేకపోవటం, కౌమార దశ బాలికలకు లేదా 35 ఏళ్లు పై బడిన మహిళలకు కాన్పు జరగటం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. సుమారు 3 వంతు శిశు మరణాలకు ప్రధాన కారణం పైన పేర్కొన్న అంశాలే. మహిళలు, పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడానికి కుటుంబ నియంత్రణ ఒక శక్తివంతమైన మార్గం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వివాహితలు లేదా పురుషులతో కలిసి వుంటున్న వారిలో 10 కోట్ల కన్నా ఎక్కువ మంది మహిళలు తమకు గర్భనిరోధక సాధనాలు (కాంట్రాసెప్టివ్) అందుబాటులో లేవని చెబుతున్నారు. కుటుంబ నియంత్రణ సదుపాయాలు కౌమార దశ బాలికలతో సహా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా లేత వయస్సులోనే పెళ్లిళ్లు జరిగే దేశాల్లో బాలికలకు విద్యతో పాటు కుటుంబ నియంత్రణ సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లయితే మాతా, శిశు మరణాలను చాలా వరకు అరికట్టవచ్చు.
ముఖ్య సందేశాలు :
కాన్పులు వ్యవధి అనే అంశంపై ప్రతి కుటుంబం, సమాజం ఏయే విషయాలను తెలుసుకొనే హక్కు కలిగి ఉందో చూద్దాం.
- 18 ఏళ్ల వయస్సు కన్నా ముందు లేదా 35 ఏళ్ల వయస్సు తర్వాత ధరించే గర్భం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం తెస్తుంది.
- తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే, కాన్పుకు కాన్పుకు మధ్య కనీసం రెండేళ్ల గడువు ఉండాలి.
- నాలుగుసార్లు గర్భం తర్వాత వచ్చే గర్భం వల్ల పిండం ఆరోగ్యానికి, శిశు జననానికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.
- కుటుంబ నియంత్రణ పద్దతులలో తమకు పిల్లలు ఎప్పుడు కావాలి. ఎంత మందిని కనాలి, వారి మధ్య ఎంత ఎడం ఉండాలి అనే ప్రణాళికను అమలు చేయవచ్చు. గర్భ నిరోధానికి నేడు సురక్షితమైన, ఆమోదయోగ్యమైన పద్దతులెన్నో ఉన్నాయి.
- పురుషులు, స్త్రీలు ఇద్దరి పైనా కుటుంబ నియంత్రణ బాధ్యత ఉంది, తద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది.
ముఖ్య సందేశం 1
18 ఏళ్ల వయస్సు కన్నా ముందు గానీ 35 ఏళ్ల వయస్సు తర్వాత గానీ ధరించే గర్భం మహిళలకు, వారికి కలుగ బోయే పిల్లలకు ఆరోగ్య పరంగా ప్రమాదానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
గర్భధారణ, ప్రసవం కారణంగా తలెత్తిన సమస్యలతో ప్రతి ఏటా 5,15,000 మంది మహిళలు మరణిస్తున్నారు. మరణించే ప్రతి మహిళతో పాటు మరో 30 మంది మహిళలు వైకల్యం లాంటి ఇతర తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. కుటుంబ నియంత్రణ పద్దతులను పాటిస్తే, ఈ మరణాలను, ఆరోగ్య వైకల్యాలను అరికట్టవచ్చు.
బాలికలకు మొదటి గర్భధారణను 18 ఏళ్ల వయస్సు నిండే దాకా జాప్యం చేస్తే ఆ తర్వాత సురక్షితమైన ప్రసవానికి గ్యారంటీ ఇవ్వచ్చు. అంతేగాక, పుట్టబోయే బిడ్డ బరువు లోపం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా లేత వయస్సులో అమ్మాయిలకు పెళ్లిళ్లు జరిపే సంప్రదాయం గల దేశాలకు ఇది చాలా అవసరం.
అమ్మాయిలు 18 ఏళ్ల వయస్సు నిండే దాకా కడుపులో బిడ్డను మోయడానికి శారీరకంగా సంసిద్దులు కాలేరు. వయోజన మహిళ కన్నా కౌమారదశ అమ్మాయిలకు కాన్పు కష్టమై ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. వీరికి పుట్టే పిల్లలు మొదటి ఏడాదిలోనే మరణించే అవకాశం ఉంటుంది. బిడ్డను కనే తల్లికి ఎంత తక్కువ వయస్సు ఉంటే, ఆమెతో సహా, ఆమెకు పుట్టబోయే బిడ్డకు అంత ఎక్కువగా ప్రమాదం పొంచి ఉంటుంది. యుక్త వయస్సు మహిళలు గర్భధారణను, జాప్యం చేయడానికి ప్రత్యేక సహాయం అవసరం. ఆమెతో ఆమె కుటుంబ సభ్యులకు లేత వయస్సు లో గర్భం వల్ల కలిగే ముప్పు గురించి, వాటి నివారణ గురించి తెలిసి ఉండాలి.
35 ఏళ్ల వయస్సు తర్వాత వచ్చే గర్భం, కాన్పుల వల్ల కూడా ప్రమాదావకాశాలు పెరుగుతాయి. 35 ఏళ్ల దాటిన మహిళ అప్పటికే నాలుగుసార్లు, గర్భం, ధరించి, తిరిగి ఐదోసారి గర్భవతి అయితే , అది ఆమెకు, ఆమె కడుపులోని పిండం ఆరోగ్యానికి పెను ప్రమాదం తెచ్చే అవకాశం ఉంది.
ముఖ్య సందేశం 2
తల్లీ పిల్లల ఆరోగ్యం కోసం కాన్పుకు – కాన్పుకు మధ్య కనీసం రెండు సంవత్సరాల వ్యవధి ఉండాలి.
కాన్పుల మధ్య రెండేళ్ల కన్నా తక్కువ వ్యవధి ఉంటే శిశువు మరణానికి ఉన్న అవకాశాలు మరో 50 శాతం పెరుగుతాయి.
రెండేళ్ల లోపు వయస్సు గల శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు పెద్ద ప్రమాదం సృష్టించగల అంశం అతని తల్లి కొత్తగా జన్మనిచ్చే శిశువే. పెద్ద శిశువుకు తల్లిపాలు వెంటనే నిలిపి వేస్తారు. వారికి కావలసిన ప్రత్యేక ఆహార పదార్ధాలను తయారు చేయటానికి తల్లికి తగినంత సమయం ఉండదు. పెద్ద శిశువుకు అవసరమైనంత సంరక్షణను, ముఖ్యంగా అనారోగ్యం సమయంలో శిశువు బాగోగులను పట్టించుకోలేరు. ఫలితంగా ఆ శిశువు మానసికంగా, శారీరకంగా ఎదగలేరు. అదే బిడ్డలిద్దరి మధ్య వయస్సులో రెండేళ్ళ కన్నా ఎక్కువ తేడా ఉంటే ఈ దుస్థితి ఉత్పన్నం కాదు.
గర్భధారణ, శిశువు ప్రసవం తర్వాత పూర్తిగా కోలుకోవటానికి మహిళకు కనీసం రెండేళ్ల సమయం అవసరం. అందుకే, ఒక మహిళకు రెండేళ్ల లోపే రెండు కాన్పులు జరిగినట్లయితే ఆమె ఆరోగ్యానికి ప్రమాదమెక్కువ ఉంటుంది. తల్లులు పుష్ఠిని, శక్తిని సమకూర్చుకొని పూర్తి ఆరోగ్యంగా తిరిగి గర్భం దాల్చటానికి తగినంత సమయం కావాలి. ఇద్దరు బిడ్డల మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి అనే విషయంపై పురుషులు అవగాహన కలిగి ఉండాలి. అంతేకాక, కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి నాలుగు కన్నా ఎక్కువ సార్లు గర్భం ధరించ రాదనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఒక కాన్పు తర్వాత పూర్తిగా కోలుకోకముందే మహిళ గర్భం దాలిస్తే, నెలలు ముందే ప్రసవం జరిగి, శిశువు బరువు లోపంతో ఉండే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. బరువులోపంతో పుట్టే శిశువు పెరుగుదల సరిగా ఉండదు, తరచూ అనారోగ్యానికి గురవుతారు. అంతేగాక, సాధారణ బరువుతో జన్మించే పిల్లల కన్నా, బరువు లోపంతో పుట్టే పిల్లలు మొదటి ఏడాదిలోనే చనిపోయే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ముఖ్య సందేశం 3
నాల్గవసారి గర్భం తర్వాత వచ్చే గర్భం శిశు జననానికి ఆరోగ్య ప్రమాద అవకాశాలు ఎక్కువ.
తరచూ గర్భధారణ , శిశుజననం, పాలివ్వడం, శిశు సంరక్షణతో మహిళల శరీరం నిస్త్రాణంగా మారుతుంది. అంటే, సుళువుగా అలసిపోతుంది. నాలుగు సార్లు గర్భం తర్వాత ముఖ్యంగా శీశు జననాల మధ్య రెండేళ్ల కన్నా తక్కువ వ్యవధి ఉన్నపుడు ఆ మహిళ అనీమియా (రక్తహీనత), హేమరేజ్ (రక్తం కోల్పోవటం) లాంటి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గర్భం ధరించిన తల్లికి పుట్టబోయే శిశువు ఆరోగ్య పరంగా అతి పెద్ద ప్రమాదానికి చేరువగా ఉంటాడు.
ముఖ్య సందేశం 4
తమకు పిల్లలు ఎప్పుడు కావాలి, ఎంత మందిని కనాలి, వారి మధ్య ఎంత వ్యవధి ఉండాలి లాంటి అవగాహనను కుంటుంబ నియంత్రణ పద్ధతులు కల్పిస్తాయి. గర్భ నిరోధానికి నేడు ఆమోదయోగ్యమైన, సురక్షితమైన పద్దతులు ఎన్నో ఉన్నాయి.
వివిధ రకాల కుటుంబ నియంత్రణ పద్దతుల్లో ప్రజలు తమకు ఇష్టమైన వాటిని ఎంపిక చేసుకొనేలా హెల్త్ క్లినిక్ లు కృషి చేయాలి. ఈ పద్దతులు ఆమోదయోగ్యమైనవి, అందుబాటు ధరలో ఉన్నవి అయి ఉండాలి.
వివిధ రకాల గర్భనిరోధక సాధనాల్లో కండోమ్స్ (నిరోధ్ లాంటివి) మాత్రమే గర్భం రాకుండా మరియు హెచ్.ఐ.వి / ఎయిడ్స్ తో సహా ఇతర లైంగిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
శిశువుకు మొదటి ఆరునెలల పాటు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇచ్చినట్లయితే ఆ తల్లి తిరిగి గర్భం అవకాశాన్ని జాప్యం చేయవచ్చు. బిడ్డకు రొమ్ముపాలు పూర్తిగా పట్టాలి. ఆ మహిళ వెంటనే గర్భం ధరించే అవకాశాలు 98 శాతం ఉండదు. అయితే, శిశువు వయస్సు ఆరునెలల లోపు ఉండాలి, ఆ మహిళకు నెలసరి రుతుక్రమం పునర్ ప్రారంభం అయి ఉండరాదు. శిశువుకు ఇతర ఆహారం గానీ, పానీయాలు గానీ లేకుండా పూర్తిగా రొమ్ముపాలు మాత్రమే పడుతూ ఉండాలి.
ముఖ్య సందేశం 5
పురుషులు, స్త్రీ లు ఇద్దరి పైనా కుటుంబ నియంత్రణ బాధ్యత ఉంది. తద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రణాళిక లేని గర్భాల నిరోధానికి మహిళలతో పాటు పురుషులు కూడా బాధ్యత తేవాలి. వీరు తమ సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి, సలహాలు తీసుకోవటం ద్వారా అందుబాటులో గల వివిధ రకాల కుటుంబ నియంత్రణ పద్దతుల గురించి తెలుసుకోగలుగుతారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని వైద్యులు, నర్సు, ఉపాధ్యాయులు, కుటుంబ నియంత్రణ వైద్యశాల మరియు, యువ లేదా మహిళా సంఘాల నుంచి కూడా పొందవచ్చు.
సురక్షితమైన మాతృత్వం
సురక్షితమైన మాతృత్వం గురించి అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం.
ఎందుకంటే గర్భధారణ, ప్రసవం కారణంగా తలెత్తిన సమస్యలతో రోజుకు కనీసం 1400 మంది మహిళలు మరణిస్తున్నారు. ఇంకా వేలాది మంది స్త్రీలు గర్భిణులుగా వున్నప్పుడు తలెత్తే సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ప్రాణాలకు ముప్పు తెచ్చేవి గానీ, తీవ్రమైన వైకల్యం కలిగించేవి గానీ అయి ఉంటున్నాయి.
గర్భధారణకు ముందే మహిళ చక్కని పోషకాహారం అలవాట్లు కలిగి, ఆరోగ్యంగా ఉన్నట్లయితే కడుపున శిశువును మోయటం వల్ల తలెత్తే ఆరోగ్య ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. అయితే, ఆ మహిళ గర్భిణిగా ఉన్న ప్రతిసారి కనీసం 4 సార్లు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేత పరీక్ష చేయించుకోవాలి. కాన్పులు చేయటం లో నైపుణ్యం గల వైద్యులు, నర్సుల సమక్షంలోనే ప్రసవం జరగాలి. కాన్పు అయిన 12 గంటల లోపు ఆ మహిళను పరీక్షించాలి. శిశు జననం తర్వాత ఆరు నెలలకు మరోసారి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించాలి.
మహిళలకు కాన్పు ముందు, ఆ తర్వాత అవసరమయ్యే ఆరోగ్య సేవా సదుపాయాలను అందుబాటులో ఉంచటం ప్రభుత్వానిదే బాధ్యత. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి మహిళలకు ప్రసవం సమయంలో వారు సహాయపడేలా చూడొచ్చు. గర్భస్థ దశ, కాన్పు సమయాల్లో తీవ్రమైన సమస్య తలెత్తే అవకాశంగల మహిళలకు ప్రత్యేకమైన సంరక్షణతో పాటు పెద్దాస్పత్రిలో వైద్యం లభించేలా ఆరోగ్య కార్యకర్తలు చూడాలి.
మహిళలపై అన్ని రకాల వివక్షలను రూపు మాపే అంశంపై జరిగిన సదస్సులో అత్యధిక దేశాల ప్రబుత్వాలు ఒక అంతర్జాతీయ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఆ ఒప్పందంలో భాగంగా, గర్భిణీ మహిళలకు అవసరమైన అన్ని రకాల ఆరోగ్య సేవలను కల్పించటానికి ప్రభుత్వాలు చట్టబద్దంగా కట్టుబడి ఉండాలని ప్రకటించాయి.
ముఖ్య సందేశాలు
సురక్షిత మైన మాతృత్వం గురించి ప్రతి కుటుంబం సమాజం ఏయే అంశాలను తెలుసుకొనే హక్కు కలిగి ఉంటారు.
- గర్భస్థ దశ, శిశు జననానికి సంబంధించి ఎదురుకాగల సమస్యలపై హెచ్చరిక సంకేతాలను అన్నీ కుటుంబాలు గుర్తించగలిగి ఉండటం చాలా ముఖ్యం. సమస్య తలెత్తితే వెంటనే నిపుణుల సహాయం తీసుకోవటానికి తగిన ప్రణాళిక, వనరులతో సిద్ధంగా ఉండాలి.
- కాన్పులు చేయటంలో నైపుణ్యంగల వైద్యులు, నర్సులు, లాంటి వారు గర్భస్ధ దశ మొత్తంలో ఆ మహిళను కనీసం నాలుగుసార్లు అయినా పరీక్ష చేయాలి. కాన్పు సురక్షితంగా జరగడానికి సహాయపడాలి.
- గర్భిణీ స్త్రీలందరికీ మామూలు రోజుల్లో కన్నా ఎక్కువగా పోషకాహారం, విశ్రాంతి, ఎక్కువగా అవసరం.
- పొగత్రాగటం, మద్యం, డ్రగ్స్, విషం, కలుషిత పదార్ధాలు గర్భిణీ స్త్రీలకు, శిశువులకు ఎక్కువగా హాని చేస్తాయి.
- మహిళలను, పిల్లలను, శారీరకంగా బాధపెట్టడమనేది చాలా సమాజాల్లో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. గర్భిణిగా వున్న మహిళను శారీరకంగా హింసపెడితే, అది ఆ మహిళకు, ఆమె కడుపులో ఉన్న పిండానికి చాలా ప్రమాదకరం.
- బాల్యము, కౌమార దశలో చక్కని ఆహారం తీసుకొని ఆరోగ్యంతో ఉన్న చదువుకున్న అమ్మాయిలకు గర్భిణీ దశ, శిశు జనన సమయంలో సమస్యలు తక్కువగా ఉంటాయి.
- ఆరోగ్య సంరక్షణ పై ప్రతి మహిళకూ, ముఖ్యంగా గర్భధారణ, శిశు జనన, అంశంలో హక్కు ఉంది. వీరికి ఆరోగ్య సేవలు అందించే వారు సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలి. మహిళలను గౌరవ ప్రదంగా చూడాలి.
ముఖ్య సందేశం - 1
గర్భస్థ దశ, శిశు జననానికి సంబంధించిన ఎదురుకాగల సమస్యలపై హెచ్చరిక సంకేతాలను కుటుంబ సభ్యులందరూ గుర్తించగలిగి ఉండటం చాలా ముఖ్యం. సమస్య తలెత్తితే వెంటనే నిపుణుల సహాయం తీసుకోవటానికి తగిన ప్రణాళిక, వనరులతో సిద్ధంగా ఉండాలి.
ఏ గర్భానికైనా ఆరోగ్యపరంగా కీడు జరిగే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే ఈ సంక్లిష్ట సమస్యలు చాలా వరకు పసిగట్టలేనివి. మొట్ట మొదటి కాన్పు సమయంలో తల్లితోపాటు బిడ్డకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది.
గర్భవతి అయిన మహిళ సమీప వైద్యశాలలో గానీ, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో గానీ కనీసం నాలుగు సార్లయినా పరీక్ష చేయించుకోవాలి. డాక్టరు, నర్సు లాంటి వారి సలహా తీసుకొని కాన్పు ఎక్కడ చేయించుకోవాలి అనేది తెలుసుకోవటం కూడా ముఖ్యం.
గర్భవతిగా ఉన్నపుడు గానీ శిశువు ప్రసవ సమయం లోగానీ, లేదా ఆ తర్వాత కొద్దిసేపటికి గానీ ఎటువంటి హెచ్చరిక లేకుండానే ప్రమాదకరమైన సమస్యలు ముంచుకొచ్చే అవకాశం ఉంది. ప్రతి కుటుంబం కూడా తమ సమీపంలోని ఆసుపత్రికి లేదా క్లినిక్ (వైద్యశాల) చిరునామా స్పష్టంగా తెలిసి ఉండాలి. ఎలాంటి సమయంలో నైనా ఆమహిళను ఆసుపత్రికి తరలించటానికి ప్రణాళిక, అవసరమైన డబ్బు, వాహనం, లాంటి వనరులను కలిగి ఉండాలి. కాన్పుకు గడువు సమీపిస్తే, తాత్కాలికంగా ఆసుపత్రి సమీపంలోని విడిదికి గర్భణిని తరలించి వైద్యసేవలు వెంటనే అందుకొనేలా ఏర్పాటు చేయాలి.
కాన్పు సమయంలో అపాయం తలెత్తే అవకాశం ఉందని కుటుంబ సభ్యులకు తెలిస్తే, ఆసుపత్రి లేదా మెటర్నిటీ క్లినిక్ లోనే ప్రసవం జరగటానికి ఏర్పాటు చేయాలి. ప్రసవాలు అన్నీ కూడా, ముఖ్యంగా మొదటిసారి కాన్పులను మెటర్నిటీ క్లినిక్ లేదా ఆసుపత్రిలో చేయించడమే శ్రేయస్కరం.
గర్భణికి కాన్పు సమయంలో ఎదురుకాగల ప్రత్యేకమైన గండాల గురించి ప్రతి కుటుంబమూ తెలుసుకొని ఉండాలి. అపాయం సంభవించే ముందు కన్పించే హెచ్చరిక సంకేతాలను వెంటనే గుర్తించగలిగి ఉండాలి.
గర్భధారణకు ముందు అపాయం కలుగజేసే అంశాలు :
- కాన్పు జరిగిన వెంటనే మరో కాన్పుకు కనీసం రెండు సంవత్సరాల కన్నా తక్కువ విరామం ఉండటం
- 18 ఏళ్ల లోపు అమ్మాయికి లేదా 35 ఏళ్లు పైబడిన మహిళ గర్భం ధరించటం
- అప్పటికే నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు గల మహిళ తిరిగి గర్భం దాల్చటం
- అంతకు ముందు నెలలు నిండక ముందే శిశువుకు జన్మ ఇచ్చినా లేదా రెండు కిలోల కన్నా తక్కువ బరువుతో శిశువు జన్మించటం
- గడిచిన కాన్పు కష్టమై లేదా సిజేరియన్ ఆపరేషన్ జరిగి ఉండటం
- గతంలో అబార్షన్ జరిగి లేదా మృతశిశువును ప్రసవించి ఉండటం
- మహిళ శరీరం బరువు 38 కిలోల కన్నా తక్కువ ఉండటం
- మహిళ మర్మాంగానికి సున్తీ జరిగి ఉండటం .
గర్భిణిగా ఉన్నప్పుడు అపాయం పై హెచ్చరిక సంకేతాలు.
- శరీరం బరువు పెరగడంలో విఫలం (గర్భిణి కాలంలో కనీసం ఆరు కిలోల బరువు పెరగాలి)
- అనీమియా (రక్తహీనత) కనురెప్పల లోపలి భాగం పాలిపోయినట్లు ఉండడం, (ఆరోగ్యకరమైన వారికి ఇవి ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి) బాగా అలసిపోవటం.
- కాళ్లు, చేతులు లేదా ముఖం అసాధారణంగా వాచి ఉండడం.
- కడుపులో పిండం కదలిక చాలా స్వల్పంగా లేదా అసలు కదలికే లేకపోవటం.
వెనువెంటనే వైద్య సహాయం అవసరమని చెప్పే సంకేతాలు:
- గర్భిణిగా ఉన్నప్పుడు యోని నుంచి రక్తం చుక్కలు పడటం లేదా కాన్పు తర్వాత యోని నుంచి ధారాళంగా రక్తం కారటం.
- తలనొప్పి లేదా కడుపునొప్పి తీవ్రంగా ఉండటం
- తీవ్రమైన లేదా నిరంతరాయంగా వాంతులు
- తీవ్రమైన జ్వరం
- కాన్పు సమయం కన్నా ముందుగానే యోని నుంచి నీళ్లు కారటం.
- వణుకురావటం
- తీవ్రమైన నొప్పి
- సుదీర్ఘమైన పురిటి నొప్పులు.
ముఖ్య సందేశం-2
డాక్టరు, నర్సు, లాంటి నైపుణ్యం గల వారు మహిళను గర్భిణి కాలంలో కనీసం నాలుగు సార్లు పరీక్షించి, కాన్పు సవ్యంగా జరిగేలా చూడాలి. మహిళ గర్భం దాల్చిన ప్రతిసారీ ఆరోగ్యపరంగా ఏదో ఒక అపాయం పొంచి ఉంటుంది. కనుక, ఆమె ఆరోగ్యం పై శ్రధ్ధ చూపాల్సిన అవసరం ఉంది. తాను నెల తప్పినట్లు భావించిన ప్రతి మహిళ కూడా ఆరోగ్యపరమైన గండాలను గట్టెక్కటానికి వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో గానీ, ఆరోగ్య కార్యకర్తను గానీ సంప్రదించాలి. గర్భిణి గా వున్నప్రతిసారీ, ఆ తొమ్మిది నెలల కాలంలో కనీసం నాలుగు సార్లయినా పరీక్షలు జరుపుకోవాలి. అంతేగాక, కాన్పు జరిగిన వెంటనే 12 గంటల వ్యవధిలో మరియు శిశువు జన్మించిన 6 వారాల తర్వాత కూడా వైద్య పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. గర్భిణి కి రక్తస్రావం గానీ, కడుపులో నొప్పిగానీ వచ్చినా లేదా పైన పేర్కొన్న హెచ్చరిక సంకేతాలు గమనించినా వెంటనే ఆరోగ్య కార్యకర్తను గానీ కాన్పులు చేయటంలో నైపుణ్యం గల దాయీలను సంప్రదించాలి. కాన్పు జరగటానికి నిపుణుల సహాయం తీసుకొని 12 గంటల లోపు బాలింతకు పరీక్షలు జరిగినట్లు తల్లీ, శిశువులకు రాగల అనారోగ్యాన్ని, మృత్యువు చాలా వరకు నిరోధించవచ్చు.
కాన్పులు చేయటంలో నైపుణ్యం గల (డాక్టరు, నర్సు, దాయీ లాంటి వారు) మహిళకు సురక్షితమైన గర్భస్థ దశ, ఆరోగ్యవంతమైన శిశు జననానికి ఈ క్రింది విధంగా ఎంతో తోడ్పడగలరు.
- గర్భస్థదశ పురోగతిని ఎప్పటికప్పుడు పరీక్షించటం వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు, ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించవచ్చు.
- తల్లీ బిడ్డలకు ప్రమాదకరంగా మారే అధిక రక్తపోటును పరీక్షించటం.
- అనీమియా(రక్తహీనత) ను పరీక్షించి, గర్భిణికి ఇనుము / ఫోలేట్ మాత్రలను ఇవ్వటం.
- విటమిన్ – ఎ లోపం ఉన్న ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను ఇన్ ఫెక్షన్ నుంచి కాపాడటానికి తగినంత విటమిన్ – ఎ మందులను సూచించటం.
- గర్భిణి దశలో ఇన్ఫెక్షన్ (అంటువ్యాధులు) ముఖ్యంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్, లైంగిక అంటువ్యాధులు లాంటి వాటిని పరీక్షించి, యాంటీ బయోటిక్ మందులు ఇవ్వటం.
- టెటనస్ నుంచి గర్భిణిని, ఆమెకు, పుట్టబోయే శిశువును రక్షించటానికి రెండు ఇంజక్షన్లు ఇవ్వటం.
- గర్భిణీ స్త్రీలందరూ తమ వంటకాల్లో అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడేలా ప్రోత్సహించటం, తద్వారా గాయిటర్ అనే వ్యాధి నుంచి వారిని, భవిష్యత్ లో వారి పిల్లలను మానసిక, శారీరక వైకల్యాల నుంచి కాపాడటం.
- పిండం పెరుగుదల సక్రమంగా ఉన్నదీ, లేనిదీ పరీక్షించటం.
- అవసరమైతే, యాంటీ – మలేరియా (మలేరియా విరుగుడు) మాత్రలను ఇవ్వటం.
- బిడ్డకు జన్మనిచ్చే అనుభూతి పై గర్భిణి స్త్రీ ని ముందే మానసికంగా సంసిద్ధం చేయటం. శిశువుకు రొమ్ముపాలు ఇవ్వటానికి, బాలింత తనతో పాటు శిశువు బాగోగులు చూడటానికి తగిన సూచనలు ఇవ్వటం.
- ప్రసవం (కాన్పు) ఎక్కడ జరగాలనే దానిపై గర్భిణి మహిళ కుటుంబ సభ్యులకు తగిన సలహా ఇవ్వటం, కాన్పు సమయంలో లేదా ఆ తర్వాత సమస్య ఏదైనా వస్తే ఏ రకంగా సహాయంతీసుకోవాలనే దానిపై కూడా వారికి సూచనలివ్వటం.
- లైంగిక వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించటం.
- హెచ్.ఐ.వి పరీక్షలు సలహాలు స్వచ్ఛందంగా, రహస్యంగా అందించటం. హెచ్.ఐ.వి పరీక్షలు సలహాలు రహస్యంగా పొందటానికి ప్రతి మహిళకూ హక్కు ఉంది. గర్భవతులు, బాలింతలు అంటువ్యాధులకు గురైనా లేదా అనుమానం కలిగినా వెంటనే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి, తమ శిశువులకు ఆ వ్యాధి అంటకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, తమ బాగోగుల గురించి తెలుసుకోవాలి.
కాన్పు సమయంలో నైపుణ్యం గల సహాయకులకు ఈ క్రింద విషయాలు తెలిసి ఉంటాయి.
- సుదీర్ఘమైన పురిటి నొప్పులు (12 గంటలకన్నా ఎక్కువగా) మరియు గర్భిణిని ఆసుపత్రికి ఎప్పుడు తీసుకెళ్లాలి.
- వైద్య సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది. వాటిని పొందటం ఎలా.
- ఇన్ ఫెక్షన్ లను నిరోధించటం ఎలా (చేతులు, పరికరాలు, కాన్పు ప్రదేశం అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచటం).
- కడుపులో శిశువు అడ్డంగా తిరగబడితే ఏం చేయాలి.
- తల్లి విపరీతమైన రక్తాన్ని కోల్పోబడితే ఏం చేయాలి.
- బొడ్డు తాడును ఎప్పుడు తెంచాలి. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.
- పుట్టిన వెంటనే శిశువు శ్వాస తీసుకోవటం ప్రారంభించకపోతే ఏం చేయాలి.
- శిశువు ఒంటిపై తడిని తుడిచి వేసి, వారిని వెచ్చగా ఉంచటం ఎలా .
- పుట్టిన వెంటనే శిశువుకు తల్లి పాలు తాగటాన్ని నేర్పటం ఎలా.
- తల్లి గర్భం నుంచి బిడ్డను సురక్షితంగా కాన్పు జరపటం ఎలా మరియు శిశువు జననం తర్వాత తల్లి ఆరోగ్య పరిరక్షణ ఎలా.
- అంధత్వాన్ని (గుడ్డితనం) నిరోధించటానికి శిశువు కళ్లల్లో ఎలా చుక్కల మందు వేయాలి.
- నైపుణ్యంగల సహాయకులు కాన్పు జరిపిన తర్వాత
- ప్రసవం జరిగిన 12 గంటల లోపే మహిళ ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అలాగే ఆరువారాల తర్వాత మరోసారి ఈ పరీక్షలు చేయాలి.
- మరోసారి గర్భం రాకుండా నిరోధించటానికి లేదా వాయిదా వేయటానికి పాటించవలసిన చర్యలను వివరించాలి.
- హెచ్.ఐ.వి లాంటి లైంగిక అంటువ్యాధులను ఎలా నిరోధించాలి. ఈ వ్యాధులు తమ శిశువులకు మార్పిడి జరగకుండా ఏయే చర్యలు తీసుకోవాలి అనే విషయాలను మహిళలకు విడమర్చి చెప్పాలి.
ముఖ్య సందేశం-3
గర్భిణిగా వున్న కాలంలో ప్రతి మహిళకూ మామూలు రోజులకన్నా ఎక్కువగా పౌష్టికాహారంతో కూడిన భోజనం , ఎక్కువ విశ్రాంతి అవసరం.
కుటుంబానికి అందుబాటులో వున్న వాటిల్లో క్రింది పదార్ధాలు గర్భవతికి చాలా అవసరం. పాలు, పండ్లు, కూరగాయలు, మాంసము, చేపలు, గుడ్లు, ధాన్యాలు, బఠానీలు మరియు బీన్స్ గర్భవతిగా వున్న మహిళలకు ఈ ఆహారం సురక్షితమైనది.
గర్భిణిలు ఇనుము ధాతువు, విటమిన్ – ఎ, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా వున్న ఆహారం బాగా తిన్నట్లయితే వారు ఆరోగ్యంగా , బలంగా ఉంటారు. మాంసము చేపలు, గుడ్లు, ఆకుకూరలు, పసుపు లేదా ఆరెంజ్ రంగు పండ్లు, కూరగాయల్లో పైన పేర్కొన్న ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్య కార్యకర్తలు గర్భిణి మహిళలను రక్తహీనత నుంచి కాపాడటానికి ఐరన్ మాత్రలను ఇవ్వాలి. అలాగే, అంటువ్యాధుల నుంచి కాపాడటానికి సరిపడేంత విటమిన్ –ఎ మోతాదులను ఇవ్వాలి. గర్భవతి రోజుకు 10,000 అంతర్జాతీయ యూనిట్లు (ఐ.యు) లేదా వారానికి 25,000 ఐ.యు. కన్నా ఎక్కువగా విటమిన్ – ఎ తీసుకోరాదు.
అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలి. తమ ఆహారంలో తగినంత అయోడిన్ లేని గర్భవతులు పిండం కోల్పోవటం లేదా మానసిక /శారీరక వైకల్యంతో శిశువు జన్మించే ప్రమాదం ఉంది. మెడ చుట్టూ వాపురావటం గాయిటర్ వ్యాధిని సూచిస్తుంది. మహిళకు తగినంత అయోడిన్ లభించటం లేదనటానికి ఇదొక గుర్తుగా భావించాలి. ఒకవేళ, అనీమియా గానీ మలేరియా లేదా కొంకి పురుగులు (నులిపురుగులు) ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే గర్భిణి స్త్రీ సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
ముఖ్య సందేశం-4
పొగత్రాగటం, మద్యపానం, డ్రగ్స్, విష పదార్ధాలు, కలుషితాలు ముఖ్యంగా గర్భవతులకు, శిశువులకు చాలా హాని చేస్తాయి.
గర్భిణి స్త్రీ పొగత్రాగటం లేదా పొగత్రాగే వారి సమీక్షంలో ఉండటం లేదా మద్యం తాగటం, నార్కోటిక్ డ్రగ్స్ వినియోగించటం ద్వారా తన ఆరోగ్యం తో పాటు కడుపులోని పిండం ను కూడా నాశనం చేసుకున్నట్లు అవుతుంది. గర్భవతిగా ఉన్నప్పడు మరీ అవసరమైతే తప్ప, (అది కూడా ఆరోగ్య కార్యకర్త సూచనమేరకే ) ఔషధాలేవీ తీసుకోరాదు.
గర్భవతి అయిన మహిళ పొగతాగితే ఆమెకు పుట్టబోయే శిశువు బరువులోపంతో ఉంటారు. అంతేకాక, ఆ శిశువు కు దగ్గు, జలుబు, ఉబ్బసం, న్యూమోనియా లాంటి శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయి. శిశువు మానసికంగా, శారీరకంగా చక్కగా ఎదగాలి గర్భిణి మహిళను, నవ శిశువును పొగాకు వంటింటి పొగ నుంచి కూడా రక్షించాలి. అంతేకాక పురుగుల మందు, క్రిమిసంహారక మందు లాంటి విషాలు, నీళ్లల్లో ఉండే సీసం లాంటి కలుషితాలు, వాహనాల పొగ, కొన్ని రకాల రంగుల నుంచి కూడా గర్భిణి, శిశువులను దూరంగా ఉంచాలి.
ముఖ్య సందేశం-5
కొన్ని సమాజాల్లో, మహిళలను, పిల్లలను తిట్టడం, కొట్టడం అనేది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. గర్భవతిని హింసిస్తే అది ఆమెతో పాటు ఆమె కడుపులోని పిండానికి కూడా ప్రమాదమే.
గర్భవతి అయిన మహిళ హింసకు గురైతే, ఆమెతోపాటు కడుపులో పిండానికి కూడా తీవ్రమైన హాని కలుగుతుంది. శారీరక హింసకు గురయ్యే గర్భిణి స్త్రీలు మరోసారి గర్భం దాల్చలేరు. కుటుంబ సభ్యులు ఈ ప్రమాదాన్ని గుర్తించి, గర్భిణి మహిళను హింసకు గురి చేసే వ్యక్తి నుంచి రక్షించాలి.
ముఖ్య సందేశం-6
బాల్యం /యవ్వనంలో చక్కని ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉన్న చదువుకున్న అమ్మాయిలకు గర్భిణిగా ఉన్నప్పుడు గానీ, కాన్పు సమయం లోగానీ, స్వల్పమైన సమస్యలే ఎదురవుతాయి. చదవటం, రాయటం, వచ్చిన మహిళలు తమతో సహా కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలరు. కనీసం ఏడు సంవత్సరాలైనా స్కూలుకు వెళ్లి చదువుకున్న అమ్మాయిలు కౌమార దశలోనే గర్భం ధరించటం గానీ చిన్న వయస్సులోనే వివాహం జరిగే అవకాశాలు గానీ తక్కువగా ఉంటాయి. అదే చదువురాని అమ్మాయిలు ఇందుకు విరుద్ధంగా ఉంటారు.
బాల్యము, యుక్త వయస్సులో పోషకాహారం బాగా తీసుకోవటం వల్ల గర్భిణి దశ, శిశువుల ప్రసవం సమయంలో సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పోషకాహారం అంటే బీన్స్ ఇతర పప్పు ధాన్యాలు ఆహారధాన్యాలు, ఆకుకూరలు, ఎరుపు/ పసుపు నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు. వీలైతే పాలు, పాల పదార్ధాలు, గుడ్లు, చేపలు, కోడి మాంసము, మాంసాహారము కూడా ఇందులో చేర్చవచ్చు.
బాలికల లేదా మహిళల మర్మాంగము కత్తిరించటం (సున్తీ) వల్ల యోనిలోను, మూత్రాశయంలోను తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగి ప్రాణాలకు ముప్పు రాగలదు. మహిళల మర్మాంగము కోయటం వల్ల కాన్పు సమయంలో అపాయం తలెత్తి, మానసిక ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది.
ముఖ్య సందేశం-7
ఆరోగ్య పరిరక్షణ పై ప్రతి మహిళకు ముఖ్యంగా గర్భవతులు, శిశుజననానికి ప్రత్యేకమైన హక్కు ఉంది. వీరికి ఆరోగ్య సేవలు అందించే వారు సాంకేతికంగా సమర్ధులై ఉండి, మహిళలకు, గౌరవంగా, మర్యాదగా వైద్య సేవలు అందించాలి.
ఒకవేళ మహిళ ఆరోగ్య పరిరక్షణ, శాస్త్రీయమైన సలహాలు అందుకోవటానికి చక్కని అవకాశం కలిగి ఉంటే గర్భిణి దశ, కాన్పు, ఆ తర్వాత దశలో ఎదురుకాగల ప్రమాదాలను చాలా వరకు నిరోధించవచ్చును.
డాక్టరు, నర్సు లేదా దాయి లాంటి వారి సేవలు తీసుకోవటానికి ప్రతి మహిళ కూడా హక్కు కలిగి ఉంది. అత్యవసరమైన పరిస్దితుల్లో ప్రసవ ఆసుపత్రి సేవలు కూడా పొందవచ్చు.
తగినంత సమాచారం, సలహాలతో కూడిన నాణ్యమైన ఆరోగ్య సేవల ద్వారా మహిళ తన ఆరోగ్యానికి సంబంధించి చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. మహిళ ప్రసవానికి సంబంధించిన సేవలను పొందే విధానం సులువుగా ఉండాలి. దీనికయ్యే ఖర్చు, ఆమెను ఈ సేవల నుంచి దూరం చేయరాదు. వైద్యం చేసేవారు నాణ్యమైన సేవలందించే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. మహిళలకు గౌరవప్రదంగా చికిత్స చేసేలా వారికి శిక్షణ ఇవ్వాలి. మహిళల సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇవ్వాలి. అంతేకాక, గోప్యత పై కలిగిన మహిళల హక్కును గౌరవించాలి.
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
శిశు అభివృద్ధి మరియు చిరు ప్రాయంలోనే వారు నేర్చుకోవటం అనే సమాచారాన్ని అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే బాల్యంలో మొదటి ఎనిమిది సంవత్సరాలు, అన్నిటికన్నా ముఖ్యంగా తొలి మూడు సంవత్సరాలు ఎంతో కీలకమైనవి. భవిష్యత్తు ఆరోగ్యానికి, పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఇవి పునాది వంటిది. ఈ దశలో పిల్లలు మిగతా వయస్సుల్లో కన్నా అతి వేగంగా నేర్చుకోగలుగుతారు. శిశువులు, చిన్న పిల్లలు చాలా వేగంగా పెరగటమే గాక, అతి త్వరగా నేర్చుకొనే శక్తిని కలిగి వుంటారు. అయితే పెద్దలు వారికి ప్రేమ, అనురాగం పంచి, వారిపై శ్రద్ద చూపి, మానసికంగా ఉత్తేజపరచడం ప్రోత్సహించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చినపుడే చిన్నపిల్లలు ఆ శక్తిని ఉపయోగిస్తారు.
పిల్లలందరూ చట్టబధ్ధమైన జనన నమోదుకు హక్కుకలిగి ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ., చక్కని పోషకాహారం, విద్యను పొందటానికి. హింస, వివక్ష, హానుల నుంచి రక్షణ పొందటానికి హక్కు కలిగి ఉంటారు. ఈ హక్కులను నెరవేర్చి, వీటిని గౌరవించి, పరిరక్షించే బాధ్యత తల్లిదండ్రులది, ప్రభుత్వానిది.
ముఖ్య సందేశాలుశిశు అభివృద్ధి మరియు లేత వయస్సులోనే నేర్చుకోవటం అనే అంశం గురించి ప్రతి కుటుంబం, సమాజం, తెలుసుకోవలసిన హక్కు కలిగి ఉంది. ఎందుకంటే –
- బాల్యంలో మొదటి ఎనిమిది సంవత్సరాలు ఇంకా ముఖ్యంగా తొలి మూడు సంవత్సరాల పాటు తల్లిదండ్రుల నుంచి శిశువుకు లభించే పరిరక్షణ, శ్రద్ద, ఆప్యాయత అతడి/ఆమె భవిష్యత్ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు అవుతాయి.
- పుట్టిన వెంటనే పిల్లలు వేగంగా నేర్చుకోవటం మొదలు పెడతారు. వారికి ప్రేమ ఆప్యాయత అంది తగిన ప్రోత్సాహం, మానసికమైన ప్రేరణ తోపాటు పోషకాహారం, సరైన ఆరోగ్య పరిరక్షణ లభిస్తే చిన్న పిల్లలు వేగంగా నేర్చుకొనే శక్తిని పూర్తిగా ఉపయోగిస్తారు.
- పిల్లలను ఆడుకోవటానికి, కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రోత్సాహం ఇస్తే వారు త్వరగా నేర్చుకొని సామాజికంగా, మేధోపరంగా శారీరకంగా ఎదుగుతారు.
- పిల్లలు తమకు సన్నిహితంగా ఉన్న వారిని అనుకరించి తాము, ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు.
- పిల్లల పెరుగుదల, అభివృద్ధికి ఆటంకాన్ని సూచించే హెచ్చరిక సంకేతాలను తల్లి దండ్రులందరూ తెలుసుకొని ఉండాలి. శిశు అభివృద్ధి, లేతవయస్సు లో అభ్యాసం పై అదనపు సమాచారం.
ముఖ్య సందేశం - 1
బాల్యంలో మొదటి ఎనిమిది సంవత్సరాలు మరీ ముఖ్యంగా తొలి మూడేళ్ల పాటు తల్లిదండ్రుల నుంచి శిశువుకు లభించే పరిరక్షణ, శ్రద్ధ, ఆప్యాయత అతడి/ఆమె భవిష్యత్ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు అవుతాయి.
మొదటి సంవత్సరంలో శిశువు పట్ల వ్యక్తం చేసే ప్రేమ, ఆప్యాయత, పరిరక్షణ అతని ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎత్తుకోవటం, హత్తుకోవటం, శిశువు తో మాట్లాడటం లాంటివి అతడి/ఆమె పెరుగుదలను ఉత్తేజపరిచి, ఉద్వేగాన్ని పెంచుతుంది. తల్లికి దగ్గరగా ఉండి, కావలసినప్పుడల్లా రొమ్ముపాలులభిస్తే శిశువు తాను సురక్షింతంగా ఉన్న భావనతో ఉంటాడు. తనకు పోషకాల కోసమే కాకుండా సౌకర్యం కోసం కూడా శిశువు తల్లి పాలు తాగవలసి ఉంటుంది.
శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా సామాన్య అవసరాలు ఆడపిల్లలు, మగపిల్లలకు ఒకే రకంగా ఉంటాయి. నేర్చుకునే శక్తి, సామర్ధ్యాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. తమపై పెద్దలనుంచి శ్రధ్దాసక్తులు, ప్రేమ ఆమోదాలు ఇద్దరికీ ఒకే రకంగా అవసరం అవుతాయి.
ఇంకా మాటలు నేర్వని శిశువులు తమ అవసరాలను ఏడుపు ద్వారా వ్యక్త పరుస్తారు. వెంటనే పెద్దలు స్పందించి ఆ శిశువును ఓదార్పుగా తమ చేతుల్లోకి తీసుకున్నట్లయితే , తాను సురక్షితంగా ఉన్నట్లు ఆ శిశువుకు నమ్మకం ఏర్పడుతుంది.
రక్తహీనత, పోషకలోపం లేదా తరచూ అస్వస్థులుగా ఉండే శిశువులు ఆరోగ్యకరమైన పిల్లలతో పోలిస్తే ఎక్కువగా భయపడుతూ కలత చెందుతుంటారు. ఆడుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవటానికి, ఇతరులతో మాట్లాడటానికి కూడా వీరు ఆసక్తి చూపరు. ఇలాంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధవహించి, తినడానికి ప్రోత్సాహించాలి.
పిల్లలు వ్యక్తం చేసే అనుభూతులు నిజమైనవి. శక్తివంతమైనవి. వారికి కావలసినవి దక్కకపోయినా, చేయాలనుకున్నది చేయలేకపోయినా చాలా నిరాశకు గురవుతారు. కొత్త వ్యక్తులను, చీకటిని చూస్తే పిల్లలు జడుసుకుంటారు. పిల్లలు వ్యక్తం చేసే ప్రతి స్పందనలకు పెద్దలు నవ్వినా, శిక్షించినా లేదా పట్టించుకోకపోయినా వారు పెరిగిన తర్వాత బిడియస్తులుగా తయారవుతారు. వారి అనుభూతులను సరిగా వ్యక్తీకరించలేరు. పిల్లలు బలమైన అనుభూతులను వ్యక్తం చేసినప్పుడు వారి సంరక్షకులు సహనం, సానుభూతిని చూపాలి. అప్పుడే పిల్లలు ఆనందంగా గడుపుతూ సురక్షితమైన భావంతో సమతులంగా పెరుగుతారు.
పిల్లలను శారీరకంగా శిక్షించినా లేదా వారి ఎదుట హింసను ప్రదర్శించినా అది వారి పెరుగుదలను దెబ్బతీస్తుంది. పెద్దల ఆగ్రహానికి, హింసకు గురైన పిల్లలు వయోజనులయ్యాక తాము కూడా హింసాత్మకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు చేయవలసిన వాటిని పెద్దలు స్పష్టంగా వివరించి చెప్పాలి. చేయకూడని వాటి గురించి సూటిగా తెలియజేయాలి. పిల్లలు చేసే మంచి పనులను ప్రశంసించాలి. తద్వారా ఆ పిల్లలకు చక్కని ప్రోత్సాహం లభించి, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారు.
తల్లి దండ్రులు ఇద్దరూ, ఇంకా కుటుంబ సభ్యులు అందరూ పిల్లల సంరక్షణలో పాలుపంచుకోవాలి. తండ్రియొక్క పాత్ర ఇక్కడ చాలా ముఖ్యమైనది. పిల్లలకు అవసరమైన ప్రేమ, అనురాగాన్ని పంచిన వారిలో చురుకుదనం నింపటానికి తండ్రి సహాయం ఎంతో అవసరం. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు చక్కని పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ లభించటానికి తండ్రి గట్టిగా భరోసా ఇవ్వగలడు. పిల్లలు నివసించే ప్రదేశంలో ఎలాంటి హింసకు తావు లేకుండా సురక్షింతంగా ఉండటానికి తండ్రి చర్యలు తీసుకోగలుగుతాడు. అంతేగాక, శిశువు తల్లి గర్భవతిగా లేదా బాలింతగా ఉన్నప్పుడు తండ్రి ఇంటి పనిని కూడా చేయగలరు.
ముఖ్య సందేశం - 2
పుట్టిన వెంటనే శిశువు నేర్చుకోవటం మొదలు పెడతారు. వారికి తగినంత ప్రేమ, పెద్దలనుంచి తమపట్ల శ్రధ్ద, చురుకుదనం తో పాటు చక్కని పోషకాహారం, సరైన ఆరోగ్య పరిరక్షణ లభిస్తే శిశువులు త్వరగతిన పెరిగి, వేగంగా నేర్చుకోగలరు.
పుట్టిన గంటలోపే శిశువును తల్లి హత్తుకొని పాలు ఇచ్చినట్లయితే ఆ శిశువు పెరుగుదల చక్కగా ఉండటమేగాక తల్లితో వారికి అనుబంధం ఏర్పడుతుంది.
శిశువు తన చుట్టు పక్కల ప్రపంచాన్ని కనుకొనటానికి వినటం, చూడటం, ముట్టుకోవటం, వాసన, రుచి చూడటం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగిస్తారు.
పిల్లలతో మాట్లాడటం, వారిని ముట్టుకొని, హత్తుకోవటం లాంటి చర్యలు వారి మెదడు వేగంగా అభివృద్ధి చెందటానికి తోడ్పడతుంది. అంతేకాక, తమకు బాగా తెలిసిన ముఖాలను చూసినపుడు, తెలిసిన గొంతుక వినబడినపుడు, వివిధ రకాల వస్తువులను పట్టుకున్నపుడు కూడా శిశువుల మెదడు వికసిస్తుంది. తమకు చక్కని ప్రేమ లభిస్తోందని తాము సురక్షింతంగా ఉన్నామని పిల్లలు భావించినపుడు, తరచూ ఆటలు ఆడుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడినపుడు వారు వేగంగా నేర్చుకోగలుగుతారు. పిల్లలకు సురక్షింతమైన భావం ఏర్పడినప్పుడు సాధారణంగా స్కూల్ లో బాగా చదువుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులువుగా దాటగలరు.
మొదటి 6 నెలలు పాటు శిశువు కోరినప్పుడల్లా కేవలం తల్లి రొమ్ము పాలు మాత్రమే ఇవ్వటం, ఆ తర్వాత సురక్షింతమైన, పుష్ఠికరమైన అదనపు ఆహారాన్ని ఇవ్వటం, తల్లిపాలను రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువగా పొడిగించడం లాంటివి ఆ శిశువు ఆరోగ్యంగా, పుష్ఠిగా ఎదగటానికి దోహదం చేస్తాయి. అంతేకాక, తనకు లభించే ప్రేమ, సంరక్షుకురాలితో ఏర్పడిన అనుబంధం కూడా శిశువు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇతరులతో మాట్లాడటం, ద్వారా ముఖ్యంగా పిల్లలు నేర్చుకొని, అభివృద్ధి చెందుతారు. తల్లిదండ్రులు, సంరక్షుకులు, తమ పిల్లలలతో ఎంత ఎక్కువగా మాట్లాడి వారి మాటలకు స్పందిస్తారో పిల్లలు అంత ఎక్కువ వేగంగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, సంరక్షుకులు, తమ పిల్లలలతో తరచూ మాట్లాడుతుండాలి. వారికి పాటలు వినిపించాలి. చదువుతుండాలి. పిల్లలు చాలా పదాలను అర్ధం చేసుకోలేక పోయినప్పుటికీ, ఈ సంభాషణ లు వారి భాషను అభివృద్ధి పరచి, వారికి నేర్చుకొనే సామర్ధాన్ని పెంపొందిస్తుంది.
సంరక్షకులు, తమ పిల్లలకు కొత్తవి, ఆసక్తి గొలిపే వస్తువులను ఇవ్వటం, వినిపించటం, ఆడించడం లాంటివి చేస్తే అవి ఆ పిల్లలు నేర్చుకొని, ఎదగటానికి సహాయపడతాయి. శిశువులను, చిన్న పిల్లలను ఎక్కువ సేపు ఒంటరిగా ఉంచరాదు. ఇవి వారి శారీరక, మానసిక అభివృద్ధిని జాప్యం చేస్తుంది.
బాలురకు లభించినట్లే బాలికలకు కూడా అంతే ఆహారం, అదే స్థాయిలో ప్రేమ, సంరక్షణ అవసరం. కొత్తవాటిని నేర్చుకొని, కొత్త విషయాలను చెప్పినప్పడు పిల్లలను ప్రశంసించి, ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.
పిల్లలెవరైనా శారీరకంగా, మానసికంగా ఎదగకపోతే, తల్లిదండ్రులు ఆరోగ్య కార్యకర్త నుంచి సలహాలు పొందాలి. పిల్లలకు తొలుత వారి మాతృభాషలోనే బోధించటం వల్ల వారి ఆలోచనా శక్తి పెరిగి వాటిని వ్యక్తీకరించే సామర్ధ్యన్ని పెంచుకోగలుగుతారు. పాటలు, కుటుంబ కధలు, గేయాలు, ఆటల ద్వారా పిల్లలు బాషను తొందరగా నేర్చుకోగలుగుతారు.
సమయం ప్రకారం ఇమ్యూనైజేషన్ (టీకాలు) పూర్తి చేసుకొని, తగినంత పోషకాహారం పొందిన పిల్లలు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, ఎదుటి వారితో మాట్లాడటానికి, నేర్చుకోవటానికి, ఆడుకోవటానికి ఎక్కువ చురుకుదనం కలిగి ఉంటారు. తద్వారా, వీరి ఆరోగ్యసేవలకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అస్వస్థత కారణంగా వీరు స్కూల్ కు గైర్హాజర్ అయ్యే పరిస్థితి ఉండదు. అనారోగ్య శిశువు సంరక్షణ కోసం తల్లిదండ్రులు తమ రాబడిని వదులుకొని సేవలు చేసే పని కూడా తగ్గుతుంది.
ముఖ్య సందేశం -3
ఆడుకోవటానికి, తెలుసుకోవటానికి పిల్లలను ప్రోత్సహించటం వల్ల వారు బాగా నేర్చుకొని సామాజికంగా, అనుభూతుల పరంగా, శారీరకంగా, మేధోపరంగా తర్వగా ఎదుగుతారు.
పిల్లలు గమ్మత్తుకోసం ఆటలు ఆడుతారు. కాని, వారి నేర్చుకొనే సామర్ధ్యం పెరగటానికి, శారీరకంగా ఎదగటానికి కూడా ఈ ఆటలు తోడ్పతాయి. ఆటలు వల్ల పిల్లల్లో జ్ఞానము, అనుభవము పెంపొందుతాయి. వారిలో జిజ్ఞాస పెరిగి, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఫలితాలను పోల్చుకుంటూ, ప్రశ్నలు అడుగుతూ, సవాళ్లని నెరవేరుస్తూ పిల్లలు కొత్తకొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆటల వల్ల పిల్లల్లో భాషా ప్రావీణ్యం పెరుగుతుంది. ఆలోచించటం, ప్రణాళిక వేయటం, కార్యనిర్వహణ, నిర్ణయాలు తీసుకొనే శక్తి పెంపొందుతుంది. పిల్లలెవరైనా వైకల్యంతో ఉంటే, వారికి ఆటలతో పాటు పెద్దవారి నుంచి ఉత్తేజం లభించడం చాలా ముఖ్యం.
అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఆడుకోవటానికి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి సమాన అవకాశాలు కల్పించాలి. తండ్రితో ఆడుకోవటం, మాట్లాడటం వల్ల ఆ తండ్రి – పిల్లల మధ్య బంధం బలపడుతుంది.
కుటుంబసభ్యులు, సంరక్షకులు పిల్లలకు చిన్నచిన్న పనులు అప్పజెప్పి వారు త్వరగా నేర్చుకోవటానికి సహాయపడవచ్చు. పిల్లలకు తగిన ఆట వస్తువులు ఇచ్చి, స్పష్టమైన సూచనలతో కొత్త కార్యకలాపాలకు వారిని ప్రోత్సహించాలి. అయితే, పిల్లల ఆటలు, కార్యకలాపాలను పెద్దలు గమనిస్తూ, తగిన సలహాలు ఇవ్వాలి కానీ, ఆధిపత్యం చెలాయించరాదు.
సహాయానికి అవకాశం లేని అంశాలను చేస్తామని చిన్న పిల్లలు మారాం చేస్తే, సంరక్షకులు సహనంతో ఉండాలి. రక్షణ లేని వాటి జోలికి వెళ్లేకుండా నిరోధించాలి. కాని, ప్రమాదం లేకుండా, సురక్షితమైన అంశాల్లో పిల్లలు ఏదైనా చేయటానికి సంఘర్షణ పడుతుంటే, అది వారి అభివృద్ధికి దోహదం చేసే మంచి చర్యగా భావించి, ప్రోత్సహించాలి.
వారి వారి వయస్సులకు తగినట్లుగా ఆడుకోవటానికి వివిధ రకాల ఆట వస్తువులు పిల్లలకు అవసరం, నీళ్లు, ఇసుక, కార్డుబోర్డు బాక్స్ లు, వెదురు చెక్కల నిర్మాణం, చిన్న సైజు పాత్రలు, కుండలు తదితర వస్తువులన్నీ కూడా షాపులో కొనుక్కొనే బొమ్మలకు ఏమాత్రం తీసిపోవు.
పిల్లలు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పొందుతూ, మార్పు చెందుతుంటారు. సంరక్షకులు ఈ మార్పులను గమనిస్తూ, అందుకు తగినట్లుగా పిల్లలు త్వరితగతిన నేర్చుకోవటానికి ఆ దిశలో ప్రోత్సహించాలి.
ముఖ్య సందేశం - 4
తమకు సన్నిహితంగా ఉన్నవారిని అనుకరించి, పిల్లలు, తాము ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. ఇతరులను గమనించి, అనుకరించి, చిన్న పిల్లలు సామాజికంగా తాము ఎలా మెలగాలనేది నేర్చుకుంటారు. ఆమోదయోగ్యమైన ప్రవర్తనలు ఏవి. ఆమోదయోగ్యం కానివి ఏవి, అనే విషయాలను తెలుసుకుంటారు.
పసివాళ్ల వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను, తీర్చిదిద్దటంలో పెద్దలు సృష్టించే ఉదాహరణలు శక్తివంతంగా ప్రభావితం చేస్తాయి. పిల్లలు ఇతరులు చెప్పినట్లు కాకుండా, ఇతరులు చేస్తున్న దాన్ని చూసి, అచ్చం అలాగే చేస్తారు. పెద్దలు గట్టిగా అరచి, దురుసుగా ప్రవర్తిస్తే, పిల్లలు కూడా ఆ రకమైన ప్రవర్తననే నేర్చుకుంటారు. ఒకవేళ, పెద్దలు ఇతరులు పట్ల దయతో మర్యాదగా, ఓపికగా ఉంటే, పిల్లలు కూడా అదే బాట అనుసరిస్తారు.
పిల్లలు తమకు విషయాలు తెలుసు అన్నట్లు నటిస్తారు. దీన్ని ప్రోత్సహించినట్లయితే, వారిలో ఊహాశక్తి, సృజనాత్మకత పెంపొందగలదు. పిల్లలు ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకొని, ఆమోదించటానికి కూడా ఇది తోడ్పడుతుంది.
ముఖ్య సందేశం - 5
పిల్లల పెరుగుదల, అభివృద్ధికి ఆటంకాన్ని సూచించే, హెచ్చరిక సంకేతాలను తల్లిదండ్రులు, సంరక్షరకులు తెలుసుకొని ఉండాలి. పసివాళ్లు తగిన విధంగానే ఎదుగుతున్నారని సూచించే ముఖ్యమైన ఘట్టాలను తల్లిదండ్రులు, సంరక్షుకులకు తెలిసి ఉండాలి. శారీరక లేదా మానసిక వైకల్యం గల పిల్లలకు ప్రేమ పూర్వకమైన వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి. ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. అసలు పిల్లలు ఎదుగుదలకు సంబంధించి ఏ దశలో సహాయం కోరాలనేది తల్లిదండ్రులకు, తెలియాలి.
పిల్లలందరూ దాదాపు ఒకే రకమైన పద్దతిలో పెరిగి పెద్దవుతారు. కాని ఆ పెరుగుదల వేగం ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ఉంటుంది.
స్పర్శ, శబ్దము, దృశ్యముకు చిన్న పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తున్నారో తల్లిదండ్రులు, గమనించి, పిల్లల ఎదుగుదలలో సమస్యలు, వైకల్యము తలెత్తే అవకాశాలను, సంకేతాలను పసిగట్టవచ్చు. ఒక శిశువు అభివృద్ది లేదా పెరగుదల మెల్లగా ఉంటే తల్లిదండ్రులు, సంరక్షకులు ఆ శిశువుకు ఎక్కువ సమయం కేటాయించాలి. శిశువు శరీరాన్ని మర్దన చేస్తూ, వారితో మాట్లాడుతూ, ఆడుతూ గడపాలి.
కదలికలకు, ఏకాగ్రతకు శిశువు సరిగ్గా స్పందించక పోతే తల్లిదండ్రులు, సంరక్షకులు వెంటనే వైద్య సహాయం కోరాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, వెనువెంటనే చర్య తీసుకోవటం వల్ల వైకల్యం పూర్తి స్దాయిలో విస్తరించకుండా శిశువును కాపాడవచ్చు. పిల్లలకు సాధ్యమయ్యే శక్తి సామర్ధ్యాలు అభివృద్ధి చెందటానికి తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి ప్రోత్సాహం చాలా అవసరం.
వైకల్యం ఏర్పడిన బాలిక లేదా బాలుడికి అదనపు ప్రేమ, పరిరక్షణ చాలా అవసరం. ఇలాంటి పిల్లలకు పేర్లను ఇతరుల లాగే జనన రికార్డుల్లో నమోదు చేయించాలి. తల్లిపాలు, టీకాలు, పౌష్ఠికాహారం వీరికి అందించాలి. తిట్లు, హింస నుంచి ఈ పిల్లలను పరిరక్షించాలి. వైకల్యంతో ఉన్నపిల్లలను ఇతర పిల్లలతో కలిసి మెలసి, ఆడుకోవటానికి ప్రోత్సహించాలి.
దు:ఖము లేదా ఉద్వేగపరమైన చిక్కులతో వున్న పిల్లలు అసాధారణంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇలాంటి వారు అకస్మికంగా మితృత్వాన్ని వీడుతారు లేదా దు:ఖంగా, బద్దకంగా ఉంటారు. సహాయానికి నిరాకరించే కొంటెవారిగా మారుతారు. తరచూ ఏడుస్తూంటారు, ఇతర పిల్లలతో హింసాత్మకంగా మారుతారు. మిత్రులతో ఆడుకోకుండా ఒంటరిగా ఉంటారు. రోజూ వారీ కార్యకలాపాలు, స్కూలు పట్ల ఆసక్తి కోల్పోతారు. ఆకలి, నిద్రను కూడా కోల్పోతారు.
- ఇలాంటి పిల్లలతో మాట్లాడటానికి లేదా వారు మాట్లాడేది వినటానికి తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. సమస్య అలాగే కొనసాగితే, టీచరును గానీ ఆరోగ్య కార్యకర్తను గానీ సహాయం కోరాలి.
- పిల్లవారికి మానసిక లేదా భావోద్వేగమైన సమస్యలు ఉంటే లేదా తిట్లు తిని ఉంటే (దౌర్జన్యానికి గురైతే) అలాంటి బాలుడు లేదా బాలికకు ఆ సమస్య ఇంకా ముదిరిపోకుండా నచ్చజెప్పాలి.
---------------------------------------------------------------
పిల్లలు ఏ రకంగా అభివృద్ది చెందుతారో తెలుసుకోవటానికి ఈ కింద ఇచ్చిన మార్గదర్శకాలు తల్లిదండ్రులకు ఉపకరిస్తాయి. పెరుగుదల, అభివృద్ది లో పిల్లల మధ్య తేడాలు ఉంటాయి. పెరుగుదల నెమ్మదించటం మామూలు విషయమే కావచ్చు లేదా లోపపోషణ, అనారోగ్యం, చురుకుదనం లోపించటం లేదా అంతకన్నా తీవ్రమైన సమస్యే కావచ్చు. తమ బిడ్డల పెరుగుదలకు సంబంధించి తల్లిదండ్రులు టీచరు తో గానీ, ఆరోగ్య కార్యకర్తతో గాని చర్చించాలనుకుంటారు.
---------------------------------------------------------------
పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు.
నెలరోజుల వయస్సులో శిశువులు ఈ క్రింద పేర్కొన్న అంశాలు చేయగలగాలి.
- తన చెంపను లేదానోటికి తగిలే చేతిపై శిశువు తన తలను తిప్పగలగాలి.
- తన రెండు చేతులను శిశువు తన నోటి వైపు తీసుకురాగలగాలి.
- తనకు పరిచితమైన గొంతుక, శబ్దాల వైపు తిరగగలగాలి.
- తల్లి రొమ్ము చీకుతూ శిశువు తన రెండు చేతులతో దాన్ని ముట్టుకోవాలి.
తల్లిదండ్రులు, సంరక్షకులకు సలహా:
- పుట్టిన గంటలోపే శిశువు చర్మం-తల్లి చర్మానికి తగిలేలా దగ్గరకు చేర్చి, రొమ్ము పాలు ఇవ్వాలి.
- శిశువును లేపి పైకి ఎత్తుకున్నపుడు, అతడు లేదా ఆమె తల కింద దున్నుగా చేయి పెట్టాలి.
- శిశువుకు తరచూ మర్దన చేస్తూ, హత్తుకొంటూ ఉండాలి.
- శిశువుతో ఎల్లప్పుడూ మృదువుగా ఉండాలి. మీరు ఎంత అలసటతో వున్నా, అన్య మనస్సుతో వున్నా ఈ మృదుత్వాన్ని వీడరాదు.
- కనీసం నాలుగు గంటల కొకసారైనా శిశువుకు రొమ్ముపాలు ఇవ్వండి.
- శిశువుతో వీలైనన్ని సార్లు మాట్లాడుతుండాలి. పాటలు పాడాలి.
- పుట్టి 6 వారాలు నిండాక, శిశువుతో సహావెళ్లి ఆరోగ్య కార్యకర్తను సందర్శించాలి.
గమనించ దగిన హెచ్చరిక సంకేతాలు:
- రొమ్ముపాలను శిశువు సరిగా చీకకపోవటం లేదా తిరస్కరించటం
- చేతులు, కాళ్ల కదలిక స్వల్పంగా ఉండటం.
- పెద్ద శబ్దాలకు, కాంతికి సైతం శిశువులో ప్రతి స్పందన లేకపోవటం
- కారణమేమీ లేకున్నా శిశువు అదే పనిగా ఏడవటం
- వాంతులు, విరోచనాలు
ఆరు నెలల వయస్సులో
శిశువు ఈ కింద పేర్కొన్న అంశాలు చేయగలగాలి.
- బోర్లా పడుకున్నప్పుడు శిశువు తలను, ఛాతీని పైకి లేపటం.
- వేలాడుతున్న వస్తువుల వద్దకు చేరుకోవటం.
- వస్తువులను చేతుల్లోకి తీసుకొని, ఊపటం.
- రెండు వైపులో పొర్లాడగలగటం
- ఏదైనా దన్ను (సహాయం) తో కూర్చోగలగటం.
- వస్తువులను చేతులతో, నోటితో తరచి చూడటం.
- శబ్దాలను, ముఖంలో భావాలను అనుకరించే ప్రయత్నం
- తన పేరు విన్నా, తెలిసిన ముఖాలు కనిపించినా ప్రతి స్పందించటం.
తల్లిదండ్రులు, సంరక్షకులకు సలహాలు:
- శిశువును పరిశుభ్రమైన, చదునైన, సురక్షిత ప్రదేశంలో పడుకోబెట్టాలి. తద్వారా వారు స్వేచ్ఛగా వస్తువుల వద్దకు చేరుకోగలరు.
- తన సమీపంలో జరిగే దాన్ని శిశువు తెలుసుకోవటానికి వీలుగా అతణ్ణి / ఆమెను ఎత్తుకోవాలి.
- శిశువు కోరినపుడల్లా రాత్రీ పగలు నిరంతరంగా తల్లి పాలు ఇస్తూనే ఉండాలి. 6 నుంచి 8 నెలల వయస్సులో రెండు పూటల భోజనం, 8 నుంచి 12 నెలల వయస్సులో 3 లేదా 4 పూటల భోజనం అదనపు ఆహారంగా ఇవ్వాలి.
- శిశువుతో వీలైనన్ని సార్లు మాట్లాడుతూ, చదువుతూ లేదా పాడుతూ ఉండాలి.
గమనించదగిన హెచ్చరిక సంకేతాలు:
- కాళ్లు బిగుసుకుపోయి ఉండటం లేదా కదలిక కష్టంగా ఉండటం.
- తలను కదలిస్తూనే ఉండటం (చెవికి అంటువ్యాధి వల్ల ఇలా వెంటనే చికిత్స చేయకపోతే ఇది శాశ్వతంగా శిశువు చెవిటి వారయ్యే ప్రమాదం ఉంది.
- తల్లి రొమ్మును లేదా తెలిసిన వారి ముఖాలను చూసినా, శబ్దాలను విన్నా స్పందించకపోవటం
- రొమ్ముపాలను లేదా ఇతర ఆహారాన్ని తిరస్కరించటం.
12 నెలల వయస్సులో
శిశువు ఈ క్రింద పేర్కొన్న అంశాలను చేయగలగాలి.
- ఎలాంటి సహాయం లేకుండా కూర్చోగలగటం
- చేతులు, మోకాళ్లపై పాకటం. నిలబడగలగటం
- గోడ లేదా ఇతర సహాయంతో అడుగులు వేయటం
- పదాలు, శబ్దాలను అనుకరించే ప్రయత్నం చిన్నచిన్న విజ్ఞప్తులకు స్పందించటం
- ఆడుకోవటం, చప్పట్లు కొట్టడాన్ని ఆనందించటం
- దృష్టిని ఆకట్టుకోవటానికి శబ్దాలను, సంజ్ఞలను పునరుక్తం చేయటం
- బొటన వేలు, మరొక వేలుతో కలిసి వస్తువులను ఏరుకోవటం.
- కప్పు, చెంచాలాంటి వస్తువులను పట్టుకొని, తానే స్వయంగా తినడానికి యత్నించటం.
తల్లిదండ్రులు, సంరక్షకులకు సలహా :
- వస్తువులను వేలుతో చూపి, శిశువులకు వాటి పేర్లు చెప్పటం తరచూ చిన్నపిల్లలలో మాట్లాడుతూ ఆడుకోవటం.
- కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి భోజనాల సమయాన్ని ఉపయోగించండి.
- ఒకవేళ పిల్లవారి పెరుగుదల నెమ్మదించినా లేదా శారీరక వైకల్యం కలిగినా, వారు చేయగల పనులపై దృష్టి నిలిపి అందుకు తగిన విధంగా ఉత్తేజపరచి మాట్లాడాలి. ప్రోత్సహించాలి.
- శిశువును గంటల తరబడి ఒకే భంగిమ లో ఉంచరాదు.
- పిల్లలు ఉండే ప్రదేశాన్ని ప్రమాదానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా సురక్షింతంగా ఉంచండి.
- తల్లి పాలను కొనసాగించాలి. కుటుంబంలోని వివిధ రకాల ఆహారం తోపాటు శిశువుకు సరిపడా ఆహారం అందేలా చూడాలి.
- స్పూను, కప్పు పట్టుకొని శిశువు స్వయంగా తానే తినేందుకు చేసే ప్రయత్నానికి సహాయం చేయండి.
- శిశువుకు అన్ని రకాల టీకాలు (ఇమ్యునైజేషన్) పూర్తయ్యేలా నిర్థారించుకోవాలి. సిఫారుసు చేసిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలు అందేలా చూడాలి.
గమనించదగిన హెచ్చరిక సంకేతాలు.
- ఇతరుల శబ్దానికి ప్రతి స్పందనగా శిశువు శబ్దం చేయకపోవటం
- కదిలే వస్తువులను శిశువు చూడకపోవటం
- సంరక్షకుల పట్ల శిశువు స్పందించకపోవటం
- శిశువుకు ఆకలి లేకపోవటం లేదా ఆహారాన్ని తిరస్కరించటం.
రెండు సంవత్సరాల వయస్సులో
శిశువు ఈ క్రింది పనులను చేయగలగాలి.
- నడవటం, ఎక్కటం, పరిగెత్తటం
- వస్తువుల, శరీర భాగాల పేర్లు చెప్పినపుడు వాటిని శిశువు వేలు చూపి గుర్తించటం (ఉదాహరణకు ముక్కు, కాళ్ళు)
- 15 నెల వయస్సు నుంచే పదాలను కలిపి చెప్పటం
- చిన్న చిన్న సూచనలను, ఆదేశాలను పాటించటం
- తనకు ఇచ్చి పెన్సిల్ లేదా క్రేయాన్ తో శిశువు గీతలు గీయటం.
- చిన్న చిన్న పాటలు, కథలను విని ఆనందించటం
- ఇతరుల ప్రవర్తనను చూసి అనుకరించటం.
- తానే స్వయంగా భుజించేది ప్రారంభించటం
తల్లిదండ్రులు, సంరక్షకులకు సలహాలు
- · శిశువుతో చదవటం, పాటడం, ఆడటం, · ప్రమాదకర వస్తువులను ఎలా నివారించాలో శిశువుకు బోధించటం
- మీరు చిన్నపిల్లల తరహాలో కాకుండా మామూలు గానే వారితో మాట్లాడటం
- తల్లి పాలను కొనసాగించాలి. శిశువుకు సరిపడా ఆహారం, కుటుంబంలో తయారుచేసిన రకరకాల వంటకాలు అందేలా చూడాలి.
- పిల్లలు భుజించడానికి ప్రోత్సహించండి కాని, బలవంత పెట్టకండి.
- పిల్లలకు సులువైన నిబంధనలనే పెట్టండి. వారి నుంచి సహేతుకమైన ఫలితాలనే ఆశించండి.
- పిల్లలు ఏదైనా సాధిస్తే, పొగడండి. మెచ్చుకోండి.
గమనించదగిన హెచ్చరిక సంకేతాలు
- ఇతరుల పట్ల శిశువు లో ప్రతి స్పందన లేకపోవటం
- నడిచేటప్పుడు అదుపు (బ్యాలెన్స్) కోల్పోతూ ఉండటం (వెంటనే ఆరోగ్య కార్యకర్తకు చూపండి)
- గాయాలు కావటం. ప్రవర్తనలో చెప్పలేని మార్పులు చోటుచేసుకోవటం
- ఆకలి లేకపోవటం.
మూడు సంవత్సరాల వయస్సులో
- పిల్లలు ఈ క్రింది విధంగా చేయగలగాలి.
- నడవటం, పరిగెత్తటం, ఎక్కటం, తన్నటం గెంతటం లాంటివి సులువుగా చేయటం
- సాధారణ వస్తువులను, చిత్రాలను వేలితో చూపి, గుర్తించటం
- రెండు – మూడు పదాలు కలిగిన వాక్యాలను పలకడం
- తన పేరు, వయస్సును తానే చెప్పటం
- రంగుల పేర్లు చెప్పటం
- సంఖ్యలను అర్ధం చేసుకోవటం
- నమ్మింప జేసే ఆట వస్తువులను ఉపయోగించటం
- తానే స్వయంగా భుజించటం
- ప్రేమను వ్యక్తం చేయటం
తల్లిదండ్రులు, సంరక్షకులకు, సలహాలు
- పిల్లలతో కలిసి పుస్తకాలను చూడటం, చదవటం అందులోని బొమ్మల గురించి మాట్లాడటం
- చిన్న పిల్లల కథలు చెప్పటం, గేయాలు, పాటలు నేర్పటం
- పిల్లల భోజనం ప్లేటును వారికే ఇవ్వటం
- పిల్లలు తినటానికి ప్రోత్సహిస్తూ, అందుకు వారికి అవసరమైనంత సమయం ఇవ్వటం.
- దుస్తులు ఎలా వేసుకోవాలో పిల్లలు నేర్చుకోవటానికి సహాయపడటం. మరుగు దొడ్డిని ఎలా ఉపయోగించాలి, చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పటం.
గమనించదగిన హెచ్చరిక సంకేతాలు
- ఆటల పట్ల ఆసక్తి కోల్పోవటం
- తరచుగా కిందపడటం
- చిన్నవస్తువులను కూడా సరిగా పట్టుకోలేకపోవటం
- చిన్నచిన్న సందేశాలను కూడా అర్థం చేసుకోలేకపోవటం
- వాక్యాలను పలకడానికి పదాలను కూర్చలేకపోవటం
- ఆహారం పట్ల స్వల్పమైన ఆసక్తి లేదా అసలు ఇష్టం లేకపోవటం
అయిదు సంవత్సరాల వయస్సులో
పిల్లలు ఈ క్రింద పేర్కొన్నట్లు చేయగలగాలి
- సమన్వయమైన దారిలో వెళ్లగలగాలి
- క్లిష్టమైన పదాలను కూడా ఉపయోగించే వాక్యాలను మాట్లాడటం
- వ్యతిరేకమైన పదాలను అర్థం చేసుకోవటం (ఉదాహరణకు లావు – సన్నం, పొడవు – పొట్టి)
- ఇతర పిల్లలతో ఆడటం
- ఇతరుల సహాయం లేకుండా తానే స్వయంగా దుస్తులు వేసుకోవటం
- సాధారణమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలగటం
- 5 నుంచి 10 వస్తువులను లెక్కబెట్టడం
- తన చేతులు తానే కడుక్కోవటం
తల్లిదండ్రులు, సంరక్షకులకు సలహాలు
- · పిల్లలు చెప్పేది వినాలి.
- పిల్లలతో తరచూ సంభాషణ జరపాలి
- పిల్లలు నత్తిగా మాట్లాడితే, మెల్లిగా మాట్లాడవలసిందిగా సూచించాలి.
- కథలను చదివి చెప్పాలి.
- ఆటలు ఆడుకోవటానికి, పరిశీలించటానికి పిల్లలను ప్రోత్సహించాలి.
గమనించదగిన హెచ్చరిక సంకేతాలు
- ఆటల్లో పిల్లలు పోషించే పాత్రను గమనించండి. ఒకవేళ ఆ అబ్బాయి లేదా అమ్మాయి భయపడుతున్నా, కోపంతో ఉన్నా లేదా హింసకు పాల్పడినా అవి భావోద్వేగానికి సంబంధించిన సంకేతాలుగా గుర్తించాలి.
రొమ్ము పాలు (తల్లిపాలు)
“రొమ్ముపాలు” అనే అంశం గురించి తెలుసుకొని, అమలు చేయటం ఎందుకు ముఖ్యం అంటే -
తల్లి రొమ్ముపాలు తాగే శిశువులకు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ఇతర పానీయాలు, ఆహారం తీసుకొనే శిశువులతో పోలిస్తే, రొమ్ముపాలు తాగే శిశువుల పెరుగుదల బాగుంటుంది. శిశువులందరికీ మొదటి ఆరునెలల పాటు తల్లి పాలను మాత్రమే తాగించినట్లయితే, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది శిశువులను మృత్యు ముఖం నుంచి కాపాడవచ్చు. ఇంకా లక్షలాది మంది ఆరోగ్యాన్ని, పెరుగుదలను మెరుగుపరచవచ్చు.
రొమ్ముపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో లభించే పాలపొడి పానీయాలు, గేదె / ఆవు తదితర జంతువుల పాలు శిశువుల ఆరోగ్యానికి ముప్పు తెస్తాయి. రొమ్ముపాలకు ప్రత్యామ్నాయంగా లభించే పానీయాలు, పాలపొడి , ఖరీదైనవి. వీటిని శిశువుకు సరిపడే విధంగా తల్లిదండ్రులు కొనలేనపుడు లేదా వీటిని కలపడానికి వాడే మంచి నీరు శుభ్రంగా లేనపుడు శిశువు ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది.
దాదాపు ప్రతీ తల్లి తన శిశువుకు రొమ్ముపాలు ఇవ్వగలదు. బిడ్డకు పాలివ్వలేనని విశ్వాసం లోపించే తల్లులను ఆ శిశువు తండ్రి, బంధు మిత్రులు ప్రోత్సహించి ప్రత్యక్ష మద్దతు అందజేయాలి. ఆరోగ్య కార్యకర్తలు, మహిళా సంఘాలు, ప్రసార మాధ్యమాలు, యాజమానులు కూడా శిశువుకు తల్లిపాలు అందేలా ప్రోత్సాహం అందించాలి.
తల్లిపాలతో కలిగే ప్రయోజనాల సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. ఈ సమాచారాన్ని అందించే బాధ్యత ప్రతి ప్రభుత్వం పైనా ఉంది.
ముఖ్యమైన సమాచారాలు :
రొమ్ముపాలకు సంబంధించి ప్రతి కుటుంబం, సమాజం ఏయే అంశాలకు తెలుసుకోవలసిన హక్కు కలిగి ఉంది.
- శిశువుకు మొదటి 6 నెలల పాటు ఆహారమైనా, పానీయమైనా కేవలం తల్లి రొమ్ముపాలు మాత్రమే అవసరమవుతాయి. మొదటి ఆరు నెలలపాటు ఏ ఇతర పదార్థాలు గానీ, పానీయాలు గానీ చివరకు మంచి నీళ్లు కూడా శిశువుకు అవసరం ఉండదు.
- హెచ్.ఐ.వి. సోకిన మహిళ రొమ్ముపాల ద్వారా ఆ వ్యాధి శిశువుకు అంటుకొనే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన లేదా అనుమానం ఉన్న మహిళ తమ సమీప ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి శిశువుకు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.
- పుట్టిన గంట లోపే శిశువుకు తల్లిపాలను ఇవ్వాలి. శిశువును తల్లికి సన్నిహితంగా (అంటే తల్లి శిశువు చర్మాలు తాకేలాగా ) చేర్చాలి.
- తరచూ పాలివ్వటం ద్వారా రొమ్ముల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాదాపు తల్లులందరూ తమ శిశువులకు విజయవంతంగా పాలివ్వగలరు.
- శిశువులను, బాలబాలికలను ప్రమాదకర వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షించగలవు. అంతేగాక, తల్లీ, పిల్లల మధ్య విడదీయరాని అనుబంధాన్ని సృష్టిస్తాయి.
- సీసా పాలవల్ల అనారోగ్యం కలిగి, మరణానికి కూడా దారి తీయవచ్చు. మహిళ తన శిశువుకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే, ఆమె రొమ్ము నుంచి తీసిన పాలను గానీ ప్రత్యామ్నాయ రొమ్ము పాలను గానీ ఒక సాధారణమైన కప్పులో (దీన్ని బాగా శుభ్రపరచాలి) పోసి, శిశువుకు తాగించాలి.
- 6 నెలలువయస్సు దాటిన శిశువుకు వివిధ రకాలైన అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. అయితే, దీంతో పాటు తల్లిపాలను కూడా రెండేళ్లు దాటే వరకూ ఇవ్వాలి.
- ఇంటి నుంచి దూరంగా వెళ్ళే పని / ఉద్యోగం చేసే మహిళ, తాను శిశువుతో ఉన్నంత సేపు వీలైనన్ని ఎక్కువసార్లు పాలివ్వాలి.
- శిశువుకు పూర్తిగా రొమ్ముపాలిచ్చే మహిళ, మొదటి 6 నెలల లోపు తిరిగి గర్భం ధరించకుండా 98 శాతం రక్షణ లభిస్తుంది. అయితే, ఈ లోపు ఆమె రుతుక్రమం పునర్ ప్రారంభం కారాదు. శిశువుకు రొమ్ముపాలు తప్ప ఇతర ఎలాంటి పానీయాలు గానీ, ఆహారం గానీ ఇవ్వరాదు.
ముఖ్య సందేశం - 1
శిశువుకు మొదటి 6 నెలలు పాటు కేవలం తల్లి రొమ్ముపాలు మాత్రమే అవసరమవుతాయి. మొదటి 6 నెలలు పాటు ఏ ఇతర పదార్థాలు గానీ, పానీయాలు గానీ, చివరకు మంచినీళ్లు కూడా శిశువుకు అవసరం లేదు.
నవ శిశువుకు తల్లిపాలు అత్యుత్తమమైన ఆహారం గేదె / ఆవు లాంటి జంతువుల పాలు, పాలపొడి, టీ, తీయటి పానీయాలు, మంచినీరు, ధాన్యపు ఆహారం లాంటివన్నీ రొమ్ముపాల ముందు దిగదుడుపే తల్లి పాలకు ఏవీ సాటిరావు.
రొమ్ముపాలు శిశువుకు సులువుగా జీర్ణమవుతాయి. అంతేగాక, శిశువు పెరుగుదల అభివృద్ధికి దోహదం చేస్తుంది. అనారోగ్యాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
వేడి, పొడి వాతావరణాల్లో సైతం శిశువుకు కావలసిన ద్రవ పదార్థాల అవసరాన్ని రొమ్ముపాలు తీరుస్తాయి. శిశువుకు మొదటి 6 నెలల వరకు మంచి నీరు గానీ, ఇతర పానీయాలు గానీ, అవసరం లేదు. రొమ్ముపాలు కాకుండా శిశువుకు ఇతర పానీయాలు గానీ, ఆహారం గానీ ఇచ్చినట్లయితే విరేచనాలు, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
రొమ్ముపాలకు ప్రత్యామ్నాయమైన పాలపొడి లాంటి. పోషక పదార్థాలు చాలా ఖరీదైనవి. ఉదాహరణకు, ఒక శిశువుకు ఏడాది మొత్తం ఈ ప్రత్యామ్నాయ పాలు తాగించాలంటే 40 కిలోలు (సుమారు 80 డబ్బాలు) అవరసమవుతాయి. ఈ ప్రత్యామ్నాయ పాలు ఇవ్వాలనుకునే తల్లులకు వీటి ఖరీదు గురించి ఆరోగ్య కార్యకర్తలు వివరించాలి.
6 నెలల లోపు శిశువు పెరుగుదలను క్రమం తప్పక గమనించాలి. ఒకవేళ, వారి శరీర బరువులో పెరుగుదల లేకపేతే :
- ఆ శిశువుకు ఇంకా తరచూ పాలు ఇస్తుండాలి. 24 గంటల్లో కనీసం 12 సార్లు తల్లి పాలివ్వాలి. ప్రతిసారి శిశువు కనీసం 15 నిమిషాల పాటు తల్లిపాలు తాగాలి.
- పాలు తాగడానికి వీలుగా తల్లి రొమ్మును నోట్లో సరిగా పెట్టుకోవటానికి ఆ శిశువుకు సహాయం కావాలి.
- ఆ శిశువు అనారోగ్యంతో ఉండొచ్చు కనుక, అరోగ్య కార్యకర్తకు చూపించాలి.
- మంచినీరు లేదా ఇతర పానీయాలు తాగటం వల్ల శిశువు తల్లిపాల వినియోగాన్ని తగ్గిస్తుంది.
- తల్లి తన శిశువుకు రొమ్ముపాలు తప్ప ఇతర ద్రవ పార్థాలేవీ ఇవ్వరాదు.
ఏ శిశువుకైనా 6 నెలల వయస్సు దాటాక ఇతర ఆహారం, పానీయాలు అవసరం. అయితే, ఈ అదనపు ఆహార పానీయాలతోపాటు తల్లి పాలను కూడా రెండేళ్లు వయస్సు పైబడే వరకూ కొనసాగించాలి.
ముఖ్య సందేశం - 2
హెచ్.ఐ.వి. సోకిన మహిళ రొమ్ముపాలు ద్వారా, ఆ వ్యాధి శిశువుకు అంటుకొనే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన లేదా అనుమానం ఉన్న మహిళ తమ సమీప ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి శిశువుకు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.
హెచ్.ఐ.వి. వ్యాధిని నివారించడం ఎలా అని తెలుసుకోవటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. గర్భిణీ, బాలింతలు దీని గురించి ఎక్కువగా తెలుసుకోనే అవసరం ఉంది. ఒకవేళ వీరికి హెచ్.ఐ.వి. వ్యాధి వస్తే, అది వీరి శిశువులకు కూడా అంటుకొనే ప్రమాదం ఉంది. గర్భస్థ దశ లేదా శిశు జననం లేదా పాలిచ్చే దశలో ఈ వ్యాధి తల్లి నుంచి శిశువుకు సోకుతుంది.
శిశువుకు ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే, ముందుగాతల్లి తనకు ఈ వ్యాధి అంటుకోకుండా నివారించడమే ఉత్తమమైన మార్గం. లైంగికంగా మార్పిడి జగిగే హెచ్.ఐ.వి. ప్రమాదాన్ని తగ్గించాలంటే, సంపర్కం జరపరాదు. ఈ వ్యాధి లేని భాగస్వాములు శారీరకంగా కలవటం లేదా కండోమ్ తో గానీ యోని ప్రవేశం జరపకుండా గానీ సురక్షిత సంపర్కం ద్వారానే హెచ్.ఐ.వి. వ్యాధిని నివారించగలము.
వ్యాధి సోకిన లేదా అనుమానం ఉన్న గర్భిణులు, బాలింతలు ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి పరీక్షలు చేయించికోవాలి. సలహాలు పొందాలి.
ముఖ్య సందేశం - 3
పుట్టిన గంటలోపే శిశువుకు తల్లి పాలను ఇవ్వాలి. శిశువును తల్లికి సన్నిహితంగా ( అంటే తల్లీ - శిశువు చర్మాలు తాకేటంతగా ) చేర్చాలి.
అప్పుడే జన్మించిన శిశువును తల్లి చర్మానికి తాకేటంత సన్నిహితంగా వీలైనంత వరకూ ఉంచాలి. తల్లీ - శిశువులు ఒకే గదిలో, ఒకే మంచంపై ఉండటం ఉత్తమం. శిశువుకు కావలసినన్నిసార్లు తల్లి రొమ్ముపాలు ఇస్తూనే ఉండాలి.
బిడ్డ పుట్టిన వెనువెంటనే తల్లి పాలు ఇవ్వటం మొదలు పెట్టండి. తద్వారా తల్లి రొమ్ముపాల్లో పాల ఉత్పత్తికి తగినంత ప్రేరేపణ కలుపుతుంది. అంతేగాక, అంటు వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తుంది.
బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లిపాలు పసుపు రంగులో చిక్కగా ఉంటాయి ముర్రుపాలు ( కొల్పొస్ట్రమ్ ) గా పిలిచే ఈ పాలు శిశువుకు అతి ఉత్తమమైన/ చాలా మంచి ఆహారం. ఈ పాలలో పోషక పదార్థాలు గణనీయంగా ఉండి, బిడ్డను అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కొందరు తల్లులు శిశువుకు ముర్రుపాలు ఇవ్వరాదని చెబుతారు. కాని, ఈ సలహా చాలా తప్పు.
శిశువుకు తల్లిపాలు తప్ప ఇతర ఆహారం గానీ, పానీయాలు గానీ అవసరం లేదు.
ఆస్పత్రి లేదా వైద్యశాలలో ప్రసవం జరిగితే, శిశువును 24 గంటలపాటు తనగదిలోనే తనతో పాటు ఉంచుకునే హక్కు తల్లికి ఉంటుంది. శిశువుకు తల్లి పాలు ఇవ్వగలిగితే చాలు. నీళ్లు గానీ, ఇతర పదార్థాలు, పానీయాలు గానీ ఇవ్వరాదు.
ముఖ్య సందేశం - 4
తరచూ పాలివ్వటం ద్వారా రొమ్ముల్లో పాలు ఉత్పత్తి పెరుగుతుంది. దాదాపు ప్రతి తల్లీ తన శిశువుకు విజయవంతంగా పాలివ్వగలదు.
కొత్తగా తల్లులైన వారిలో చాలా మందికి శిశువుకు పాలు పట్టడంలో తోటి మహిళల నుంచి ప్రోత్సాహం, సహాయం ఉవసరం. అప్పటికే విజయవంతంగా పాలిచ్చిన మరో మహిళగానీ, కుటుంబ సభ్యులు / మిత్రులు లేదా రొమ్ముపాలకు మద్దతు తెలిపేవారు ఎవరైనా గానీ కొత్తగా తల్లులైన వారిని ప్రోత్సహించాలి. రొమ్ముపాలు ఇవ్వటంలో ఎదురయ్యే, సమస్యలను నివారించటానికి, సందిగ్థతలను తొలగించటానికి కొత్త తల్లులకు సహాయం చేయాలి.
తల్లి తన శిశువును ఎలా ఎత్తుకోవాలి లేదా పట్టుకోవాలి ? శిశువు తల్లి రొమ్మును తన నోట్లోకి ఎలా తీసుకుంటాడు ? అనే విషయాలు చాలా ముఖ్యమైనవి. శిశువును సరైన భంగిమలో ఎత్తుకోవటం వల్ల ఆ శిశువుకు సులువుగా తల్లి రొమ్మును నోట్లో పెట్టకొనే సౌలభ్యం కలుగుతుంది. అప్పుడే ఆ శిశువు తల్లి పాలను కడుపార తాగ గలుగుతారు.
రొమ్ముపాలను చీకటానికి శిశువు సరైన భంగిమలోనే ఉన్నాడని తెలిపే సంకేతాలు :
- శిశువు శరీరం మొత్తం తల్లివైపు తిరిగి ఉండటం.
- శిశువు తల్లికి చాలా దగ్గరగా, సన్నిహితంగా ఉండటం.
- శిశువు విశ్రాంతిగా, సంతోషంగా ఉండటం.
శిశువు పాలు చీకటానికి ఇబ్బందికర మనిపించే భంగిమ వల్ల కలిగే కష్టాలు
- చనుమొనలపై పగుళ్లు ఏర్పడటం
- తగినంతగా పాలు లేకపోవటం
- పాలు ఇవ్వటానికి నిరాకరించటం
శిశువు తల్లి పాలను బాగానే తాగుతున్నాడని తెలిపే సంకేతాలు:
- శిశువు నోరు వెడల్పుగా తెరచి ఉండటం
- శిశువు చుబుకము (గెడ్డం) తల్లి రొమ్మును తాకు తుండటం.
- తల్లి చనుమొనల చుట్టూ శిశువు నోరు తగిలే ప్రాంతం కన్నామిగతా రొమ్ము చర్మం నల్లబడి ఉండటం.
- శిశువు సుదీర్ఘంగా, గాఢంగా పాలు చీకటం
- తల్లి చనుమొనలలో ఎలాంటి నొప్పి లేకపోవటం
దాదాపు ప్రతి తల్లీ తన శిశువుకు సరిపడేంత పాలను ఉత్పత్తి చేయగలదు. ఎలాగంటే
- బిడ్డకు రొమ్ముపాలు మాత్రమే ఇవ్వటం
- శిశువు చక్కని భంగిమలో ఉండి, తల్లి రొమ్మును సులభంగా నోట్లోపెట్టుకోగలగటం
- శిశువుకు కావలసినన్ని సార్లు, రాత్రి వేళల్లో తరచూ పాలివ్వటం.
పుట్టినప్పటినుంచి బిడ్డకు కావలసినన్ని సార్లు పాలు ఇస్తుండాలి. పాలు తాగిన నవ శిశువు మూడు గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోతే, ఆ శిశువును మృదువుగా లేపి తల్లి రొమ్ము అందించాలి. శిశువు ఏడుస్తున్నారంటే దానికి అర్థం తనకు ఇతర ఆహారమో, పానీయమో కావాలని కాదు. తనను ఎక్కువసేపు ఎత్తుకోవాలనీ, హత్తుకోవాలనీ దానికి అర్థం. కొందరు శిశువు తమకు తాము సౌకర్యంగా ఉండాటానికి తల్లి రొమ్ము చీకుతుంటారు. దీనివల్ల తల్లిరోమ్ముల్లో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
తొలి రోజుల్లో తమ రొమ్ముపాలు బిడ్డకడుపు నింపడానికి సరిపోవటం లేదని తల్లులు భావించి, వారికి ఇతర ఆహారం లేదా పానీయం ఇస్తుంటారు. దీనివల్ల ఆ బిడ్డ తల్లి రొమ్మును తక్కువ సేపు చీకుతారు. ఫలితంగా రొమ్ముల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. తన బిడ్డకు ఇతర ఆహారం పానీయం ఇవ్వకుండా పూర్తిగా తన పాలే తరచూ ఇవ్వటం ద్వారా తల్లి తన రొమ్ముల్లో పాల ఉత్పత్తిని పెంచగలదు.
శిశువులకు పాలసీసాలను గానీ, ఇతర ఉపశమన (డమ్మీ) వస్తువులను గానీ ఇవ్వరాదు. రొమ్ము పాలను చీకే విధానానికీ, పాలసీసా / డమ్మీలను చీకే పద్దతికి చాలా తేడా ఉంటుంది. ఉపశమన వస్తువులు లేదా పాలసీసా వల్ల తల్లి రొమ్ముల్లో పాల ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే శిశువు కూడా తల్లిపాలను తాగడం తగ్గిస్తాడు లేదా మానేస్తాడు.
రొమ్ముపాల తోనే తన శిశువు కడుపు నింపగలనని ప్రతి తల్లీ ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలి.
బిడ్డకు రొమ్ము పాలివ్వటానికి ఆ శిశువు తండ్రి, కుంటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, ఆరోగ్యకార్యకర్తలు, యాజమానులు, మహిళా సంఘాలు వారు తల్లికి మద్దతు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. బిడ్డకు పాలివ్వటం ద్వారా తల్లికి విశ్రాంతి లభించే అవకాశం ఉంది. శిశువుకు పాలిస్తున్నంత సేపు తల్లి నిశ్శబ్ధంగా విశ్రాంతి తీసుకునేలా బిడ్డ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు సహాయపడాలి. అంతే గాక, తల్లికి తగినంత ఆహారం లభించేలా చూసి, ఇంటి పనుల్లో కూడా ఆమెకు సహాయం చేయాలి.
ముఖ్య సందేశం - 5
శిశువులను, బాల బాలికలను ప్రమాదకర వ్యాధులు నుంచి రక్షించటానికి తల్లిపాలు సహాయం చేస్తాయి. అంతేకాక, తల్లీ-పిల్లల మధ్య విడదీయరాని అనుబంధాన్ని సృష్టిస్తాయి.
శిశువుకు మొట్టమొదటి టీకామందు (ఇమ్యూనైజేషన్) తల్లి పాలే. డయోరియా (నీళ్ల విరోచనాలు), చెవి, ఛాతీకి సోకే అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలనుంచి శిశువును తల్లి పాలు రక్షిస్తాయి. మొదటి 6 నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత రెండేళ్ల వయస్సు వరకూ కొనసాగించినట్లైతే ఈ రక్షణ కవచం మరింత దృఢంగా ఉంటుంది. ఏ ఇతర పానీయం లేదా ఆహారం శిశువుకు ఇంత గట్టి రక్షణ కల్పించలేవు. సీసా పాలు తాగే వారి కన్నా తల్లిపాలు తాగే శిశువులకు సాధారణంగా ఎక్కువ శ్రద్ధ, ప్రేరణ లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి లభించే ఈ శ్రద్ధ వల్ల శిశువుల పెరుగుదల చక్కగా ఉండి, తాము సురక్షితంగా ఉన్నాయనే భావనతో ఉంటారు.
ముఖ్య సందేశం - 6
సీసా పాల వల్ల అనారోగ్యం కలిగి మరణానికి కూడా దారితీయవచ్చు. మహిళ తన శిశువుకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే, ఆమె రొమ్ము నుంచి తీసిన పాలను గానీ, ప్రత్యామ్నాయ పాలను గానీ శుభ్రమైన కప్పులో పోసి, శిశువు చేత తాగించాలి.
అపరిశుభ్రమైన పాలసీసాల వల్ల శిశువుకు నీళ్ల విరేచనాలు, చెవికి అంటువ్యాధి లాంటి అస్వస్థత కలుగజేస్తాయి. నీళ్ల విరేచనాలు శిశువు పాలిట ప్రాణాంతకమైన వ్యాధి. పాలసీసా, కృత్రిమమైన చన్ను సాధనాన్ని శిశువు పాలిచ్చే ముందు ప్రతిసారీ వేడి నీటిలో శుభ్రపరచటం వల్ల అస్వస్థత ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయినప్పటికీ, రొమ్ముపాలు తాగే శిసువులతో పోలిస్తే సీసాపాలు తాగే శిశువులు డయేరియా ఇతర అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
శిశువుకు పాలు పట్టలేని పరిస్థితిలో, ఆ శిశువు తల్లి రొమ్మునుంచి తీసిన పాలను గానీ లేదా ఇతర ఆరోగ్యకరమైన తల్లి రొమ్ముపాలను గానీ తాగించటమే అత్యుత్తమమైన ఆహారం. వీటిని పరిశుభ్రమైన కప్పులో పోసి తాగించాలి. అప్పుడే జన్మించిన శిశువుకు సైతం ఇలాంటి పరిశుభ్రమైన కప్పుతో పాలు తాగించవచ్చు.
కన్న తల్లిపాలు అందుబాటులో లేని శిశువులకు ఆరోగ్యకరమైన ఇతర తల్లుల రొమ్ముపాలు అత్యుత్తమమైనది.
ఒకవేళ రొమ్ముపాలు అందుబాటులో లేకపోతే, పోషకాలు సమృద్ధిగా ఉన్న ప్రత్యామ్నాయ పాలను శిశువు చేత తాగించాలి. కాని ఎంతైనా, రొమ్ముపాలు తాగే శిశువుకన్నా ప్రత్యామ్నాయ పాలు తాగే శిశువుకు వ్యాధులు, మృత్యువు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రత్యామ్నాయ పాలు తాగే శిశువుల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. లేదా అస్వస్థత కలిగే అవకాశం ఉంటుంది. ఈ పాలల్లో కలిపే నీళ్లు ఎక్కువ లేదా తక్కువ మోతాదులో ఉన్నా, పరిశుభ్రంగా లేకపోయినా పైన పేర్కొన్న ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే, మంచినీటిని బాగా మరగబెట్టి, చల్లార్చిన తర్వాత నిర్దేశించిన సూచనల ప్రకారం ప్రత్యామ్నాయ పాలను కలపటం చాలా ముఖ్యం.
గేదె, ఆవు లాంటి జంతువుల పాలు, ప్రత్యామ్నాయ పాలు గది ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే కొద్ది గంటల్లోనే పాడవుతాయి. అదే రొమ్ముపాలు అయితే గది ఉష్ణోగ్రతలో 8 గంటల పాటు నిల్వ చేసినా, పాడుకావు. అయితే, వీటిని పరిశుభ్రమైన గిన్నెలో మూతపెట్టి నిల్వచేయాలి.
ముఖ్య సందేశం - 7
6 నెలల వయస్సు నుంచే శిశువుకు వివిధ రకాల ఆహారాన్నిఅదనంగా ఇవ్వాలి. వీటితో పాటు తల్లి పాలను కూడా రెండేళ్లు దాటే వరకూ ఇవ్వాలి.
6 నెలలు దాటిన శిశువుకు అదనపు ఆహారం అవసరమైనప్పటికీ తల్లిపాలు కూడా ఇస్తుండాలి. ఎందుకంటే, శిశువుకు అవసరమైన శక్తిని, మాంసకృత్తులు ఇంకా విటమిన్-ఎ, ఇనుము లాంటి పోషకాలు తల్లిపాలలోనే లభిస్తాయి. రొమ్ముపాలు తాగినంత కాలం శిశువుకు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. 6 నెలల నుంచి ఏడాది వయస్సు వరకు శిశువుకు ఇతర ఆహారం ఇచ్చే ముందు తల్లిపాలు తాగించాలి. తద్వారా ప్రతి రోజూ శిశువు తల్లిపాలు సమృద్ధిగా తాగేలా చూడొచ్చు. శిశువు ఆహారంలో పొట్టుతీసి, ఉడికించిన కూరగాయలు, పప్పులు, ధాన్యాలు ఇంకా పండ్లు ఉండాలి. బిడ్డకు తగినంత విటమిన్లు, ఖనిజాలు అంద టానికి వీలుగా కొంచెం నూనె, చేపలు, గుడ్లు కోడి, జంతు మాంసం, పాల ఉత్పత్తులలో కూడిన ఆహారాన్ని ఇవ్వాలి. రెండో ఏడాది శిశువు భోజనం చేసిన తర్వాత తల్లిపాలు ఇవ్వాలి. తల్లి తన బిడ్డకు కాలసినంత కాలం రొమ్ముపాలు ఇస్తూనే ఉండాలి.
శిశువుకు అదనపు ఆహారం ఇవ్వటానికి మార్గదర్శకాలు : -
ఆరు నుంచి 12 నెలల వయస్సు వరకు :
రొమ్ముపాలు తరచూ ఇస్తూ, ఇతర ఆహారాన్ని రోజుకు మూడు నుంచి 5 సార్లు తినిపించాలి.
ఏడాది నుంచి రెండేళ్ల వయస్సు వరకు :
రొమ్ముపాలు తరచూ తాగిస్తూ, కుటుంబంలో చేసిన ఆహారాన్ని రోజుకు ఐదుసార్లు తినిపించాలి.
రెండేళ్ల వయస్సు నుంచి :
తల్లి - పిల్లలకు ఇష్టమైతే రొమ్ముపాలను కొనసాగిస్తూ కుటుంబంలో చేసిన ఆహారాన్ని రోజుకు ఐదుసార్లు తినిపించాలి.
శిశువులు పాకటం, నడవటం, ఆడుకోవటం, ఇతర ఆహార పానీయాలను తీసుకోవటం మొదలు పెట్టినందున తరచూ అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి శిశువులకు రొమ్ముపాలు అధికంగా ఇవ్వాలి. రొమ్ముపాలల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శిశువుకు సులువుగా జీర్ణమవుతాయి. ఇతర ఆహార పదార్థాలు తినడానికి శిశువుకు ఆకలిని పెంచుతాయి.
ముఖ్య సందేశం - 8
పని / ఉద్యోగం కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లి రావలసివచ్చే మహిళ తాను శిశువుతో ఉన్నంతసేపు వీలైనన్నీ ఎక్కువ సార్లు పాలివ్వాలి.
పనివేళల్లో శిశువుకు దూరంగా ఉండే మహిళలు, దానికి ముందు, ఆ తర్వాత శిశువుతో ఉన్నంతసేపు వీలైనన్ని ఎక్కువ సార్లు పాలివ్వడం తరచూ పాలివ్వడం వల్ల శిశువుకు సరిపడ పాలు తల్లి రొమ్ముల్లో ఉత్పత్తి అవుతాయి.
పని / ఉద్యోగం చేసే ప్రదేశంలో మహిళ శిశువు పాలివ్వలేని పరిస్థితి ఉంటే, ఆమె పనిరోజుల్లో రెండు, మూడుసార్లు, తన రొమ్ముపాలను తీసి శుభ్రమైన గ్లాసు / చెంబులో భద్రపరచాలి. సాధారణ గది ఉష్ణోగ్రతలో తల్లిపాలు 8 గంటల వరకు చెడిపోకుండా నిల్వ ఉండగలవు. ఈ పాలను శిశువుకు శుభ్రమైన కప్పులో పోసి తాగించాలి. రొమ్ముపాలకు ప్రత్యామ్నాయంగా దొరికే పాలను శిశువుకు ఇవ్వరాదు.
శిశువుకు రొమ్ముపాలు ఇవ్వడానికి వారివారి కుటుంబాలు, సమాజం, యాజమానులను ప్రోత్సహించాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవు, క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రం) శిశువుకు పాలివ్వటానికి మహిళా ఉద్యోగులకు కొంత సమయం ఇచ్చి, సౌలభ్యమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి.
ముఖ్య సందేశం - 9
శిశువుకు పూర్తిగా రొమ్ముపాలిచ్చే మహిళ మొదటి 6 నెలల లోపు తిరిగి గర్భం ధరించకుండా 98 శాతం రక్షణ లభిస్తుంది. అయితే ఈ లోపు ఆమె రుతుక్రమం మళ్ళీ ప్రారంభం కారాదు. శిశువుకు రాత్రీ పగలు రొమ్ముపాలు తప్ప ఇతర ఎలాంటి ఆహార పానీయాలు ఇవ్వరాదు. శిశువుకు ఎంత ఎక్కువ కాలం పాలిస్తే అంత ఎక్కువ కాలంపాటు తల్లికి రుతుక్రమం పునర్ ప్రారంభం కాదు. 24 గంటల సమయంలో 8 కన్నా తక్కవసార్లు పాలిచ్చినా, శిశువుకు ఇతర ఆహార పానీయాలు గానీ ఉపశమన సాధనాలు (డమ్మీ) గానీ ఇచ్చినా, శిశువు తాగేపాలు తగ్గి తల్లికి రుతుక్రమం పునర్ ప్రారంభం అవుతుంది.
నెలసరి ముట్టు తిరిగి రావటానికి కన్నా ముందే తల్లి మళ్లీ గర్భం ధరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శిశువుకు 6 నెలలు నిండాక ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరోసారి గర్భధారణను వాయిదా వేయడానికి మహిళ ఈ క్రింద పేర్కొన్న పరిస్థితుల్లో ఇతర గర్భ నిరోధక పద్దతులను పాటించాలి.
- ఆమె రుతుక్రమం పునర్ ప్రారంభం అయినపుడు
- ఆమె శిశువు ఇతర ఆహారపానీయాలను గానీ, ఉపశమన సాధనాలు (డమ్మీ) వినియోగిస్తున్నపుడు.
- ఆమె శిశువు వయస్సు 6 నెలలు దాటినపుడు
శిశువుకు రెండేళ్ల వయస్సు నిండే దాకా మరోసారి గర్భధారణను వాయిదా వేయటం తల్లీ శిశువు లిద్దరికీ శ్రేయస్కరం. ఆరోగ్య కార్యకర్త లేదా శిక్షణ పొందిన ప్రసూతి సిబ్బంది కొత్తగా తల్లులైన మహిళలకు, వారి భర్తలకు గర్భనిరోధానికి సంబంధించి సలహాలు ఇవ్వాలి.
గర్భనిరోధక పద్దతుల్లో చాలా వరకు తల్లిపాల నాణ్యత పై ప్రభావం చూపవు. అయితే ఓస్ట్రోజెన్ తో కూడిన కొన్ని గర్భనిరోధక మాత్రలు రొమ్ముపాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఉత్తమ గర్భనిరోధక సాధనాల గురించి ఆరోగ్య కార్యకర్త తెలియజేస్తారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు