Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

గుండె


మానవుని గుండె అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

  • ఇది పిడికిలంత పరిమాణంలో ఉండి బోలుగా, కండరనిర్మితమైన అవయవం.
  • ఇది ఛాతి మధ్య భాగంలో కొద్దిగా ఎడమ ప్రక్కకు ఉంటుంది.
  • ఇది రోజుకి సుమారు లక్ష సార్లు, నిమిషానికి అరవై నుండి తొంభై సార్లు (60-90) కొట్టుకుంటుంది.
  • గుండె స్పందించిన ప్రతీసారీ రక్తాన్ని శరీరములోనికి పంపుతుంది.
  • హృదయ ధమనుల ద్వారా సరఫరా చేయబడిన రక్తం ద్వారా పోషణ మరియు ఆమ్లజని (ఆక్సిజన్) రక్తముతోపాటు గుండెకు చేరుతుంది.
  • గుండె కుడి మరియు ఎడమ భాగాలుగా విభజింపబడి ఉంటుంది. గుండెలో రెండు గదులు ఉంటాయి (వీటిని కర్ణిక మరియు జఠరిక అంటారు). మరలా ఒక్కొక్క గదికి కుడి మరియు ఎడమ వైపున రెండేసి గదుల చొప్పున ఉంటాయి. గుండెలో మొత్తం నాలుగు గదులు ఉంటాయి.
  • శరీరము నుండి చెడు రక్తాన్ని కుడి వైపునున్న గుండె గ్రహించి ఊపిరితిత్తులకు పంపిస్తుంది.
  • ఊపిరితిత్తులలో శుభ్రపడిన రక్తము గుండె ఎడమ భాగానికి తిరిగి వచ్చి అక్కడి నుండి రక్తం తిరిగి శరీరములోనికి వెళుతుంది.
  • గుండెకు ఎడమ ప్రక్కన రెండు కవాటాలు ( మైట్రల్ మరియు బృహద్ధమని), కుడి ప్రక్కన రెండు కవాటాలు (పుప్పుస మరియు అగ్రత్రయ కవాటాలు) ఉంటాయి. ఇవి రక్తాన్ని ఒకేదిశలో ప్రవహించేలా చేస్తాయి.

గుండె పోటు

గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళే రక్త నాళాలలో కొవ్వు కాని, రక్తపు గడ్డ వలన కాని రక్త సరఫరాలో ఆటంకము కలిగిన యెడల గుండె పోటు వస్తుంది.

గుండెపోటు అంటే ఏమిటి ?

గుండె శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని అందించే జీవాధారమైన అవయవం. గుండె ఆమ్లజని (ఆక్సిజన్) సహిత రక్తమును రక్తనాళాల ద్వారా గ్రహిస్తుంది. ఈ రక్తనాళాలను (కరోనరీ) హృదయ ధమనులు అంటారు.
ఈ రక్తనాళాలు పూడుకుపోతే రక్తము గుండె కండరాలకు అందక గుండె పనిచేయదు. దీనినే గుండె పోటు అంటారు.

గుండెపోటు తీవ్రత, గుండె కండరాలు ఎంతవరకు పాడైపోయినవో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ చచ్చుబడిపోయిన కండరాలు రక్తాన్ని పంపించే సామర్ధ్యాన్ని తగ్గించి గుండె పని చేసే తీరుని మార్పు చేస్తుంది. ఇది కన్జెస్టివ్ హార్ట్ ఫెల్యూర్ కి దారితీస్తుంది. దీని వలన శ్వాస తీసుకొనలేకపోవడం మరియు పాదాలకు చెమట పట్టడం వంటివి జరుగుతాయి.

లక్షణాలు

  • ఛాతీ మధ్య భాగములో అకస్మాత్తుగా నొప్పి రావడం గుండె పోటు యొక్క ప్రధాన లక్షణము
  • ఈ నొప్పి ఒక్కో సమయములో ఛాతీ మీద బరువు పెట్టినట్లు గాను లేదా నొక్కిపట్టినట్లుగాను ఉండవచ్చును
  • ఈ ఛాతీ నొప్పి భుజానికి కాని చేతులకు కాని వెనక వీపు భాగమునకు గాని దవడకు కాని ప్రాకినట్లుగా ఉండవచ్చును
  • ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గదు
  • శరీరమంతా చల్లబడి చమట పట్టినట్లు ఉండవచ్చును
  • ఊపిరి అందకపోవచ్చు
  • శరీరము చచ్చుబడినట్లు, బలహీనపడి వాంతి వచ్చినట్లు ఉండవచ్చు
  • తల తిరిగినట్లు స్పృహ కోల్పోతున్నట్లు ఉండవచ్చు
  • ఛాతీ నొప్పి లేకుండానే పైన తెలియబరిచిన లక్షణాలతో మాత్రమే కూడా గుండెపోటు రావచ్చు

ఇది ఎందుకు వస్తుంది ?

మనకు వయస్సు పెరిగే కొద్దీ , హృదయధమనులతో పాటు శరీరం యొక్క వివిధ భాగాలలోని రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది క్రమంగా రక్తప్రసారానికి అవరోధం కల్గిస్తుంది. ఈ విధంగా రక్త నాళాలు మూసుకుపోవడాన్ని ఎథిరోస్ల్కిరోసిస్ అంటారు.

పురుషులు, స్త్రీల కన్నా ఎక్కువ గుండెపోటుకి గురయ్యే అవకాశం ఉంది. స్త్రీలు స్త్రీ సెక్స్ హార్మోనులైన ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ ల ప్రభావము చేత రక్షింపబడతారు. ఈ రక్షణ కనీసం రజోనివృత్తి వరకు ఉంటుంది.

భారతీయులతో సహా ఆసియా దేశం వారు ఎక్కువ అతిప్రమాదభరితమైన గుండెపోటుకి గురౌతున్నారు.

ఈ అపాయానికి కారణాలుః

  • ధూమపానం
  • మధుమేహం
  • అధిక రక్తపోటు
  • అధిక బరువు
  • ఎక్కువ కొవ్వు మరియు తక్కువ హెచ్ డి ఎల్ (అధిక సాంద్రత లిపోప్రొటీన్) విలువలు వర్సెస్ మేలు చేసే కొవ్వు
  • భౌతికశ్రమ లేకపోవడం
  • గుండెపోటు చరిత్ర గల కుటుంబం
  • వత్తిడి, ఎక్కువకోపము మరియు ఆందోళన
  • వంశపారంపర్య కారకాలు

ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుంది

  • ఎక్కువగా రక్తపోటు ఉన్నవారికి
  • రక్తములో ఎక్కువ శాతం కొవ్వు వున్న వాళ్ళకు
  • శారీరక శ్రమ లేనివాళ్ళకు
  • స్థూలకాయులకు
  • మధుమేహ వ్యాధి ఉన్నవారికి
  • మధ్యపానము ఎక్కువ మోతాదులో సేవించే వారికి
  • బీడీ, సిగరెట్ లాంటి పొగాకు సంబంధించినవి వాడే వాళ్ళకి
  • వయస్సు మీద పడుతున్న వాళ్ళకు

గుండెపోటుని ఏవిధంగా కనిపెట్టాలి ?

  • వైద్యుడు వైద్యచరిత్ర వివరాలను తీసుకుని గుండె స్పందనలను పరీక్ష చేసి రక్తపోటును నమోదు చేస్తారు.
  • గుండె స్పందనలను నమోదు చేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసిజి) ను తీస్తారు.
  • గుండె స్పందన వేగము, అసామాన్యమైన స్పందన నమూనా మొదలైన సమాచారాన్ని ఈసిజి ఇస్తుంది. గుండెపోటు వల్ల పాడైపోయిన కండరాల ఉనికిని కూడా ఈసిజి తెలియ జేస్తుంది. మొదటి దశలో నమోదైన మామూలు ఈసిజి, గుండెపోటు రావడానికి అవకాశాలు లేవనే అవగాహనకు రాకూడదనే విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం.
  • గుండె కండరాలు పాడైనదీ లేనిదీ గుర్తించడానికి రక్తపరీక్షలు ఉపయోగపడతాయి.
  • గుండెని ఎక్స్ రే తీయడం మంచిది.
  • గుండె పనిచర్యల సమాచారము తెలుసుకోడానికి ఈకోకార్డియోగ్రాఫ్ చేయించడం మంచిది.
  • రక్తనాళాలు మూసుకుపోయాయని నిర్థారించే సాక్ష్యాన్ని కరోనరీ ఎంజియోగ్రామ్ తెలియ జేస్తుంది.

గుండెపోటు వల్ల అనర్దాలు

  • గుండె కండరానికి ఎంతమోతాదులో రక్త ప్రసరణ తగ్గినది లేదా పూర్తిగా ఆగిపోయిన స్థాయిని బట్టి అనర్థాలు వుంటాయి.
  • ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ చేసే సామర్ద్యాన్ని కోల్పోయి హార్టు ఫెయిల్యూర్ రావచ్చు.
  • గుండె కొట్టుకొనే క్రమబద్దతలో గుండె దడలాంటి మార్పులు రావచ్చును.
  • గుండె పోటు వచ్చిన కొన్నిరోజులు తరువాత గుండెలో కవాటాలకు అనర్థము రావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పొగాకు సంబంధించినవి బీడీ, సిగరెట్లు త్రాగడం పూర్తిగా మానాలి
  • క్రమం తప్పక వ్యాయమం చేయాలి
  • రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
  • కూరాగాయలు, పండ్లు ఎక్కువగా ఆహారములో తీసుకోవాలి
  • వీలైతే చేప కూరలు, చేప వేపుడు తినాలి
  • వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది
  • క్రమం తప్పక డాక్టరును సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది

గుండె నొప్పి వచ్చునప్పుడు రోగికి ఎటువంటి ప్రధమచికిత్స ఇవ్వాలి?

గుండె నొప్పికి సత్వరమైన వైద్య చికిత్సను అందించడం ద్వారా జీవితాలను రక్షించగలము.

  • నైపుణ్యత గల వైద్యసహాయము అందే వరకు రోగిని పడుకోబెట్టి బిగుతుగానున్న దుస్తులను వదులు చేయాలి.
  • ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్లైతే రోగికి ఆక్సిజన్ ఇవ్వాలి.
  • ఆ సమయమునకు నైట్రోగ్లిజరిన్ లేదా సోర్బిట్రేట్ మాత్రలు అందుబాటులో ఉంటే ఒకటి లేదా రెండు మాత్రలు రోగి నాలుక క్రింద ఉంచవచ్చు.
  • కరిగిన రూపంలో ఆస్ప్రిన్ మాత్రను కూడా ఇవ్వవలెను.
  • అంబులెన్సు, డాక్టరు కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడం
  • వీలైతే అస్పిరిన్ మాత్ర తీసుకోవడం
  • కుటుంబ వ్యక్తిగత డాక్టరుకు వెంటనే సమాచారాన్ని తెలిపి సలహా తీసుకోవడం
  • ప్రమాదాన్ని గురించి ఆలోచించకుండా మనో నిబ్బరంగా ఉండేటట్లు వాతావరణం కల్పించడం త్వరగా ఆస్పత్రికి తరలించడం

దీనికి చికిత్స ఏమిటి ?

  • గుండె నొప్పులకు ఆసుపత్రిలో చేర్చడం మరియు సత్వర వైద్య సదుపాయము అవసరమవుతుంది.
  • మొదటి కొద్ది నిమిషములు మరియు గంటలు కీలకమైనవి. ప్రధమదశలో హృదయ ధమనులలోని అడ్డంకులు కరగడానికి మందులు ఇవ్వవచ్చు.
  • గుండె చప్పుడు (లయ) పర్యవేక్షించబడుతుంది మరియు ఇది అసహజంగా ఉన్నట్లైతే సత్వర చికిత్స చేయబడుతుంది. నొప్పి ఉపశమనానికి మందులు ఇవ్వాలి మరియు రోగిని విశ్రాంతి మరియు నిద్రకు ప్రోత్సహించాలి.
  • ఒకవేళ అధిక రక్తపోటు (పీడనం) ఉన్నట్లైతే రక్త పోటు తగ్గడానికి మందులు ఇవ్వాలి.
  • నిర్దిష్టమైన చికిత్స ప్రత్యేకించబడి ఉంటుంది. ఇది రక్తనాళాలలోని అడ్డంకులపరిధి, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత మరియు రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది.
  • చాలాసార్లు అతి నిర్దిష్ట పద్ధతుల ద్వారా రక్తనాళాలలో అడ్డంకులు తొలగించుట అవసరమౌతుంది. ఇది కరోనరీ ఎంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింప జేయుట లేదా కరోనరీ బైపాస్ సర్జరీ రూపాలలో ఉండవచ్చును.

గుండె పోటు రాకుండా ఎలా అడ్డుకొనవచ్చు?

అతి ప్రమాదభరితమైన గుండె జబ్బులున్నవారు – ఈ క్రింది నిరోధక చర్యలను తీసుకోవాలి.

జీవన శైలి మార్పులో ఎదురయ్యే సవాలు

వారి ఆహారము, తక్కువ కొవ్వు పదార్థములు మరియు ఉప్పు, అధిక పీచుపదార్థములు మరియు సంక్లిష్ట పిండిపదార్థాలతో ఆరోగ్యవంతంగా ఉండాలి.

  • ఎవరైతే అధిక బరువును కల్గి ఉన్నారో వారు బరువు తగ్గించుకొనుట అవసరము.
  • క్రమం తప్పకుండా రోజూ భౌతిక వ్యాయామం చెయ్యాలి.
  • పొగ త్రాగుట పూర్తిగా మానివేయాలి.

మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తప్పకుండా మందులు వాడి వారి పరిస్థితిని నియంత్రించుకోవాలి.

గుండె -రక్తనాళాల వ్యాధులు

శరీరంలో గుండె అతిముఖ్యమైన భాగం. ఇది మనిషి శరీరంలో ఎడమవైపున ఛాతీ భాగంలో ఉంటుంది. దీనిలో నాలుగు గదులు ఉంటాయి. పైన ఉన్న రెండు గదులను ఆరికల్స్ లేదా ఆట్రియా (auricles or atria) అంటారు. క్రింది భాగంలో ఉన్న గదులను వెంట్రికల్స్ (ventircles) అంటారు. గుండె లోపల ఎడమ మరియు కుడి ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ ను కండరాలు కలిగిన గోడ విభజిస్తుంది. ఆరికల్స్ యొక్క గోడలు వెంట్రికల్స్ యొక్క గోడల కంటే మందంగా ఉంటాయి. ఈ గోడలలో మూడు పొరలు ఉంటాయి. గుండె వెలుపల వైపున ఉండే పొరను పెరికార్డియం (peri cardium) అంటారు. గుండె లోపలి వైపున ఉండే పొరను ఎండోకార్డియం (endo cardium) అంటారు. ఈ రెంటికి మధ్యలో ఉండే పొరను మయోదార్డియం అంటారు. ఈ పొర కండరాలతో తయారుచేయబడి ఉంటుంది. ఈ కండరాలు ఇతర శరీర కండరాలవలె కాకుండా ఏ విధమైన నాడీ సంబంధమైన ప్రేరేపణ లేకుండా సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి. రక్తం ఎప్పుడూ గుండెలో ఆరికల్స్ నుండి వెంట్రికల్స్ కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా రక్తం ఒకే దిశలో ప్రవహించడానికి వీలుగా ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ మధ్య కవాటాలు ఉంటాయి. ఒక క్రమపద్దతిలో సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ గుండె కాని రక్తనాళాలు గాని సరిగ్గా పనిచేయనప్పుడు గుండె జబ్బులు వస్తాయి.

ఈ వ్యాధులు ఏ వయస్సులో అయినా రావచ్చు. కాని ఇవి ఎక్కువగా మధ్య వయస్సులో వస్తాయి. గుండె జబ్బుల వల్ల గుండెలో పెరీకార్డియం, మయోకార్డియం లేదా ఎండోకార్డియం దెబ్బతినవచ్చు. అంతేకాక గుండెలోపలి రక్తనాళాలు లేదా గుండె కవాటాలు దెబ్బ తినడం వల్ల కూడా ఈ జబ్బులు రావచ్చు. కానీ హార్టెటాక్ అన్నిసార్లు ప్రాణాంతకం కాదు. కొన్నిసార్లు ఇవి పూర్తిగా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు అవే చాలా తీవ్రస్థాయిని పొందవచ్చు. చాలాసార్లు ఈ జబ్బులు ఆర్టరీల గోడలు గట్టిపడి వాటి ఎలాస్టిసిటీని కోల్పోవడం వల్ల వస్తాయి.

గుండె జబ్బులలో రకాలు

ఎథిరోస్ల్కిరోసిస్: ఇది ఆర్టరీస్ లో వచ్చే వ్యాధి. ఈ వ్యాధిలో ఆర్టరీల యొక్క లోపలి పొరలో రక్తం, పైబ్రస్ టిష్యూ, పిండిపదార్ధాలు, క్రొవ్వుపదార్ధాలు మరియు కాల్షియం వంటివి పేరుకుపోతాయి. అందువల్ల రక్తనాళాల గోడలు మందంగా తయారై రక్తప్రసరణను ఆటంక పరుస్తాయి.
కరోనరీ హార్ట్ డిసీజ్: మయోకార్డియంకు కావలసిన రక్తాన్ని కరోనరీ ఆర్టరీస్ అందించలేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనినే ఇస్కమిక్ హార్ట్ డిసీజ్ అనికూడా అంటారు. మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ మరియు ఏంజినాపెక్టోరిస్ ఈ కోవకు చెందిన గుండె రక్తనాళాల జబ్బులే.
మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ : గుండె కండరాలకు కావలసిన రక్తం అందకపోవడం వల్ల రక్తం అందని భాగం నిర్జీవమైపోతుంది. దీనినే నెక్రోసిస్ అని అంటారు. ఈ విధంగా గుండెలో ఎక్కువ భాగం నిర్జీవం కావడం వల్ల గుండె సరిగా పనిచెయ్యలేదు. ఎధిరోస్ల్కిరోసిస్ ఉన్న కరోనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టుకుపోయి రక్తప్రసరణకు అడ్డుపడటం వల్ల ఈ ఇన్ ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ఆకస్మిక మరణం సంభవించవచ్చు.

ఏంజినాపెక్టోరిస్: ఎక్కువగా పనిచేసినప్పుడు లేదా ఆవేశపడినప్పుడు ఛాతీలో నొప్పి రావడాన్ని ఏంజినా పెక్టోరిస్ అంటారు. ఇది రోగి యొక్క పనిచేసేశక్తిని తగ్గిస్తుంది. రోగి తన పనిని అదుపులో ఉంచుకుంటే చాలా సంవత్సరాలు ఈ వ్యాధితో బ్రతికే అవకాశం ఉంది.

వ్యాధి ఎలా వృద్ధి చెందుతుంది ?

రక్తనాళాలలో ఏదైనా రాపిడివల్ల లీకైన రసాయన పదార్ధాలవల్ల లోపలి పొర అప్పుడప్పుడు చిట్లిపోతుంది. ఈ చిట్లిన ప్రదేశాన్ని మార్చే సమయంలో రక్తంలోని పదార్ధాలు చనిపొయిన కణజాలం ఆ ప్రదేశంలో పేరుకుపోతాయి. ఈ విధంగా పేరుకుపోయిన కణజాలంపై రక్తంలొ అధికంగా ఉన్న కొలెస్ట్రాల్,కొలస్ట్రాల్ కారియర్స్ మరియు లిపోప్రొటీన్ వంటి ఇతర క్రొవ్వు పదార్ధాలు కూడ పేరుకుపొతాయి. ఈ విధంగా పేరుకుపోయిన పదార్ధాలు రక్తనాళాల లోపలిపొరలను మందంగాను మరియు యెత్తుపల్లాలు వచ్చేటట్లు చేస్తాయి. పేరుకున్న కొలస్ట్రాల్ క్రిస్టల్స్ గా తయారవుతుంది. ఇది నెమ్మదిగా గట్టిపడి ఫైబ్రస్ ఫ్లేక్స్ గా మార్పుచెందుతుంది. అందువల్ల రక్తనాళాలలొని ఖాళీ తగ్గిపోతుంది. ఒకొక్కసారి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుకుపోవడంవల్ల రక్తనాళాలు మరింత సన్నబడతాయి. ఈ విధంగా ఒకొక్కసారి ఆయా రక్తనాళాలలో రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఆ రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేసే కణాలు రక్తం అందకపొవడం వల్ల నిర్జీవం అయి నెక్రోసిస్ వస్తుంది. ఈ విధంగా గుండె పనిచేసే శక్తి తగ్గిపోతుంది.

లక్షణాలు

గుండె రక్తనాళాల జబ్బులు ఉన్నవారిలో పని ఎక్కువయినప్పుడు ఆయాసం రావడం,నీరసం మరియు ఛాతిలో నొప్పి కనిపిస్తాయి. ఒకవేళ గుండె-రక్తనాళాలు బాగాదెబ్బతింటే గుండె పరిమాణం పెరుగుతుంది. మూత్రపిండాలకు రక్తం సరఫరా కూడా బాగా తగ్గిపోవడంవల్ల కణజాలంలోని ఖాళీప్రదేశాలలో నీరు మరియు సోడియం నిలువ ఉండిపొతుంది. ఈ విధంగా నీరు ముందుగా కాళ్ళు మరియు చేతులలో నిలువ ఉంటుంది. క్రమేణా ఇది కడుపు మరియు ఛాతిలోని కేవిటీల్లో నిల్వ ఉంటుంది. దీనినే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్(congestive heart failure) అని అంటారు.

గుండె-రక్తనాళాల జబ్బులు రావడానికి కారణాలు

లింగత్వం: గుండె రక్తనాళాల జబ్బులు ఎక్కువగా పురుషుల్లోను మరియు మెనోపాజ్ వయసులోని స్త్రీలలోను వస్తాయి. ప్రత్యుత్పత్తి వయసులొ ఉన్న స్త్రీలలో ఈ జబ్బులు తక్కువగా రావడానికి ముఖ్యకారణం వారిలో ఉండే అండాశయాలు ఉత్పత్తి చేసే హార్మోనులు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని కొంతవరకూ తగ్గిస్తాయి. కానీ గర్బనిరోధక మాత్రలు వేసుకొనే స్ర్తీలలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
వయస్సు: ఈ జబ్బులు వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటాయి. ఇవి 50-55 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో అతి ఎక్కువగా కనిపిస్తాయి.
జన్యుసంబంధమైన కారణాలు: ఈ రోగ చరిత్ర ఉన్న కుటుంబాల వ్యక్తులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిని కలగచేయడంలో 30 జీన్సుల పాత్ర ఉంది. రక్తంలోని కొలస్ట్రాల్ ను తగ్గించే ఇఫోలిపో ప్రోటీన్ తయారుచేయడానికి కారణమైన జన్యువులలో మూడు రకాలున్నాయి. ఈ మూడు రకాలలో ఒక రకం జీను ఉన్న వ్యక్తులలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులలో గుండె-రక్తనాళాలలో జబ్బులు ఉంటే పిల్లలలో ఈ జబ్బులు తల్లిదండ్రులకు ఈ జబ్బువచ్చిన వయస్సు కంటే చిన్న వయస్సులోనే వచ్చే అవకాశాలున్నాయి.

శరీరతత్వం: పొట్టిగా, లావుగా మరియు పొట్టిమెడ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. పొట్టిగా ఉన్నవారిలో ఛాతీ భాగంలో ఎక్కువగా క్రొవ్వు ఉండే అవకాశాలు ఎక్కువ.
వ్యక్తిత్వ సంబంధిత కారణాలు: ఎక్కువ బాధ్యతలు కలిగిన వ్యక్తులు, తమకు ఇష్టమైనవారిని కోల్పోయిన వ్యక్తులు, ఎక్కువగా సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది.
పొగత్రాగడం: పొగత్రాగేవారిలో ఈ జబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. పొగత్రాగడం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్.డి .యల్ తయారీ తగ్గిపోతుంది. పొగలో ఉండే నికోటిన్ రక్తనాళాలను సంకోచించేటట్లు చేస్తుంది. ఇవి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టేటట్లు కూడా చేస్తుంది. అంతేకాక ఈ పొగలో ఉండే ఫ్రీరేడికల్స్ రక్తనాళాల లోపలి పొరను దెబ్బతినేటట్లు చేస్తాయి. అందువల్ల ఆ ప్రదేశంలో పైబ్రస్ ప్లేక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
జీవనవిధానం: ఎక్కువ శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.
ఊబకాయం: అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ.
త్రాగేనీరు: నీటిలో ఎక్కువ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉన్నప్పుడు అది కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి.
అధిక కాఫీ మరియు మత్తు పానీయాలు: ఎక్కువగా కాఫీ మరియు ఆల్కహాలు తీసుకొన్నప్పుడు గుండె పనిచేసే విధానం దెబ్బతినడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి.

మధుమేహం: మధుమేహవ్యాధి గుండె మరియు రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా అధికం.
ఆహారపు అలవాట్లు: అధిక చక్కెర,మాంసాహారం,వెన్న,నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. క్రొవ్వు పదార్ధాలలో ముఖ్యంగా కొబ్బరినూనె,డాల్డా,నెయ్యి,మార్జరిన్ ఎక్కువగా ఈ వ్యాధులను కలిగిస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఫాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ వుండటం వల్ల (Poly unsaturated fatty acids) వీటిని వాడినప్పుడు మిగిలిన క్రొవ్వుపదార్ధాలలో పోల్చినప్పుడు రక్తంలో కొలస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ వీటిని కూడా తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకొన్నప్పుడు ఏం జరుగుతుంది?

ఆహారంలో క్రొవ్వుపదార్దాలు జీర్ణం కావడానికి కాలేయాన్ని చేరతాయి. కాలేయం ఈ క్రొవ్వు పదార్ధాలను ప్రోటీన్లతో కలిసేటట్లు చేసి వి.ఎల్.డి.ఎల్. (క్రొవ్వును కలిగిన ప్యాకెట్లు) ను తయారుచేస్తుంది. ఇది రక్తంలో కలిసి ఎపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైము వాటిపై పనిచేయడం వల్ల చిన్న చిన్న వి.ఎల్.డి.ఎల్ రెమినెంట్స్ గా తయారవుతుంది. ఇది ఎపోప్రోటీన్ సి మరియు బి లతో కలిసి ఎల్.డి.ఎల్ గా మార్పు చెందుతుంది. ఈ ఎల్.డి.ఎల్, కణాలలోకి ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ద్వారా చేరుతుంది. ప్రతీకణంలో కొన్ని పరిమితమైన ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ఉంటాయి.

  • ఈ ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ అన్నీ ఎల్.డి.ఎల్ తో నిండిపోయినప్పుడు మిగిలిన ఎల్.డి.ఎల్ రక్తనాళాల గోడలకు అతుక్కొనిపోయి వాటిని సన్నగా చేస్తాయి.
  • నెయ్యి,డాల్డావంటి సాచ్యురేటెడ్ నూనెలను తీసుకొనేటప్పుడు ఇవి కణాలలోని ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ను తగ్గించి తద్వారా ఎధిరోస్ల్కిరోసిస్ ను అధికం చేస్తుంది. అంతేకాక రక్తనాళాలలో లోపలి పొర తయారుచేసే రక్తనాళాలకు సంకోచింపచేసే పదార్ధాన్ని(Endothelium derived relaxing factor) కూడా తక్కువగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది.
  • సాచ్యురేటెడ్ ల్యూకో ట్రైఈన్స్(Leuco trienes) వంటి రక్తం చిక్కబడేటట్లు చేసే పదార్ధాలను కూడా తయారుచేస్తాయి. ఈ విధంగా చిక్కబడిన రక్తం త్వరగా గడ్డకట్టే అవకాశాలు ఎక్కువ. ఇతర రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపించే పదార్ధాలు కూడా క్రొవ్వు పదార్ధాలు వాడినప్పుడు ఎక్కువవుతాయి.
  • రక్తంలోని వి.ఎల్.డి.ఎల్ రెమినెంట్స్ ఎపోప్రోటిన్ ఇ తో కలిసి హెచ్.డి.ఎల్ గా (మంచి కొలెస్ట్రాల్)తయారవుతుంది.
  • హెచ్.డి.ఎల్ రక్తంలో అధికంగా ఉన్న ఎల్.డి.ఎల్ ను మరలా కాలేయానికి తీసుకువచ్చి అక్కడి నుండి విసర్జింపబడేటట్లు చేస్తుంది.
  • ఎక్కువగా వ్యాయమం చేయడం వల్ల మరియు పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తీసుకొన్నప్పుడు ఈ హెచ్.డి.ఎల్ శరీరంలో పెరుగుతుంది.

గుండెజబ్బులను అరికట్టే చేపనూనెలు

  • చేపనూనెలలో ఉండే ఎన్-3 ఫాటీ యాసిడ్లు శరీరంలో క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. అంతేకాక ఇవి శరీరంలోని రక్తం గడ్డకట్టేటట్లు చేసే పదార్ధాలను కూడా తగ్గిస్తాయి.
  • యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా గల పదార్ధాలు:నిమ్మ,నారింజ,బత్తాయి వంటి విటమిన్ సి ఎక్కువగా కల పదార్ధాలు,టమోటా,క్యారెట్,బొప్పాయి, మామిడి వంటి పసుపు రంగు మరియు ఎరుపురంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విటమిన్ ఎ ని కలిగి ఉండి గుండె జబ్బులను తగ్గిస్తాయి. ఫ్రీరేడికల్స్ రక్త నాళాల లోపలి పొర దెబ్బతినేటట్లు చేస్తాయి. వీటిని యాంటి ఆక్సిడెంట్లు తగ్గించడం వల్ల ఇవి గుండె జబ్బులను తగ్గిస్తాయి.
  • పైబర్ ఎక్కువగా ఉన్న పదార్ధాలు: పీచు పదార్ధం ఎక్కువగా గల పచ్చి కూరగాయలు,మామిడి,ఆపిల్స్,జామకాయ వంటి పండ్లు,ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తక్కువగా వస్తాయి.
  • ఇతర పదార్ధాలు: ఉల్లిపాయ,వెల్లుల్లి మరియు శనగపప్పులో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉండటం వల్ల ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అంతేకాక పాలు,ఆకుకూరలు,రాగులు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే పదార్ధాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
  • వీటిని దృష్టిలో ఉంచుకొని ఆహారపు అలవాట్లులో మార్పు తెచ్చుకోవడం అనగా యాంటి ఆక్సిడెంట్సు ఎక్కువగా గల పదార్ధాలు, పీచు పదార్ధం ఎక్కువగా గల పదార్ధాలు తీసుకోవడం,నూనె పదార్ధాలను తగ్గించడం,సిగరెట్లు మానేయడం,తగినంత వ్యాయామం చేయడం మరియు మానసిక వత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండె-రక్తనాళాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

 

 

 

 

 

ఆధారము: పోర్టల్ విషయ రచన భాగస్వామ్యులు

ఒంటిరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ ను ఎదుర్కోవడం ఎలా

గుండెపోటు అనేది ఒక గుర్తించని అతిథి వంటిది. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే,మీ జెనెటిక్స్ కారణంగా ఊహించని క్షణాల్లో గుండెపోటుకు దారి తీయవచ్చు. మీ వద్ద వేరొక వ్యక్తి ఉంటే కనుక, మీకు ప్రారంభ వైద్య చికిత్సను చేయవచ్చు. మీరు ఒంటరిగా ఉంటే మీకు సరైన కదలికలు మినహా, బతకటానికి చిన్న ఆస్కారం మాత్రమే ఉంటుంది.

అమెరికాలో ప్రతి సంవత్సరం కనీసం 1.5 మిలియన్ మంది గుండె పోటుతో బాధపడుతున్నారు. 1.5 మిలియన్ మందిలో 5,00000 మంది చనిపోతున్నారు. అమెరికన్లు చనిపోవటానికి కారణం ఎమర్జెన్సీ వైద్య సేవలు లేకపోవటమే కారణం అని చెప్పవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే, మీరు ఒక అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తూ ఉంటే, అభివృద్ధి చెందని దేశాలలో నివసించే ప్రజలతో పోలిస్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అత్యంత సాధారణ చిహ్నాల ద్వారా గుండెపోటు బాధ తెలుసుకున్నప్పుడు,మీరు ఖచ్చితంగా త్వరగా చర్య తీసుకోవాలి. మనస్సు యొక్క మీ ఉనికి మీ మనుగడ అవకాశాలను పెంచదు.

ఉదాహరణకు, మీరు ప్రస్తుతం గుండెపోటును కలిగి ఉంటే,మీరు వెంటనే ఎమర్జెన్సీ కోరుకుంటారు. దానికి బదులుగా మరిన్ని లక్షణాలు చూపే దాక వేచి ఉండరు. కాబట్టి, ఇక్కడ మరింత వైద్య చికిత్స చేయటానికి ముందు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటును తట్టుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

లక్షణాలు తెలుసుకోండి:
  • మీ మొదటి అడుగు గుండెపోటు లక్షణాలను తెలుసుకోవటం.
  • మీరు ఊహాత్మక గుండెపోటుతో భాదపడుతూ ఉంటే, ఏమి జరుగుతుందో మీరు గుర్తించలేరు.
  • సాధారణ గుండెపోటు లక్షణాలు ఛాతీ బిగుతు లేదా సంపూర్ణత ఉంటాయి. అలాగే ఛాతీ నుండి ప్రసరణ, శ్వాస ఆడకపోవటం మరియు తీవ్రమైన నొప్పి ఉంటాయి.
  • ఛాతీ మధ్యలో అసౌకర్యమైన ఒత్తిడి, సంపూర్ణత, పిండినట్టు ఉండటం లేదా నొప్పి వంటి లక్షణాలు ఉంటే, మీరు గుండెపోటుతో బాధపడుతున్నట్లు మరియు అది ఒక అలారంగా భావించాలి.
  • మీరు చేస్తున్న ప్రతిదీ ఆపాలి మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు లక్షణాలు ఎదుర్కొంటుంటే, అప్పుడు వాహనం ఆపండి. మీరు చేస్తున్న ప్రతి పనిని ఆపండి.
  • మీరు మీ శరీరం నుండి ఒత్తిడి పోగొట్టేందుకు స్పేస్ మరియు స్వేచ్ఛ ఇవ్వాలి.
  • శరీరం యొక్క కండరములను సడలిస్తే బ్లాక్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఇది ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటును తట్టుకొనే మార్గం.
  • ఆస్పిరిన్ ఉంచుకోండి చాలా గుండెపోటు కేసుల్లో రక్తం గడ్డకట్టటం వలన గుండె పోటుకు కారణం అవుతుంది.
  • గుండెకు రక్తాన్ని సరఫరా చేసే భాద్యతను రక్త కణాలు తీసుకుంటాయి. ఈ అడ్డంకులు ఆమ్లజని అధికంగా ఉన్న రక్తాన్ని గుండెకు అందకుండా చేయవచ్చు.
  • అలాగే గుండె కండరాలకు మరింత నష్టం కలిగించి,అది క్రమంగా మరణానికి దారి తీస్తుంది.
  • మీరు గుండెపోటు ఉన్న సమయంలో ఆస్పిరిన్ తీసుకుంటే, క్లాట్ ను నివారించే అవకాశం ఉంటుంది.
  • అలాగే క్లాట్ విచ్ఛిన్నంనకు సమయం కూడా ఉంటుంది.
  • మీరు డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో ఆస్పిరిన్ తీసుకోవాలి.
  • గుండె పోటును తట్టుకొవటానికి ఇది ఒక మంచి మార్గం.
  • గుండెపోటు చుట్టిముట్టినప్పుడు విజయవంతముగా బయటకు రావటానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ చాలా వాటిని అపోహలుగా నిర్ధారణ చేయవచ్చు.
  • మీరు బాగా సిద్దంగా ఉండాలంటే, వివిధ నివారణ ఎంపికల గురించి మీ డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

హృదయ సంబంధ సమస్యలు-పరిష్కారాలు

గుండె నొప్పి వస్తే ఏం చేయాలి?

బీపీ, షుగర్, పని ఒత్తిళ్ల వల్ల హృద్రోగాలు వస్తున్నాయి. గుండె కండరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడటం వల్ల గుండె నొప్పి వస్తుంటుంది. కారణాలేవైనా ఆకస్మాత్తుగా గుండె నొప్పితో సృహ కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొందరు గుండెనొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు గుండెనొప్పి వచ్చిన రోగులు, వారి పక్కన ఉన్న వారు ఏం చేయాలనే విషయాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఎవరైనా సృహ కోల్పోయినప్పుడు పక్కన ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అంబులెన్స్‌ను పిలిచి, జాప్యం లేకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలా కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడవచ్చు. కార్యాలయంలోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నప్పుడు గుండె నొప్పితో పడిపోతే సమీపంలో ఉన్న వారు చేయాల్సిన ప్రాథమిక చికిత్సలపై అందరికీ అవగాహన అవసరం. వివిధ రకాల హృద్రోగాల వల్ల ఓ వ్యక్తి గుండె ఆగి మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా నిలచినప్పుడు సృహ కోల్పోతాడు. అలాంటప్పుడు పక్కనున్న వారు కార్డియాక్ రెసిస్టేషన్ కోసం ప్రాథమిక చికిత్స చేయటం వారి కర్తవ్యంగా భావించాలి. ఛాతీ వద్ద రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి అదుముతుండాలి. అలా నిమిషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. నోటి నుంచి నోటి ద్వారా సృహ కోల్పోయిన రోగికి శ్వాస కల్పించాలి. రోగి మెడ వెనుక చేయి పెట్టి డీఫిబ్రిలేటర్ మిషన్ సాయంతో షాక్ ఇవ్వాలి. దీనివల్ల ఆగిపోయిన గుండె బ్రెయిన్‌డెడ్ కాకముందే స్టిములేట్ అయి పనిచేయటం ఆరంభిస్తుంది. దీంతోపాటు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, సత్వరం రోగిని ఆసుపత్రికి చేర్చాలి.

శ్వాస పీల్చి వదలాలి...

ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినపుడు మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతుండాలి. తన రెండు చేతులతో గుండెను అదుముతూ కంప్రెషన్ చేసుకుంటే మంచిది. దీంతోపాటు వెంటనే ఫోన్ చేసి, అంబులెన్స్‌ను తెప్పించుకొని, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెనొప్పి వచ్చినపుడు ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో తీసుకునే బేసిక్ లైఫ్ సపోర్టు రోగి ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుంది. గుండెనొప్పి వచ్చినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అందరిలో చైతన్యం రావాలి. అమెరికాలోని విమానాశ్రయాలు, బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, షాపింగ్ మాల్స్, పెద్ద కార్యాలయాల్లో డీఫిబ్రిలేటర్ మిషన్‌లు ఉంటాయి. దీని వల్ల ఆగిపోయిన గుండెను పనిచేయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు హృద్రోగులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.

తక్షణ వైద్య చికిత్స

గుండెనొప్పి వచ్చిన రోగికి ఆసుపత్రికి తీసుకొచ్చాక తక్షణ వైద్య చికిత్స చేయించాలి. నోరు లేదా ముక్కులో నుంచి ట్యూబ్ పంపించి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తారు. తొడ లేదా మెడలోని చిన్న రక్తనాళం ద్వారా గుండె లోపలకు పేస్‌మేకర్ ద్వారా విద్యుత్తు ఇచ్చి గుండెలో రక్తం పంపింగ్‌ను పెంచుతారు. బెలూన్ పంపు, ఇంప్లెల్లా డివైజ్‌ల ద్వారా గుండె ఎడమ వైపు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరాను పెంచుతారు. ఈ చికిత్స వల్ల ఆక్సిజన్‌తోపాటు రక్త సరఫరా మెరుగుపడి హృద్రోగి కోలుకుంటాడు.

గుండె నొప్పికి కారణాలెన్నో...

ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావటానికి పలు కారణాలున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో గుండె కండరం మందంగా మారి హార్ట్‌బీటింగ్ ఎక్కువ అవుతుంది. లాంగ్ క్యూటీసిండ్రోమ్ వల్ల కూడా రోగికి గుండెనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గి గుండె నొప్పి వస్తుంది. దీన్ని పల్మమనరీ అంబాల్కిమ్ అంటారు. కొందరికి పుట్టుకతోనూ హృద్రోగాలు వస్తుంటాయి.

ముందస్తు పరీక్షలు

సాధారణంగా గుండెకు సంబంధించి సమస్యలు వచ్చాయని అనుమానమున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కార్డియాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, కొరోనరీ యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేయించుకోవాలి. హృద్రోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండటంతోపాటు గుండెనొప్పి వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్సతోపాటు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రాథమిక చికిత్స, సత్వర వైద్యంతో రోగి ప్రాణాలు కాపాడవచ్చని అందరూ గ్రహించాలి.

గుండెలలో రంధ్రం ఉంటే సర్జరీ తప్పదా?

మాకు తెలిసిన వాళ్లకు బాబుకు ఆరేళ్లు. ఎప్పుడూ నీరసంగా ఆయాసంగా ఉండడం గమనించి వారు డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన బాబు గుండెలో రంధ్రం ఉందని, బహుశా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చు అని చెప్పారట. ఈ సమస్య మందులతో తగ్గే అవకాశం లేదా ? అసలు పిల్లలకు ఈ సమస్య ఎందుకు వస్తుంది. దీన్ని రాకుండా నివారించే మార్గమేమైనా ఉందా ? వివరించండి.

చిన్న పిల్లల్లో గుండెకు రంధ్రం ఉందన్న విషయం ఒకటే సరిపోదు. అది ఏరకమైన రంధ్రం అన్నది కూడా ముఖ్యమే. ఆ రంధ్రం వల్ల బాబుకు ఏమైనా ఇబ్బంది ఉందా ? ఇబ్బంది ఏమీ లేకపోయినా గుండెలో ప్రతికూల మార్పులు ఏమైనా వచ్చాయా ? అన్నది కూడా గమనించాలి. నిజానికి గుండెలో ఉన్న ప్రతి రంధ్రాన్నీ శస్త్రచికిత్స ద్వారా పూడ్చవలసిన అవసరం లేదు. అలా అని ప్రతి రంద్రాన్నీ అలాగే వదిలేయడమూ క్షేమకరం కాకపోవచ్చు. అయితే కొన్ని సార్లు గుండెలో రంధ్రం ఉన్నా కొన్ని సార్లు డాక్టర్ ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉండవచ్చు.

గుండెలో రంధ్రం ఉన్న విషయాన్ని బాల్యంలోనే గుర్తించి చికిత్స అందించకపోవడం వల్ల కొందరిలోఅది బాగా పెద్దదె ౖపోవచ్చు. ఫలితంగా శ్వాసకోశాలకు వెళ్లే ధమనుల్లో రక్తపోటు పెరుగుతుంది. ఈ స్థితిలో మంచి రక్తం, చెడు రక్తం విరుద్ధ మార్గాల్లో వెళతాయి. ఇలా కావడాన్ని షంట్ రివర్సల్ అంటారు. ఈ పరిస్థితి ఏర్పడితే తాత్కాలిక ఉపశమనానికి మందులు ఇవ్వడం తప్ప చక్కదిద్దడానికి పెద్దగా ఏమీ ఉండదు. అందుకే గుండెలో రంద్రం ఉన్న విషయాన్ని పసితనంలోనే పసిగట్టడం చాలా ముఖ్యం.

రంద్రంతోనే పెద్ద వారయితే ఆ స్త్రీలకు గర్భం ధరించడం అన్నది ఇక ఏమాత్రం సాధ్యం కాదు. అందుకే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చాలా చిన్న వయసులోనే చేయాలి. ఈ సమస్య ఉండే పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, ఆయాసం రావడం, ఆకలి సరిగా లేకపోవడం, పాలు సరిగా తాగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అది గమనించి వెంటనే శిశువైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఏమైనా లోపాలు ఉన్నట్లు వారికి అనిపిస్తే వారు కార్డియాలజిస్టు వద్దకు పంపుతారు.

ఈ సమస్య రాకుండా నివారించే అవకాశాలు తక్కువే అయినా ఉన్నంతలో కొన్ని జాగ్రత్తల ద్వారా కొంత మేరకు అరికట్టవచ్చు. అందుకు గర్భంతో ఉన్న స్త్రీ మద్యపానం చేయకూడదు. ఏవి పడితే అవి కాకుండా గైనకాలజిస్టు సూచించిన మందులు మాత్రమే వాడాలి. గర్భంతో ఉన్న కాలమంతా విషజ్వరాల (వైరల్ ఫీవర్స్) బారిన పడకుండా ప్రత్యేకించి చికెన్ పాక్స్, రుబెల్లా, టార్చ్, హెర్పస్ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ప్రత్యేకించి గర్భం ధరించిన తొలి మూడు మాసాల్లో మాత్రం ఇవి రాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

మా అక్కయ్య వయసు 48. ఆరుమాసాల క్రితం ఒకసారి ఆమెకు గుండెపోటు వచ్చింది. సకాలంలో వైద్య చికిత్సలు అందించడం వల్ల ప్రాణాపాయం లేకుండా బయటపడింది. నిజానికి ఆమె చాలా సన్నగా ఉంటుంది. అంతవరకు ఆమెకు ఏనాడూ ఛాతీలో నొప్పిగానీ, ఆయాసం గానీ ఏనాడూ రాలేదు. పైగా స్త్రీలలో గుండె పోట్లు చాలా తక్కువ అంటారు కదా ! మా అక్కయ్యకు గుండెపోటు రావడానికి కారణం ఏమిటి ? రోజూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూనే ఉంది. మరోసారి గుండెపోటు రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్పండి.

నిజానికి పురుషులతో పోలిస్తే స్త్రీలలో గుండెపోటు తక్కువే . అయితే మధ్యవయసు వచ్చాక పురుషులతో సమానంగానే వీరూ గుండెపోట్లకు గురవుతారు. సహజంగా స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలిచిపోవడం అన్నది చాలా తక్కువ. కాకపోతే మెనోపాజ్ తరువాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికి తోడు గర్భాశయాన్నీ, అండాశయాన్ని కూడా తొలగించిన వారిలో పురుషులకు సమానంగానే గుండెపోటు వస్తుంది. అలా అని ఆ హార్మోన్ సప్లిమెంట్‌లు ఇవ్వడం ద్వారా ఈ స్థితిని అరికట్టలేం.

గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళం మూసుకుపోయి గుండె కండరానికి అవసరమైన రక్తం అందదు. ఈపేరుకుపోవడం అన్నది నిదానంగా జరిగితే ఆ లక్షణాలు కూడా అంతే నిదానంగా కనపడతాయి. అలా కాకుండా ఏకారణంగానైనా ఒక్కోసారి ఈ కొలెస్ట్రాల్ చిట్లిపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోతుంది. అప్పటిదాకా ఏ 70 శాత మో ఉన్న ఆటంకం క్షణాల్లోనూరు శాతంగా మారిపోతుంది. ఆ వెంటనే గుండెపోటు వచ్చేస్తుంది.

గుండె వేగం విపరీతంగా పెరిగిపోయి ఆ తరువాత చాలా మందిలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ స్థితి ఏర్పడిన వారిలో సుమారు 50 శాతం మంది ప్రాణాలు కోల్పోవచ్చు. కొలెస్ట్రాల్ చితకడానికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా శారీరక, మానసిక ఒత్తిళ్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. రతిలో మరీ ఉద్రేకానికి గురికావడం వల్ల కూడా కొందరిలో ఈ సమస్య రావచ్చు. అందుకే ఈ సమస్యకు నివారణే ముఖ్యం.

అందుకే కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించడం, పొగతాగడం కానీ, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం గానీ పూర్తిగా మానుకోవడం ముఖ్యం. ముఖ్యంగా చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన వారసత్వ చరిత్ర ఉన్న వారు ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చర్యలు చేపట్టాలి.

కొలెస్ట్రాల్ పెరగడం అన్నది ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. లావుగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ నార్మల్‌గానే ఉండవచ్చు సన్నగా ఉన్న వారిలో చాలా ఎక్కువగానూ ఉండవచ్చు. ఇవన్నీ రక్తపరీక్షల్లో తేలవలసిందే తప్ప శరీరం బరువు ఆధారంగా మాత్రం కాదు.

కాకపోతే లావుగా ఉన్న వారిలో కాస్త ఎక్కువ మందిలో ఈ సమస్య ఉండవచ్చు. కుటుంబ చరిత్ర ఉన్న వారు చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. తీవ్రతను అనుసరించి ఆహార నియమాలు పాటించడం కానీ, కొన్ని మందులు వేసుకోవడం ద్వారాగానీ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచవచ్చు.

అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్న వారు వ్యాధిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ మందులు క్రమం తప్పకుండా వాడుతూ కనీసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే ఈ సమస్యనుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

హార్ట్ ఫెయిల్యూర్ అంటే?

మా నాన్న గారి వయసు 62. ఇటీవల ఆయన తరుచూఆయాసానికీ, నీరసానికీ గురవుతూ ఉంటే ఒక డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షారిపోర్టులను చూసిన డాక్టర్ ఆయనకు హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉందని చెప్పారు.ప్రస్తుతానికి ఈ మందులు వాడండి ఆ తరువాత ఏంచేయాలో ఆలోచిద్దాం అంటూ కొన్నిమందులు రాశారు. అయితే సజీవంగా ఉన్న వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ అనిచెప్పడమేమిటో మాకేమీ అర్థం కావడం లేదు. అసలింతకీ హార్ట్ ఫెయిల్యూర్ అంటేఏమిటో కాస్త వివరించండి.

హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె ఆగిపోయిందని కాదు. గుండె కండరాలు బలహీనం కావడం వల్ల శరీరానికి అవసరమైన రక్తాన్ని అది పంపిణీ చేయలేకపోతోందని అర్థం. ఈ స్థితిలో గుండె సక్రమంగా ముడుచుకోవడం గానీ, విశ్రాంతి తీసుకోవడం గానీ ఉండదు. సాధారణంగా అంతకు మందు గుండెపోటుకు గురయిన వారిలో లేదా గుండె కవాటాలు దెబ్బ తిన్నవారిలో ఈ హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలతో పాటు వీరిలో కాళ్లు, కాలి చీలమండలాల వద్ద నీరు చేరిపోవడం, బరువు పెరగడం, అతి మూత్రం, పొడిదగ్గు, గుండె లయలో హెచ్చు తగ్గుల వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తూ ఉంటాయి. వీరిలోని రక్త పంపిణీ లోపాన్ని పూరించడానికి ఎక్కువగా పనిచేయవలసిన భారం గుండె మీద పడుతుంది. ఇది గుండె మరింత బలహీనం కావడానికి దారి తీస్తుంది. అందుకే వెంటనే హృద్రోగనిపుణున్ని సంప్రదిస్తే అవసరమైన వైద్య చికిత్సల గురించి మీకు తెలియచేస్తారు.

మాఅక్కయ్య వయసు 58. గుండె జబ్బుతో ఉన్న ఆమెను ఒక కార్డియాలజిస్టుకు చూపిస్తేఆమెకు సిఆర్‌టి ( కార్డియాక్ రీ-సింక్రనైజేషన్ థెరపీ అవసరం అని చెప్పారు.అసలు సిఆర్‌టి అంటే ఏమటి ? ఆ చికిత్స అవసరమేమిటి ? వివరించండి. అలాగేసిఆర్‌టి పరికరాన్ని ఎలా అమరుస్తారో కూడా తెలియచేయండి.

సిఆర్‌టి అంటే గుండె కొట్టుకోవడంలోని అస్తవ్యస్త ధోరణిని నియంత్రించే ఒక పరికరం. గుండె కండరాలు దెబ్బ తిన్న వారిలో గుండెలోని వివిధ భాగాలు పనిచేసే తీరులో తేడా వస్తుంది. ఆ తేడాను తొలగించడంలో సిఆర్‌టి తోడ్పడుతుంది. గుండె లయను క్రమబద్ధం చేస్తుంది. చాలా మందిలో ఇది హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలను బాగా త గ్గిస్తుంది. గుండె లయ ప్రాణాపాయానికి దారితీసే స్థితిలో విద్యుత్ షాక్‌తో దాన్ని సరిదిద్ధే సామర్థ్యం సిఆర్‌టిడి పరికరానికి ఉంది. రోగికి మత్తు ఇచ్చి సిఆర్‌టి పరికరాన్ని అమరుస్తారు.

చికిత్సా సమయంలో రోగికి ఏ కాస్తయినా నొప్పి ఉండదు. పైగా శస్త్ర చికిత్స సమయంలో పరిసరాలను మామూలుగానే గమనిస్తూ ఉంటారు. సిఆర్‌టి పరికరాన్ని అమర్చే సమయంలో చర్మం మీద చిన్న కోత పెడతారు. ఆ తరువాత సిరలో కోత పెట్టి లీడ్స్‌గా మూడు పొడవైన వంగే తీగెలను అమరుస్తారు. ఆ తరువాత లీడ్స్‌ను గుండెలో పెడతారు. ఈ శస్త్ర చికిత్సకు సాధారణంగా 45 నుంచి 60 నిమిషాల దాకా పడుతుంది. సిఆర్‌టి పరికరాన్ని అమర్చడానికి ఆసుపత్రిలో ఒకరోజు ఉంటే సరిపోతుంది.

మా అమ్మగారి వయసు 63. గుండె సమస్యలకారణంగా డాక్టర్‌ను సంప్రదిస్తే గుండె సక్రమంగా పనిచేయడం లేదని, ఆమెకుసిఆర్‌టి పరికరాన్ని అమర్చడం అవసరం అని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సచేయించిన తరువాత కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ? వాటి గురించితెలియచేయండి.

సిఆర్‌టి పరికరాన్ని అమర్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సిఆర్‌టి పరికరాన్ని అమర్చిన సుమారు 6 వారాల దాకా వీరు బరువులేమీ ఎత్తకూడదు. అమర్చిన వైపు చేతిని చాచరాదు. అయితే సిఆర్‌టి పరికరాన్ని అమర్చిన వైద్యుని వద్దకు తనిఖీలకోసం వారు సూచించిన సమయాల్లో తప్పనిసరిగా వెళ్లాలి. తనిఖీ సమయాల్లో మీ పరికరంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రోగ్రామర్ అనే ఒక టేబుల్ టాప్‌ను ఉపయోగిస్తారు.

డాక్టర్‌ను మీరు చివరిసారి కలిసినప్పటి నుంచి మీ గుండె లయ గురించి, పరికరంలో బ్యాటరీ స్థాయి గురించి, అలాగే మరికొంత ముఖ్యమైన సమాచారాన్ని కూడా ప్రోగ్రామర్ ముద్రించి ఇవ్వగలదు. సిఆర్‌టి పరికరంపై అవసరమైన సెట్టింగులును సర్దటానికి కూడా ఈ ప్రోగ్రామర్ ఉపయోగపడుతుంది. సిఆర్‌టి పరికరాన్ని అమర్చడంతో పాటు వైద్యులు మీకు కొన్ని మందులు కూడా అవసరమవుతాయి. లోపాలు పూర్తిగా చక్కబడేందుకు డాక్టర్ సూచించిన మందులన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి.

చిన్నగాటుతో బైపాస్ సాధ్యమేనా?

నా వయస్సు 52 సంవత్సరాలు. కొంతకాలం క్రితంఛాతీలో నొప్పి వస్తే డాక్టర్‌ని సంప్రదించాను. యాంజియోగ్రామ్ చేసి ఎడమవైపు రెండు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని, బైపాస్ ఆపరేషన్ చేయాలనిచెప్పారు. నాకు డయాబెటిస్, బి.పి కూడా ఉంది. బైపాస్ సర్జరీచేయించుకోవాలంటే భయంగా ఉంది. అయితే చిన్న గాటు పెట్టి చేసే మినిమల్యాక్సెస్ బైపాస్ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉందంటున్నారు. నిజమేనా? నాకు ఈసర్జరీ ఉపయోగపడుతుందా? దాని గురించి వివరించండి?

మీకు ఎడమ వైపు ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని రాశారు. ఎడమ వైపు రక్తనాళాలు బ్లాక్ అయినపుడు 'మినిమల్ యాక్సెస్ బైపాస్ ఆపరేషన్' అనే పద్ధతి బాగా ఉపకరిస్తుంది. ఈ పద్ధతిలో 6 సెం.మీల నుంచి 8 సెం.మీల వరకు మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. ఛాతీ ఎముకలను కట్ చేసే అవసరం ఉండకుండా కండరాలను వేరుచేసి స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో సర్జరీ చేయడం జరుగుతుంది. సాధారణ బైపాస్ సర్జరీలో ఛాతీ ఎముకలు కట్ చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల రోగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మినిమల్ యాక్సెస్ పద్దతిలో తక్కువ దూరం కట్ చేయడం, ఎముకలు కట్ చేయకుండా ఉండటం వల్ల రోగి త్వరగా కోలుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మీకు డయాబెటిస్, బి.పి ఉందని రాశారు. డయాబెటిస్ ఉన్న వ్యక్తికి సాధారణ బైపాస్ సర్జరీ చేసినపుడు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కొంత వరకు ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఛాతీ ఎముకలు కట్ చేసే పని ఉండదు కనుక ఆపరేషన్ తరువాత వచ్చే నొప్పులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపాలని ఆశించే వారికి ఈ పద్ధతి అనువైనది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా ఆపరేషన్ చేయించుకోండి.

నావయస్సు 70 సంవత్సరాలు. పన్నెండేళ్ల క్రితం నాకు బైపాస్ ఆపరేషన్ జరిగింది.నా సమస్య ఏమిటంటే ఈ మధ్య కాలంలో నడుస్తుంటే ఛాతీలో నొప్పి వస్తోంది.డాక్టర్‌ని సంప్రదిస్తే యాంజియోగ్రామ్ చేసి రివాస్కులైజేషన్ చేయాలిఅన్నారు. అసలు రీవాస్కులైజేషన్ అంటే ఏమిటి? దీనివల్ల ఏమైనా ఇబ్బందులుతలెత్తే అవకాశం ఉందా? నాకు సరైన సలహా ఇవ్వండి?

బైపాస్ ఆపరేషన్ తరువాత కూడా రక్తనాళాల్లో మళ్లీ బ్లాక్స్ ఏర్పడే అవకాశం అందరిలోనూ ఉంటుంది. బహుశా మీకు కూడా బ్లాక్స్ ఏర్పడటం మూలంగానే ఛాతీలో నొప్పి వస్తూ ఉండి ఉంటుంది. మీకు యాంజియోగ్రామ్ చేసి రీవాస్కులైజేషన్ చెయ్యాలని చెప్పారు కాబట్టి మీరు వెంటనే చేయించుకోండి. దీనిలో కొంతమందికి స్టెంట్ అమర్చడం ద్వారా నయం చెయ్యటానికి కూడా వీలుంటుంది. మరి కొందరిలో బైపాస్ సర్జరీ మళ్లీ చేయాల్సి ఉంటుంది. మీకు ఏది చేయాల్సి ఉంటుందో డాక్టర్లు పరిశీలించి నిర్ణయిస్తారు. రెండవసారి బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినా ఆందోళనచెందాల్సిన పనిలేదు.ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీరు డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.

నా వయస్సు 61 సంవత్సరాలు. నాకు ఆరేళ్ల క్రితంబైపాస్ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. అయితే ఆపరేషన్చేసినపుడు వేసిన గ్రాఫ్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనితెలుసుకోవాలని ఉంది. గ్రాఫ్ట్స్ పనితీరును ఏయే పరీక్షల ద్వారాతెలుసుకోవచ్చు? యాంజియోగ్రామ్ కాకుండా వేరే ఎదయినా పద్ధతి ద్వారాతెలుసుకునే అవకాశం ఉందా?

రక్తనాళాలలో కొలెస్ట్రాల్(కొవ్వు) పేరుకుపోవటం అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ రక్తనాళాల గ్రాఫ్ట్స్ బ్లాక్ రావటానికి అవకాశం ఉంటుంది. రక్తనాళాల గ్రాఫ్ట్స్ బ్లాక్ అయినదీ లేనిదీ తెలుసుకోవాలంటే సి.టి యాంజియో అనే పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మామూలు ఎక్స్‌రే లాంటి పరీక్ష. 15 నుంచి 20 నిమిషాలలో పూర్తవుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుని మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి.

కొద్ది నిమిషాలే కీలకం

గోల్డెన్‌ అవర్‌ అంటే ఎవరికైనా ఏ విధమైనా అత్యవసర పరిస్థితి సంభవించినపుడు మొదట కొన్ని నిముషాలు తీసుకోవలసిన వైద్య సంబంధ చర్యలు సక్రమంగా తీసుకొంటే చాలా వరకు ప్రాణ హానిని లేదా నష్టాన్ని నివారించ వచ్చు.ఆ సమయాన్ని మనం గోల్డె న్‌ అవర్‌ అంటాము.ఈ కాన్సెప్ట్‌ చాలా వైద్య విభాగాలలో ఉంది.వీటిలో ముఖ్యమైనవి ట్రామా (యాక్సిడెంట్స్‌), హార్ట్‌ఎటాక్‌, పక్షవాతం, సెప్సిస్‌.ట్రామా అనేది వెనకకు తీసురాగలిగిన పరిస్థితి.ఎవరికైనా వెంటనే వైద్యం మనం అందించగలిగితే ఉదాహరణకు ఆక్సీజన్‌, రోగి ఊపిరి తీసుకొనేటట్లు చేయడం, అవసరమైతే శ్వాస నాళంలోకి గొట్టంవేయడం, రక్తస్రావాన్ని ఆప డం, సెలైన్‌ ఎక్కించడం మొ వీటిని అడ్వాన్స్‌డ్‌ ట్రామా లైఫ్‌ సపోర్ట్‌ (ఎ.టి. ఎల్‌.ఎస్‌) అని అంటారు.రోగిని బ్రతికించుకొనే ఛాన్సు ఎక్కువ.అన్నీ ఫస్ట్‌ అవర్‌లో చేయగలిగితే ఎక్కువగా బతికినట్లు లిటరేచర్‌లో ఉంది.దీనిని ట్రామా గోల్డెన్‌ అవర్‌ అంటారు.తొందరగా సర్జరీ చేయడం కూడా అందులో ముఖ్యం.

అదే మెదడుకి రక్తప్రసరణ జరిగే నాళాలలో రక్తం గడ్డకడితే ఇస్సమిక్‌ స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది.ఇలాంటి వారికి మొదటి మూడు గంటలలో ఈ మందు ఇవ్వగలిగితే రికవరీ ఛాన్స్‌ ఎక్కువ దీనికి ముందు రోగి హాస్పిటల్‌కి ఎంత త్వరగా చేరుకోగలిగితే అంత మంచిది.అవసరమైతే సిటి స్కాన్‌ / ఎం.ఆర్‌.టి.బ్రేయిన్‌ తీసి రక్తస్రావం వలన పక్షవాతం రాలేదు అని నిర్ధారించిన తరువాత గానీ మందులు ఇవ్వలేరు.దీనికి కొంత సమయం పడుతుంది.ఆ సమయం కూడా మనం మొదటి 3 గంలలో అయ్యేట్లు చూసుకోవాలి.

వీటన్నిటినీ సద్వినియోగ పరచుకోవాలంటే, ప్రతి ఒక్కరికీ దీనికి సంబంధిం చిన జ్ఞానం ఉండాలి.ఆ పరిస్థితిని వారు గుర్తించగలగాలి.ఆంబులెన్స్‌ సర్వీస్‌ని త్వరగా ఉపయోగించుకోగలిగిన సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి.ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ నంబర్లు ఉంటే ఆంబులెన్స్‌, దగ్గరిలోని హాస్పిటల్‌ / డాక్టర్‌ నంబర్లు ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోవాలి.ఈ విషయంలో అందరిలో అవగాహన పెంచాలి.సమయం వృథా కాకుండా ఇన్‌ఫర్‌మేషన్‌ వైద్య బృందా నికి (రిస్క్‌ టీమ్‌) అందించగలగాలి.

గుండె నొప్పి (హార్ట్‌ ఎటాక్‌) వచ్చిన వారికి నొప్పి మొదలయిన సమయం నుండి హాస్పిటల్‌లో థ్రాంబోలైసిస్‌ మందులు ఇచ్చే వరకు మనకు 90 నిముషాలు సమయం ఉంటుంది.ఈ సమయం దాటితే మనం థ్రాంబోలైసిస్‌ చేయలేము.అందుకు ముందు రోగి దానిని గుర్తించి, వెంటనే హాస్పిటల్‌కి చేరుకోవాలి.గుండెకి రక్తప్రసరణ చేయడానికి రక్తనాళాలు ఉంటాయి.దేని వలననైనా వాటిలో రక్తం గడ్డకట్టుకొనిపోతే, దానినే మనం హార్ట్‌ఎటాక్‌ అంటాము.ఆ రక్తంగడ్డని మన మొదటి 90 ని అయితే మందులతో కరిగించగలం.

ఎవరికైనా రక్తంలోకి ఇన్‌ఫెక్షన్‌ ప్రాకిసెప్టిక్‌ అయితే వారిలో బీపీ బాగా పడి పోతుంది.అంతేకాక దీని వలన మిగతా అవయవ వ్యవస్థలు ఫెయిల్‌ అయ్యే ఛాన్సు ఉంది.ఉదా: లివర్‌, బ్రెయిన్‌, మొ వీటిని రక్షించడానికి రిససిటేషన్‌ అని మొదటి ఆరు గంటలలో ఐ.సి.యు.లో పెట్టి చేస్తారు. దీని వలన రోగిని రక్షించుకొనే ఛాన్సు ఎక్కువ. ఎవరికైనా ఇన్‌ఫెక్షన్‌ వచ్చి (జ్వరం) బీపీ తగ్గుతుందో వారు షాక్‌లో ఉన్నారు అంటాం.ఈ షాక్‌ నుండి మనం వాళ్ళని ఎంత త్వరగా బయటికి తీసుకురాగలిగితే అంత మంచిది.

గుండె పదిలంగా ఉండాలంటే..

నా వయస్సు 55 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో ఒకటేగుండెదడగా ఉంటోంది. హార్ట్ఎటాక్‌తో చనిపోయారనే వార్త ఏదైనా చదివినా, విన్నాఇది మరింత ఎక్కువవుతోంది. నాకూ గుండె జబ్బు ఉందేమోనని అనుమానం. గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు గుండె జబ్బులు రాకుండాఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి పరీక్షల ద్వారా గుండె జబ్బులను ముందేగుర్తించవచ్చు? వివరాలు తెలియజేయండి?

గుండెదడగా ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని చెప్పలేం. ముందుగా మీరు గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్ల చిన్న సమస్యకు కూడా కంగారుపడిపోతుంటారు. నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువకుల్లో గుండె జబ్బులు రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే గుండె జబ్బులు వచ్చిన తరువాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం.

వేటివల్ల ముప్పు ఉంటుందో వాటిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చేయాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు, హై కొలెస్టరాల్ ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జబ్బులతో బాధపడతున్న వారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. ఇటీవలి కాలంలో యువకుల్లో సైతం గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. స్మోకింగ్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

లక్షణాలు :

కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటేగుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని హైరానా పడిపోవడం కూడా సరికాదు. లక్షణాలు ఉన్నా నిర్ధారించుకోవడానికి పరీక్షలు తప్పనిసరి.

రెగ్యులర్ చెకప్

నలభై ఏళ్లు దాటిన వారు రెగ్యులర్ గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకోవడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు. ఇ.సి.జి, 2డి ఎకో, కొలెస్టరాల్, టీఎమ్‌టీ పరీక్షల ద్వారా గుండె పనితీరు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.

గుండె జబ్బు ఉంటే..

పైన పరీక్షల్లో గుండె బబ్బు ఉందని తేలినట్లయితే అప్పుడు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంది? ఎన్ని చోట్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ పరీక్ష అవసరమవుతుంది. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు లేక అంతకంటే ఎక్కువ బ్లాక్‌లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం(ఎల్ఎమ్‌సీఏ)లో సమస్య ఉన్నట్లయితే బైపాస్ సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్‌ల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్‌లు వేసినా, బైపాస్ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్ జరిగింది కదా, ఇక ఏం ఫర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అది పనికిరాదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, డైట్ కంట్రోల్ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు.

జాగ్రత్తలు :

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు అరగంట పాటు నడక తప్పనిసరి చేసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. అలాగే కొలెస్టరాల్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు

శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. దీని గురించి తెలుసుకుందాం.

ధమనుల్లో కొవ్వు (కొలెస్ట్రాల్‌) పెరిగిపోతే గుండెకు హానికరం అని తెలుసు. కానీ కొవ్వు శరీరంలో ఎక్కడైనా పెరగడంవల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయని, గుండెపోటు, పక్షవాతం వస్తాయని, కాలి దిగువ భాగంలో గ్యాంగ్రీన్‌ ఏర్పడుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఇవన్నీ గుండె రక్త నాళాల జబ్బుకు దారి తీస్తాయని వైద్యులు చెబుతు న్నారు. గుండె రక్తనాళాల జబ్బులకు చాలా కారణా లున్నాయి. వీటిలో ముఖ్యమైనవి మధు మేహం, అధిక రక్తపోటు, ధూమపానం, కొవ్వు అసాధారణ స్థాయిలో ఉండటం (డిస్‌లిపిడిమియ) వంటివి.

శరీరంలో ఉండే రకరకాల కొవ్వులను లిపిడ్స్‌ అంటారు. కానీ ప్రధానమైన కొవ్వు రూపాల్లో ఒకటి కొలెస్ట్రాల్‌, రెండోది ట్రై గ్లిజరాయిడ్స్‌. ఇవీ రెండు లైపోప్రోటీన్‌ రూపంలో రక్తంలో ప్రవహిస్తుంటాయి. లైపో ప్రోటీన్లు మూడు రకాలులో డెన్సిటీ లైపో ప్రోటీన్‌ (ఎల్‌డిఎల్‌) మొత్తం కొలెస్ట్రాల్‌లో ఇది 10 నుంచి 15% ఉంటుంది. వీటిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కలిగే పరిస్థితిని డిస్‌లిపిడిమియ అంటారు.

డిస్‌లిపిడిమియ జన్యుపరమైన కారణాలవల్ల రావచ్చు. జీవనశైలి కారణాలు… మధుమేహం, ధూమపానం, కదలికలేని జీవన విధానం (సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌), స్థూలకాయంవల్ల డిస్‌లిపిడిమియ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అంతేగాక కొన్ని ప్రత్యేక మందులు (స్టెరాయిడ్లు, హార్మోన్లు), వ్యాధులు (థైరాయిడ్‌ సమస్యలు) కూడా డిస్‌లిపిడిమియాకు కారణం కావచ్చు .

ఎల్‌డిఎల్‌: ఎల్‌డిఎల్‌ను చెడ్డ కొలెస్ట్రాల్‌ అంటారు. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతీ ఒక మిల్లీ గ్రాము/డిఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒక శాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డిఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీగ్రాము/డిఎల్‌కు పెరిగి నప్పుడు గుండెపోటు ప్రమాదం అధికం అవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము /డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

యుక్త వయసు నుంచే ఎల్‌డిఎల్‌ను తగ్గించుకోవడాన్ని ప్రారంభిం చాలి. ఎల్‌డిఎల్‌ స్థాయిని 10 మిల్లీ గ్రాము/డిఎల్‌కు తగ్గించుకుంటే, 40 ఏళ్ళు వచ్చేసరికి, జీవితకాలంలో వచ్చే గుండెపోటు ప్రమాదం 50 శాతం తగ్గుతుంది. ఇదే స్థాయిని కొనసాగిస్తే, 70 ఏళ్ల వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం తగ్గుతుంది. ఎల్‌డిఎల్‌ స్థాయి 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంటే సురక్షితమైన స్థితిలో ఉన్నామని అర్థం. కుటుంబంలో ఇంతకు ముందు తాతయ్య, నానమ్మలు, తల్లితండ్రు లకు గుండెజబ్బు ఉన్న చరిత్ర ఉండే వారు తమ ఎల్‌డిఎల్‌ స్థాయిని 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంచు కోవడం ఎంతో సురక్షితం, ఆరోగ్యకరం కూడా.

హెచ్‌డిఎల్‌: దీన్ని మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. అథిరొస్ల్కెరొసిస్‌ అనే సమస్య ఉత్పన్నం గాకుండా హెచ్‌డిఎల్‌ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువ ఉందంటే, గుండె రక్త నాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండెపోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/డిఎల్‌, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా చూసుకోవాలి.

ట్రైగ్లిజరైడ్స్‌: ఇవి పెరుగుతున్నాయంటే, గుండె రక్తనాళాల వ్యాధి అధికమవుతున్న సంకే తాలు వెలువడతాయి. ట్రైగ్లిజరైడ్‌ స్తాయి పెరిగితే, గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని కొత్త ఆధారాలు వెల్లడించాయి. ట్రైగ్లిజరైడ్‌ స్థాయి 150 ఎంజి/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలి.

డిస్‌లిపిడిమియాను సులభంగా నిర్వహిం చొచ్చు. స్తబ్దుగా ఉండకుండా ఏదైనా క్రియాశీల చర్యలు చేపట్టడం అవసరం. ఇష్టమైన వ్యాయామం చేయాలి. ఉదయం పూట కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. నడకేగాక, జాగింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ చేయవచ్చు.

మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలి.

ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. మధుమేహం ఉంటే, నియంత్రణలో ఉంచుకోవాలి.

మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదిస్తే మీకు మరిన్ని సూచనలు, సలహాలు ఇస్తారు.

డాక్టర్‌ ఉషశ్రీ, 
కేర్‌ హాస్పిటల్‌,
బంజారాహిల్స్‌,
హైదరాబాద్‌.

గుండెనొప్పి – ఇసిజి

గుండె జబ్బుల విషయంలో నొప్పి స్థాయి ప్రధానాంశం కాదు. నొప్పి కలుగుతున్న విధానమే ప్రధానం. నొప్పి తక్కువగానే ఉన్నప్పటికీ లోపల గుండె తీవ్రస్థాయిలోనే దెబ్బతిని ఉండవచ్చు. దీనినే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌గా వ్యవహరిస్తుంటారు. అందుకే గుండెనొప్పి లక్షణాలన్న అనుమానం కలిగిన వెంటనే కనీసం ఇ.సి.జి. అయినా తీయించడం మంచి పద్ధతి.

విద్యుత్‌ తరంగాల ద్వారా గుండె దెబ్బ తిన్నదా? లేదా? అన్న ప్రాథమిక సమాచారం అందించే ఇ.సి.జి. కొన్ని వేల ప్రాణాల రక్షణతో సమర్ధవంతంగా తనదైన పాత్ర నిర్వహిస్తోంది మరి! అయితే – ఎన్నో వేల ప్రాణాలను కాపాడు తున్న ఇ.సి.జి. గుండె జబ్బులకు సంబం ధించి కలిగే మరికొన్ని సందేహాలకు సరైన సమాధానం చెప్పలేదు. గుండె ఎంత భాగం దెబ్బతిన్నది? గుండె రక్తనాళాలలో కొవ్వు ఎంతశాతం చేరింది? మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? వంటి ప్రశ్నలకు ఇ.సి.జి. సమా ధానం ఇవ్వలేదు. అందుకే ఇ.సి.జి.లో పైకి గుండెపోటు లక్షణాలు ఉన్నట్లు ప్రతిబింబిం చినా లోపల జబ్బేమీ ఉండకపోవచ్చు. ఇ.సి.జి. ఫలితాలు మాత్రమే కొలమానంగా భావించే అనేక మంది అనవ సరంగా సంవత్సరాల తరబడి మందులు ఉపయోగించడం కూడా కద్దు! ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు -గుండెవ్యాధుల నిర్ధారణలో మరిన్ని పరీక్షలు అంటే గుండె స్కానింగ్‌, ట్రేడ్‌మిల్‌, స్ట్రెస్‌ థాలియమ్‌ వంటి పరీక్షలు అవసరమౌతున్నాయి. ఈ పరీక్షలన్నీ ఒక ఎత్తు అయితే – గుండె పనితీరు గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గుండె జబ్బుల ప్రమాదస్థాయిని, రాబోయే గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే తెలియజేసి హెచ్చరించే అత్యాధునిక వ్యాధి నిర్ధారణా పరికరం యాంజియోగ్రాం ఇటీవలకాలంలో సామాన్య మానవునికి లభించిన అత్యద్భుతం!

గుండె గదులలోని రక్తపీడనం ఖచ్చితంగా తెలుసుకోవడంతోబాటు 0.56 శాతం రక్తనాళంతో రక్తప్రసరణకు విఘాతం ఏర్పడుతున్న ప్రమాదాన్ని కూడా ఈ పరికరం ద్వారా ఖచ్చితంగా తెలుసు కోవచ్చు. గుండెజబ్బు ప్రమాదాన్ని నిర్ధిష్టంగా తెలుసుకోవడంతో బాటు అత్యాధునిక వైద్య చికిత్సలైన ఆధునిక ఇంజక్షన్స్‌, బెలూన్‌ యాంజియోప్లాస్టీ, స్టెంట్స్‌, బైపాస్‌ సర్జరీ వంటి చికిత్సలు ఏ రోగికి ఎంతవరకూ అవసరం అన్నది కూడా ఈ పరికరం ద్వారా నిర్ధారించవచ్చు! గుండె జబ్బుల వైద్య విధానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ అనేక మంది గుండెపోటు ప్రమాదంతో మరణి స్తూండటం గుండెజబ్బుల పట్ల ప్రజలలో ఉన్న అవగాహనాలేమికి నిదర్శనం!

రాబోయే గుండెజబ్బు ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోగల అత్యాధునిక వైద్య పరీక్షా విధానాలు ప్రస్తుతం మనకు అందుబాటులోనే వున్నాయి. 40 సంవత్స రాలు దాటిన వ్యక్తి కనీసం ఏడాదికోసారి జనరల్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. గుండె పనితీరును మెరుగు పరచుకోవచ్చు!

- మల్లాది కామేశ్వరరావు

విటమిన్‌ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం

ఆరోగ్యానికి ‘బి విటమిన్లు చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే అయితే మరోసారి ఈ ‘బి విటమిన్లలోని ఫోలేట్‌, బి6 ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బుల వల్ల కలిగే మరణాల ముప్పు తగ్గుతుందని జపాన్‌ పరిశోధ కుల అధ్యయనంలో తేలింది.

జపాన్‌ కొలాబరేటివ్‌ కోహార్ట్‌ స్టడీలో భాగంగా 40-79 ఏళ్ళ మధ్యగల 23, 119 మంది పురుషులు, 35, 611 మంది మహిళల మీద అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లను నమోదు చేసుకుని, 14 సంవత్సరాల పాటు గమనించారు.

అనంతరం చనిపోయిన వారి వివరాలను సునిశితంగా పరిశీలించారు. వీరిలో ఫోలేట్‌, బి6 ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో గుండె వైఫల్యం కారణంగా వచ్చే మరణాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్టు గుర్తించారు. అదే మహిళల్లో గుండెజబ్బులు, పక్షవాతం వల్ల కలిగే మరణాలు తక్కువగా ఉన్నాయి.

మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, బీన్స్‌, ఆకుకూరల్లో ఫొలేట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక బి6 చేపలు, కాలేయం, ముడిధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవేకాక నూనెలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పక్షవాతం, గుండె జబ్బులకు చెక్‌ చెప్పడమే కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంతేకాదు ఈ ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి పీచుపదార్థం (ఫైబర్‌) ఎక్కువగా అందుతాయి. స్థూలకాయులు కూడా ఈ ఆహారాన్ని మితంగా తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.

ఆధారము: వైద్యం

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free