ఇమ్యునైజేషన్ (టీకాలు)
ఇమ్యూనైజేషన్ (రోగ నిరోధక టీకా మందులు) అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యమంటే
- అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లతో నివారించదగిన వ్యాధుల కారణంగా, ప్రతి సంవత్సరం 1.7 మిలియన్ల మంది పిల్లలు మరణిస్తున్నారు. అంగవైకల్యానికి, కొన్నిసార్లు, మరణానికి సైతం దారితీసే ప్రమాదకరమైన ఈ వ్యాధుల నుండి వ్యాక్సిన్ లు తీసుకొన్న పిల్లలు మాత్రం రక్షణ పొందుతున్నారు. ఈ రక్షణ పొందటానికి ప్రతి బాలుడు / బాలిక హక్కు కలిగి ఉన్నారు.
- ప్రతి బాలిక, బాలుడు ఇమ్యూనైజ్ కావలసిన అవసరం ఉంది. గర్భవతి అయిన ప్రతి మహిళ కూడా తనకు, పుట్టబోయే తన శిశువును టెటనస్ వ్యాధి నుంచి రక్షించుకోవటానికి ఇమ్యూనైజ్ కావాలి.
- ప్రతి తల్లిదండ్రులకు తమ శిశువుకు ఏయే రకాల ఇమ్యూనైజేషన్ ఇవ్వాలి. వాటిని ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎన్నిసార్లు ఇవ్వాలి. అనే విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండటం చాలా అవసరం. అంతేగాక, తమ బిడ్డ అనారోగ్యంతో లేదా అంగవైకల్యంతో ఉన్నా లేదా పోషక లోపంతో బాధపడుతున్నా ఇమ్యూనైజ్ చేయటం చాలా సురక్షితమనే విషయం కూడా ప్రతి తల్లిదండ్రులకు తెలిసి ఉండటం అవసరం.
ముఖ్య సందేశాలు
ఇమ్యూనైజేషన్ గురించి తెలుసుకోవటం ప్రతి కుటుంబం, సమాజం ఏయే హక్కులు కలిగి ఉన్నాయి.
- ఇమ్యూనైజేషన్ అనేది వెంటనే (అర్జెంట్ గా) చేయవలసిన పని. ప్రతి శిశువుకు మొదటి ఏడాదిలో వరుసగా ఇమ్యూనైజేషన్ (టీకా మందులు) ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- పలు రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి ఇమ్యూనైజేషన్ రక్షిస్తుంది. ఇమ్యూనైజ్ చేయని పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, శాశ్వత, అంగవైకల్యం లేదా లోపపోషణకు గురై మరణించే ప్రమాదం కూడా ఉంది.
- స్వల్ప అస్వస్థత, అంగవైకల్యం లేదా లోపపోషణతో ఉన్న పిల్లలను ఇమ్యూనైజ్ చేయటం సురక్షితం.
- గర్భిణీ మహిళలందరూ టెటనస్ వ్యాధి నుంచి రక్షణ పొందటం అవసరం. ఈ వ్యాధికి మహిళ, గతంలో ఇమ్యూనైజ్ చేయించినప్పటికీ, గర్భం ధరించిన తర్వాత అదనంగా మరోసారి టెట్నస్ టాక్సైడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనిపై సలహా పొందటానికి లేదా టెట్నస్ టాక్సైడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
- టీకా మందు తీసుకోవటానికి ప్రతి ఒక్కరూ సరికొత్త సూది (నీడిల్) లేదా స్టెరైల్ (నీటిలో మరగబెట్టిన) సూదిని మరియు సరికొత్త సిరంజీని తప్పకుండా ఉపయోగించాలి. దీనిపై ప్రజలు ఖచ్చితంగా ఉండాలి.
- ప్రజలు గుంపుగా చేరిన సందర్భంలో వ్యాధి తొందరగా వ్యాపిస్తుంది. ఇరుకైన పరిసరాల్లో నివసించే పిల్లలు ముఖ్యంగా శరణార్థులు, విపత్తు బాధితుల శిబిరాల్లో ఉండేవారు వెంటనే టీకా మందులు తీసుకోవాలి. ముఖ్యంగా మీజిల్స్ వ్యాధి నుంచి రక్షణకు ఇమ్యూనైజ్ చేయించాలి.
ముఖ్య సందేశం - 1
ఇమ్యూనైజేషన్/ టీకాలు ఇప్పించడం అనేది అత్యవసర చర్య . ఇది వెనువెంటనే చేయవలసిన పని. బిడ్డ పుట్టిన మెదటి సంవత్సరం లో సూచించిన ప్రతి టీకా మందులు (ఇమ్యూనైజేషన్) ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- పిల్లలు తొలిదశ (శిశువుగా ఉన్న దశ) లో టీకా మందులు తీసుకోవాలి. మరణిస్తున్న ఏడాది లోపు పిల్లల్లో సగం మంది కోరింత దగ్గు కారణంగా, కన్ను మూస్తున్నారు. పోలియోకు గురైన వారిలో మూడింట ఒక వంతు మంది పిల్లలు తనువు చాలిస్తున్నారు. మృతి చెందుతున్న ఏడాది లోపు వయస్సు పిల్లల్లో పాతిక శాతం మంది మీజిల్స్ వ్యాధికి బలవుతున్నారు.
- శిశువులకు టీకా మందులను పూర్తి సంఖ్యలో ఇప్పించాలి . లేకపోతే ఈ వ్యాక్సిన్లు పని చేయవు.
- శిశువును మొదటి ఏడాది కాలంలో రక్షించటానికి క్రింద ఇచ్చిన పట్టిక ప్రకారం టీకా మందులు ఇవ్వటం తప్పనిసరి. నిర్దేశించిన వయస్సులో శిశువుకు టీకాలు ఇస్తే ప్రభావవంతంగా పని చేస్తాయి.
- ఏదైనా కారణం చేత శిశువుకు తొలి ఏడాదిలో వరుసగా అన్ని టీకాలను పూర్తి సంఖ్యలో ఇవ్వలేకపోతే, వీలైనంత త్వరగా ఆ శిశువుకు వెంటనే ఆ టీకాలను పూర్తిగా ఇప్పించటం చాలా ముఖ్యం. జాతీయ టీకాల దినోత్సవాల సందర్భంగా నైనా ఆ టీకాలన్నింటినీ ఇప్పించాలి.
- కొన్ని దేశాల్లో శిశువులకు అదనపు వ్యాక్సిన్ డోసులను తొలి ఏడాది దాటాక ఇస్తారు. వీటిని “బూస్టర్ షాట్స్” అంటారు. వ్యాక్సిన్ ద్వారా లభించే రక్షణను ఈ షాట్స్ రెట్టింపు చేస్తాయి.
శిశువులకు టీకా మందుల కాలపట్టిక *వయస్సు : పుట్టిన సమయంలో
- ఇవ్వాల్సిన టీకాలు : బి.సి.జి. ** పోలియో మరియు కొన్నిదేశాల్లో హెపటైటిస్- బి.
- వయస్సు : 6 వారాలు
- ఇవ్వాల్సిన టీకాలు : డి.పి.టి.,** పోలియో మరియు కొన్ని దేశాల్లో హెపటైటిస్ – బి (Hib).
- వయస్సు : 10 వారాలు
- ఇవ్వాల్సిన టీకాలు : డి.పి.టి., పోలియో మరియు కొన్ని దేశాల్లో హెపటైటిస్ – బి (Hib).
- వయస్సు : 14 వారాలు
- ఇవ్వాల్సిన టీకాలు : డి.పి.టి., పోలియో మరియు కొన్ని దేశాల్లో హెపటైటిస్ - బి (Hib).
- వయస్సు : 9 నెలలు
- ఇవ్వాల్సిన టీకాలు : మీజిల్స్ (పారిశ్రామిక దేశాల్లో 12-15 నెలలు మధ్య) మరియు కొన్ని దేశాల్లో ఎల్లోఫీవర్, గవద బిళ్ళలు, రుబెల్లా.
- * జాతీయ టీకా మందుల కాల పట్టికలో దేశానికి - దేశానికి మధ్య వ్యవధిలో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
- ** కొన్ని రకాలైన టి.బి. క్షయ వ్యాధుల నుంచి బి.సి.జి. పాక్షిక రక్షణ కల్పిస్తుంది. డిప్తీరియా, కోరింతదగ్గు, టెట్నస్ వ్యాధుల నుంచి డి.పి.టి. రక్షిస్తుంది.
ముఖ్య సందేశం - 2
పలురకాలైన ప్రమాదకర వ్యాధుల నుంచి టీకా మందులు (ఇమ్యూనైజేషన్) రక్షిస్తాయి. టీకా మందులు లేకపోతే పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, శాశ్వత అంగవైకల్యం లేదా కుపోషణకు గురై మరణించే ప్రమాదం కూడా ఉంది.
- బాల్యంలో వచ్చే కొన్ని ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి టీకా మందులు పిల్లలను రక్షిస్తాయి. పిల్లలందరికీ (అంగవైకల్యం కలిగిన వారితో సహా) టీకా మందులు ఇప్పించటం అత్యంత అవసరం. టీకా మందుల వ్యాక్సిన్ ను ఇంజెక్షన్ ద్వారా గానీ, నోటి ద్వారా గానీ ఇస్తారు. ఇలా ఇచ్చిన వ్యాక్సిన్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తారు. అతి ముఖ్యమైన విషయమేమిటంటే, వ్యాధి రాకముందు తీసుకుంటేనే ఈ వ్యాక్సిన్లు పని చేస్తాయి.
- టీకా మందులు తీసుకోకపోతే పిల్లలు మీజిల్స్, కోరింతదగ్గు ఇంకా ప్రాణాలు తీసే ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు గురై ప్రాణాలతో బయటపడిన పిల్లలు బలహీనంగా మారి సరిగా పెరగరు లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవుతారు. ఆ తర్వాత కొంత కాలానికి లోప పోషణకు గురై లేదా ఇతర అనారోగ్యం కారణంగా వారు చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
- మీజిల్స్ వ్యాధి రాకుండా ప్రతి శిశువునూ ఇమ్యూనైజ్ చేయాలి. ఎందుకంటే కుపోషణకు, వినికిడి, దృష్టి లోపాలకు, మేధోవికాసానికి విఘాతం కలగడానికి ప్రధాన కారణం మీజిల్స్ వ్యాధి పిల్లల్లో మీజిల్లో వ్యాధి లక్షణాలు - మూడు రోజుల కన్నా ఎక్కువగా జ్వరం, శరీరంపై దద్దుర్లు, దగ్గు ముక్కులో నుంచి నీళ్లు కారటం, కళ్లు ఎర్రబడటం మెదలైనవి. మీజిల్స్ వ్యాధితో మరణం కూడా సంభవించవచ్చు.
- పోలియో రాకుండా పిల్లలందరూ ప్రతి చోటా ఇమ్యూనైజ్ కావాలి. కాలు, చెయ్యి ఇతర అంగాలు వేలాడినట్లు ఉండటం, కదలిక కష్టం కావటం పోలియో వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధికి గురైన ప్రతి 200 మంది పిల్లల్లో ఒకరు జీవితాంతం అంగవైకల్యానికి గురవుతారు.
- శరీరంపై పొక్కులు లేపి, జుగుప్సాకరంగా మార్చే టెట్నస్ బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే టీకా మందు అవసరం.
- మహిళ గర్భం ధరించడం కన్నా ముందు గానీ లేదా గర్బవతిగా ఉన్న సమయంలో గానీ కనీసం రెండు డోసుల టెట్నస్ టాక్సైడ్ టీకామందు ఇచ్చినట్లయితే, అది ఆమెనే కాకుండా ఆమెకు పుట్టిన బిడ్డను కూడా మొదటి కొన్ని వారాల పాటు ఈ వ్యాధి రాకుండా కాపాడుతుంది.
- శిశువుకు 6 వారాల వయస్సప్పుడు డి.పి.టి. అవసరం. ఇది టెట్నస్ వ్యాధికి వ్యతిరేకంగా శిశువుకు రక్షణను కొనసాగిస్తుంది.
- హెపటైటిస్-బి సమస్య ఉన్న దేశాల్లో, దీనికి టీకా మందు తీసుకోలేకపోయిన ప్రతి 100 మంది చిన్నారుల్లో 10 మంది వరకు ఈ వ్యాధిని జీవితాంతం మోస్తున్నారు. హెపటైటిస్ -బి వ్యాధి సోకిన పిల్లలు పెద్దయిన తర్వాత లివర్ (కలేజా) క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఉంది.
- కొన్ని దేశాల్లో, ఎల్లోఫీవర్ అనే వ్యాధి వ్యాపించి పిల్లల ప్రాణాలను ప్రమాదం లోకి నెడుతుంది. టీకా (వ్యాక్సినేషన్) మందుతో ఈ వ్యాధిని నివారించవచ్చు. చాలా దేశాల్లో, హెమోఫిలస్ ఇన్ ఫ్లుయెంజా టైప్-బి ( Hib ) అనే సూక్ష్మక్రిమి కారణంగా వచ్చే న్యూమోనియో వ్యాధి అనేక మంది చిన్నారుల మరణానికి కారణమవుతోంది. ఈ ( Hib) క్రిమి బాల్యంలో మెనింజైటిస్ (మెదడుకు వచ్చే వ్యాధి) ని కలుగజేస్తుంది. పిల్లలకు, ముఖ్యంగా ఐదేళ్లలోపు వయస్సు వారికి ఈ క్రిమి అత్యంత ప్రమాదకరమైనది. హెపటైటిస్ బి (Hib) టీకా మందుతో ఈ మరణాలను అరికట్టవచ్చు.
- తల్లి రొమ్ముపాలు మరియు ముర్రుపాలు (కొలెస్ట్రమ్) ను శిశువు పుట్టిన వెంటనే ఇవ్వటం మొదలు పెట్టాలి. ప్రసవం తర్వాత కొద్ది రోజులు మాత్రమే తల్లి రొమ్ముల్లో ఉత్పత్తయ్యే ముర్రుపాలు (పసుపు రంగులో ఉంటాయి.) శిశువును న్యూమోనియా, విరేచనాలు (డయేరియా) ఇంకా ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శిశువుకు రొమ్ముపాలు అందినంత కాలం ఈ రక్షణ కొనసాగుతుంది.
- శిశువు అంటువ్యాధులతో పోరాడటానికి, అంధత్వాన్ని నివారించటానికి విటమిన్-ఎ సహాయపడుతుంది. విటమిన్-ఎ తల్లి పాలల్లో పుష్కలంగా ఉంటుంది. ఇంకా కలేజా (కార్జము) , చేపలు, పాల ఉత్పత్తలు , బత్తాయి, పసుపు రంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్-ఎ లభిస్తుంది. విటమిన్-ఎ లోపం ఉన్న ప్రాంతాల్లో 6 నెలల వయస్సు దాటిన శిశువులందరికీ విటమిన్-ఎ క్యాప్సూల్ (గొట్టం మాత్రలు) లేదా ద్రవం ఇవ్వాలి. టీకామందు ఇచ్చిన ప్రతిసారి లేదా జాతీయ టీకా మందుల దినోత్సవాల సందర్భంగా విటమిన్-ఎ ద్రవం లేదా క్యాప్సూల్ ఇవ్వాలి. మీజిల్స్ వ్యాధి చికిత్సలో విటమిన్-ఎ కూడా చాలా ముఖ్యమైనది.
ముఖ్య సందేశం - 3
స్వల్ప అస్వస్థత , అంగవైకల్యం లేదా కుపోషణ ఉన్న పిల్లలకు టీకా మందులు ఇవ్వటం చాలా సురక్షితం.
- నిర్దేశించిన రోజున టీకామందు ఇప్పించటానికి తల్లిదండ్రులు తమ శిశువును తీసుకురాకపోవటానికి ఆ శిశువు దగ్గు, జ్వరం, జలుబు, విరేచనాలతో బాధపడుతున్నారని లేదా ఇతర అస్వస్థత తో ఉన్నారనేది ప్రధాన కారణం. కాని, స్వల్ప అస్వస్థత ఉన్నప్పటికీ పిల్లలకు టీకా మందులు ఇప్పించటం శ్రేయస్కరం.
- కొన్నిసార్లు, శిశువు అంగవైకల్యంతో ఉన్నారనీ లేదా కుపోషణతో ఉన్నారని, కనుక టీకామందు ఇప్పించరాదని ఆరోగ్య కార్యకర్తలు సలహా ఇస్తుంటారు. ఈ సలహా చాలా తప్పు. అంగవైకల్యం లేదా లోపపోషణతో ఉన్నప్పటికీ శిశువుకు టీకా మందు వేయటం చాలా సురక్షితం.
- ఇంజెక్షన్ పొందిన శిశువు ఏడ్వటం లేదా వారికి జ్వరం రావటం లేదా చిన్న దద్దురు గానీ పొక్కుగానీ రావటం సహజం. ఇలాంటి వారికి తరచూ తల్లిపాలిస్తూ లేదా ద్రవ పదార్ధాలు ఇతర ఆహారం ఎక్కువగా ఇస్తూ స్వాంతన చేకూర్చాలి. ఒకవేళ శిశువుకు జ్వరం తీవ్రంగా ఉంటే, ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.
- లోపపోషణతో ఉన్న పిల్లలకు మీజిల్స్ వ్యాధి చాలా ప్రమాదకరం కనుక, లోపపోషణ తీవ్రంగా ఉన్నపిల్లలకు మీజిల్స్ రాకుండా వెంటనే టీకా మందులు వేయించాలి.
ముఖ్య సందేశం - 4
గర్భిణీ మహిళలందరూ టెట్నస్ వ్యాధి నుంచి రక్షణ పొందటం అవసరం. ఈ వ్యాధికి మహిళ గతంలో టీకామందు వేయించినప్పుటికీ. గర్భం ధరించిన తర్వాత అదనంగా మరోసారి టెట్నస్ టాక్సైడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనిపై సలహా పొందటానికి లేదా టెట్నస్ టాక్సైడ్ వ్యాక్సిన్ తీసుకోవటానికి ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
- ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, తల్లులు అపరిశుభ్రమైన పరిస్థితుల మధ్య బిడ్డకు జన్మనిస్తున్నారు. ఇది తల్లీ పిల్లలిద్దరికీ టెట్నస్ వ్యాధిని కలుగజేస్తుంది. నవ శిశువులకు వ్యాధి ప్రాణాంతకమైనది.
- గర్భిణి మహిళ టెట్నస్ వ్యాధి రాకుండా టీకామందు తీసుకోకపోతే, ఈ వ్యాధి బ్యాక్టీరియా లేదా పొక్కులు ఆమె శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆమె ప్రాణాలకు గండంగా మారతాయి.
- టెట్నస్ బ్యాక్టీరియా లేదా పొక్కులు శరీరంపై జుగుప్సాకరంగా పెరుగుతాయి. ప్రసవం జరిగాక, బొడ్డుతాడును తెంపటానికి ఉపయోగించిన కత్తి శుభ్రంగా లేకపోయినా లేదా ఆ తాడుకు ఏదైనా అపరిశుభ్రం తగిలినా ఈ వ్యాధి సూక్ష్మక్రిములు పెరుగుతాయి. బొడ్డుతాడును తెంపటానికి వాడే ఏ సాధనమైనా ముందుగా దాన్ని శుభ్రంగా కడిగి, వేడి నీళ్లలో మరగబెట్టాలి. లేదా మంటల్లో కాల్చాలి. ఆ తర్వాత దాన్ని చల్లారనిచ్చి, బొడ్డుతాడును కట్ చేయాలి. శిశువు జన్మించాక మొదటి వారం రోజుల పాటు, బొడ్డుతాడును అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి.
- గర్భిణీ స్త్రీలందరూ తాము టెట్నస్ టీకాలు తీసుకున్నదీ లేనిదీ పరీక్షించి నిర్ధారించుకోవాలి. ఇది తల్లీ పిల్లలిద్దరినీ పరిరక్షిస్తుంది.
టెట్నస్ రాకుండా టాకామందు తీసుకోవటం గర్భిణీ స్త్రీకి చాలా శ్రేయస్కరం. దిగువ ఇచ్చిన కాల వ్యవధి ప్రకారం ఆమె టెట్నస్ కు టీకా మందు తీసుకోవాలి.
- మొదటి డోసు : తాను గర్భం దాల్చానని తెలిసిన వెంటనే .
- రెండవ డోసు : మొదటి డోసు నుంచి నెల రోజుల తర్వాత. అయితే దీన్ని రెండు వారాలకన్నా ఎక్కువ జాప్యం చేయరాదు. అంటే మొదటి డోసు తర్వాత 30 నుంచి 45 రోజుల మధ్య ఖచ్చితంగా తీసుకోవాలి.
- మూడవ డోసు : రెండో డోసు తర్వాత 6 నుంచి 12 నెలల మధ్య, లేదా ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చినప్పుడు.
- నాలుగవ డోసు : మూడవ డోసు తర్వాత ఏడాదికి లేదా ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చినప్పుడు.
- ఐదో డోసు : నాలుగో డోసు అయ్యాక సంవత్సరం కాలానికి లేదా ఆ తర్వాత మళ్లీ గర్భం ధరిస్తే.
- పైన పేర్కొన్న కాలవ్యవధి ప్రకారం ఒక మహిళ గానీ, అమ్మాయి గానీ ఐదు డోసుల టాకామందు తీసుకున్నట్లయితే, వారి జీవితకాలం మొత్తం టెట్నస్ వ్యాది నుంచి రక్షణ పొందుతారు. వారికి పుట్టిన పిల్లలు కూడా మొదటి కొన్నివారాల పాటు ఈ వ్యాధికి దూరంగా రక్షణ పొందగలరు.
ముఖ్య సందేశం - 5
టీకామందు తీసుకోవటానికి ప్రతి ఒక్కరూ సరికొత్తవి గానీ లేదా మరగబెట్టినవి గానీ సూది, సిరంజీలను ఉపయోగించాలి. దీనిపై ప్రజలు ఖచ్చితంగా ఉండాలి.
- సూది, సిరంజీ సాధనాలను సరిగా, స్టెరిలైజ్ చేయకుండా వినియోగిస్తే ప్రాణాలకు ముప్పుతెచ్చే వ్యాధులు కలుగుతాయి.
- సూది, సిరంజీలను ఒకరివి ఇంకొకరు వాడరాదు. ఒకే కుటుంబసభ్యులు సైతం వీటిని పంచుకోరాదు. ఒకవేళ పంచుకుంటే, ఒకే కుటుంబం అయినప్పటికీ వీరి మధ్య ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలే ప్రమాంద ఉంది. కేవలం కొత్తవి లేదా మరగబెట్టిన (స్టెరిలైజ్డ్) నీడిల్స్, సిరంజీలను మాత్రమే వాడాలి.
ముఖ్య సందేశం - 6
ప్రజలు గుంపుగా చేరిన సందర్భంలో వ్యాధి తొందరగా వ్యాపిస్తుంది. ఇరుకైన పరిసరాల్లో నివసించే పిల్లలు, ముఖ్యంగా శరణార్థులు, విపత్తు బాధితుల శిబిరాల్లో ఉండేవారు. వెంటనే టీకా మందులు తీసుకోవాలి. ముఖ్యంగా మీజిల్స్ వ్యాధి నుంచి రక్షణకు ఇమ్యూనైజ్ చేయించాలి.
- అత్యవసర పరిస్థితులు ప్రజలు ఇల్లు వదిలి పారిపోవలసి వచ్చిన విపత్కర పరిస్థితుల్లో అంటువ్యాధులు ప్రబలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుచేత, ఆవాసం కోల్పోయిన 12 ఏళ్లలోపు పిల్లలకు వెంటనే టీకా మందు ఇవ్వాలి. ఇలాంటి పిల్లల్ని కనుగొన్న వెంటనే ముఖ్యంగా మీజిల్స్ రాకుండా టీకా ఇవ్వాలి.
- అత్యవసర పునరావాస కేంద్రాల్లో ఒకసారి మాత్రమే వినియోగించగల సిరంజీలను ఉపయోగించాలి. కుపోషణతో ఉన్నా లేదా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నివసించే పిల్లలకు మీజిల్స్ వ్యాధి చాలా ప్రమాదకరం.
- మీజిల్స్ లాంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. కనుక, ఈ వ్యాధితో ఉన్న పిల్లలను ఇతర పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. వ్యాధి గ్రస్తుడైన పిల్లలను ఆరోగ్య కార్యకర్త చేత పరీక్ష చేయించాలి.
- మీజిల్స్ కారణంగా తీవ్రమైన విరేచనాలు కలుగుతాయి. కనుక, ఈ వ్యాధి రాకుండా ఇమ్యూనైజ్ చేయటం ద్వారా పిల్లలను విరేచనాల నుంచి రక్షించవచ్చు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు