పౌష్ఠిక ఆహారం పెరుగుదల
పౌష్టిక ఆహారం మరియు పెరుగుదల గురించిన సమాచారం తెలుసుకొని పాఠించటం ఎందుకు ముఖ్యమంటే ప్రస్తుతం శిశు మరణాల్లో సగానికి పైగా పోషకాహారం లోపం వల్లనే సంభవిస్తున్నాయి. పోషక లోపం (కుపోషణ) వల్ల శరీరంలో ప్రతిఘటన శక్తి నశిస్తుంది. తగిన ఆహారం లేక పోవటం, తరచూ అస్వస్థతకు గురవటం, శిశువు సంరక్షణను పట్టించుకోకపోవటం కుపోషణకి దారి తీస్తుంది. మహిళ గర్భవతిగా ఉన్నపుడు కుపోషణకి గురైనా, రెండేళ్ల వయస్సు వరకు శిశువుకు పోషకాహారం లోపించినా, ఆ శిశువు శారీరక, మానసిక పెరుగుదల నెమ్మదిస్తుంది. ఆ శిశువు పెద్ద అయిన తర్వాత కూడా దీన్ని సరిచేయలేరు. కుపోషణ ప్రభావం ఆ శిశువు భవిష్యత్ జీవితం పై ఉంటుంది. అనారోగ్యం నుంచి రక్షణపొంది , శారీరక మానసిక పెరుగుదలకు అవసరమైన సంరక్షణా పూరితమైన వాతావరణం, వసతులు పొందటానికి శిశువులకు అన్ని రకాల హక్కులున్నాయి.
ముఖ్య సందేశాలు :
పౌష్టికాహారం మరియు పెరుగుదలకు సంబంధించి ప్రతి కుటుంబం, సమాజం, ఏయే అంశాలను తెలుసుకొనే హక్కుకలిగి ఉంది.
- నవ శిశువు రోజురోజుకీ బరువు పెంచుకుంటూ చక్కగా ఎదగాలి. పుట్టినప్పుటి నుంచి రెండేళ్ల వయస్సు దాకా శిశువు బరువును ప్రతినెలా చూడాలి. వరుసగా రెండు నెలల పాటు శిశువు బరువులో పెరుగుదల లేకపోతే, ఏదో లోపం ఉన్నట్లు భావించాలి.
- ఆరునెలల వయస్సు వచ్చే వరకు శిశువుకు ఆహారమైనా పానీయమైనా కేవలం తల్లి రొమ్ము పాలు మాత్రమే అవసరమవుతాయి. ఆరునెలల నిండాక, తల్లి పాలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలు శిశువుకు అవసరం.
- ఆరునెలల నుంచి రెండేళ్ల వయస్సు వరకూ తల్లి పాలు కొనసాగిస్తూనే రోజుకు కనీసం ఐదుసార్లు శిశవుకు ఆహారం తినిపించాలి.
- అనారోగ్యాన్ని ప్రతిఘటించటానికి, దృష్టిదోషాలను నివారించటానికి పిల్లలకు విటమిన్ - ఎ చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, నూనెలు, గుడ్లు పాల ఉత్పత్తులు, తల్లిపాలు, బలపరచిన ఆహార పదార్థాలు, విటమిన్ - ఎ సప్లిమెంట్లలో విటమిన్ - ఎ సమృద్ధిగా ఉంటుంది.
- పిల్లల శారీరక, మానసిక సామర్ధ్యాన్ని పరిరక్షించడానికి ఇనుము (ఐరన్) ధాతువు సమృద్ధిగా వున్న ఆహార పదార్థాలు అవసరం. కలేజా (కార్జము/లివరు) , లేత మాంసము, చేపలు, గుడ్లు, ఇనుముతో బలపరిచిన ఆహార పదార్ధాలు / సప్లిమెంట్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
- పిల్లల్లో నేర్చుకొనే సామర్ధ్యంలో పెరుగుదలలో జాప్యాలను నివారించటానికి అయొడైజ్ ఉప్పు అత్యంత అవసరం.
- అస్వస్థత కాలంలో పిల్లలు క్రమం తప్పకుండా ఆహారాన్ని భుజిస్తుండాలి. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కనీసం వారం రోజుల పాటు పిల్లలకు అధనంగా ఒక పూట భోజనం ఎక్కువగా పెట్టాలి.
ముఖ్య సందేశాలు - 1
నవ శిశువు రోజురోజుకీ బరువు పెంచుకుంటూ చక్కగా ఎదగాలి. పుట్టినప్పుటి నుంచి రెండేళ్ల వయస్సు దాకా శిశువు బరువును ప్రతినెలా చూడాలి. వరుసగా రెండు నెలల పాటు శిశువు బరువులో పెరుగుదల లేకపోతే, ఏదో లోపం ఉన్నట్లు భావించాలి.
- క్రమం తప్పకుండా బరువు పెరగటమనేది ఆ శిశువు ఎదుగుల, అభివ్రద్ధి చక్కగా ఉందని తెలిపే ముఖ్య సంకేతం. ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ప్రతిసారీ శిశువు బరువును తూచాలి. మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు మాత్రమే పూర్తిగా తాగిన శిశువు పెరుగుదల సాధారణంగా ఆ కాలంలో బాగుంటుంది. సాధారణంగా వచ్చే అనారోగ్యాలు తోడ్పడతాయి. వీరితో పోలిస్తే, తల్లిపాలు లేని శిశువు నేర్చుకోవటంలో నెమ్మదిగా ఉంటారు.
- రెండునెలల వరకూ బరువులో పెరుగుదల లేని శిశువుకు ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని, పోషక పదార్థాలను తినిపించాలి. ఎందుకంటే ఆ శిశువు అనారోగ్యంలో ఉండొచ్చు లేదా ఎక్కువ సంరక్షణ అవసరం కావచ్చు.
- ఇలాంటి శిశువుల పట్ల తల్లిదండ్రులు, ఆరోగ్య కార్యకర్తలు వెంటనే స్పందించి, మూల కారణమేంటో కనుక్కోవాలి. ప్రతి శిశువుకు ఒక పెరుగుదల పట్టిక ఉండాలి. శిశువు బరువును తూచిన ప్రతిసారీ ఆ పట్టిక పై చుక్కపెట్టి గుర్తించాలి. ప్రతిసారి బరువు తూగిన తర్వాత ఈ చుక్కలను ఒకగీత ద్వారా కలపాలి. పట్టిక పై ఈ రేఖ శిశువు పెరుగుదలను స్పష్టంగా సూచిస్తుంది. పట్టిక పై గీత పైకి వెళితే, శిశువు ఎదుగుదల చక్కగా ఉన్నట్లు లేదా ఆ గీత అడ్డంగా ఉన్నా క్రిందకు వెళుతున్నా అది ఆందోళనకరమైన విషయమే.
శిశువు బరువు క్రమం తప్పకుండా పెరగక పోయినా అభివృద్ధి లేకపోయినా, అడగ వలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి:
- శిశువు తరచూ ఆహారం తీసుకుంటున్నాడా ? రోజుకు కనీసం మూడు నుంచి ఐదుసార్లు శిశువు ఆహారం తినాలి. వైకల్యంతో ఉన్న శిశువు భుజించడానికి ఒకరి సహాయం కావాలి. తినడానికి ఎక్కువ సమయం అవరసం
- శిశువుకు సరిపడేంత ఆహారం అందుతోందా ? ఆహారం భుజించిన తర్వాత శిశువు ఇంకా మరికొంత ఆహారం కోరితే పెట్టాలి.
- బిడ్డ తీసుకునే ఆహారంలో పెరుగుదల లేక శక్తి నిచ్చే పదార్థాలు తక్కువుగా ఉన్నాయా ? బిడ్డ పెరగడానికి సహాయపడే వాటిల్లో మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్, కాయ ధాన్యాలు, ధాన్యాలు, పప్పులు మొదలైనవి. చిటికెడంత నూనె శక్తినిస్తుంది. ఎర్ర పామాయిల్ ఇతర విటమిన్ సమృద్ధిగల వంటనూనెలు కూడా శక్తి నిచ్చే వనరులు గలిగి ఉన్నాయి.
- తినడానికి బిడ్డ నిరాకరిస్తున్నాడా ? ఒక ఆహార పదార్థం రుచిని బిడ్డ ఇష్టపడకపోతే, ఇతర రకాల ఆహారాన్ని ఇవ్వాలి. క్రమక్రమంగా కొత్త రకాల ఆహార పదార్థాలను ప్రవేశ పెట్టాలి.
- శిశువుకు అనారోగ్యమా ? అనారోగ్యంతో వున్న బిడ్డ కొంచెం కొంచెం ఆహారాన్ని తరుచుగా తినడానికి ప్రోత్సహించాలి. అనారోగ్యం నుంచి బయటిపడ్డాక వారం రోజులపాటు బిడ్డకు అదనంగా ఒక పూట భోజనం ఎక్కువగా అవసరం. శిశువులకు తల్లిపాలు అదనంగా అవసరమవుతాయి. శిశువు తరచూ అనారోగ్యానికి గురైతే, ఆరోగ్య కార్యకర్తచేత పరీక్ష చేయించాలి.
- అనారోగ్యాన్ని నివారించే విటమిన్-ఎ తో కూడిన ఆహారం శిశువుకు తగినంతగా అందుతోందా ? రొమ్ముపాలల్లో విటమిన్-ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇంకా, కార్జము (కాలేజా), గుడ్లు, పాల ఉత్పత్తులు, ఎర్రపామాయిల్, పసుపు, నారింజరంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో కూడా ఎ - విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఒకవేళ, తగిన మొత్తంలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోతే, బిడ్డకు ఏడాదికి రెండు సార్లు విటమిన్-ఎ క్యాప్సూల్ ఇవ్వాలి.
- రొమ్ముపాలకు ప్రత్యామ్నాయంగా శిశువుకు సీసాపాలు ఇస్తున్నారా ? శిశువుకు ఆరు నెలల లోపు వయస్సు ఉంటే పూర్తిగా రొమ్ముపాలు మాత్రమే ఇవ్వటం ఉత్తమం. ఆరునెలల నుంచి రెండేళ్ల వయస్సు వరకు కూడా రొమ్ముపాలనే కొనసాగించాలి. ఎందుకంటే, వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర పాలు ఇవ్వదలిస్తే వాటిని సీసాలో నుంచి కాకుండా పరిశుభ్రమైన కప్పు ద్వారా శిశువుకు తాగించాలి.
- శిశువుకిచ్చే ఆహార పదార్థాలు, మంచినీటిని శుభ్రంగా పెట్టారా ? ఒకవేళ, శుభ్రంగా పెట్టకపోతే, శిశువు తరచూ అస్వస్థతకు గురవుతారు. ముడి ఆహార పదార్థాలను శుభ్రంగా కడిగి వుండాలి. వండిన ఆహారాన్ని వెంటనే తినిపించాలి. మిగిలిన ఆహార పదార్థాన్ని బాగా వేడి చేయాలి.
- సురక్షితమైన వనరు నుంచి వచ్చే మంచి నీటిని పరిశుభ్రంగా నిల్వ చేయాలి. క్రమం తప్పకుండా క్లోరినేట్ చేసిన పైప్ లైన్ ద్వారా వచ్చే పరశుభ్రమైన నీటిని పట్టుకోవాలి. శుభ్రమైన మంచినీటిని చేద బావి, బోరు బావి, బావి నుంచి కూడా సేకరించవచ్చు. ఒకవేళ, నీటిని చెరువు నుంచి లేదా కాల్వనుంచి సేకరిస్తే దాన్ని మరగబెట్టడం ద్వారా సురక్షితంగా మార్చవచ్చు.
- మలము మరుగుదొడ్లలో / మూత్రశాలలోనే వేస్తున్నారా ? లేదా భూమిలో పూడ్చివేస్తున్నారా ? ఒకవేళ అలా చేయకపోతే బిడ్డకు కడుపులో నులిపురుగులు ఏర్పడి, ఇతర అనారోగ్యానికి గురవుతాడు. నులిపురుగులు కలిగి వున్న బిడ్డకు ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి, వాటిని (డీ-వార్మ్ చేయాలి) విసర్జింపజేయాలి.
- శిశువును ఎక్కువ సేపు ఒంటరిగా వదిలేస్తూన్నారా ? ఒకవేళ అలాచేస్తే, ఆ శిశువుకు పెద్దల నుంచి సంరక్షణ, శ్రద్ధ ఎక్కువగా అవసరం. ముఖ్యంగా భోజనం సమయంలో ఆ శిశువును ఉత్తేజం చేయాలి.
ముఖ్య సందేశాలు - 2
ఆరునెలల వయస్సు వచ్చే వరకు శిశువుకు ఆహారమైనా పానీయమైనా కేవలం తల్లి రొమ్ముపాలు మాత్రమే అవసరమవుతాయి. ఆరునెలలు నిండాక, తల్లి పాలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలు శిశువుకు అవసరం.
- పుట్టిన తర్వాత తొలి రోజుల్లో, శిశువును నీళ్ల విరోచనాలు, ఇతర అంటువ్యాధుల నుంచి రక్షించటానికి రొమ్ముపాలు చాలా సహాయం చేస్తాయి. ఆరు నెలల తర్వాత కూడా రెండేళ్ల వరకూ శిశువుకు రొమ్ము పాలు కొనసాగించాలి. ఆరునెలల లోపు వయస్సు గల శిశువులు బరువు లో పెరుగుదల లేకపోతే, ఆ శిశువుకు తరచూ రొమ్ముపాలు తాగిస్తుండాలి.
- రొమ్ముపాలు తాగే ఆరునెలల లోపు శిశువుకు ఇతర పానీయాలు గానీ, మంచినీరుగానీ అవసరం లేదు.
- బరువు పెరగని శిశువు అనారోగ్యంతోనైనా ఉండాలి లేదా వారికి సరిపడినంతగా రొమ్ముపాలు దొరకడం లేదని భావించాలి. ఆరోగ్య కార్యకర్త శిశువు ఆరోగ్యాన్ని పరీక్షించి, తల్లి తన శిశువుకు రొమ్ముపాలను అధికంగా తాగించడానికి ఏం చేయాలనే దానిపై సలహాలు ఇవ్వాలి.
ఆరునెలల వయస్సు రాగానే శిశువుకు తల్లి రొమ్ము పాలతో పాటు ఇతర ఆహారం అవసరం. దీన్ని అదనపు ఆహారం అంటారు. వీటిలో పొట్టు తీసి, వండి, గుజ్జుగా చేసిన కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, పండ్లు, కొద్దిగా నూనె, చేపలు, గుడ్లు, చికెన్, మాంసము , పాల ఉత్పత్తులు వంటి వాటిని అదనపు ఆహారంగా ఇస్తే శిశువుకు కావలసిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి, ఆహారంలో ఎన్ని ఎక్కువ రకాలు ఉంటే, అంత మంచిది.
- 6 నుంచి 12 నెలల వయస్సు పిల్లలకు ఇతర ఆహారం తినిపించే ముందు తల్లిపాలు తరచూ ఇవ్వాలి.
- ఆరునెలల వయస్సు తర్వాత ఇతర ఆహార పదార్థాలు తినటం, నేలపై పాకటం వల్ల శిశువుకు అంటు వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక, శిశువు చేతులను, వారు తినబోయే ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.
- ఏడాది నుంచి రెండేళ్ల వయస్సు పిల్లలు భోజనం చేసిన తర్వాత రొమ్ముపాలు ఇవ్వాలి. వారు కోరితే ఇతర సమయాల్లో కూడా తల్లిపాలు ఇవ్వాలి.
ముఖ్య సందేశాలు - 3
ఆరునెలల నుంచి రెండేళ్ల వయస్సు వరకు తల్లి (రొమ్ము) పాలు కొనసాగిస్తూనే రోజుకు కనీసం ఐదుసార్లు శిశువుకు ఆహారం తినిపించాలి.
- మొదటి రెండు సంవత్సరాల్లో పోషక లోపం ఏర్పడితే, ఆ శిశువు భవిష్యత్ లో శారీరక మానసిక ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది.
- శిశువు చక్కగా పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే వారికి వివిధ రకాల పోషక పదార్థాలతో కూడిన ఆహారం ఇవ్వాలి. అంటే, రొమ్ముపాలతో పాటు, మాంసము, చేపలు, పప్పులు, ధాన్యాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు వండి తినిపించాలి.
- పెద్దలతో పోలిస్తే, చిన్న పిల్లల కడుపు చాలా చిన్నది, కనుక ఒక్క సారి వారు ఎక్కువ తినలేరు. కనుక ఒక పూట లోనే వారు మొత్తం భోజనం చేయలేరు. కాని, పిల్లల శరీర నిర్మాణానికి, శక్తి చేకూర్చుకోవడానికి ఆహారం ఎంతో అవసరం. ఈ అవసరం తీరడానికి పిల్లలు తరుచుగా , అంటే ఐదు పూటలు భోజనం చేయాలి.
- గుజ్జుగా వండిన కూరగాయాలు, కొన్ని మాంసం తునకలు, గుడ్లు లేదా చేపలు వంటి వాటిని పిల్లలకు ఆహారంతో పాటు తరచూ ఇవ్వాలి. కొద్దిగా నూనెను, వీలైతే ఎర్ర పామాయిల్ లేదా విటమిన్ సమృద్ధిగల నూనెను ఉపయోగించాలి.
- సాధారణ రకం పాత్రల్లో వడ్డిస్తే పిల్లలకు సరిపడేంత ఆహారం లభించకపోవచ్చు. కనుక, తల్లి దండ్రులు, సంరక్షులు పిల్లలకు ప్రత్యేకమైన పాత్రల్లో ఆహారం వడ్డించాలి. అప్పుడే పిల్లలు తమకు కావలసినంత తినగలరు. వారు ఎంత వరకు తింటున్నదీ తెలుసుకోవచ్చు.
- చిన్న పిల్లలు ఆహారం తినడానికి ప్రోత్సాహం అవసరం. వారు ఆహారాన్ని, పాత్రలను పట్టుకొని తినడానికి పెద్దల సహాయం అవరసం. అంగవైకల్యంగల పిల్లలు తినడానికి, త్రాగడానికి అదనపు సహాయం కావలసి ఉంటుంది.
ముఖ్య సందేశాలు - 4
అనారోగ్యాన్ని ప్రతిఘటించటానికి, దృష్టిదోషాలను నివారించటానికి పిల్లలకు విటమిన్ - ఎ చాలా అవసరం. పండ్లు, కూరగాయాలు, నూనెలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, తల్లిపాలు, బలపరిచిన ఆహార పదార్థాలు, విటమిన్ - ఎ సప్లిమెంట్లలో విటమిన్ - ఎ ఎక్కువగా ఉంటుంది.
- శిశువుకు ఆరునెలలు వయస్సు వచ్చే వరకు తల్లిపాల ద్వారా తగినంత విటమిన్-ఎ లభిస్తుంది. అయితే, తల్లి తాను భోజనం లో విటమిన్ - ఎ ఎక్కువగా వున్న పదార్థాలు ఉన్నపుడే, ఆమె రొమ్ముపాల ద్వారా శిశువుకు విటమిన్ - ఎ లభిస్తుంది. ఆరు నెలలు పైబడిన పిల్లలకు ఇతర ఆహారం ద్వారా విటమిన్ - ఎ పొందవలసి ఉంటుంది.
- గుడ్లు, కార్జము (కలేజా), పాల ఉత్పత్తులు, చేపనూనె, పండిన మామిడి పండ్లు, బొప్పాయి, చిలకడ దుంపలు, ఆకుకూరలు, క్యారెట్ లలో విటమిన్ - ఎ లభిస్తుంది.
- తగినంత విటమిన్ - ఎ లభించకపోతే శిశువులకు రేచీకటి వచ్చే ప్రమాదం ఉంది. సాయం సంధ్యాకాలంలో, రాత్రి వేళల్లో చూపు కష్టమైన పిల్లలకు విటమిన్ - ఎ ఎక్కువగా అవసరం. ఇలాంటి పిల్లలకు విటమిన్ - ఎ క్యాప్సూల్ కోసం ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లాలి. కొన్ని దేశాల్లో, నూనె, ఇతర ఆహార పదార్థం విటమిన్ - ఎ కలుపుతారు. క్యాప్యూల్ మాత్రమే లేదా ద్రవం రూపంలో కూడా విటమిన్ - ఎ లభిస్తుంది. చాలా దేశాల్లో, ఏడాదికి ఒకటి రెండుసార్లు విటమిన్ - ఎ క్యాప్సూల్ ను ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పంపిణీ చేస్తారు.
- విరేచనాలు, మీజిల్స్ వ్యాధి వచ్చిన పిల్లల శరీరం లో విటమిన్ - ఎ తగ్గిపోతుంది. దీన్ని తిరిగి భర్తీచేయడానికి ఆ పిల్లలకు తరచూ తల్లిపాలు ఇవ్వాలి. ఆరునెలలు పైబడిన పిల్లలైతే, వారికి పండ్లు, కూరగాయలు, గుడ్లు, కార్జము, ఆహారాల ఉత్పత్తులను ఎక్కువగా తినిపించాలి. 14 రోజులకన్నా ఎక్కువ కాలం విరేచనాలతో బాధపడిన పిల్లలకు, మీజిల్స్ వచ్చిన పిల్లలకు, ఆరోగ్య కార్యకర్త వద్ద లభించే విటమిన్ - ఎ క్యాప్యూల్ తీసుకొని ఇవ్వాలి.
ముఖ్య సందేశాలు - 5
పిల్లల శారీరక, మానసిక సామర్ధ్యా న్ని పరిరక్షించటానికి, ఇనుము, (ఐరన్) ధాతువు సమృద్ధిగా వున్న ఆహార పదార్థాలు అవసరం. కలేజా (కార్జము) లేత మాంసము, చేపలు, గుడ్లు, ఇనుముతో బలపరిచిన ఆహార పదార్థాలు) సప్లిమెంట్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
- ఇనుము లోపంతో వచ్చే అనీమియా వ్యాధి. శారీరక, మానసిక వికాసానికి అవరోధం కల్పిస్తుంది.
- నాలుక, అరిచేతులు, పెదవుల లోపలి భాగం పాలి పోయినట్లు ఉండడం, నీరసం / అలసట శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది అనీమియా వ్యాధి లక్షణాలు. ప్రపంచంలో పోషకాహారలోపం వల్ల సంభవించే అతి సాధారణ జబ్బుల్లో అనీమియా ఒకటి.
- శిశువులు, చిన్నపిల్లల్లో అనీమియా స్వల్పస్థాయిలో ఉన్నప్పటికీ అదివారి మేధో వికాసంపై దుష్ప్రభావం చూపుతుంది.
- అనీమియాకు గురైన రెండేళ్ల లోపు పిల్లలు సమన్వయం, సమతుల్యం కోల్పోయి ముడుచుకు పోయినట్లు కనిపిస్తారు. నలుగురితో కలిసి ఆడుకోవటానికి నిరాకరిస్తారు. ఫలితంగా వారి మేధో వికాసం సరిగా జరగదు.
- అనీమియాకు గురైన గర్భవతులకు ప్రసవ సమయంలో రక్తస్రావం తీవ్రత అధికమయ్యే ప్రమాదం ఉండి, మరణానికి కూడా ప్రధాన కారణం కావచ్చు. అనీమియా గల తల్లులకు పుట్టిన శిశువులు బరువు లోపం తో ఉండి, వారూ అనీమియాతో బాధపడతారు. ఇనుము బిళ్లలు (మాత్రలు) మహిళను, ఆమెకు పుట్టబోయే శిశువును రక్షిస్తాయి.
- కార్జము, లేతమాంసము, గుడ్లు, పప్పు ధాన్యాల్లో ఇనుము ధాతువు లభిస్తుంది. ఇనుముతో బల పరిచిన ఆహారం కూడా అనీమియాను నిరోధిస్తుంది. మలేరియా నులిపురుగుల సమస్య అనీమియాను కలుగజేస్తాయి లేదా ఈ వ్యాధిని తీవ్రం చేస్తాయి.
- మలేరియాను నివారించడానికి దోమ తెరకింద నిద్రించాలి. సిఫార్సు చేసిన క్రిమిసంహారక మందు ఈ దోమ తెరకు పూసి ఉండాలి.
- పురుగులు, క్రిములు ఎక్కువగా ఉన్న ప్రదాశాల్లో నివసించే పిల్లలకు ఏడాదికి కనీసం రెండు మూడుసార్లు యాంటీ హెల్మింతిక్ తో చికిత్స చేయాలి. పరిశుభ్రమైన అలవాట్లతో కూడా క్రిములను నివారించవచ్చు. మరుగుదొడ్ల సమీపం లో పిల్లలు ఆడుకోరాదు. వారి చేతులను తరచూ సబ్బుతో కడుగుతుండాలి. క్రిములతో పీడలేకుండా బయట ఆడుకునే పిల్లల కాలికి సాక్స్ తొడగాలి.
ముఖ్య సందేశాలు - 6
పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాంలో, పెరుగుదలల్లో జాప్యాన్ని నివారించటానికి అయోడైజ్డ్ ఉప్పు అత్యంత అవసరం.
- పిల్లల పెరుగుదల, అభివృద్ధికి స్వల్ప మొత్తం లో అయోడిన్ అత్యంత ఉవసరం. పిల్లలకు తగినంత అయోడిన్ లభించకపోతే లేదా వారి తల్లి గర్భవతిగా ఉన్నపుడు అయోడిన్ లోపంతో ఉంటే, అలాంటి పిల్లలు పుట్టుకతోటే మానసిక వైకల్యంతో గానీ వినికిడి లేదా మాట్లాడే లోపంతో గాని ఉంటారు. ఇలాంటి పిల్లల ఎదుగుదల శారీరకంగా, మానసికంగా చాలా నెమ్మదిగా ఉంటుంది.
- ఆహారములో అయోడిన్ లోపాన్ని సూచించే మరో వ్యాధి గాయిటర్. ఈ వ్యాధికి గురైన వారి మెడ చుట్టూ వాపు ఉంటుంది. గాయిటర్ తో ఉన్న గర్భవతికి గర్భస్రావం గానీ మృత శిశువు లేదా మెదడు పాడైన శిశువుకు జన్మనివ్వటం గానీ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- సాధారణ ఉప్పు స్థానంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగించినట్లైతే మహిళ, ఆమె పిల్లలకు కావలసినంత, అయోడిన్ లభిస్తుంది. అయోడైజ్డ్ ఉప్పు అందుబాటులో లేకపోతే, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి అయోడిన్ సప్లిమెంట్లు పొందాలి.
ముఖ్య సందేశాలు - 7
అస్వస్థత కాలంలో పిల్లలు క్రమం తప్పకుండా ఆహారం భుజిస్తుండాలి. అనారోగ్యం నుంచి కోలుకున్నాక, కనీసం వారం రోజుల పాటు పిల్లలకు అదనంగా ఒక పూట భోజనం ఎక్కువగా పెట్టాలి.
- పిల్లలు అనారోగ్యంతో- ముఖ్యంగా విరేచనాలు, మీజిల్స్ వ్యాధితో ఉన్నపుడు వారిలో ఆకలి మందగిస్తుంది. వారు తినే ఆహారాన్ని వారి శరీరం స్వల్పంగా ఉపయోగిస్తుంది. ఒక ఏడాది కాలంలో ఇలా పలుసార్లు జరిగితే ఆ పిల్లల పెరుగుదల మెల్లగా ఉంటుంది. లేదా నిలిచిపోతుంది.
- అనారోగ్యంలో వున్న శిశువు ఆహారం తినడానికి ప్రోత్సాహం చాలా ఉవసరం. అయితే, వీరికి ఆకలి ఉండదు కనుక ఇది కొంత కష్టం కావచ్చు. పిల్లలకు నచ్చిన, ఇష్టపడిన ఆహారాన్ని ఇవ్వటం చాలా ముఖ్యం. దీన్ని కొద్దికొద్దిగా తరచూ ఇస్తుండాలి. అన్నిటికన్నా మించిది, తల్లిపాలు ఇవ్వటం చాలా ముఖ్యం.
- అనారోగ్యంతో ఉన్న పిల్లలు తరచూ పానీయాలు తాగటానికి ప్రోత్సహించాలి. విరేచనాలవల్ల శిశువు శరీరం లో నీరు తగ్గి ( డీ-హైడ్రేషన్) తీవ్ర సమస్య ఏర్పడుతుంది. ద్రవ పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల డీ-హైడ్రేషన్ ను నివారించవచ్చు.
- అనారోగ్యం, ఆకలి తగ్గటం కొన్ని రోజుల తర్వాత కూడా కొనసాగితే, శిశువును ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్లాలి. అనారోగ్యం కలగడానికి ముందు శిశువు ఎంత బరువు ఉన్నాడో, ఆ బరువును తిరిగి పొందే వరకు శిశువు పూర్తిగా కోలుకోలేనట్లు లెక్క.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు