సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్టు)
చెత్త అనేది వృథాగా పడి ఉండే వనరులు. వ్యవసాయ పనులవల్ల, డయిరీ ఫాంలనుంచి, పశువుల కొట్టాలనుంచి ఎంతో పెద్ద ఎత్తున జీవరసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ ఏదో ఒక మూలలో పడేసి ఉంచడం వల్ల అవి అక్కడ మురిగి పోయి దర్వాసన వెదజల్లనారంభిస్తుంది. ఐతే, చాలా విలువైన వనరుగా మనం దీన్ని గుర్తించి సరిగ్గా వాడుకొంటే, దీనిని ఎంతో విలువైన ఎరువుగా మార్చుకోవచ్చు. జీవరసాయన వ్యర్థ పదార్థాలను వదిలించుకోవడమేకాక, వాటిని నాణ్యమైన ఎరువుగా మార్చుకొని మన భూములను సారవంతంగా చేసుకోవచ్చు. ఇదే కంపోస్టింగ్ ముఖ్యోద్దేశ్యం.
స్థానిక వానపాములతో వర్మి కంపోస్టింగ్
ప్రపంచంలో దాదాపు 2500 వానపాముల రకాలను గుర్తించారు. వీటిలో 500 పైగా ఇండియాలో ఉన్నాయి. ఈ వానపాము రకం భూమిని బట్టి ఉంటుంది. అందువల్ల స్థానికంగా ఎలాంటి వానపాములు న్నాయనేది గుర్తించి తదనుగుణంగా వర్మికంపోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఈ వానపాములను మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోపెరియోనైక్స్ ఎక్స్కావటస్, మరియు లంపిటో మౌరిట్టి అనే రెండు రకాలు సాధారణంగా లభ్యమవుతున్నాయి. వీటి పెంపకం చేయవచ్చు లేదా కంపోస్టింగ్ లో పద్ధతుల్లో గోతులలో, క్రేట్లలో, చెరువుల్లో, కాంక్రీటు రింగుల్లో లేదా ఇతర పాత్రల్లో వాడవచ్చు.
స్థానిక వానపాములనెలా సేకరించాలి?
- ముందుగా భూమి ఉపరితలంపైన వానపాముల జాడను బట్టి వానపాములెక్కడున్నాయో గుర్తించాలి.
- 500గ్రా. బెల్లాన్ని, 500 గ్రా. తాజా ఆవు పేడను 2 లీటర్ల నీళ్లలో కరిగించి దాన్ని ఒక చదరపు మీటర్ వైశాల్యంగల భూమిపై చల్లాలి.
- దానిని గడ్డితో కప్పి, దానిపైన పాత గోతాన్ని కప్పాలి.
- దీనిపై 20 నించి 30 రోజులపాటు రోజూ నీళ్లు చల్లుతూ రావాలి.
- ఈ స్థలంలో ఎపిజైక్, అనెసిక్ స్థానిక వానపాములు వృద్ధిచెందుతాయి. వాటిని సేకరించి వాడుకోవచ్చు.
కంపోస్టు గుంతలను ఏర్పాటు చేయడం
మనకు కావలసిన విధంగా, కావలసిన సైజులో ఈ కంపోస్టు గుంతలను మన పెరటిలో గానీ, ఉద్యానవనంలోగానీ, పొలంలోగానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఒక గుంత లేదా రెండు గుంతలు లేదా తొట్టి కావచ్చు. ఏసైజులోనైనా సరే, ఇటుక, సున్నపుగచ్చులతో నిర్మించుకోవాలి. నీళ్లు పోవడానికి తగిన కవాటాలేర్పాటు చేసుకోవాలి. సాధారణంగా 2 మీ x 1 మీ x 0.75 మీ సైజు గుంత లేదా తొట్టి సరిగ్గా ఉంటుంది. ఐతే, ఈ గుంతలు లేదా తొట్ల సైజును మనం వేయబోయే బయోమాస్ పైనా, వ్యవసాయ వ్యర్థాల పైనా ఆధారపడి ఉంటుంది. వానపాములను చీమలు ఎదుర్కోకుండా ఈ గుంటల లేదా గదులవర్మిపిట్) చుట్టుతా ఉండే గోడలో మధ్య భాగాన తగిన రీతిలో సన్నని నీటి కాలవను ఏర్పాటు చేసుకోవాలి.
నాలుగు గదుల తొట్టి / గుంత వ్యవస్థ
నాలుగు గదుల తొట్టి లేదా నాలుగు గదుల గుంత పద్ధతిలో గుంతల నిర్మాణం చేయడంవల్ల కంపోస్ట్ ఉన్న గదినించి ముందే శుద్ధిచేసిన చెత్తను ఉంచిన గదిలోకి వానపాములు సులభంగా, నిరాటంకంగా తిరుగుతూ ఉండేందుకు వీలవుతుంది.
వర్మి బెడ్ నిర్మాణం
- వర్మి బెడ్(వర్మ్స్ అంటే వానపాములు, బెడ్ - పడక, మందపాటి పొర) అనేది విరిగిన ఇటుకముక్కలు, బరకగా ఉండే మన్ను గల 5 సెం.మీ. మందంగల నేలపై 15 నుంచి 20 సెం.మీ. మందంతో చక్కని చెమ్మగలిగిన బంకమట్టితో, చెత్తతో కూడిన సారవంతమైన నేల.
- వానపాములను బంకమట్టితో, చెత్తతో కూడిన సారవంతమైన నేలపై ఉండేలా చూడాలి. ప్రతి 2 మీ. x 1 మీ. x 0.75 మీ. కంపోస్టు గుంతకు కనీసం 150 వానపాములను ఉండేలా చూడాలి.
- దోసిళ్లకొద్దీ తాజా ఆవు పేడను వర్మిబెడ్పై వెదజల్లాలి. దానిపై 5 సెం.మీ. మందంతో ఎండుటాకులను లేదా కత్తిరించిన ఎండుగడ్డి లేదా వ్యవసాయ వ్యర్థాలైన బయోమాస్ను ఉంచాలి. ఆ తర్వాత 30 రోజులదాకా ఆ గోతిని రోజూ అవసరమైన మేరకు నీటితో తడపాలి.
- ఈ వర్మిబెడ్ మరీ పొడిగా ఉఁడకూడదు. మరీ చెమ్మగా ఉండకూడదు. బెడ్ను పక్షులు పాడుచేయకుండా, కొబ్బరిమట్టలతో గానీ, తాటాకులతోగానీ లేదా పాత జనపనార గోతాలతోగానీ కప్పి ఉంచాలి.
- ఈ బెడ్లను కప్పడానికి ప్లాస్టిక్ కాగితాలను మాత్రం వాడకూడదు. ఎందుకంటే, అవి ఎక్కువ వేడిని కలగజేస్తాయి. మొదటి 30 రోజులు గడిచాక, తడిగా ఉండే జీవరసాయన వ్యర్థ పదార్థాలతోగానీ, లేదా ఇళ్లలో, హోటళ్లలోనుంచి తెచ్చిన ఆకులూఅలములతో నిండిన వ్యర్థాలతో గానీ 5 సెం.మీ. మందంతో ఉండేలా నింపాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
- ఈ జీవరసాయన వ్యర్థాలను కొడవలితోగానీ, కత్తితోగానీ పైకీ కిందకీ తరచూ తిప్పుతూ మళ్లిస్తూ ఉండాలి.
- ఈ గుంతల్లో చెమ్మ తగ్గకుండా ఉండేందుకు వీలుగా నిత్యం నీళ్లు పడుతూండాలి. వాతావరణం పొడిగా ఉంటే మరింత ఎక్కువ సార్లు నీళ్లు పట్టాలి.
కంపోస్టు ఎరువు ఎపుడు తయారౌతుంది?
- గుంతలో కంపోస్టుకై ఉంచిన పదార్థాలన్నీ ముక్కముక్కలైపోయేలా తయారై, వదులుగా ఉండి ముదురు గోధుమరంగులోకి మారితే కంపోస్టు ఎరువు తయారైనట్టు లెక్క. ఇది బాగా నలుపురంగులో, చిన్నచిన్న కణాల్లా, తేలికగా ఉండి కుళ్లిన పచ్చి ఎరువుగా తయారై ఉంటుంది.
- గుంత సైజునుబట్టి 60నుంచి 90 రోజుల్లో కంపోస్టు ఎరువులు తయారౌతుంది. ఎక్కువ పరిమాణంలో వానపాముల ఉనికి(వర్మి కంపోస్టు) గుంతపైన కనిపిస్తుందీ అంటే, ఎరువులు తయారైనట్టే. ఇక వర్మి కంపోస్టును మనం వాడుకోవచ్చు.
- కంపోస్టు ఎరువునుంచి వానపాములను వేరుచేయడానికి రెండు మూడు రోజులముందే నీళ్లు పట్టడం ఆపేయాలి. దీనివల్ల 80 శాతం వానపాములు గుంతలో అడుగుభాగంలోకి వెళ్లిపోతాయి.
- వానపాములను వేరుచేయడానికి జల్లెడలనుగానీ, వలగానీ వాడచ్చు. దీనివల్ల మందమైన పదార్థాలు, వానపాములు జల్లెడపైభాగంలో ఉండిపోతాయి. వాటిని తిరిగి గుంతల్లోకి పంపివేయవచ్చు. దీనివల్ల కంపోస్టు తయారీ పునః ప్రారంభం అవుతుంది. కంపోస్ట్ ఎరువు వాసన దాదాపుగా మట్టివాసనే ఉండాలి. ఎలాటి దుర్వాసన వస్తూ ఉన్నా అది కంపోస్టు ఎరువు తయారు కాలేదన్న విషయాన్ని సూచిస్తుంది. బూజు పట్టిన వాసన గనక వస్తే, అది అధిక వేడిమిని సూచిస్తుంది. దీనివల్ల నత్రజని లోపం ఏర్పడుతుంది. అలా గనక జరిగితే, తిరిగి గుంతలో ఉన్న కుప్పను గాలిపారేలా చేసి, దానికి మరింత పీచుతో కూడిన పదార్థాలను కలపాలి. ఆ తర్వాత కంపోస్టును జల్లెడ పట్టాలి.
- తయారైన పదార్థాన్ని కుప్పగాపోసి ఎండ తగిలేలా ఉంచాలి. అపుడు వానపాములు కుప్ప అడుగులో చల్లని ప్రదేశానికి చేరిపోతాయి.
- రెండు లేదా నాలుగు గదుల వ్యవస్థలో మొదటి గదికి నీళ్లు పట్టడం ఆపాలి. అపుడు వానపాములు వాటికి అనుకూలమైన వాతావరణం ఉండే మరో గదికి వెళ్లిపోతాయి. ఇలా ఒక ప్రక్రీయ వ్యవస్థలో కంపోస్టింగ్ చేయడం జరుగుతుంది.
వర్మికంపోస్టింగ్ వల్ల లాభాలు
- జీవ రసాయన వ్యర్థాలను వానపాములు సులభంగా, వేగంగా ముక్కలు ముక్కలుగా చేయగలవు. దీనివల్ల నిరపాయకరమైన, సలక్షణమైన కంపోస్టు ఎరువు అతి తక్కువ ఖర్చుతో లభిస్తుంది. అలాగే ఇవి భూమిని సారవంతంచేసి చెట్లు బాగా ఏపుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
- వర్మి కంపోస్ట్ సరైన మోతాదుల్లో ఖనిజాలు లభ్యమయ్యేలాచూడటమేకాక, చెట్లకు అవసరమయ్యే పోషక పదార్థాలను అందిస్తుంది. సంక్లిష్టమైన ఎరువుకణాలుగా పనిచేస్తుంది.
- వర్మి కంపోస్టింగ్ వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవకణాలను పెరగనీయకుండా చూస్తుంది. అదే సమయంలో ఎరువు తయారీలో సారాన్ని కోల్పోకుండా చూస్తుంది.
- వర్మి కంపోస్టింగ్ చెత్తను నిర్మూలించకుండానే పర్యావరణ సంబంధమైన సమస్యలనూ తగ్గిస్తుంది.
- వర్మి కంపోస్టింగ్ ను కుటీర పరిశ్రమగా అందరూ గుర్తించాలి. ముఖ్యంగా ఇది అల్పాదాయ వర్గాలవారు అదనపు ఆదాయాన్నిచ్చే ఒక ప్రత్యామ్నాయమార్గంగా ఎంచుకోవచ్చు.
- ప్రతి గ్రామంలోనూ నిరుద్యోగ యువత, మహిళలూ ఒక సహకార సంస్థగా ఏర్పడితే ఈ వర్మికంపోస్టింగ్ ఒక చక్కని పరిశ్రమగా ఏర్పడుతుంది. తద్వారా తయారయ్యే ఎరువును తగిన ధరలకు ఆ గ్రామంలోనే సరసమైనధరలకు అమ్మవచ్చు. దీనివల్ల యువత ఆదాయాన్ని పొందడమేకాక సమాజానికి చక్కని నాణ్యమైన సేంద్రీయ ఎరువును అందించి వ్యవసాయ ప్రక్రియను కొనసాగించగలదు.
వ్యర్థ పదార్థాల నుండి వర్మి కంపోస్టు
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు