Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

Anantapuramu District Agriculture Overview

నీటి పారుదల

సాగునీటి వనరులు

అనంతపురం జిల్లా రైతాంగం ప్రధానంగా తుంగభద్ర జలాశాలయాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. తుంగభద్ర నుంచి వచ్చే నీరు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించాల్సి వస్తోంది. యేటా నీటి లభ్యత ఆధారంగా జిల్లాలోని ఆయకట్టుకు నీటిని వినియోగిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాజెక్టులు వర్షాధారం కింద ఆధారపడి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిఉంది. ఇటీవల నెలకొన్న తీవ్ర వర్షాభావం వల్ల ఆయకట్టుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులకు ఉన్న ఆయకట్టు విస్తీర్ణంలో సగ భాగం కూడా నీరు అందడం లేదు. పేరుకు మాత్రమే ఆయకట్టు... విస్తీర్ణం అనే రీతిలో ఉన్నాయి.

తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌(హెచ్ ఎల్ సీ)

జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టు. దీని కింద సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీటి పారుదల సౌకర్యం ఉంది. హెచ్ ఎల్ సీ నీరు వివిధ బ్రాంచ్‌కెనాల్‌ ద్వారా ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం ఉంది. జిల్లావ్యాప్తంగా 26 మండలాల్లో హెచ్ ఎల్ సీ కింద ఆయకట్టు సౌకర్యం ఉంది. ఇందుకు టీబీ డ్యాం నుంచి యేటా 32 టీఎంసీల నుంచి 35 టీఎంసీలు కేటాయిస్తున్నారు.

తుంగభద్ర ప్రధానకాలువ

దీని కింద 35,541 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా బొమ్మనహాల్‌, కణేకల్‌ మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈప్రాంతంలో ఎక్కువగా వరి పంటను సాగు చేయనున్నారు

మిడ్‌పెన్నార్‌ నార్త్‌కెనాల్‌

దీని కింద పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈ కెనాల్‌ కింద మొత్తం 13,325 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. పెద్దవడుగూరులో ఎక్కువగా పత్తి పంటను సాగు చేయనున్నారు.

మిడ్‌పెన్నార్‌ సౌత్‌

దీని కింద గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్‌ మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈ కెనాల్‌ కింద మొత్తం 33176 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా గార్లదిన్నె, శింగనమల మండలాల్లో అత్యధికంగా వరిని సాగు చేయనున్నారు.

తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌

మిడ్‌పెన్నార్‌ సౌత్‌కెనాల్‌ నుంచి నార్పల మండల మీదుగా ప్రధాన కాలువ పుట్లూరు మండలం సుబ్బరాయసాగర్‌లోకి నీరు వస్తుంది. అక్కడినుంచి ఎ.కొండాపురం మీదుగా తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌ ప్రారంభమవుతుంది. ఈ కెనాల్‌ కింద తాడిపత్రి, పుట్లూరు, పెద్దపప్పూరు, యల్లనూరు మండలాల్లో 31131 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా సగభాగం నీరందిన దాఖలాలు లేవు. యేటా 5వేల ఎకరాల వరకే నీరందుతోంది

గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌

గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ కింద విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు మండలాల్లో ఆయకట్టు ఉంది. మొత్తం 15,792 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ఈ కెనాల్‌ కింద వరి, మిరప పంటలను సాగు చేయనున్నారు

గుత్తి బ్రాంచ్‌ కెనాల్‌

గుత్తి బ్రాంచ్‌ కెనాల్‌ కింద గుత్తి, పామిడి మండలాల్లో ఆయకట్టు ఉంది. గత పదేళ్ల నుంచి ఆయకట్టు పరిధిలో కొంత భాగం భూసేకరణ కారణంగా ఆగిపోయింది. ఇటీవలే భూసేకరణ పూర్తి అయ్యింది. వచ్చే యేడాది నుంచి గుత్తి బ్రాంచ్‌ కెనాల్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కెనాల్‌ కింద 16271 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది అలాగే టీబీ డ్యాం నుంచి తుంగభద్ర జలాలు సరిహద్దులో ఉన్న కర్నూలు, కడప జిల్లాలకు కూడా వెళ్లాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో 14255 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా, కడప జిల్లాలోని పులివెందల బ్రాంచ్‌ కెనాల్‌ కింద 55,579 ఎకరాలు, మైలవరం నార్త్‌, సౌత్‌ కెనాల్‌ కింద 69922 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంకు నీరు పారాల్సి ఉంది

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం

జిల్లా రైతాంగానికి హంద్రీనీవా సజల స్రవంతి పథకం వరంగా మారనున్నది. పథకం పూర్తి అయ్యి సాగు నీరు అందితే కరువు జిల్లా రైతులకు కొంత ఊరట లభిస్తుంది. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులో తుంగభద్ర హెచ్ ఎల్ సీ తోపాటు హంద్రీనీవా పథకం ఒకటి. రెండు దశల్లో తొమ్మిది ప్రదేశాల్లో లిఫ్ట్‌ పనులు జరగనున్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో పథకం పూర్తి అయితే 6లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. జిల్లాలో పరిగి, హిందూపురం, పెనుకొండ, ఉరవకొండ, గుంతకల్లు, బెలుగుప్ప, వజ్రకరూరు, రాప్తాడు, ఆత్మకూరు తదితర మండలాల్లో ఆయకట్టు ఉంటుంది

యోగివేమన రిజర్వాయర్‌

జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో యోగివేమన రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద 13వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణముంది. ప్రధానంగా వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి ఈ పంటలను సాగుచేయనున్నారు.

పెడబల్లి రిజర్వాయర్‌

జిల్లాలోని నంబులపూలకుంట మండలంలో పెడబల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ కింద 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. పాపాగ్ని నుంచి నీరు రిజర్వాయర్‌లోకి రానున్నది

చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు

జిల్లాలోని తనకల్లు మండలంలో పాపాగ్ని నదిపై చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కర్నాటక ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా మీదుగా పాపాగ్ని నది ప్రవహిస్తుంది. చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు కింద 909 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. దీని కింద ప్రధానంగా వేరుశనగ, వరి పంటలను సాగు చేయనున్నారు

భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీ ప్రాజెక్టు)

జిల్లాలోని గుమ్మగట్ట మండలంలో భైరవానితిప్ప ప్రాజెక్టు ఉంది. ఎగువ ప్రాంతం అయిన కర్నాటక నుంచి వచ్చే వర్షపు నీరు ప్రాజెక్టులోకి చేరనున్నది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న రెండు కాలువల ద్వారా 12 వేల ఎకరాలకు ఆయకట్టు విస్తీర్ణంకు నీరు పారాల్సి ఉంది. ప్రధానంగా గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం, రాయదుర్గం మండలాల్లో బీటీ ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉంది

అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు (పేరూరు డ్యాం)

జిల్లాలోని రామగిరి మండలంలో పెన్నానదిపై 1956లో అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టును (పేరూరు డ్యాం) నిర్మించారు. కర్నాటక రాష్ట్రంలోని నందికొండ ప్రాంతం నుంచి పెన్నానది ద్వారా అప్పర్‌ పెన్నార్‌కు నీరు రావాల్సి ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు నీరు రావడం లేదు. 1986 వరకు ఆయకట్టుకు నీరు వచ్చాయి. తరువాత కాలంలో నీరు రాలేదు. తిరిగి 2002, 2003 సంవత్సరంలో కొంత వరకు ప్రాజెక్టుకు నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఈ ప్రాజెక్టు కింద 10,048 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో ఆయకట్టు విస్తీర్ణం ఉంది

పెన్నార్‌ కుముద్వతి ప్రాజెక్టు

జిల్లాలోని పరిగి మండలంలో పెన్నానదిపై 1950-60 మధ్యలో పెన్నార్‌ కుముద్వతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు కూడా కర్నాటకలోని నందికొండ ప్రాంతం నుంచి పెన్నానది ద్వారా నీరు రావాల్సి ఉంది. పరిగి, హిందూపురం మండలాల్లో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉంది. వర్షాకాలంలో వచ్చే నీటిని వివిధ చెరువులకు మల్లించి అక్కడి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు రావడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోపగడుతోంది

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు

జిల్లాలో పీఎబీఆర్‌ స్టేజ్‌-2 పథకం కింద రూ.536 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. దీని ద్వారా తాడిపత్రి నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్నది లక్ష్యం

చాగల్లు ప్రాజెక్టు

పెద్దపప్పూరు మండలం చాగుల్లు గ్రామం వద్ద పెన్నానదిపై రెండు కొండల మద్య చాగల్లు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రూ.244 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. పెద్దపప్పూరు మండలంలో 6100 ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇవ్వాలన్నది లక్ష్యం. అదేవిధంగా ఇక్కడి నుంచి పుట్లూరు మండలానికి కూడా నీటిని ఇవ్వాలని ప్రతిపాధనలు తయారు చేస్తున్నారు

పెండేకల్లు

పెద్దపప్పూరు మండలం పెండేకల్లు గ్రామం వద్ద రూ.102 కోట్ల వ్యయంతో పెండేకల్లు ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీని ద్వారా పెద్దపప్పూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో 18500 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంకు నీటిని ఇవ్వాలన్నది లక్ష్యం. ఇందుకు సంబధించిన పనులు జరుగుతున్నాయి.

యాడికి కాలువ

రూ.190 కోట్ల వ్యయంతో యాడికి కాలువ నిర్మాణం చేపట్టారు. 18వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్నది లక్ష్యం. ఇందు కోసం పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణం చేపట్టారు. అక్కడి నుంచి కెనాల్‌ ద్వారా పెద్దవడుగూరు, యాడికి మండలాల్లోని ఆయకట్టుకు నీటిని ఇవ్వనున్నారు. ప్రస్తుతం నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి

చెరువులు

జిల్లాలో 1264 చెరువులు ఉన్నాయి. ప్రధానంగా బుక్కపట్నం చెరువు రాయలసీమలోనే అత్యంత పెద్దది. దీని కింద 8200 ఎకరాల ఆయకట్టు ఉంది. తరువాత స్థానంలో శింగనమల చెరువు ఉంది. దీని కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడో స్థానంలో ధర్మవరం చెరువు ఉంది. ఈ చెరువు కింద 2వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. అదేవిధంగా వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 305, వంద ఎకరాలలోపు ఉన్న చెరువులు 959 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 118396 ఎకరాల ఆయకట్టు చెరువుల కింద ఉంది. అయితే వర్షాలు లేకపోవడం వల్ల చాలా చెరువుల్లో ఆయకట్టు విస్తీర్ణం పూర్తిగా పడిపోయింది

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

దేశంలోనే అత్యల్ప వర్షపాతం కల జిల్లా అనంతపురం. ఇక్కడి రైతులు అనునిత్యం ప్రకృతితో పోటీ పడుతుంటారు. జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ. ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగులో అనంత రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఇటీవల కాలంలో పండ్లతోటల సాగులో కూడా ముందంజలో ఉంది. తక్కువ నీటిని వినియోగించుకొని బిందు, తుంపర పరికరాలతో పండ్లతోటలను సాగు చేస్తున్నారు. 89వేల హెక్టార్లలో ఉద్యానవనపంటలు సాగవుతున్నాయి. యేటా అనంత నుంచి 9.95 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో 63 మండలాలకు గాను 11 వ్యవసాయ డివిజన్లుగా విభజించారు.

జిల్లాలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల వివరాలు

తుంగభద్ర జలాలు

జిల్లా రైతాంగానికి తుంగభద్ర జలాలు ప్రధాన వనరు. ప్రతి యేటా 21 నుంచి 25 టీఎంసీల వరకు తుంగబద్ర జలాశయం నుంచి జిల్లాకు నీటిని విడుదల చేస్తారు. తుంగభద్ర జలాశయము ప్రారంభ సమయంలో 132.473 టీఎంసీలు సామర్యం ఉండేది. అయితే ఇటీవల కాలంలో జలాశంం పూర్తిగా పూడికతో నిండింది. 2008లో జరిపిన సర్వే ప్రకారంఆయకట్టు నీటి సామర్థ్యం కేవలం 100.855ల ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత పూడిక పేరుకొని రానున్న రోజుల్లో మరింత నీటి సామర్థం తగ్గే అవకాశం లేకపోలేదు

జిల్లాలో హెచ్ ఎల్ సీ ఆయకట్టు కింద ప్రధానంగా గార్లదిన్నె, పామిడి, శింగనమల, బొమ్మనహాల్‌, కణేకల్‌, బుక్కరాయసముద్రం ప్రాంతాల్లో వరిని సాగు చేయనున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గంతో పాటు నదీ పరివాహాక, చెరువుల కింద, ఇతర ప్రాంతాల్లో నీటి వసతి ఉన్న చోట్ల వరిని సాగు చేస్తున్నారు. పెన్నానది, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో కూడా వరి పంటను సాగు చేయున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి సాధారణ విస్తీర్ణం 29989 హెక్టార్లు కాగా గత యేడాది 34,973 హెక్టార్లలో వరిని సాగు చేశారు. ఈ యేడాది ఖరీఫ్‌లో 21232 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు.

వేరుశనగ

రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశనగ పంటను సాగు చేసే జిల్లా అనంతపురం. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు అయ్యే జిల్లా అనంతపురం. వర్షాభావ పరిస్థితికి నిలదోక్కుకో గలిగే పంట వేరుశనగ. అందుకే జిల్లాలో ఎక్కువ మంది రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. ఎర్రనేలల్లో ఎక్కువగా వేరుశనగను సాగు చేస్తున్నారు. ప్రతి యేటా ఖరీఫ్‌లో సుమారు 7లక్షల హెక్టార్లకుపై గానే వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ యేడాది 7.06లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు.

మొక్కజొన్న

జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న సాగు లక్ష్యం, సాధారణ విస్తీర్ణం 7559 హెక్టార్లుగా వ్యవసాయశాఖ నిర్ణయించింది. అయితే ఈ యేడాది 13,689 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. కొంత వరకు నీటి వసతి ఉండే పొలాలు మొక్కజొన్నకు అనుకూలం. ప్రస్తుతం మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఉండటంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుండటం, లాభదాయకమైన పంట కావడంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు అయ్యింది.

జొన్న

జిల్లా వ్యాప్తంగా ఈ యేడాది ఖరీఫ్‌లో 13464 హెక్టార్లలో జొన్న పంటను సాగు చేశారు. ఇందులో అత్యధికశాతం వర్షాధారం కిందనే జొన్నను సాగు చేశారు. హైబ్రీడ్‌ జొన్న, పచ్చజొన్న, తెల్లజొన్నలనురైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో చిరుధాన్యాల ప్రోత్సాహక పథకం కింద కూడా ఇలాంటి పంటల సాగును రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. తాడిపత్రి మండలంలో 1000 హెక్టార్లలో జొన్న పంటను సాగు చేయాలనే లక్ష్యంతో రాయితీ విత్తనం, ఎరువులు ఇచ్చి రైతులను ప్రోత్సహించింది.

రాగులు

జిల్లా వ్యాప్తంగా 1428 హెక్టార్లలో రాగి(రాగులు) పంటను సాగు చేశారు. ఇదీ ఎక్కువ భాగం కొంత వరకు నీటి వసతి ఉన్న ప్రాంతంలోనే ఈ పంటను సాగు చేశారు. మారుతున్న కాలంలో వస్తున్న ఆహార అలవాట్ల కారణంగా ఇటీవల పూర్వ పద్దతికి చేరుకొంటున్నారు. దీంతో ఎక్కువగా చిరుధాన్యాల ఆహారంకు అలవాటు పడుతుండగా లాభదాయకంగా మారుతుండటంతో రైతులు కూడా వీటినే సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కొర్ర

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 636 హెక్టార్లలో కొర్ర పంటను సాగు చేశారు. నీటి వసతితో పాటు వర్షాధారం కింద కూడా కొర్రను సాగు చేశారు. ఈ పంటను మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో పాటు తదుపరి రబీలో కూడా మరోక పంట వేసేందుకు అనువుగా ఉండటంతో పాటు పశువులకు మేత కూడా అవుతుందని రైతులు కొర్ర పంటను సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో కొర్రతో కలిసి మూడు పంటలు పండించవచ్చునని వ్యవసాయశాస్త్రవేత్తలు నిరూపించారు. రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్తలు కొర్ర సాగులో మెలకువులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

కంది

జిల్లాలో కంది పంటను ప్రధానంగా వేరుశనగలో అంతర పంటగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రనేలలో ఎక్కువగా కంది పంటను సాగు చేయనున్నారు. 45705 హెక్టార్లలో కంది పంటను సాగు చేయనున్నారు. కంది పప్పు ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సాధారణ విస్తీర్ణం కంటే 9వేల హెక్టార్లలో ఎక్కువగా రైతులు కంది పంటను సాగు చేశారు. ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా అంతర పంటగా రైతులు కందిని సాగు చేస్తున్నారు.

పెసర

పెసర పంటను కూడా జిల్లాలో ప్రధానంగా వేరుశనగకు అంతర పంటగా సాగు చేస్తున్నారు. అలాగే ఎర్రటి నేలల్లో, ఇసుక నేలల్లో ఎక్కువగా పెసర పంటను సాగు చేస్తున్నారు.

పప్పుశనగ

ప్రధానంగా జిల్లాలో రబీలో పప్పుసెనగ పంటను సాగు చేస్తారు. ఈ పంట నల్లరేగడి పొలాల్లో సాగుకు అనుకూలమైనది. చలికాలంలో వచ్చే మంచు బిందువులతో ఎక్కువగా ఈ పంట వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో పప్పుసెనగను సాగు చేయనున్నారు. ఎక్కువగా విడపనకల్లు, వజ్రకరూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో పప్పుసెనగ పంట రబీలో సాగుచేస్తున్నారు.

సోయాచిక్కుడు

సోయా చిక్కుడు పంటను ఎక్కువగా నల్లరేగడి భూమల్లో చేస్తారు. జిల్లాలో ప్రధానంగా సోయా చిక్కుడు తాడిపత్రి వ్యవసాయ డివిజన్‌ పరిధిలో సాగు చేస్తారు. సుమారు 1300 హెక్టార్లలో సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు.

ఉలవలు

ఎర్రనేలల్లో ఎక్కువగా ఉలవ పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఉలవ పంటను సాగు చేస్తున్నారు.

పొద్దుతిరుగుడు

నల్లరేగడి నేలల్లో ఎక్కువగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు. అయితే తీవ్ర వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో, రబీలో పొద్దుతిరుగుడు పంట సక్రమంగా పడలేదు. ఖరీఫ్‌లో 20085 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా గత ఖరీఫ్‌లో కేవలం 3570 హెకార్టలో మాత్రమే పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో బీడుగా కొంతమేరకు వదిలివేయగా, మరికొంత ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు.

ఆముదం

ఆముదం పంటకు మంచి గిట్టుబాటు ధర ఉండటంతో దీని సాగుకు రైతులు ఆసక్తి చూపించారు. వర్షాధారం కింద ఆముదంతో పాటు వేరుశనగతో పాటు ఇతర పంటల్లో అంతర పంటగా ఆముదంను సాగు చేస్తున్నారు. ఈ యేడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 23173 హెక్టార్లలో రైతులు ఆముదం పంటను సాగు చేశారు.

ధనియాలు

సారవంతమైన నల్లరేగడి పొలాల్లో ఎక్కువగా ధనియాలు పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా తాడిపత్రి వ్యవసాయ డివిజన్‌, ఉరవకొండ, విడపనకల్లు, హిందూపురం తదితర ప్రాంతాల్లో ధనియాలు సాగు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో ధనియాలు పంటను సాగు చేయనున్నారు. వర్షాధారం కింద ధనియాలు సాగు చేస్తారు. అలాగే బోరుబావుల కింద సాగు చేసే ఈ పంటను ఎక్కువగా కొత్తిమీరకు ఉపయోగించుకొని మార్కెట్‌ చేస్తారు. దీని వల్ల కూడా తక్కువ కాలంలో రైతులకు ఆదాయం సమకూరుతుంది.

చెరకు

జిల్లాలో చాలా తక్కువ విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేయనున్నారు. నార్పల, యాడికి మండలాల్లో చెరకు పంటను పండిస్తున్నారు. 150 నుంచి 200 ఎకరాల వరకు మాత్రమే ఈ పంట విస్తీర్ణం సాగవుతోంది.

పత్తి

జిల్లాలో పత్తి సాగులో పెద్దవడుగూరు ప్రసిద్ధి. ఇక్కడ ఆయకట్టు నీటితో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,255 హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నారు. పత్తికి మార్కెట్‌ ధర బాగుండటంతో రైతులు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా సాధారణ విస్తీర్ణం కంటే సాగు విస్తీర్ణం రెట్టింపవుతోంది.

మామిడి

జిల్లా వ్యాప్తంగా 7994 హెక్టార్లలో మామిడి పంటను సాగు చేయబడుతోంది. కదిరి, పెనగొండ, హిందూపురం, తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాంతాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. మిగిలన ప్రాంతాల్లో అక్కడక్కడా మామిడిని సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఇసుక రకం నేలల్లో ఈ మామిడిని సాగు చేస్తున్నారు.

అరటి

తక్కువ నీటి వినియోగం, తక్కువ శ్రమ, ఎక్కువ మంది కూలీలపై ఆధారపడాల్సి అవసరం లేని పంట అరటి. గత పదేళ్ల నుంచి టిష్యూకల్చర్‌ అరటి పంటను సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7286 హెక్టార్లలో (18215 ఎకరాలు) అరటి పంట సాగు చేయబడుతోంది. మూడు పంటలు వచ్చే అరటి ఒక్కక్క పంటకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. జిల్లాలో పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రి, పెద్దపప్పూరు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ పంటకు తెగుళ్లు తక్కువ... ఈదురు గాలులు వీస్తే చెట్లు నేలకొరి పంట తినే అవకాశం ఉంది. జిల్లాలో పండించిన అరటి పంట స్థానిక మార్కెట్‌తో పాటు ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓడ రేవుల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కూడా ఉంది.

చీనీ(బత్తాయి)

పండ్లతోటలలో ప్రధానమైన వాటిలో బత్తాయి(చీనీ) పంట ముఖ్యమైనది. చీనీ మొక్క  నాటిన ఐదు సంవత్సరాల నుంచి పంట చేతికొస్తుంది. జిల్లాలో గార్లదిన్నె, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బత్తాయిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 49759 హెక్టార్లలో (124397ఎకరాల్లో) బత్తాయి పంట సాగు చేయబడుతోంది. ఇటీవల కాలంలో బత్తాయి చెట్లకు వేరుకుళ్లు తెగుళ్లు ఎక్కువగా రావడంతో రైతులు నష్టపోతున్నారు. చీనీ మార్కెట్‌కు నిలకడ లేని మార్కెట్‌ వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. వీటికి తోడు నీటి వసతి చాలా వరకు తగ్గిపోవడంతో ధీర్ఘకాలికంగా నీటి వసతి కలిగిన వారే బత్తాయి సాగుకు ముందుకు వస్తున్నారు. యేడాదికి రెండు పంటలు తీయవచ్చు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, కోయంబత్తూరు, మైసూరు, బెంగళూరు, చెన్నై, ఈరోడ్‌, తిరుచ్చి, నాగ్‌పూర్‌, బెల్గాం తదితర ప్రాంతాలకు జిల్లా నుంచి బత్తాయి ఎగుమతి జరుగుతోంది. ఎక్కువగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రధానంగా ఎగుమతి జరుగుతోంది.

ద్రాక్ష

జిల్లా వ్యాప్తంగా 195 హెక్టార్లలో ద్రాక్ష పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా రాప్తాడు, కుందుర్పి, కణేకల్‌ మండలాల్లో పండిస్తారు. దిల్‌కుషా అనే రకం డిసెంబరు నుంచి పంట చేతికొస్తుంది. ఈరకం ద్రాక్షను కర్నాటకలోని చిత్రదుర్గం, నాసిక్‌, కటక్‌, లక్నో  కల్‌కత్తా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. మరో రకం సీడ్‌లెస్‌ (విత్తన రహిత రకం) వేసవీలో పంట చేతికొస్తుంది. ఈ రకం ద్రాక్ష స్థానిక మార్కెట్‌లోనే విక్రయిస్తారు.

జామ

ఇసుక నేలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా జామ పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో పామిడి, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల్లో అత్యధికంగా జామను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2100 హెక్టార్లలో జామ పంట సాగు చేయబడుతోంది. జనవరి నుంచి జామ పంట చేతికొస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన జామ స్థానిక మార్కెట్‌తో పాటు బెంగళూరు, కోలార్‌, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు  ఎగుమతి చేస్తారు. జ్యూస్‌ పరిశ్రమలకు కూడా జామను ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో జామకు ఎండు తెగులు రావడంతో చెట్లు ఎండిపోవడంతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు.

సపోట

జిల్లా వ్యాప్తంగా 3951 హెక్టార్లలో సపోటా పంటను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సపోటాను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంట చెనై, హైదరాబాద్‌, విజయవాడ , కొత్తపేట, సింగనూరు (కర్నాటక), మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతోంది.

దానిమ్మ

జిల్లా వ్యాప్తంగా 3363 హెక్టార్లలో దానిమ్మ పంట సాగు చేయబడుతోంది. ధర్మవరం, రాయదుర్గం, యల్లనూరు, పెద్దపప్పూరు, పెనుగొండ తదితర మండలాల్లో అత్యధికంగా దానిమ్మ పంటను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండించిన దానిమ్మ పంటను చెన్నై, కల్‌కత్తా, బెంగళూరు, కోయంబత్తూరు, విజయవాడ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

రేగు

జిల్లాలో 700 హెక్టార్లలో రేగు పంటను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపప్పూరు, తాడిపత్రి గార్లదిన్నె, ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో రేగు పంటను సాగు చేస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, మదనపల్లి, విశాఖపట్నం, కాళహస్తి, ఎలూరు ప్రాంతాలకు రేగు పంటను ఎగుమతి చేస్తున్నారు.

బొప్పాయి

జిల్లా వ్యాప్తంగా బొప్పాయి పంటను 4వేల హెక్టార్లలో పండిస్తున్నారు. ఇందులో ఇందులో థైవాన్‌ రెడ్‌లేడీ 786 రకం పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, యాడికి, పుట్లూరు, తదితర ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటను ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, అహమ్మదాబాద్‌, ముంబాయి, హైదరాబాద్‌ తదితర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు.

సీతాఫలం

జిల్లాలోని రాయదుర్గం, కుందిర్పి కొండ ప్రాంతాల్లో సీతాఫలం పండుతుంది. ఇక్కడి నుంచి ముంబాయి, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. అలాగే స్థానిక మార్కెట్‌ కూడా ఈప్రాంతాల నుంచి సీతాఫలం పండ్లు సరఫరా చేస్తారు.

ఉసిరి

జిల్లాలోని బొమ్మనహల్‌, డి.హీరేహల్‌, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఉసిరి పంటను సాగుచేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో లేకపోయినప్పటికీ ఉసిరి పంటను ఎక్కువగా మెడికల్‌, ఆయుర్వేద కంపెనీలకు ఎగుమతి జరుగుతోంది. అలాగే వూరగాయకు కూడా ఎగుమతి జరుగుతుంది

తమలపాకు

తమలపాకు పంటను జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు, యాడికి మండలం రాయలచెరువు, చందన, చిక్కేపల్లి, కమలపాడు తదితర ప్రాంతాల్లో పండిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 150 హెక్టార్ల వరకు తమలపాకు పంటను పండిస్తున్నారు. ఇటీవల కాలంలో తెగుళ్లు, మార్కెట్‌ ధర గిట్టుబాటు లేకపోవడంతోతమలపాకు రైతులు నష్టపోతున్నారు

చామంతి

చామంతి పంటను జిల్లాలోని పుట్లూరు మండలం ఎ.కొండాపురం, అరకటివేముల, సూరేపల్లి, కడవకల్లు, పెద్దపప్పూరు మండలం అమ్మళ్లదిన్నె, వరదాయపల్లి, నామనాంకపల్లి, పెద్దపప్పూరు, చిక్కేపల్లి, నార్పల మండలం నాయనపల్లి, వెంకటాంపల్లి తదితర గ్రామాల్లో, పెనుగోండ, హిందూపురం, గుత్తి తదితర ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 95 హెక్టార్లలోచామంతి పంటను సాగు చేస్తున్నారు. చామంతిని జూన్‌ మాసంలో చామంతి నారును నాటగా నవంబరులో పంట చేతికొస్తుంది. పంట కాలం ఆరు మాసాలు పడుతుంది  ఈయేడాది నాణ్యమై పంట లేకపోవడం, దిగుబడి తగ్గడం, మార్కెట్‌ ధర సరిగా లేకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు.

కరివేపాకు

తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకోగల పంటకరివేపాకు. నీరు లేకపోతే కరివేపాకు పంట ఎండిపోతుంది. అయితే చినిపోదు. తిరిగి నీరు పోయగానేబతికే పంటే కరివేపాకు. ఈ పంటను జిల్లా వ్యాప్తంగా ఎకరాల్లో సాగు చేయబడుతోండగా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలోనే అత్యధికంగా 700 ఎకరాల్లో సాగు చేయబడుతోంది. ఇక్కడి నుంచి చెన్నై, బెంగూళూరు, హైదరాబాద్‌, ఆదోని తదితర ప్రాంతాలకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూట కరివేపాకును ఎగుమతి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 450 హెకార్లలో కరివేపాకు పంటను రైతులు సాగు చేస్తున్నారు.

లిల్లీ

లిల్లీ పూల పంటను ప్రధానంగా నార్పల, శింగనమల మండలాల్లో పండిస్తారు. యాడికి, పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి ప్రాంతాల్లో లిల్లీ పూల సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో లిల్లీ పూల సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కనకాంబరం

జిల్లాలో వ్యాప్తంగా సుమారు 600 ఎకరాల్లో కనకాంబరం పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా నార్పల, బత్తలపల్లి మండలాల్లో ఎక్కువగా కనకాంబరం పూలను పండిస్తున్నారు. ప్రతిరోజూ కనకాంబరం పంట బత్తలపల్లి పూల మార్కెట్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

మల్లె

యాడికి మండలంలో వేములపాడు ప్రాంతాల్లో మల్లె పూల పంటను రైతులు పండిస్తున్నారు. అలాగే నార్పల, మడకశిర, హిందూపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా మల్లెపూల సాగు చేస్తున్నారు.

ఖర్భూజ

జిల్లాలో 4200 హెక్టార్లలో కర్భూజ, 1000హెక్టార్లలో పుచ్చ(కలింగర) పంటలను పండిస్తున్నారు. కళ్యాణదుర్గం, అనంతపురం రూరల్‌, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాల్లో ఎక్కువగా ఈ పంటలను సాగు చేస్తున్నారు. నూతన పద్దతులను అవలంబించి ఈ పంటలను సాగు చేస్తున్నారు. బింద పరికరాలతో పాటు పంట సాగులో మల్చింగ్‌ షీట్‌(ప్లాస్టిక్‌ కవర్‌ రోల్‌) పరచి వాటికి రంధ్రాలు వేసి అందులో విత్తం వేస్తారు. దీని వల్ల గడ్డి తగ్గడం, తెగుళ్లు, దోమను అరికట్టేందుకు అవకాశం ఉంది.

వక్కలు

జిల్లాలో వక్క పంటను ఎక్కువగా మడకశిర నియోజక వర్గంలో పండిస్తారు. కర్ణాటక సరిహద్దులో ఉండే మండలాల్లో ఈ పంటను పండిస్తారు. వక్క ప్రధానంగా అమరాపురం మండలంలో అత్యధికంగా 1300 ఎకరాల్లో, అగళి మండలంలో 600 ఎకరాలు, రొళ్ల మండలంలో 350 ఎకరాలు, గుండిబండ మండలంలో 250 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు పంట దిగుబడి వస్తుంది. ఈ పంటను ప్రధానంగా కర్నాటకలోని చిత్రచేడు, చెళ్లికెర, తూంకూరు, పరిసరాంపురం మార్కెట్‌లకు తరలించి విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో వక్క పరిశ్రమ నెలకొల్పుతామని రెవిన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి గతంలో హామీ ఇచ్చినా అదింతవరకు నెరవేరలేదు.

సేంద్రియ వ్యవసాయంపై పెరుగుతున్న ఆసక్తి

ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సేంద్రీయ సాగు విధానం వల్ల తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఈ పంట వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉండదు. వాతావరణ కాలుష్యం కూడా తగ్గనున్నది. దీని వల్లనే వేప కషాయంతో పాటు బ్రహ్మస్త్రం, ఆకులు, కషాయాలు, పేడ వంటి వాటితో తయారు చేసే సేంద్రియ ఎరువులను రైతులు వాడుతున్నారు. వర్మీ కంపోస్టు ఎరువుల తయారీకి కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సబ్సిడీతో కూడా వర్మీ ఎరువును ఎంపిక చేసిన రైతులకు సరఫరా చేస్తోంది. ఐకేపీ ఆధ్వర్యంలో రసాయనేతర ఎరువులవాడకంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సేంద్రీయ వ్యవసాయం ప్రొత్సహిస్తున్నారు. ఫలితాలను బట్టీ రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

జిల్లాలో బిందుసేద్యం

ఇటీవల కాలంలో తక్కువ నీటి వనరులను వినియోగించుకొని సాగు చేయడానికి అనువుగా రైతులు బిందుసేద్యం, తుంపర సేద్యంవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మైక్రోఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద రైతులకు రాయితీ ద్వారా బిందు, తుంపర పరికరాలను సరఫరా చేస్తున్నారు. బిందు పరికరాలు అత్యధికంగా పుట్లూరు, యల్లనూరు మండలాల రైతులు తీసుకోగా తుంపర పరికరాలు అత్యధికంగా ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల రైతులు తీసుకొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2003-04 నుంచి ఇప్పటివరకు బిందుసేద్యం పరికరాలు 64692 యూనిట్లును 76441 హెక్టార్లకు పంపిణీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.24447 లక్షల నిధులను రాయితీగా ఇచ్చింది.

తుంపర సేద్యానికి కూడా రాయితీ (స్పింక్లర్లు):

జిల్లా వ్యాప్తంగా 2003-04 నుంచి ఇప్పటి వరకు తుంపర సేధ్యం పరికరాలు 32677 యూనిట్లను 50065 హెక్టార్లకు పంపిణీ చేసింది. ఇందుకు గాను ప్రభుత్వం రూ.3784 లక్షల రూపాయల నిధులను సబ్సిడీగా రైతులకు రాయితీ ఇచ్చింది.

జిల్లాలో వ్యవసాయానికి విద్యుత్తు

జిల్లావ్యాప్తంగా వర్షాదారంతో పాటు బోరుబావుల కింద కూడా వ్యవసాయ పంటలను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.62లక్షల వ్యవసాయ మోటార్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు అనధికారింగా మరో 20 వేల వరకు విద్యుత్తు మోటార్‌ కనెక్షన్లు ఉన్నాయి.

జిల్లాలోని నీటి కుంటలు

జిల్లాలో మొత్తం 400 వరకు చెరువులు ఉన్నాయి. ఇందులో మైనర్‌, మేజర్‌ చెరువులు (కుంటలు) ఉన్నాయి. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే ఇవి పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడాల్సి ఉంది. వర్షం నీరు వస్తే ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. జిల్లాలోని బుక్కపట్నం చెరువు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే రెండవది. తరువాత స్థానంలో ధర్మవరం చెరువు, శింగనమల, బుక్కరాయసముద్రం చెరువులు ఉన్నాయి.

జిల్లాలో ప్రధానంగా పెన్నానది, జయమంగళినది, చిత్రావతి, వేదవతి (హగరి)నదులు ఉన్నాయి. వీటి పరివాహాక ప్రాంతాల్లో భూగర్భజలమట్టం పెరిగేందుకు మాత్రమే ఇవి ఉపయోగడుతున్నాయి. ఇటీవల కాలంలో అత్యధికంగా ఈ నదుల నుంచి అక్రమ ఇసుకు రవాణా జరుగుతోంది. అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా చాలావరకు భూగర్భజలమట్టం కూడా తగ్గుతోంది. దీనివల్ల సాగు నీటికేకాక తాగునీటికి ఇబ్బందులు తప్పే అవకాశం లేకపోలేదు.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. అవి అనంతపురం,ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ, రాయదుర్గం, తాడిపత్రి, తనకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటిలో హిందూపురం, అనంతపురం, తాడిపత్రి మినహా చాలా వరకు రైతులకు ఉపయోగ పడటం లేదు.

జిల్లాలో పాడిపరిశ్రమ

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా రైతులు జీవనాధారం సాగిస్తున్నారు. ఇటీవల పాడి పరిశ్రమను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక రాయితీలు ఇస్తోంది. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద గడ్డి పెంపకంను ప్రొత్సహిస్తోంది. గడ్డి పెంపకం చేపట్టిన రైతుకు ఆదాయాన్ని చేకూరుస్తుంది.

జిల్లావ్యాప్తంగా సుమారు 8.54 లక్షల తెల్లపశువులు, 6.68లక్షల గేదెలు ఉన్నాయి. ఇందులో కేవలం 55,600 సంకరజాతి ఆవులు కాగా 4500 ముర్రాజాతి, 35,500 గ్రేడెడ్‌ ముర్రాజాతి గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ సరాసరి 3.70లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో పాడి సహకార సమాఖ్య ద్వారా 2లక్షల లీటర్ల వరకు సేకరణ జరుగుతుండగా మిగిలిన పాలు ప్రయివేట్‌ సంస్థలు, పాలసేకరణదారులు, ఇతరులు సేకరిస్తున్నారు.

జిల్లాలో ఎరువుల వినియోగం

జిల్లా వ్యాప్తంగా ప్రటి యేటా 3లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం అవుతున్నాయి. ముఖ్యంగా రబీ సమయంలో ఎక్కువగా డీఏపీ ఎరువుకు నల్లరేగడి పొలాల రైతుల నుంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. రవాణా ఛార్జీలు కూడా రైతుపై అధనంగా భారం మోపుతుండటంతో రైతులు నిర్ధేశిత ధరకే విక్రయించే ఎజెన్సీల వద్ద బారులు తీరి మరీ ఎరువులను తీసుకెళ్లుతున్నారు. ఎరువుల దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు నామమాత్రపు దాడులు చేసి సరిపెట్టుకొంటున్నారు.

వ్యవసాయ కార్యాలయాల ఫోన్‌ నెంబర్లు

·         జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం :08554-275596

·         జిల్లా వ్యవసాయాధికారి(జేడీఏ) : 9505518181

·         పశుసంవర్థకశాఖ జేడీఎ : 944080767

·         అనంతపురం పాల డైరీ: 9440045758

·         ఉద్యాణవనశాఖ అధికారులు: 8374449060

·         ఏపీఎంఐపీ పీడీ: 8374449710

·         పట్టుగూళ్లకు ప్రసిద్ధి హిందూపురం

పట్టుగూళ్ల మార్కెట్లో హిందూపురం అగ్రస్థానంలో ఉంది. మార్కెట్‌కు నిత్యం 7 నుంచి 8 టన్నుల పట్టుగూళ్లు మార్కెట్‌కు వస్తున్నాయి. నాణ్యమైన పట్టుగూళ్లు గరిష్ట ధర రూ.330ల వరకు పలుకుతున్నాయి. రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడికి కర్నూలు, చిత్తూరు జిల్లాల రైతులు హిందూపురం మార్కెట్‌కు పట్టుగూళ్లు తీసుకువస్తారు.జిల్లాలో మల్బరీ సాగు విస్తీర్ణం 13 వేల ఎకరాలు ఉండగా ఒక్క హిందూపురంలోనే 8వేల ఎకరాలు ఉంది. మల్బరీ తోటలు సాగుచేయడం, షూట్‌రేరింగ్‌ పద్ధతిలో పంటలు మేపడంతో రైతులకు వంద గుడ్లకు 70 కిలోల నుంచి 80 కిలోల దిగుబడి తీస్తున్నారు.

చింతపండు, మిర్చికి పెట్టింది పేరు

హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు ఏటా లక్ష క్వింటాళ్లకు పైగా చింతపండు వస్తుంది. ప్రస్తుతం హిందూపురం మార్కెట్‌కు చింతపండు రావడం తగ్గింది. స్థానికంగా ఉన్న 6 శీతల గోదాముల్లో రెండేళ్లుగా ధరలు లేకపోవడంతో 1200 లారీలు (12000) టన్నులు నిల్వ ఉంచారు. హిందూపురం మార్కెట్‌కు ఏటా 40వేల కింటాళ్ల మిర్చి వస్తుంది.

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌ జిల్లాలోని ప్రధాన భారీ నీటిపారుదల ప్రాజెక్టు. ప్రాజెక్టు కింద సుమారు 26 మండలాల్లో 1,50,886 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

మధ్యతరహా ప్రాజెక్టులు

·         అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు - 10,048 ఎకరాలు

·         భైరవానితిప్ప ప్రాజెక్టు - 12,000 ఎకరాలు

·         చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు - 909 ఎకరాలు

·         పెన్నారు-కుముద్వతి ప్రాజెక్టు - 6,126 ఎకరాలు

·         యోగి వేమన రిజర్వాయర్‌ - 13 వేల ఎకరాలు

·         పెడబల్లి రిజర్వాయర్‌ - 1,500 ఎకరాలు

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు

·         పీఏబీఆర్‌ ప్రాజెక్టు

·         ఎంపీఆర్‌ ప్రాజెక్టు

·         మైలవరం ప్రాజెక్టు

పనులు జరుగుతున్న ప్రాజెక్టులు

·         పెండేకల్లు రిజర్వాయర్‌

·         ఛాంగళ్లు రిజర్వాయర్‌

·         పీఏబీఆర్‌ డిస్ట్రిబ్యూటరీ

చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు - సాగు వివరాలు (ఎకరాల్లో)

·         భైరవానితిప్ప ప్రాజెక్టు (గుమ్మగట్ట) - 12,000

·         అప్పర్‌పెన్నార్‌ ప్రాజెక్టు(పేరూరు) - 10,040

·         పెన్నా కుముద్వతి ప్రాజెక్టు (హిందూపురం) - 6,522

·         యోగి మేమన ప్రాజెక్టు (కదిరి) - 12,800

ప్రధాన కాలువలు - సాగు వివరాలు (ఎకరాల్లో)

·         తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్‌ మెయిన్‌ కెనాల్‌ - 35,541

·         మిడ్‌పెన్నార్‌ నార్త్‌కెనాల్‌ - 13,325

·         మిడ్‌పెన్నార్‌ సౌత్‌కెనాల్‌ - 33,176

·         తాడిపత్రి బ్రాంచ్‌కెనాల్‌ - 31,131

·         గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్‌ - 15,792

·         ఆలూరు బ్రాంచ్‌కెనాల్‌(కర్నూల్‌)- 14,255

·         గుత్తి సబ్‌బ్రాంచ్‌ కెనాల్‌ - 16,271

·         పులివెందల బ్రాంచ్‌కెనాల్‌(కడప) - 55,579

·         మైలవరం నార్త్‌కెనాల్‌ - 47,214

·         మైలవరం సౌత్‌కెనాల్‌ - 22,708

చెరువులు - సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)

·         100 ఎకరాలు పైబడి 305 చెరువులు ఉన్నాయి -89,991 ఎకరాలు

·         100 ఎకరాలు లోపు 959 చెరువులు ఉన్నాయి - 28,405 ఎకరాలు

ఆధారము: ఈనాడు

నదులు

పెన్నా

కర్ణాటక రాష్ట్రంలోని నందికొండలో పుట్టి హిందూపురం మండలం దక్షిణాన చేలూరు గ్రామం వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. పరిగి, రొద్దం, రామగిరి, కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఉరవకొండ, వజ్రకరూరు, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల గుండా ఈ నది ప్రవహించి, కోడూరు గ్రామానికి నైరుతీ దిశగా 3 కి.మీ. దూరంలో కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

చిత్రావతి

చిత్రావతి నది జిల్లాలో రెండో పెద్ద నది. ఇది కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నందిదుర్గానికి ఉత్తరంగా ఉన్న హరిహరేశ్వర్‌ కొండల్లో పుట్టి చిలమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామానికి 2 కి.మీ. దూరంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నది గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, యల్లనూరు మండలాల్లో ప్రవహిస్తుంది. కడప జిల్లాలోని గండికోట వద్ద పెన్నానది సంగమం చేస్తుంది.

హగరి లేదా వేదావతి

హగరి లేదా వేదావతి నది కూడా ముఖ్యమైంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో పుట్టి గుమ్మగట్ట, బ్రహ్మ సముద్రం, బెళుగుప్ప, కణేకల్లు, డి.హీరేహాళ్‌ మండలాల గుండా ప్రవహిస్తుంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ప్రవేశిస్తుంది.

జయమంగళ

ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పరిగి మండలంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పెన్నానదిని, సంగమేశ్వరంపల్లి గ్రామం(పరిగి మండలం) వద్ద కలుస్తుంది.

చిన్ననదులు: చిలమత్తూరు మండలంలోని కుషావతి, అగళి మండలంలోని స్వర్ణముఖి, తనకల్లు మండలంలోని పాపాఘ్ని, నల్లమాడ, కదిరి, ముదిగుబ్బ మండలాల్లోని మద్దిలేరు, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లోని పండమేరు చిన్న నదులు.

ఆధారము: ఈనాడు

 

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free