Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

రైతే ఒక శాస్త్రవేత్త - రైతులు కనుగొన్న కొత

గ్రామీణ మహిళలకు ఆదాయాన్ని అందించే కొత్త పిండి మిషన్‌

తమిళనాడులోని కోయంబతూరుకు చెందిన శ్రీ కె.వివేకానందన్, 8 లక్షల రూపాయల పెట్టుబడితో, ఎండు మిరపకాయలను, ధనియాలను పొడిచేసే 3 హెచ్‌పి పల్వరైజర్ (గ్రైండర్) రూపొందించారు. ''తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆశించే గ్రామీణ మహిళలకు, ఈ పరికరం ఒక చక్కని ఆదాయమార్గం'' అంటారు శ్రీ వివేకానందన్.

ఎండు మిర్చిని, ధనియాలను పొడిచేయడానికి, చాలావరకు, ఎక్కువ పెట్టుబడి , ఎక్కువ కరెంటు అవసరమయ్యే గ్రైండింగ్ యంత్రాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులోవున్నాయి. ఇందువల్ల, ముఖ్యంగా, విద్యుత్ సరఫరా ఎప్పుడు వుంటుందో, ఎప్పుడు వుండదో నమ్మకంలేని గ్రామీణ ప్రాంతాలకు, ఇవి అంతగా ఉపయోగకరం కాకుండాపోతున్నాయి.

ఎదుర్కొన్న సవాళ్ళు

ఈ సమస్యలను దృష్టిలోపెట్టుకుని కొత్తయంత్రాన్ని రూపొందించిన శ్రీ వివేకానందన్ , తాను 90 శాతం పరిష్కారాన్ని సాధించాననుకుని, దాదాపు 100 యంత్రాలు తయారు చేశారు. కాని, కేవలం 20 యంత్రాలు మాత్రమే అమ్ముడుపోవడం ఆయనకు ఎంతో ఆశాభంగం కలిగించింది. ఇంతేకాదు, ఈ పిండి మిషన్‌లోని తిరగలిలోకి మిర్చి, ధనియాలు సరిగా వెళ్ళలేకపోతున్నాయని, పొడిచేసేటప్పుడు ఎక్కువగా ధూళి చెలరేగుతున్నదంటూ, కొందరు వాటిని వాపసు తెచ్చారు కూడా. దీంతో ఈ కొత్తయంత్రం పని ముందుకుసాగక, దాదాపు సంవత్సరంపాటు ఆగిపోయింది. ఈ దశలో, శ్రీ వివేకానందన్ గ్రామీణ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించే విల్‌గ్రో అనే సంస్థను గురించి తెలుసుకుని, సలహాకోసం వారివద్దకు వెళ్ళారు. విల్‌గ్రో సిబ్బంది ఈ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ముందుగా, 1 హెచ్‌పి, సింగిల్‌ఫేజ్ యంత్రాన్ని రూపొందించమని అక్కడివారు శ్రీ వివేకానందన్‌కు సలహా ఇచ్చి, ఆ యంత్రాన్ని రూపొందించడంలో ఆయనకు సహకరించారు. ఎందుకంటే, వివేకానందన్ మొదట రూపొందించిన 3 హెచ్‌పి యంత్రం వేగంగా తిరగలేకపోతున్నది. (గ్రామీణ ప్రాంతాలలో ఓల్టేజి హెచ్చుతగ్గులు బాగా ఎక్కువగా వుంటాయికాబట్టి, గ్రామీణులు సాధారణంగా 1 హెచ్‌పి, సింగిల్ ఫేజ్ యంత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు). మిర్చిలో, ధనియాలలో పీచుపదార్ధం ఎక్కువగా వున్నందువల్లనే, అవి పిండిమిషన్‌లో ముందుకు కదలకుండా అంటుకుపోతున్నాయని వారు తొలుత భావించారు. అయితే, అనేక ప్రయత్నాల తర్వాత, పిండిమిషన్‌లోని తిరగలి (రోటర్) తగినంత వేగంగా తిరగలేకపోవడమే అందుకు కారణమని వారు గ్రహించి, యంత్రం బరువును, గోడల మందాన్ని, పరిమాణాన్ని, చుట్టుకొలతను తగ్గించి; గ్రామీణ ఉపయోగానికి అనువుగా దానిని మార్చగలిగారు.

వ్యయం

యంత్రం తయారీలో ఉపయోగించే పరికరాల సంఖ్యను తగ్గించి, తక్కువ ఖరీదులో నాణ్యమైన పరికరాలను ఎన్నుకుని, ఆ యంత్రం ఖర్చును శ్రీ వివేకానందన్ గణనీయంగా తగ్గించగలిగారు. తిరగలితో సహా ఒక్కొక్క పిండి మిషన్ రూ 11, 500 గా ధర నిర్ణయించారు.

మరింత సమాచారంకోసం :
శ్రీ కె.వివేకానందన్, మెజర్స్ వివేక ఇంజనీరింగ్ వర్క్స్,
న్యూ నంబర్: 116 -118, సాథీ రోడ్,
ఆర్ కె. పురం,గణపతి, కోయంబతూర్ - 641 006
మొబైల్ నంబర్ : 94437 21341 అనే చిరునామాను సంప్రతించవచ్చు.

ఆధారము: ది హిందూ

సేంద్రీయ రొయ్యల పెంపకం - ఒక రైతు అనుభవం

రొయ్యలు పెంచే రైతు, జోసెఫ్‌ కోరా, అతడి కుటుంబం, కుట్టనాడ్‌, అలెప్పీ.

కేరళలోని కుట్టనాడ్‌, ఒక ప్రత్యేకమైన వూనవ నిర్మితమైన తడి నేలల పర్యావరణంతో కూడుకుని సమృద్ధిగా నీరు, సారవంతమైన భూవిు కలిగి ఉంది. ఈ ప్రాంతం వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఆ దృశ్యం మారిపోయింది. అధికవైున పెట్టుబడి ఖర్చు, వ్యవసాయ కూలీల కొరత, లాభంలేని పంట ధర వంటి పెను సవాళ్ళు ఈ ప్రాంతపు రైతులు ఎదుర్కొంటున్నారు.

ఇటువంటి పరిస్థితులలో  రైతులు తక్కువ ఖర్చుతో కూడిన మార్గాంతరం కోసం ఆశతో ఎదురుచూస్తున్నపుడు, శ్రీ జోసెఫ్‌ కోరా అనే సేంద్రీయ వరి సాగు చేసే  రైతు తన నాలుగు హెక్టార్ల పొలంలో  సేంద్రీయ రొయ్యలను పెంచడం లో ముందంజ వేసాడు.
అభివృద్ధి దిశగా వూర్పుః
సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అధికార సంఘం (ది వెురైన్‌ ప్రోడక్ట్స్  డెవలప్‌మెంట్‌ అథారిటి) (ఎం.పి.ఇ.డి.ఎ.) మరియు ఇతర అభివృద్ధి సంస్థలు సేంద్రీయ స్కంపీ రకం రొయ్యల సాగును (ఆక్వాకల్చర్‌ ) అనే ఆలోచనను అతడి ముందుంచాయి. అతడు ఈ సాగు చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు. సువూరు 11 లక్షల స్కంపీ రొయ్య పిల్లలను అతడి నాలుగు హెక్టార్ల పొలంలో పెంచాడు. ఈ పెంపకానికి అవసరమైన రొయ్య పిల్లలు, వాటి మేత, సలహాలకు అధికారులు తమ వ్యక్తిగత పర్యవేక్షణ తో తోడ్పాటునం దించారు. దాదాపు ఏడు నెలల తరువాత, ఒక్కొక్కటి  గ్రాముల బరువున్న 1800 కేజిల స్కంపీ జాతి రొతయ్యలు అతడి నాలుగు హెక్టార్ల పొలం లో పెచబ డ్డాయి.

మరికొంత సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునావూ

శ్రీ  జోసెఫ్‌ కోరా
కారివెలితర . రావున్కరి పి.ఒ., 689-595,
కుట్టనాడ్‌, అలెప్పీ,
ఫోన్‌ : 0477-2707375, మొబైల్‌ : 9495240886
శ్రీ. ఆర్‌.హలి,
ఫోన్‌: 04070-2622453,మెబైల్‌ : 9947460075

ఆధారం: ద హిందూ, తేది 8 జనవరి, 2009

చెరుకు గడలను కోసి, వాటి మొగ్గలను తుంచే, శ్రమను తక్కువ చేసే సాధనం

ప్రస్తుతం ఉన్న పద్ధతిలో, చెరుకు మొక్కలను నాటడం, అధికమైన వ్యయప్రయాసలతో కూడుకుని ఉంది శ్రీరోషన్ లాల్ విశ్వకర్మ అనే మధ్యప్రదేశ్ లోని మేఖ్ గ్రామానికి చెందిన రైతు, చెరుకు వ్యవసాయంతో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయ పద్ధతిగా, చెరకు అంటు మొక్కలను ఒక్కొక్కటిగా నాటినా ఫలితం లేకపోయింది అధిక సంఖ్యలో అంటు మొక్కలు అందుబాటులో లేకపోవడం అడ్డంకిగా మారింది. ఆరైతు, చెరకు మొక్కలను నారుగా నాటే బదులు, పొలాల్లో బంగాళదుంపల పంటను పండించినట్లు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు.

కఠినశ్రమ

ఒక నిపుణునితో ఈ విషయమై చర్చించారు. ఆరైతు, ఈ విషయం పై నిరంతరం ఆలోచించి, తనకు అందిన ప్రోత్సాహకరమైన సమాచారంతో, కష్టపడి పనిచేసి, రెండేళ్ళ తరువాత, ఒక సులభమైన సాధనాన్ని అభివృద్ధి పరిచారు. ఈ సాధనం చెరుకుగడల మొగ్గలను తుంచే సాధనంగా పిలవబడుతోంది (sugar cane bud chibber) ఇది నేల మీద ఉంచబడి, అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన కత్తి కలిగి, అధికమైన ఒత్తిడితో నైపుణ్యంగా, చెరుకు గడకు ఎటువంటి నష్టం కాకుండా, మొగ్గలను గడ నుండి త్రుంచి వేస్తుంది.
ఈ సాధనాన్ని ఉపయోగించి, ఒక వ్యక్తి, ఒక గంటలో సుమారు 100 మొగ్గలను త్రుంచి వేయగలడు. అని శ్రీ విశ్వకర్మ అంటున్నారు.

నిర్వహించే సామర్ధ్యం

ఈ యంత్రం, చెరకు గడను చిన్నచిన్న ముక్కలుగా కూడ చేయగలదు. ఇది సులభంగా వాడగలిగేది మరియు వివిధ కొలతలు (పొడవులు, సైజు), వ్యాసాలు (డయామీటర్) కలిగిన గడలను కూడ కోసే సామర్ధ్యం కలది.
సంప్రదాయ రకమైన చేతితో కోసే సాధనాలు, చేతులకు, బొటనవ్రేలికి ఎక్కువ శ్రమ కలిగించి, చెరకుగడలను వాలుగా కోసి, ఎక్కువ వృధా, నష్టం కలుగజేస్తాయి. దృఢమైన అంటుమొక్కలను కోసే సామర్ధ్యం, వాటికి ఉండదు.

యంత్రం యొక్క ప్రధానమైన అంశాలు

సమతలమైన ఫలకం, పట్టుకునే కొయ్యా / కడ్డీ (holding stand), పక్కపక్కనే ఉన్న యంత్రభాగాల అమరిక, సర్దుబాటు చేసే మరమేకులు తో ఉన్న చలనం కలిగించే లీవర్ ( కడ్డీ బరువు నెత్తేది), అనుసంధానించే పరికరం (connector), స్ప్రింగుతో ఆపబడే, క్రింది వైపుకు మళ్ళీ ఉన్న యు ఆకారం లో గల కోసే కత్తి, సమానమైన గాడిలో అమర్చబడినది, గుబ్బమేకులు (studs) ఆధారంగా, చుట్టూ లాగి ఉండే స్ప్రింగు (తీగలచక్క) తో బలంగా తోయడానికి వీలుగా ఉంటుంది. ఈ యంత్రం, ఐదు సంవత్సరాల పూచీకత్తు (గ్యారంటీ)
ప్రకటనతో 600 రూపాయల ఖరీదు కలిగి ఉంది. ఈ యంత్రం ఉపయోగించే వ్యక్తి సౌకర్యవంతంగా నేలమీద కూచుని, ఎడమచేతితో చెరకు గడలను పరికరంలోనికి నిర్విరామంగా చొప్పిస్తూ, కుడి భుజాన్ని అర్ధచంద్రాకారంలో, సులువుగా ఊపుతూ, చెరకుగడల మొగ్గలను శక్తివంతమైన స్ప్రింగు కలిగిన పిడిని ఉపయోగించి చెరకుగడల నుండి త్రుంచి వేస్తారు.

పూర్తి ఖండన

ఈ అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన కోసే కత్తి లేక బ్లేడు (blade), పూర్తిగా, నైపుణ్యంగా, రెండు అంచెల్లో, గంట్లు పెట్టడం మరియు కోసివేయడం అనే విధానంలో పని చేస్తుంది. ఈ యంత్రాన్ని నడపడానికి ఎటువంటి విద్యుత్తు, ఇంధనం అవసరం లేదు. దీని బరువు కొన్ని కిలో గ్రాములే ఉండడం వలన రవాణా చేయడం సులభంగా అవుతుంది. ఈ పరికరం చెరకు గడలనుండి, మొగ్గలను వేరు చేయడమే కాకుండా, అంట్లు కట్టే పరికరంగా కూడ కొన్ని పెద్ద మొక్కల మొగ్గలను వేరుచేసేటప్పుడు ఉపయోగించవచ్చు.
నేను, ఆ యంత్రాన్ని, ఏ విధంగా రూపొందించానంటే, ఇది ఉపయోగించే వ్యక్తి సౌకర్యవంతంగా నేల మీద కూచుని, ఏ పరిమాణంలో ఉన్న చెరకుగడనైనా వాడగలిగి పనిచేసేటట్లు చేశాను. రకరకాల రూపాల్లో, కోయడానికి ఉపయోగించే దానిపై ప్రయోగాలు చేసి, చివరకి యు- ఆకారంలో ఉండే రూపకల్పన చేశాను. స్ప్రింగు తో ఉన్న పిడితో వేగవంతమైన కదలికతో మొగ్గను, గడ నుండి వేరుచేసి, మిగిలిన చెరకుగడకు ఎటువంటి నష్టం కాకుండా, పని చేస్తుంది అని ఆయన అంటారు.

బల్లపై ఉంచే నమూనా

నేలపై ఉంచి వాడే నమూనాకు బదులుగా, బల్లపై ఉంచి వాడే నమూనా గురించి ఆయన ఆలోచించినప్పుడు, ఈ నమూనా క్లిష్టమైనదిగా ఆయన భావించారు. ఎందుకంటే వివిధ వ్యక్తులు ఈ పరికరాన్ని ఉపయోగించినప్పుడు, నిర్ధిష్టమైన ఎత్తులో ఉంచి వాడడం కష్టతరమవుతుంది. రెండవది, గ్రామీణ వాడకం దారులకు, బల్ల పై ఉంచి వాడే నమూనా కన్నా, నేలపై ఉంచి వాడే నమూనా నే సౌకర్యవంతంగా ఉన్నట్లు ఆయన గమనించారు. మడత పెట్టే రకం మొగ్గలను త్రుంచే యంత్రాన్ని కూడ ఆయన అభివృద్ధి చేశారు. కాని, అది, స్ధానిక వాడకం దారులకి నచ్చలేదు. అందువలన, ఆ నమూనాని మధ్యలోనే అభివృద్ధి పరచడం మానివేశారు. ఆ ప్రాంతంలోని ఎంతోమంది చెరుకు పండించే రైతులు, శ్రీవిశ్వకర్మ తయారుచేసిన యంత్రాన్ని ఉపయోగిస్తూ, తమ సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకుంటున్నారు.

సమగ్ర సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా
శ్రీ రోషన్ లాల్, విశ్వకర్మ
పి.బ. మేఖ్, గోటెగావ్, నర్సింగ్ పూర్,
మధ్యప్రదేశ్ 487002
టెలిఫోను నంబరు . 09300724167
ఈ మెయిల్ :info@nifindia.org మరియు bd@nifindia.org
ఫోను: 079- 26732456 and 26732095.

ఆధారము: http://www.hindu.com

నిరంతరమైన వ్యవసాయ పధ్ధతులు ఇచ్చిన మెరుగైన ఫలితాలు

ఉదాహరణ : శ్రీ అరుణాచలం అనే రైతు తన అరటి తోటలో చేసిన ప్రయొగాలు

సహజమైన లేక నిరంతరమైన్ వ్యవసాయం అనేది, తక్కువ ఖర్చు, సులభమైన ఉత్పాదన చీడపీడలకు తట్టుకోగలిగినది, మరీ ముఖ్యంగా  సురక్షిత వైునదని.
- గోపిచెట్టిపాలెం, ఈరోడ్‌ జిల్లా, తమిళనాడుకు చెందిన శ్రీ అరుణాచలం అనే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు అంటున్నారు.

శ్రీ అరుణాచలం మరియు ఆయన కుటుంబం, ఇంచుమించు ఎనిమిదేళ్ళ క్రితం మూడు ఎకరాల భూమి  కొన్నారు. ఆ నేల ఎక్కువగా క్షారగుణాలు కలిగి ఉండడం చేత అది కొన్నవారికి లాభం లేదు కాబట్టి భూవిు ఎక్కువ  ఖరీదు చాల తక్కువగా ఉన్నది. అటువంటి నేలలో ఎటువంటి పంటలు  పండవని ప్రజలు అతడిని నిరుత్సాహ పరిచారు.

నిరంతరమైనపద్ధతులద్వారాపనిచెసినవిధానం:
అనేకరకాలవిత్తనాలుచల్లుటః
 శ్రీ అరుణాచలం ముందు అనేక రకాల విత్తనాలు భూవిులో చల్లారు. ఎన్నో  చిన్న రకాల కాయ, గింజ ధాన్యాల  విత్తనాలను నేలలో చల్లడం ఈ పద్ధతి లో ఉంటుంది. ఒక నెల తరువాత , మొలకలెత్తిన విత్తనాలను మళ్ళీ ఆ నేలలోనే  ఎరువుగా వాడతారు.

వరినుండిఆదాయం: ఆయన, కొన్ని  రకాల సంప్రదాయ వరి రకాలను ఆ భూవిులోనే పండించి ఆ ధాన్యాన్ని అమ్మి దాదాపు 1,90, 000 రూపాయలను గడించాడు.

అరటితోఆదాయం: తరువాత సుమారు 1800 అరటి  దుంపలను (పిలకలు) ఆ నేల లోనే పెంచాడు. ఎనివిుది నెలలకొకసారి ఆ చెట్లకు పళ్ళు పండాయి. ఇప్పుడు ఆ పంట పదకొండవసారి చేతికి వచ్చింది. ఒక్కొక్క గెల 100 రూపాయల నుండి 190 రూపాయలకు అమ్మడం వలన అతడికి సుమారుగా 1,80,000 రూపాయల ఆదాయం  వచ్చింది.

అరటిఎరువుః ప్రతీ పంట దిగుబడి అయిన తరువాత, విుగిలిన అరటి వ్యర్ధాలతో ఏర్పడిన ఎరువు, అసలు నేల  ఎత్తు కంటె ఒక అడుగు ఎత్తులో పేర్చేవారు. కలుపు తీయడం గాని, పెట్టుబడి, ఇతరత్రా ఖర్చులు కాని ఉండవు, ఎందుకంటే , ఇది నిరంతరం స్వయంగా నిర్వహించుకునే  ప్రక్రియ. దీనికి కావలసింది పంట పండించడం ఒక్కటే  అని శ్రీ అరుణాచలం అంటున్నారు.

అంతరపంటలుః కూరగాయలు, బెండ, వంగ, పచ్చి విురప, బీర, గుమ్మడి వంటివి, ఇంకా బొప్పాయి, కంది, విునుము వంటివి, అంతర పంటలుగా అరటి తోట లో పండించడం వలన అతడికి 10,000 రూపాయల  ఆదాయం లభించింది.

కంచెమరియుఅంచుపంటలుః కలప మరియు పశువుల మేత విలువ కలిగిన చెట్లను, కంచెపంటలుగా, అంచె పంటలుగా పొలం గట్ల వెంబడి పెంచబడ్డాయి.

పశువులపెంపకం: రెండు  కంగాయం (స్థానికమైన  జాతి) ఎద్దులను వాటి ఒకటో సంవత్సరంలలో   ఒక్కొక్కటి 8500 రూపాయల చొప్పున కొని, ఆరు నెలలలో 50,000 రూపాయలకు ఏటా జరిగే తమ ప్రాంతపు పశువుల సంతలో అమ్మబడ్డాయి. అవి అమ్మేనాటికి ఆ పశువులు, బరువులు వెూయడంలో  సమర్ధవంతమైన తర్ఫీదు పొంది ఉన్నాయి. ఎద్దుల పేడ, మరియు 15  టెలిచెర్రి మేకల వ్యర్ధాల లో నీటిని కలిపి పొలం తడపబడింది. దీని వలన భూవిుకి మంచి ఎరువు లభించింది. మేకలను అమ్మడం వలన అదనంగా 60,000 రూపాయలు లభించింది. బొప్పాయి పళ్ళు, విత్తనాలు అతడి పది కోడి పుంజులకు మేతగా ఉపయోగపడతాయి. ఆ పుంజులన్నీ పందెపు కోళ్ళుగా తీర్చిదిద్దబడి 1000 రూపాయలకు అమ్మబడ్డాయి. ఒక సంవత్సరంలో అతడు ఈ పక్షులను అమ్మి 10,000  రూపాయలు సంపాదించాడు. ఈ సంప్రదాయ  స్థానికమైన పశు జాతులు (ఎద్దులైనా, మేకౖలెనా, కోడి పుంజులైనా) ఏవీ కూడా ఎటువంటి వ్యాధికి లోనుకానటువంటివి. వీటిని అమ్మకానికి సిద్ధం చేయడంలో ఎటువంటి ఖర్చూ జరగలేదు.

నేను 365 రోజుల్లో, నా మూడు ఎకరాల భూవిుతో, ఎటువంటి పెట్టుబడి ఖర్చు ఎక్కువగా పెట్టకుండా, 6 లక్షల రూపాయలను సంపాదించగలిగితే, ఇతరరైతులు ఎందుకు సంపాదించలేరు? - అని శ్రీ అరుణాచలం అడుగుతున్నారు.
మరి కొంత సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా:
శ్రీ. వి.ఎస్‌.అరుణాచలం,
కులవికరడు, పి.వెల్లాల పాళ్యం, (పి.ఒ.), గోబిచెట్టిపాళ్యం,
ఈరోడ్‌, తమిళనాడు, పిన్‌ -  638476,
మెబైల్‌ : 9443346323, ఈ.మెయిల్‌ - elunkathir@gmail.com
ఆధారము: ద హిందూ, తేది1 జనవరి, 2009

విజయ గాధలు

వరి దిగుబడిని పెంచే కదిరామంగళం విధానం

(తమిళనాడు, కావేరి డెల్టా ప్రాంతములో ఉన్న ఒక గ్రామములో ఎస్.గోపాల్ గారిచే అభివృద్ధి చేసి అభ్యాసం చేసిన విధానము)

దిగుబడి పెంచే ‘శ్రీ’వరి సాగు (ఎస్. ఆర్. ఐ)  పధ్ధతిలోని ఆలోచనా విధానాన్ని, అభ్యాసాల్ని మరియు ఉపాయాల్ని ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ విధానం కావేరి డెల్టా ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా రూపొందించారు .

దిగుబడిని పెంచే శ్రీ వరి సాగు విధానంలోరైతుల సమస్యలు/బెంగలు: ‘శ్రీ’ (ఎస్. ఆర్. ఐ)  విధానంలో తెలిపిన విధంగా  రెండు ఆకుల లేత వరి నారుని నాటితే,  తీవ్రమైన ఎండకి మరియు నిరంతర గాలివలన లేత వరి నారు ఎండి పోతుంది.
ఈ సమస్యకి అనువైన పరిష్కారం: మొదటి రెండు వారములు ఐదు వరి మొక్కల్ని కలిపి నాటడం వలన ఎండ మరియు గాలి వలన రక్షణ కల్గించవచ్చు.  రెండు వారముల తరువాత బలంగా తయారైన వరి మొక్కల్ని ఒక్కటొక్కటిగా తిరిగి నాటాలి.  దీని వలన వరి మొక్కలు చావ కుండా త్వరగా పెరుగుతాయి.
ఈ విధానములోని లోపం: రెండవసారి వరి మొక్కల్ని నాటడానికి కావలసిన అదనపు శ్రమ ఉన్నప్పటికిని, ఎక్కువ దిగుబడి ముందు ఈ అదనపు శ్రమ ఖర్చు పెద్దదేమీ కాదని రైతులు భావి స్తున్నారు.

ఫలితం: ఈ విధానములో ఒక హెక్టారుకి  సగటున 7.5 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

ఈ విధానంలో అనుసరించవలసిన సాంకేతిక మెకువలు:

నారుమడి తయారుచేయు విధానము:

  • 12 (పన్నెండు) రోజులలోపు మంచి వరి నారులు పొందడానికి కావలసిన నీటి పారుదల మరియు కాల్వల సౌకర్యం గల చదును భూమి.
  • 100 (వంద) చదరపు మీటర్ల చదును భూమిని తయారుచేయాలి.  ఇది ఒక హెక్టారు పంటని నాటడానికి అవసరం. (రెండున్నర సెంట్లు)
  • 200 (రెండు వందల) అడుగుల పొడవు మరియు ఒక మీటరు వెడల్పు గల 300 (మూడు వందల) గేజ్ పాలీథీన్ పొర ఒక హెక్టారుకి సరిపడే వరి నారు పెంచడానికి కావాలి.
  • విత్తనాలు చల్లడానికి ఒక మీటరు పొడవు, అర మీటర్ల వెడల్పు మరియు నాలుగు సెంటీ మీటర్ల ఎత్తు గల చట్రం కావాలి.
  • వత్తిన మట్టిని గాని, పెంటతో గాని చట్రాన్ని నింపాలి.
  • ఎజోస్పిరిల్లమ్ మరియు ఫాస్ఫోబాక్టీరియమ్ కలిపిన ఐదు (5) కిలోగ్రాముల మొలకెత్తిన విత్తనాలు ఒక హెక్టారు భూమికి నాటడానికి కావాలి. ప్రతి అరకి నలభై ఐదు (45) గ్రాముల విత్తనాలు చొప్పున నాటాలి మరియు జల్లించిన మట్టితో ఆ విత్తనాల్ని కప్పాలి.
  • రోజుకి రెండు సార్లు చొప్పున స్ప్రింక్లర్ డబ్బాతో  ఐదు రోజుల పాటు నీటిని పోయాలి.
  • 150 (నూట ఏభై) గ్రాముల యూరియాను మూప్ఫై లీటర్ల నీటిలో కరిగించి ఎనిమిదవ రోజు 0.5 శాతము యూరియాను వెదజల్లాలి.
  • పన్నెండు రోజుల వరి నారుని వాటి వేళ్ళతో పాటు మట్టిలో పెట్టి ఈ విత్తనాల సంచుల్ని నారుమడికి తీసుకురావాలి.

నారుమడి వేసే పద్ధతి:

మొదటిదశ వరి మొక్కల్నినాటే విధానం:

  • ఒక మూలలో ఉన్న ఎనిమిది సెంట్ల భూమిని పన్నెండు రోజుల వరి మొక్కల్ని నాటడానికి తయారు చేయాలి.  తరువాత ఈ వరి మొక్కలు ఒక హెక్టారు భూమిలో నాటడానికి సరి పోతాయి.
  • ఈ చిన్న భాగంలో ఒక దిబ్బకి నాలుగు నుంచి ఐదు వరి మొక్కలు చొప్పున నాటాలి.  ఒక దిబ్బ నుంచి మరొక దిబ్బకి పదిహేను సెంటీమీటర్ల చదరపు ఖాళీ ఉంచాలి.
  • పదిహేనవ రోజు 0.5 శాతము యూరియాను వెదజల్లాలి.
  • ఇరవై ఎనిమిది రోజులకి వరి మొక్కలు ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు ఏపుగా ఎదిగి దట్టమైన వేళ్ళతో ఉంటాయి.

రెండవ దశ వరి మొక్కల్నినాటే విధానం/ పద్ధతి:

  • ముప్ఫై రోజులకి వరిమొక్కల్ని జాగ్రత్తగా దిబ్బల నుంచి పీకి వేరు చేసి మరియు 20 x 20 సెంటీమీటర్ల దూరములో ఒక్కటొక్కటిగా మొత్తం భూమిలో నాటాలి.
  • ఒక హెక్టారు భూమిలో ఈ పనిని చేయడానికి రోజుకి పదిహేను కూలీలతో చేయవచ్చు.

రెండు సార్లు వరి నాటడం వలన ఉపయోగాలు:

  • వరి మొక్కలు చనిపోకుండా ఏపుగా పెరుగుతాయి.
  • వరి మొక్కలు ఏపుగా పెరగడంతో కలుపు మొక్కల సమస్య కొద్దిగానో లేదా లేకపోవడమో జరుగుతుంది.
  • వరి మొక్కలు ఎత్తుగా ఉండడం వల్ల అవి నిశ్చలమైన నీటిని మొదటి రోజు నుంచి  తట్టు కుంటాయి.  దీని వలన కలుపు మొక్కల్ని నియంత్రించవచ్చు.
  • మొక్కల్ని ఒక్కటొక్కటిగా వేరు చేయడం చాలా సులువుగా ఉంటుంది.
  • పంట తొందరగా ఎదుగుతుంది.  పదవరోజు నుంచి కలుపు తీసేయంత్రంతో పనిచేయడం సాధ్యపడు తుంది.
  • రైతులు మామూలుగా చేసే వరి వ్యవసాయ విధానాలనే పాటించి ఈ సాంకేతిక పద్ధతుల్ని అనుసరించవచ్చు.  ప్రత్యేకమయిన శిక్షణ లేదా ప్రయత్నాలు అవసరం లేదు.

కలుపు మొక్కల యాజమాన్యం:

రెండవ దశ వరి మొక్కల్ని నాటిన తరువాత, పదవరోజు మొక్కల వరుస వెంబడి మరియు అడ్డంగా కోనో-వీడరుని(యంత్రం) మూడు నుంచి నాలుగు సార్లు రెండు దిశలలో లాగాలి.  ఈ కలుపు మొక్కలు తీసే విధానం ఒకసారే అవసరమవుతుండడంతో ఒక హెక్టారుకు పది శ్రమ రోజులు ఆదా అవుతుంది.

నీటి పారుదల:

మట్టిని ఆరనివ్వకుండా అప్పుడప్పుడు నీటిని పెడుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ నీటితో తడప రాదు. ఇది సుమారు ఐదు వందల మిల్లీ మీటర్ల సేద్యపు నీటి అవసరాల్ని తగ్గిస్తుంది.

ఎరువులు వేసే విధానం:

  • మొదట, కనీస మోతాదులో ఫాస్ఫరస్ మరియు పొటాష్ ఎరువు వేయాలి.
  • కలుపు తీసిన తరువాత చేసిన తరువాత పదిహేనవ రోజు ముప్ఫై కిలోగ్రాముల యూరియాని వేయాలి.
  • మళ్ళీ ముప్ఫైవ రోజు ఒక హెక్టారుకు ముప్ఫై కిలోగ్రాముల యూరియాని వేయాలి.
  • నలభైవ రోజు ఒక హెక్టారుకు ముప్ఫై కిలోగ్రాముల యూరియాతో పాటు ముప్ఫై కిలోగ్రాముల పొటాష్ వేయాలి.

గమనిక: ప్రభుత్వము వ్యవసాయ సిబ్బంది అయిన రాజేష్ కుమార్ మరియు సౌరవ్ నాయక్ లు కదిరామంగళం గ్రామం నుంచి ఈ సమాచారాన్ని ఇచ్చారు. తమిళనాడు, కావేరి డెల్టా ప్రాంతములో నున్న ఒక గ్రామములో బి.ఎస్.సి (బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్) పట్టభద్రుడైన ఎస్.గోపాల్ గారిచే అభివృద్ధి చేసి అభ్యాసం చేసిన వరి దిగుబడి పెంచే ఈ సవరించిన విధానం కావేరి డెల్టా ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా ఉందని చెప్పారు.

ఆధారము: http://ciifad.cornell.edu/sri/countries/india/kadiramangalam.html

పసందైన పండ్ల శుద్ధి యంత్రం!

పండ్లు, కలబంద, ఉసిరి రసం, గుజ్జు, ఎసెన్స్ తయారు చేస్తుంది
విత్తనాలు పాడవకుండానే ఈ పనులు చేస్తుంది 
హర్యానా రైతు అద్భుత ఆవిష్కరణ.. టమాటా రైతులకు ఉపయోగకరం

జీవితావసరం ఒక ఆవిష్కరణకు కారణభూతం అవుతుందనడానికి ఈ రైతు శాస్త్రవేత్త జీవితానుభవం ఉదాహరణగా నిలుస్తుంది. ధరమ్‌వీర్ సింగ్ కాంబోజ్(50) హర్యానాలోని యమునానగర్ నివాసి. అవరోధాలను మనోబలంతో ఎదుర్కొని బహుళ ప్రయోజనకారి అయిన యంత్రాన్ని కనుగొని రైతులోకానికే ఆదర్శంగా నిలిచాడు. పేద రైతు కుటుంబంలో జన్మించిన ధరమ్‌వీర్ తమకున్న పిండి మిల్లు, బెల్లం వండే బట్టీపనుల్లో తండ్రికి సాయపడేవాడు. పెద్దగా చదువుకోలేదు.

పొట్టపోసుకోడానికి కొన్నాళ్లపాటు ఢిల్లీలో రిక్షా తొక్కాడు. కొత్తగా ఏదైనా చేయాలన్న తపన కలిగిన అతను తదనంతరం తమ ప్రాంతంలో మొట్టమొదటగా హైబ్రిడ్ టమాటా సాగు ప్రారంభించి అధిక దిగుబడి సాధించాడు. టేప్‌రికార్డర్ మోటారుతో పిచికారీ యంత్రం తయారు చేశాడు. చెరకు తోటలో అంతర సేద్యానికి ఉపకరించేపరికరాన్ని తానే తయారు చేసుకున్నాడు. నిత్యం కొత్తగా ఏదోఒకటి చేయాలని తపించే ధరమ్‌వీర్ రైల్వే స్టేషన్‌లో చెత్త ఊడ్చి, గచ్చు శుభ్రం చేసే యంత్రం తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఆ నేపథ్యంలో కలబంద వంటి ఔషధ మొక్కల సాగు వైపు ధరమ్‌వీర్ ఆలోచన మళ్లింది. కలబంద నుంచి గుజ్జు తీసే యంత్రం నెలకొల్పే ఆలోచనలో ఉండగా.. ఉద్యాన శాఖ ద్వారా రాజస్థాన్‌లో కలబంద, ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు చూసే అవకాశం దొరికింది. అక్కడి యంత్రాలను ధరమ్‌వీర్ క్షుణ్ణంగా పరిశీలించాడు. అవన్నీ ఖరీదైనవి కావడంతో ఒక యంత్రాన్ని తానే సొంతంగా తయారు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ పట్టుదలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 2006 ఏప్రిల్‌లో కలబంద గుజ్జు తీసే ఒక చిన్న యంత్రాన్ని తయారు చేశాడు. తర్వాత దాన్నే ఎసెన్స్ తీసే యంత్రంగా మార్చగలిగాడు. మార్పులు చేర్పులతో అనేక ఔషధ మొక్కలు, వ్యవసాయోత్పత్తులను శుద్ధిచేసి వివిధ ఉత్పత్తులు తయారు చేయడం ప్రారంభించాడు. గ్రామీణ ఆవిష్కర్తలకు గుర్తింపునిచ్చే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) ఆయనను ఎంతో ఉపయుక్తమైన ఆవిష్కరణకు దోహదపడిన రైతు శాస్త్రవేత్తగా గుర్తించింది. యంత్రాన్ని మరింత మెరుగుపరచి, అందంగా తీర్చిదిద్దింది.

ప్రయోజనాలెన్నో 
ఆహార, ఔషధ పరిశ్రమల కోసం పండ్లు, కూరగాయల నుంచి గుజ్జు/రసం, చమురు, ఎసెన్స్‌ను తయారు చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. అలాగని భారీ యంత్రం కాదు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. సింగిల్ ఫేజ్ మోటారుతో పనిచేస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణ, ఆటో కటాఫ్ సదుపాయాలున్న పెద్ద ప్రెజర్ కుక్కర్ మాదిరిగా ఉంటుంది. పూలు, ఔషధ మొక్కల నుంచి ఎసెన్స్, రసాలను ఔషధ గుణాలు పోకుండా సంగ్రహించగలదు. అన్నిటికన్నా ముఖ్యంగా.. పండ్లు, కూరగాయలను శుద్ధి చేసేటప్పుడు వాటి విత్తనాలు దెబ్బతినకుండా వేరుచేస్తుంది.

రాష్ట్రపతి పురస్కారం
ఎన్‌ఐఎఫ్ సిఫారసు మేరకు 2009లో హర్యానా రాష్ట్ర అవార్డును, 2012లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ జాతీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నాడు ధరమ్‌వీర్. పేటెంట్ కోసం దరఖాస్తు చేశాడు. ఇప్పటి వరకు 90 యంత్రాలను అమ్మాడు. సొంతంగా కలబంద, ఉసిరి, తులసి తదితర ఔషధ మొక్కలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ.. వాటి నుంచి ఎసెన్స్, రసాలు, పొడులు, తలనూనెలు, స్వీట్లు తదితర ఉత్పత్తులను తయారు చేసి ఏటా రూ.40 లక్షల వ్యాపారం చేస్తున్నాడు. 20 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు. గంటకు 50 కిలోల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ.70 వేలు. గంటకు 150 కిలోల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ. లక్షన్నర. ఔషధ మొక్కలు, మామిడి, టమాటా వంటి పంటలు సాగుచేసే రైతులు ఈ యంత్రం సాయంతో ధరమ్‌వీర్ మాదిరిగా అధికాదాయం పొందే అవకాశం ఉంది.

వివరాలకు: పల్లెసృజన, 122, వాయుపురి, సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్-500094 ఫోన్: 040-27111959. విశ్రాంత బ్రిగేడియర్ గణేశం: 98660 01678

ఆధారము: సాక్షి

విద్యుత్ అవసరం లేని సైకిల్ నీటి పంపు

‘ఏటికేతంబెట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగనన్నా... నేను గంజిలో మెతుకెరుగనన్నా...’ అని జనపథాల్లో వినిపించే మట్టి వాసన వంటి పల్లెపాట రైతు బతుకు వ్యధను, సాగు నీటి కోసం పడే పాట్లను కళ్ల ముందు రూపుకట్టిస్తుంది. కాలం మారి విద్యుత్ మోటార్లొచ్చినా ఇప్పటికీ మారుమూల పల్లెల్లో పరిస్థితి మారలేదు. అరకొర విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినా దాన్ని వినియోగించుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ మోటార్లను కొని వినియోగించుకొనే ఆర్థిక శక్తి రైతుల్లో చాలా మందికి ఉండదు. ఆంధ్ర దేశంలోని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఏతం, గూడబొక్కెనలతో చేను చెలకను పారించుకోవడం కనిపిస్తూనే ఉంది. చేను తడుపుకోవడానికి రైతులు రెక్కలు ముక్కలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆదిలాబాద్ జిల్లా మారుమూల అడవి మండలం ఇంద్రవెల్లిలోని జైత్‌రాంతండా నవాస్‌పూర్‌కు చెందిన ఓ ఆదివాసీ రైతు ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అందుకే వినూత్న ఆవిష్కరణతో చరిత్ర సృష్టించిన రైతు శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందాడు.

అతని పేరు విక్రం రాథోడ్. అతనికి నాలుగెకరాల చెలక ఉంది. ఇందులో పత్తి, కూరగాయలు, వరి సేద్యం చేస్తున్నాడు. వర్షాలు మొహం చాటేసిన నాడు వరి పంట నిలువునా ఎండిపోతుంది. కూరగాయలు మొహం మాడుస్తాయి. మరీ బెట్ట పరిస్థితి ఎదురయితే పత్తి పంటకూ నీరు కట్టాల్సి ఉంటుంది. చేనుకు పక్కనే చిన్న కుంట నిండుగా నీటితో ఉంది. ఆ నీరుతో చేను పారించుకోవడానికి ఆయనకు డీజిల్ ఇంజిన్ లేదా విద్యుత్ మోటారు కొనే ఆర్థిక స్థోమత లేదు. అలాగని సాగుకు స్వస్తి పలికితే.. బతకటానికి మరోదారి లేదు. తక్కువ శ్రమతో ఉన్న చేనును సాగు చేసుకోవాలనే పట్టుదల.. ఆలోచనకు పదును పెట్టింది. అప్పటికే సైకిల్ రిపేరింగ్‌లో కొంత అనుభవముంది. సైకిల్‌తో నీటి పంపును నడిపితే? అనే ఉపాయం తట్టింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. సైకిల్ వెనుక చక్రానికి బెల్టును అనుసంధానం చేసి పంపు పుల్లీకి జత కలిపాడు.  స్టాండ్ వేసిన సైకిల్ ఎక్కి తొక్కడంతో.. బెల్టుతో అనుసంధానమైన పంపు పుల్లీ తిరిగింది.. నీరు బయటకు చిమ్మింది. విరబూసిన రేల పూలలా ఆ రైతన్న కళ్లు ఆనందంతో వెలిగిపోయాయి. అంతే.. రాథోడ్ ప్రయోగం ఈ నోట.. ఆనోట.. పల్లెలకు పాకింది. ఆశ్చర్యంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు నవాస్‌పూర్ జైతురాం తండా బాట పట్టారు. ఆయన సాధించిన అద్భుత విజయాన్ని చూసి ఆనందించారు.. అభినందించారు!  విక్రం రాథోడ్ అవసరం కొద్దీ పట్టుదలకు బుద్ధిబలాన్ని జోడించి సాధించిన ఈ విజయం ఇతర రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. విద్యుత్ అవసరం లేకుండా.. అతి తక్కువ ఖర్చుతో రైతులు చేను తడుపుకోవడానికి నీటి పంపు రూపొందింది. గ్రామీణ శాస్త్రవేత్త రాథోడ్ ఆవిష్కరణ గురించి ఉట్నూర్‌లోని ఐటీడీఏ అధికారులకు, హనీబీ నెట్‌వర్క్ వారికి తెలిసింది. స్వయంగా వచ్చి నీటిపంపు పనితనం చూసి పల్లె రైతులకు ఉపయోగకరమైన ఆవిష్కరణగా గుర్తించారు. గ్రామీణుల ఆవిష్కర్తలను ప్రోత్సహించే ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్)’ పరిశీలనకు దీన్ని పంపారు. ఎన్‌ఐఎఫ్ విక్రం రాథోడ్ ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయిలో పురస్కారానికి ఎంపిక చేశారు. మారుమూల అదిలాబాద్ పల్లెలో పుట్టిన రైతు శాస్త్రవేత్త అప్పటి రాష్ట్రపతి కలామ్ చేతుల మీదుగా 2003లో బహుమతి అందుకున్నాడు. అంతేకాదు.. ఎన్‌ఐఎఫ్ విక్రం రాథోడ్ ఆవిష్కరణకు 2004లో పేటెంట్‌ను కూడా తెప్పించింది. పదేళ్లు గడచిపోయాయి. కానీ, ఈ గొప్ప ఆవిష్కరణను రైతులకు చేర్చడానికి ప్రభుత్వం, బ్యాంకులు.. తోడ్పడనే లేదు. ఇటువంటి నీటి పంపులను తయారు చేసి అమ్మడం ద్వారా కొంత ఆదాయం పొందుతున్నాడు రాథోడ్.

సంప్రదించాల్సిన చిరునామా:
పల్లెసృజన, సైనిక్‌పురి, సికింద్రాబాద్-500094 ఫోన్‌‌స: 040 27111959, 9866001678
- న్యూస్‌లైన్, ఉట్నూర్ (ఆదిలాబాద్ జిల్లా)

ప్రోత్సాహం కరువు!
ఎవరైనా అడిగితే సైకిల్ నీటి పంపును తయారు చేసి ఇస్తున్నా. ఇప్పటికి 20 పంపులు తయారు చేసి ఇచ్చా. దీని ఖరీదు రూ. 15 వేలు. ఆర్డరు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని పల్లెసృజన కేంద్రం వాళ్లు నన్ను పిలిపించి తయారు చేయిస్తున్నారు. ఒక పంపు తయారు చేస్తే నాకు రూ.2 వేలు వస్తుంది.  మొదట్లో ప్రోత్సహించిన ఐటీడీఏ కూడా తర్వాత పట్టించుకోలేదు. పేటెంటు, అవార్డులు వచ్చాయి. కానీ, పేదరికం పోలేదు. ఇంధనం లేకుండా ఇంటి అవసరాలకు విద్యుత్ తయారు చేసే యంత్రం తయారు చేస్తున్నా. బ్యాంకు రుణం ఇచ్చి ప్రోత్సహిస్తే ఉపయోగపడే మంచి యంత్రాలను కనిపెడతా.

- విక్రమ్ రాథోడ్ (9440711195)

ఆధారము: సాక్షి

పాలీహౌస్‌లో పంట సిరి!

పుణే కేంద్రంగా విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం

పావెకరం(25 సెంట్లు) పంట పొలం.  అంగుళం నీరు, గంట కరెంట్‌తో వ్యవసాయం సాగిస్తే... అబ్బో అయ్యగారి చేను కొయ్యా? మొయ్యా? అని నలుగురూ పగలబడి నవ్వుతారు. అయితే.. సరిగ్గా ఇవే వనరులతో ఏడాదికి రూ.8 లక్షలు కళ్లజూస్తున్నారు మహారాష్ట్ర రైతులు. ఆశ్చర్యంగా అనిపించినా.. అతిశయోక్తిగా భావించినా.. పుణే నగరం సమీపంలోని ిహింజేవాడి గ్రామం వెళ్లి చూడండి. నిజం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.

యువ రైతు దానేశ్వర్ బోడ్కే సారథ్యంలో లాభసాటిగా సమష్టి వ్యవసాయం
స్థానిక వినియోగదారుల అవసరం మేరకే పంటల సాగు.. డోర్ డెలివరీ
సొంత మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా పూలు, కూరగాయల అమ్మకం.. స్వయం సహాయక బృందాలకు భాగస్వామ్యం

పుణే-ముంబై జాతీయ రహదారికి ఆవలివైపు విసిరేసినట్టుగా ఉండే హింజేవాడికి చెందిన దానే శ్వర్ బోడ్కే అనే యువరైతు మదిలో మెదిలిన ఆలోచన.. కార్యరూపం దాల్చి రైతుల ఇంట పంట సిరులు కురిపిస్తోంది. సరిగ్గా వెయ్యి గజాలు లేదా పావు ఎకరం స్థలంలోని పాలీహౌస్‌లలో పూలు, కూరగాయలు పండిస్తూ అధికాదాయం పొందుతున్నారు. పుణే ఐటీ హబ్ తలేగావ్‌కు చివరన ఉండే హింజేవాడి ఒకప్పుడు మారుమూల గ్రామం. సంప్రదాయ పద్ధతిలో జొన్న, మొక్కజొన్న, పత్తి, చెరకు తదితర పంటలను సాగు చేసేవారు. ఆరుగాలం శ్రమను సాలాఖరుకు లెక్కేసుకుంటే అప్పులు, వడ్డీలు పోను చేతిలో మిగిలేది హళ్లికి హళ్లి.. సున్నకు సున్న! ఐటీ కంపెనీలు వచ్చిన తరువాత ఈ ప్రాంత భూముల ధరకు రెక్కలొచ్చాయి. జీవితకాలంలో ఎన్నడూ కళ్లజూడని డబ్బు.. ఎకరం భూమి 40 లక్షల చొప్పున అడిగినవాడికి అడిగినట్లు అమ్ముకున్నారు. చేతిలో పడిన డబ్బు హారతి కర్పూరమయ్యాక యువకులు ఐటీ హబ్‌లో చిరుద్యోగులుగా మారారు. వీరికి భిన్నంగా దూరదృష్టితో కదిలాడు దానేశ్వర్ బోడ్కే. పాలీహౌస్ వ్యవసాయాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాడు.

కష్టాలే రాటుదేల్చాయి!

బోడ్కే తండ్రి 16 ఎకరాల రైతు. రూ. 20 వేల  అప్పు రూ. లక్షన్నరకు పెరిగి వ్యవసాయం తలకు చుట్టిన పాములా మారింది. కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి దాటే యడానికి బోడ్కే మొదట చిరుద్యోగాలు చేశాడు. ఇంటీ రియర్ డిజైనింగ్ కోర్సు చేశాక ఒక మోస్తరు ఆదాయం పొందే స్థాయికి చేరాడు. అయినా.. ఏదో వెలితి.. ఇంకా ఏదో చేయాలన్న తపన వెంటాడింది. ఆ దశలో తలెగావ్‌లోని ప్రభుత్వ ఉద్యాన కళాశాల పాలీహౌస్ వ్యవసాయంపై 2 రోజుల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వా నించింది. మరో ఆలోచన లేకుండా శిక్షణ పొందాడు. అయితే పాలీహౌస్‌లో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించడానికి ఆ 2 రోజుల శిక్షణ సరిపోదనిపించింది. ఉద్యాన కళాశాల ప్రొఫెసర్‌ను బతిమిలాడి సంవత్సరం పాటు వేతనం లేని శిక్షణా కార్మికుడిగా పనిలో చేరాడు. పాలీహౌస్ నిర్మాణం నుంచి నిర్వాహణ వరకు అన్ని పనులనూ ఆకళింపు చేసుకున్నాడు. అనుభవమైతే సాధించాడు కానీ.. దాన్ని ఆచరణలో పెట్టేందుకు తగినంత ఆర్థిక శక్తి లేదు. విసుగు, విరామం లేకుండా  నెలల తరబడి తిరిగి కెనరా బ్యాంక్ రుణం పొందాడు. కేవలం 5 గుంటల(20 సెంట్ల) స్థలంలో తొలి పాలీహౌస్ నిర్మించాడు బోడ్కే. కార్నిషియన్ పూలే సాగు చేసి ఏడాదిలోనే అప్పు తీర్చేశాడు. పుణే నగరంలో అప్పు డప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆతిథ్య పరిశ్రమదారులు ఐస్‌బర్గ్ లెట్యూస్, బ్రకోలీ, కోలే, పార్స్‌లే, సలేరీ, లూలూరోసా, చెర్రీ టమాటా, చైనా క్యాబేజీ వంటి విదేశీ కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించాడు. తన పాలీ హౌస్‌లో సాగు చేసి సరఫరా చేయడంతో ఆదా యం బాగా పెరిగింది. బోడ్కే అంతటితో సంతృప్తి చెందలేదు.

అభినవ్ ఫార్మర్స్ క్లబ్ అవతరణ

రైతు పంటలు పండించడమే కాదు.. తన సరుకును ప్రణాళికాబద్ధంగా అమ్ముకుంటేనే తగిన ప్రతిఫలం ఉంటుందని భావించిన బోడ్కే.. నలుగురినీ కూడగట్టి రైతుల సంఘటిత శక్తిని చాటాడు. కొద్దిమంది పాలీహౌస్ సాగుదారులతో 2004లో ఏర్పాటైన అభినవ్ ఫార్మర్స్ క్లబ్‌లో సభ్యుల సంఖ్య 640కు పెరిగింది. 2008లో క్లబ్‌కు జాతీయ పురస్కారం లభించింది. బోడ్కే తన కార్యకలాపాలను హింజేవాడి నుంచి మహారాష్ట్ర అంతటికీ విస్తరింపజేశాడు. వెయ్యికి పైగా పాలీహౌస్‌లు ఏర్పాటు అయ్యాయి.

వినియోగదారుల ఇళ్ల వద్దకే కూరగాయలు

పాలీహౌస్‌ల సంఖ్య పెరిగిన తరువాత మార్కెట్‌లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. పండించిన కూర గాయలను నేరుగా వినియోగదారుడి ఇంటి గుమ్మంలోకే చేర్చాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది. రైతులు పండించిన కూరగాయలను ఒక చోటకు చేర్చి ప్యాకింగ్ చేసే పనిని స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. దీంతో అభినవ్ ఫామ్స్‌కు అనుబంధంగా మహిళా సంఘం ఏర్పాటైంది. వినియోగదారుల అవసరాలకనుగుణంగా వారానికి సరిపడే 7 రకాల కూరగాయలు ప్యాక్ చేసి నేరుగా ఇంటికి చేర్చుతున్నారు. దానికి అనుగుణంగా వివిధ పంటలను సాగుచేస్తున్నారు. బోడ్కే ఆధ్వర్యంలోని అభినవ్ ఫార్మర్స్ క్లబ్ తన కార్యక్రమాలను గుజరాత్, మధ్య ప్రదేశ్‌లకూ విస్తరింపజేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకూ శిక్షణ అందిస్తోంది.

పశువుల ఎరువు..
వరిపొట్టు..
అమృత్‌పానీ!

ఇదీ బోడ్కే పాలీహౌస్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి

నియంత్రిత వాతావరణంలో పంటల సాగు కాబట్టి.. సాధారణ పాలీహౌస్‌లో సస్యరక్షణ మందుల వినియోగం ఎక్కువే. అయితే, ప్రజల్లో ఆరోగ్య స్పృహతో పాటు సేంద్రియ ఆహారానికి గిరాకీ పెరగడాన్ని బోడ్కే గుర్తించాడు. పాలీహౌస్‌ల లో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రూపొందించారు. పాలీహౌస్‌లోని 10 గజాల స్థలంలో ఉత్తర, దక్షిణాల మధ్య దుక్కి దున్ని రోటవేటర్‌తో భూమిని సమంగా చేస్తారు. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. మధ్యలో 40 సెంటీమీటర్ల మేర దారి వదలిపెడతారు. సమంగా చేసిన నేల మీద చివికిన పశువుల ఎరువు ఒక వరుస, దాని మీద వరి పొట్టు మరో వరుస వేస్తారు. మూడో వరుసగా ఇసుక పోస్తారు. దీన్ని రోటవేటర్‌తో దున్ని ఒక్కో వైపు 25 చొప్పున బోదెలు చేసి కూరగాయ మొక్కలు నాటుతారు. మొక్కలకు రోజూ ఉదయం 7 గంటల నుంచి 20 నిమిషాలపాటు డ్రిప్ ద్వారా నీరందిస్తారు. తేనె, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రాలతో తయారు చేసే ‘అమృత్‌పానీ’ అనే ద్రావణ ఎరువును వారానికి ఒకసారి పిచికారీ చేస్తారు. క్రిమిసంహారిణిగా 10,000 పీపీఎం వేప నూనె, ఆవు మూత్రంను నీటిలో 3 నుంచి 5 శాతం వరకు కలిపి పిచికారీ చేస్తారు.

వ్యవసాయం లాభదాయకమే!

రైతు ఎవరినీ దేన్నీ ఉచితంగా అడగకూడదు, దేన్నీ ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. వ్యవసాయోత్పత్తులకు  రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. వ్యవసాయం లాభదాయకమైనదే. యువతరం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలు స్వయం సమృద్ధం కావాలి.

- దానేశ్వర్ బోడ్కే, అభినవ్ ఫార్మర్స్ క్లబ్, పుణే

చిరునామా:
అభినవ్ ఫార్మర్స్ క్లబ్, ిహింజేవాడి గ్రామం,  ముల్సి తాలూకా, పుణె జిల్లా, మహారాష్ట్ర
ఫోన్స్:  09422005389, 0808-7690912  
email: abinavfarmersclub@gmail.com

ఆధారము: సాక్షి

చోహన్‌క్యూ విధానంలో సహజంగా కోళ్ల పెంపకం..

ఆరోగ్యం.. ఆదాయం

డా. చోహన్‌క్యూ విధానంలో వ్యాక్సిన్లు, హార్మోన్లు వాడకుండానే కోళ్ల పెంపకం
తక్కువ ఖర్చుతో.. రైతే సొంతంగా దాణా తయారు చేసుకోవచ్చు
షెడ్డు నుంచి దుర్వాసన రాకపోవడం ఈ పద్ధతి ప్రత్యేకత

ఒలపల దాపల ఒక్క తీరుగా నడిస్తేగాని బండి ప్రయాణం భద్రంగా సాగదన్నట్లుగానే.. వ్యవసాయం లాభాల సాగవ్వాలంటే ప్రధాన, అనుబంధ రంగాల మధ్య సమతుల్యం సాధించడం అవసరం. వ్యవసాయం నగదు పంటల వ్యామోహంలో పడినప్పటి నుంచి ధరలకు దొరలెవరో తెలియని పరిస్థితి. పంటల ధర పూటకో తీరుగా ఊరించి చివరికి ఊబిలో దించుతున్నాయి. ఈ పరిస్థితిలో రైతుకు ‘సాగుబాటు’ కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానమే శరణ్యం. మార్కెట్ మాయాజాలం పుట్టిముంచకుండా ఉండాలంటే వ్యవసాయానికి అనుబంధంగా పాడి, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టాలి. మాట భారీగా ఉన్నా ఇదే సమగ్ర వ్యవసాయ విధానమంటే. నగదుల పంటల వెంట మొదలయిన పరుగు రైతులను మిగతా రంగాలను విస్మరించేలా చేసింది.

పారిశ్రామిక పద్ధతుల్లో కోళ్ల పెంపకంపై సందేహాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో దేశీ కోళ్ల పెంపకం రైతుకు బాగా లాభసాటిగా ఉంటుంది. సహజ విధానంలో కోళ్ల పెంపకంపై దక్షిణ కొరియాకు చెందిన డాక్టర్ చోహన్ క్యూ విస్తృతమైన పరిశోధన చేశారు. చో నేచురల్ పౌల్ట్రీ ఫార్మింగ్ పద్ధతిని రూపొందించారు. మార్కెట్‌పై ఆధారపడకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతోనే కోళ్లను పెంచగలగడం ఇందులో ప్రత్యేకత. వ్యాక్సిన్లు, హార్మోన్ల అవసరం లేకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతో పుష్టికరమైన కోడి మాంసం అందించడం ఇందులోని ప్రత్యేకత.

వైవిధ్యభరితం చోహన్ విధానం

డాక్టర్ చోహన్ విధానంలో కోళ్ల షెడ్డు నిర్మాణం సహజంగా గాలి, వెలుతురులందే విధంగా.. ఎలాంటి సిమెంట్ గచ్చు చేయని నేల మీదే నిర్మించాలి. ఈ విధానంలో ప్రతి కోడికీ గరిష్టంగా 4 అడుగుల స్థలం అవసరం అని నిర్ణయించారు. మీరు పెంచదలచిన కోళ్ల సంఖ్యకు అనుగుణంగా కొలతను నిర్ణయించుకోవాలి. ఎంపిక చేసుకున్న స్థలాన్ని దున్ని చదును చేసుకోవాలి. చుట్టూరా రెండు అడుగుల మేర గోడను నిర్మించుకొని సిమెంట్ స్తంభాల ఆధారంగా చుట్టూ ఇనుప వలను బిగించుకోవాలి. పై కప్పుకు సిమెంట్ రేకులు లేదా తాటాకు, పొరక, జమ్ముగడ్డి, వరిగడ్డి, కొబ ్బరాకులు.. ఏవైనా వాడొచ్చు. వర్షాకాలంలో నీరు పడకుండా కప్పు, చూర్ల నిర్మాణం ఉంటే సరిపోతుంది.

ముందుగా తవ్విన మట్టి మీద మూడంగుళాల మేర వరిపొట్టు, చిన్నచిన్న ముక్కలుగా నరికిన గడ్డి, కొబ్బరి డొక్కు తదితరాలను మట్టితో పాటు కలపాలి. దీని మీద (పాలు, బియ్యం కడిగిన నీటితో తయారు చేసిన) ల్యాక్టో బ్యాక్టీరియా, (అన్నంతో తయారు చేసిన) ఆదిమ సూక్ష్మ జీవుల(ఐఎంఓ) మిశ్రమాన్ని నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. నేలలో ఉన్న మట్టిలో సూక్ష్మజీవులే కోళ్ల ఆరోగ్యానికి భరోసానిచ్చే కాపలాదారులన్నమాట. షెడ్డులో పూర్తి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ల్యాక్టో బ్యాక్టీరియా, ఐఎంఓను పిచికారీ చేయాలి. ఇవి కోళ్ల పెంటను కుళ్లింప జేసి అందులో చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. ఒకసారి షెడ్డులోని నేల తయారు చేస్తే పదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ అవసరాల కోసం ఎరువును తీసుకోవాల్సి వచ్చినప్పుడు పై పొర 3, 4 అంగుళాల మేర తొలగించి వాడుకోవాలి.

కోడి పిల్లలను తేవడానికి ముందు షెడ్డును రెండు భాగాలుగా విభజించాలి. ఇందులో మొదటి భాగంలో కోడి పిల్లలకు గూళ్లు ఏర్పాటు చేయాలి. రాత్రి వేళ అందులోనే విశ్రాంతి తీసుకుంటాయి. పెద్దవైన తరువాత గుడ్లు అదే చోట పెట్టడం అలవాటవుతుంది. ఈ గూళ్లను పౌల్ట్రీ భాషలో బ్రూడర్లంటారు. బ్రూడర్లకు ముందు భాగంలో మెత్తటి నూలు వస్త్రం, పాత చీరలు ఇందుకు సరిపోతాయి. తెరలు కట్టడం ద్వారా కోడి పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు తల్లి రెక్కలు తగిలిన అనుభూతి కలుగుతుంది. తెరకు ముందు భాగంలో దాణా తొట్లు ఉంచాలి. వాటికి ముందు భాగంలో నీరు తాగే వసతి కల్పించాలి. నీటి అవసరాల కోసం తొట్లు లేదా పీవీసీ పైపునకు రంధ్రాలు చేసి అందులో నీరు నింపి ఉంచాలి. ఎప్పటికప్పుడు పాత నీరు తొలగించే ఏర్పాటు చేసుకోవాలి. కోళ్లు పెరిగేకొద్దీ పెద్ద రంధ్రాలున్న పైపులను అమర్చాల్సి ఉంటుంది.

రోజుకు ఒకసారే మేత!

చో విధానంలో కోళ్లకు రోజుకు ఒకసారే మేత ఇవ్వాలి. చీకటి పడడానికి 2 గంటల ముందు మేత వేస్తే సరిపోతుంది. మనకు అందుబాటులో దొరికే దాణాలనే మేతగా వాడొచ్చు. చిన్న కోడి పిల్లలకు రైసు మిల్లులో దొరికే ముక్కులు, వెదురు ఆకులను ఆహారంగా అందివ్వవచ్చు. దీని వల్ల కోడి పిల్లల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. కోడి పిల్లలు ఎదిగిన తరువాత రెండోనెల నుంచి తవుడు, గోధుమ పొట్టు, మొక్కజొన్నలు, ఉలవలు వంటి పప్పుధాన్యాలను వరిగడ్డి, గరిక, కూరగాయ వ్యర్థాలు, ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఇందుకు వాడొచ్చు. ఈ పద్ధతిలో సమతుల్య ఆహారం ఇవ్వడం వలన సాధారణ కోళ్ల కంటే ఎక్కువ కాలం గుడ్లు పెడతాయి. మేతలో 30% వరకు సన్నగా తరిగిన గరిక, మునగాకు, అవిశాకు తదితరాలను కూడా ఇవ్వవచ్చు. దీని వలన దాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. దాణాలో కేజీకి ఒక మిల్లీ లీటర్ చొప్పున ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలిపి ఇవ్వాలి. ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలవడం వలన మేత తేలికగా జీర్ణమవుతుంది. అందులో ఎంజైమ్‌లు, యాంటీ బయోటిక్స్ తయారవడానికి ఇవి తోడ్పడతాయి. ఈ దాణా కోడి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

(ఇన్‌పుట్స్ : డా. మల్లికార్జునరెడ్డి, న్యూస్‌లైన్, ఎస్వీయూ, తిరుపతి. 
ఫొటోలు: మోహన కష్ణ కేతారి)

మేత రెండు రకాలు: పొడి మేత, తడి మేత
తడి మేతలో అరటి బోదెలు- 50%, కూరగాయ వ్యర్థాలు- 30%, వరి గడ్డి- 15%, వెదురు ఆకులు- 5% ఉండాలి. పొడి మేతలో.. వరి తవుడు 30%, మొక్కజొన్న 30%, ఉలవలు 25%, వరిగడ్డి లేదా పుట్టమన్ను 15% కలిపి ఇవ్వాలి.
కాయగూరలతో పాటు అందుబాటులో ఉన్నప్పుడు బొప్పాయి, గుమ్మడి కాయలను కూడా సన్నగా తరిగి మేతలో కలపవచ్చు.
షెడ్ చుట్టూరా అడుగు దూరంలో నిమ్మగడ్డి, పుదీనా వంటి మొక్కలను పెంచితే.. దోమలు, ఇతర పరాన్నజీవులు కోళ్లను బాధించవు.
నీటిలో కరిగే సున్నం, గుడ్ల పెంకులు, నత్తగుల్లలు, ఎముకలు గోధుమ రంగుకు తిరిగే వరకు వేయించి, పొడి చేసి నీటిలో కలిపి మేతలో కలిపి ఇస్తే కాల్షియం లోపం తీరుతుంది.

డా. చో ప్రకృతి సాగు పద్ధతులపై వేసవిలోశిక్షణ!

డా. చో పద్ధతిలో కోళ్ల పెంపకం ద్వారా రైతుకు నికరాదాయం బాగా వస్తుంది. మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు రావు. డా. చో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు పంటలూ పండించవచ్చు. ‘సర్ర’ స్వచ్ఛంద సంస్థతో కలసి ఎస్వీయూలో అధ్యయనం చేశాం. ఫలితాలు బాగున్నాయి. ఈ వేసవిలో రైతులు, విద్యార్థులు, అధ్యాపకులు, విదేశీయులకు విడివిడిగా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం.

- ప్రొ.సాయి గోపాల్ (98496 15634), వైరాలజీ విభాగాధిపతి, ఎస్వీయూ, తిరుపతి
ఇతర వివరాలకు: రోహిణీరెడ్డి (‘సర్ర’ సంస్థ)- 099859 47003, సోమశేఖర్- 99661 43361

ల్యాక్టో బ్యాక్టిరియా తయారీ ఇలా

కోళ్ల ఫారమ్‌లో ఉపయోగించే ల్యాక్టో బ్యాక్టీరియాను తయారు చేసుకోవడం అతి సులభం. ఇంట్లో బియ్యం కడిగిన నీటిని ఒక ప్లాస్టిక్ టబ్‌లో లేదా కుండలో పోసి ఉంచుకోవాలి. బియ్యం కడిగిన నీరు 3 నుంచి 5 రోజుల్లో పులిసి పుల్లని వాసన వస్తుంది. ఈ నీటిని ఓ పాత్రలోకి పోసుకోవాలి. ఒక వంతు బియ్యం కడిగిన నీళ్లకు పది వంతులు పాలు కలపాలి. పాత్రలో మూడో వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఈ పాత్రకు మూతి బిగించి లేదా శుభ్రమైన తెల్లకాగితంతో కప్పి దారంతో కట్టి ఎండసోకని మూలన భద్రపర్చుకోవాలి. 3 రోజుల్లో పాత్రలోని ద్రావణం 3 పొరలుగా ఏర్పడుతుంది. పై భాగంలో పాలలోని కొవ్వు పదార్థాలు తెట్టు మాదిరిగా పేరుకుంటాయి. మధ్య భాగంలో పసుపు పచ్చ లేదా లేత పసుపు పచ్చ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ల్యాక్టో బ్యాక్టీరియా. దీన్ని వడకట్టుకొని మరో పాత్రలో పోసుకోవాలి. నిలువ ఉంచుకోవడానికి ద్రావణం ఎంత ఉందో అంత బెల్లాన్ని కలుపుకోవాలి. కోళ్ల షెడ్డులో నాలుగైదు మిల్లీలీటర్ల ల్యాక్టో బ్యాక్టీరియాను ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.

ఆధారము: సాక్షి

ఆటో ఆయిల్ ఇంజిన్!

ఆటో ఆయిల్ ఇంజిన్‌ను సృష్టించిన మెకానిక్
లీటర్ డీజిల్‌తో రెండు గంటలు పనిచేస్తుంది.
ఖర్చు తక్కువ , మన్నిక ఎక్కువ.
చైనా ఇంజిన్ల కంటే చవక

కార్తె బలువున కురువని వర్షం కరువై కాటేస్తే.. కడుపు నింపు తుందనుకున్న పంట కళ్ల ముందే నిలువునా ఎండి పోతే గుండె పగిలిన రైతు లు బలవన్మరణాల పాల వుతున్నారు. ఒక ఊరిది కాదు, ఒక పల్లెది కాదు. ఆ చివర అనంతపురం నుంచి ఈ చివర ఇచ్ఛా పురం వరకు.. ఎందరో రైతుల పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితిలో పదునెక్కిన ఆలోచనే వారికి పరిష్కారాన్ని కూడా చూపిస్తోంది. సాగునీటి కష్టాలను చూసి చలించిన రామ శివప్రసాద్‌లో మొగ్గ తొడిగిన ఆలోచన ఆటో ఇంజిన్‌తో నీటి పంపు తయారీకి పురికొల్పింది.

వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో వృత్తి రీత్యా ఆటో మెకానిక్ అయిన రామ శివప్రసాద్ ఆటో ఇంజిన్‌నే ఆయిల్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాడు. చైనా ఆయిల్ ఇంజిన్ కంటే మన్నిక ఉన్న ఈ పంపు సెట్ 7.5 హెచ్‌పీ ఇంజిన్ కంటే ఎక్కువ నీరు తోడగలుగుతోంది. ఏకంగా 240 అడుగుల దూరం నుంచి నీటిని తోడే సామర్థ్యంతో 24 గంటల పాటు నడిచినా ఇంజిన్ వేడెక్కకుండా నిలుస్తోంది. ఇంధన ఖర్చు కూడా చాలా తక్కువ. లోడు ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు డీజిల్ ఆయి ల్‌తో గంటన్నర సేపు నడుస్తుంది. లోడు తక్కువగా ఉంటే 2 గంటలు పనిచేస్తోంది. రైతులు దీని పని విధానం పట్ల పూర్తిగా సంతృప్తి చెందారు.

రామ శివప్రసాద్ చదివింది ఏడో తరగతి వరకే. రైస్‌మిల్లులో 15 ఏళ్లు పనిచేశాక ఆటో మెకానిక్ పని నేర్చుకొని షాపు పెట్టుకున్నాడు. ఆటోలతో పాటు చైనా పంపు సెట్లు, పవర్ స్ప్రేయర్లు కూడా బాగు చేసేవాడు. మాటిమాటికీ మరమ్మతుకొచ్చే చైనా మోటార్లను మోసుకొస్తూ ఇబ్బందులు పడే రైతుల బాధలను చూసి తానూ బాధపడేవాడు. చివరకు ఎలాగైనా ఈ ఇబ్బందిని పరిష్కరించే కొత్త తరహా మోటార్‌ను తయారు చేయాలని నిర్ణయించుకొని, గత వేసవిలో పని ప్రారంభించాడు.

ప్రతి నెలా ఒక పంపు సెట్‌ను తయారు చేయడం, పరీక్షించి చూసుకొని, అందులోని లోపాలను గుర్తించడం, తిరిగి మార్పులు చేయడంపైనే రామ శివప్రసాద్ దృష్టిని కేంద్రీకరించాడు. ఆ విధంగా ఆరు నెలలు శ్రమించి చివరకు 12 వోల్ట్స్ బ్యాటరీతో సెల్ఫ్ స్టార్టర్‌తో కలిపి మోటార్ పంపును రూపొందించాడు. ఇప్పటి వరకు 20 మంది రైతులు దీన్ని తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. మోటార్ తయారీకి దాదాపు 22 వేల రూపాయలు ఖర్చయింది. మార్కెట్‌లో దొరికే ఆయిల్ ఇంజిన్లు, కరెంట్ పంపు సెట్ల ధరలు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో లేవు. తక్కువ ఖర్చుతో మాంచి మన్నికైన పంపును సృష్టించిన రామ శివప్రసాద్ సృజన రైతు లోకం నీటి కష్టాలను తీర్చే వరప్రసాదమనే చెప్పాలి.
- మహేందర్,
శాయంపేట, వరంగల్ జిల్లా

కమ్ముకున్న కారు మబ్బు చినుకు కురవక తొలగిపోతే పచ్చగెదిగిన పంట చేలు కనుల ముందె నిలువునెండగ.. గుండె చెదిరిన రైతు బిడ్డడు లోకమే ఎడబాసిపాయే..!

6 నెలలు కష్టపడి తయారుచేశా!
రైతులు పడే బాధ నన్ను కదిలించింది. ఆటోలో పది, పదేహేను మంది వెళ్తుంటారు. ఇంత లోడును భరించే ఆటో ఇంజన్ బావిలోంచి నీరు లాగలేదా? అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక ఆటో ఇంజిన్‌తో ప్రయోగాలు మొదలు పెట్టాను. తయారు చేయడం.. పరీక్షించడం.. అర్థమైన లోపాలను సరి చేయడం.. ఇలా 6 నెలలు కష్టపడి సాధించాను. ఇంజిన్‌ను సెల్ఫ్ స్టార్టర్‌తో సిద్ధం చేశాను. దీని తయారీకి రూ. 22 వేలు ఖర్చయింది. ఈ ఇంజిన్లను ఇప్పుడు 20 మంది రైతులు వాడుతున్నారు. ఈ ఇంజిన్ కాలువలు, బావుల్లోంచి నీరు తోడగలదు. బోరు బావులకు పనిచేయదు. అయితే, దీనికి డైనమో బిగించి కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే రెండు మోటార్లకు కరెంట్ అందించవచ్చు. డబ్బుల్లేక డైనమో తయారు చేయలేదు. త్వరలో అది కూడా తయారు చేస్తా. రైతులు కావాలంటే ఇలాంటి ఆటో ఆయిల్ ఇంజిన్లు తయారు చేసి ఇస్తా.

ఆధారము: సాక్షి

ఏడు అడుగులకు ఒక బెడ్ పద్ధతి...

ఈ సాగు విధానంలో నేలను సిద్ధం చేసుకోవడం, మొక్కలు నాటడం కీలకమైనవి. అరెకరంలోనే వేయాల నేం లేదు. పావెకరంలోనూ.. వీలయితే ఎకరం పొలం లోనూ ఈ సాగు చేపట్టొచ్చు. ముందుగా పొలం చుట్టూ ఒకటిన్నర అడుగుల వెడల్పు, అర అడుగు లోతు కాలువ తవ్వుకోవాలి. తరువాత ఏడు అడుగులకు ఒక బెడ్(మట్టి పరుపు)ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు మట్టి పరుపుల మధ్య 2 అడుగుల వెడల్పు కాలువ తవ్వుకోవాలి. దీని వలన మట్టి పరుపు మీద పడిన నీరు అదనంగా నిలవ కుండా జారిపోతుంది. వర్షాకాలంలో నీరు తీసివేయ డానికి, ఎండాకాలంలో నీరు పెట్టడానికి వీలవుతుంది.

కంపోస్టు లేదా చెరువు మట్టి + పశువుల ఎరువు..
మట్టి పరుపు మీద వర్మీ కంపోస్టు, నాడెపు కంపోస్టు లేదా చెరువు మట్టి, పశువుల ఎరువు కలిపి ఆరు నుండి ఎనిమిది అంగుళాల మందాన పరవాలి. మొదటి మట్టి పరుపు మీద మూడున్నర అడుగుల స్థలం వదిలి ప్రతి ముపై ్ప ఆరు అడుగులకు ఒకటి చొప్పున.. ఎత్తుగా ఎదిగే పండ్ల మొక్క (మామిడి, ఉసిరి, నేరేడు, పనస)ను నాటుకోవాలి. ఇవి అర ఎకరంలో దాదాపు పదహారు వరకు వస్తాయి. తరువాత ఈ మొక్కల మధ్య ప్రతి 18 అడుగులకు ఒకటి చొప్పున జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి లాంటి మొక్కలు నాటుకోవాలి. ఆ తరువాత ప్రతి తొమ్మిది అడుగుల దూరానికి ఒకటి చొప్పున పెద్దగా కొమ్మలు రాని బొప్పాయి, అరటి లాంటి మొక్కలు నాటుకోవాలి. వీటి మధ్య ఒక పావు ఎకరంలో పలు రకాల కూరగాయ విత్తనాలు విత్తుకోవాలి.

‘మా పిల్లలు మంచిగా తింటున్నారు’
మావన్నీ మెట్ట భూములు వానలు లేక ఏం పండేది కాదు. నేను ఒంటరిదాన్ని. ఇద్దరు పిల్లల్ని ఎలా చదివించాలా అని బాధపడేదాన్ని. పారినాయుడు సారు అన్నపూర్ణ పద్ధతి బాగుంటదని చెపితే, అరెకరంలో పంటలు, పండ్ల మొక్కలు వేసుకున్నాం. మా పిల్లలు మంచిగా తింటున్నారు. ఈ సీజన్‌లో రూ.25,500 ఆదాయం కూడా వచ్చింది.
- కమలకుమారి, పెంగువ, గుమ్మలక్ష్మీపురం మండలం

కడుపు నిండా తింటున్నాం!
ఇంతకు మునుపు ఏడాదంతా పనిచేసినా డబ్బులకు ఇబ్బందిగా ఉండేది. 13 జాతుల విత్తనాలు వేశాం. ‘అన్నపూర్ణ’ వల్ల మేం కడుపునిండా తింటున్నాం. ఈ పంటకాలంలో (4-5 నెలలు) మేం తిన్నది కాక రూ.32,500 ఆదాయం వచ్చింది.
- చంద్రమ్మ, మర్రిగూడ, కురుప మండలం

ఇతర రాష్ట్రాల్లోనూ అమలు..!
‘అన్నపూర్ణ’ సాగు పద్ధతి పేద రైతులకు చాలా ఉపయోగకరం. వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా పంటలు పండించడానికి ఈ పద్ధతి చాలా అనువైనది. కేవలం అర ఎకరంలో బహుళ పంటల సాగుతో సంవత్సరం పొడవునా రైతుకు ఆహారం, ఆదాయం సమకూరడం ఇందులో చాలా కీలకమైనవి. సెర్‌‌ప ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న దీన్ని ఇతర రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాల ద్వారా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 
- విజయ్‌కుమార్,
సంయుక్త కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, 
డెరైక్టర్, జాతీయ గ్రామీణాభివృద్ధి మిషన్

ఆధారము: సాక్షి

అర ఎకరం ‘అక్షయపాత్ర’!

చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ‘అన్నపూర్ణ’ భరోసా ఏడాది పొడవునా అందుబాటులో పౌష్టికాహారం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం! విజయనగరం జిల్లాలో సక్సెస్.. ఇతర రాష్ట్రాలకూ విస్తరింపజేసే యోచన

ఆకలి.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద హింస! మనిషి ముఖం మీద నవ్వును తుడిచేసే శక్తి ఒక్క ఆకలికే ఉంది. అపార పకృతి సంపద నిలయమై, అనాదిగా సంస్కృతి వికాస కేంద్రమైన ప్రాంతాన్ని కూడా ఒక్కసారిగా సోమా లియా, ఇథియోపియాల్లా మార్చగలదు. దేశాలకు దేశాలను క్షామాల్లో తగలేసి శవాల దిబ్బలను చేయగలదు. ఎన్ని హరిత విప్లవాలు వచ్చినా, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వేసినా ఆకలి సమస్య ఇంకా కాలుస్తూనే ఉంది. అసలు మనిషికి ఆయువంత సహజంగా అన్నం దొరకాలి. కానీ ఆకలి కోసం ఆరాటాలు, పోరాటాలేమిటి? కనిపించని శక్తు లేవో సహజ వనరులపై పట్టు బిగించి ప్రాథమిక అవసరై మెన ఆహారాన్ని అందని సరుకుగా మారుస్తున్నట్లనిపిస్తుంది.

జనాభాలో సగానికి పైగా పౌష్టికాహారం దొరక్క అలమటిస్తుండగా ఆకలి కేకలు మాన్పే చారిత్రక బాధ్యతను తలకెత్తుకుంది ‘అన్నపూర్ణ’ సాగు నమూనా. అరెకరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో చిన్న రైతు కుటుంబానికి సరిపడే ఆహారం అందించే లక్ష్యంతో ఈ ‘అన్నపూర్ణ’ విధానానికి రూపకల్పన జరిగింది. ‘అన్నపూర్ణ’ నమూనా పారినాయుడు మాస్టారు నాయకత్వంలో ‘జట్టు’ స్వచ్ఛంద సంస్థ రూపొందించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం తోటపల్లి కేంద్రంగా ‘ప్రకృతి ఆది దేవోభవ’ ఆశ్రమంలో అంకురించింది. ప్రకృతి సేద్యం ద్వారా ప్రతి రోజూ ఏదో ఒక పంట చేతికందిస్తూ.. ఒక కుటుంబానికి సరిపడే ఆహారంతో పాటు ప్రాథమిక అవసరాలకు సరిపడే ఆదాయాన్ని అందించడమే ఈ పద్ధతి లక్ష్యం. ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యం, రైతు సంక్షేమం ఒకదానితో ఒకటిగా కలగలసిన ‘అన్నపూర్ణ’ వ్యవసాయ విధానం డెబ్బై మందితో మొదలై.. ఇప్పుడు మూడు వేల మంది రైతుల జీవితాల్లో వెలుగుపూలు పూయిస్తోంది.

‘అన్నపూర్ణ’ సాగుతో ప్రతి రోజూ కూరగాయలు
ఒక బెడ్(మట్టి పరుపు) మీద ఉల్లి వేసుకుంటే.. రెండో మట్టి పరుపు మీద ఆకుకూరలు, మూడో మట్టి పరుపు మీద వంగ, తరువాత మరో రకం కూరగాయలు పండించాలి. కాల్వల వెంట మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఒక బెడ్‌లో పంటకు ఆశించిన పురుగు మరో మట్టి పరుపులో పంటకు సోకదు. ఈ పావెకరంలో ప్రతి రోజూ ఏదో ఒక కూరగాయ పంట చేతికి అందుతుంటుంది. పొలం చుట్టూరా బంతి, ఆముదం, అలసంద లాంటి పంటలు వేసుకుంటే.. ఎర పంటలుగా చీడపీడల నియంత్రణకు ఉపయోగపడతాయి. రోజు వారీ ఆహారం కోసం వేసుకున్న పంటలకు పావెకరం పోగా.. మిగిలిన పావు ఎకరంలో రేపటి కాలానికి ఉపయోగపడే ఆహారాన్ని పండించుకోవాలి. అంటే నిల్వ దినుసులన్నమాట. ఒక మట్టి పరుపులో మినుము, పెసర వంటి పప్పు దినుసులు, మరో మట్టి పరుపుపై వేరుశనగ, పొద్దుతిరుగుడు, శ్రీవరి, మెట్ట శ్రీవరి, జొన్న లాంటి పంటలు వేసుకోవాలి. ఇలా మూడు రకాల పంటలు మార్చి మార్చి వేసుకోవడం వలన సంవత్సరానికి సరిపడా పప్పులు, ధాన్యం, నూనె గింజలు కూడా పొందవచ్చు. ఇందులో పండ్ల మొక్కల మధ్య దూరం 36 అడుగులు ఉండడంతో నీడ సమస్య తలెత్తదు. ఏడాది పొడవునా కూరగాయ పంటలు వేసుకోవచ్చు. నీడ పడే ప్రాంతాల్లో పసుపు, అల్లం, అనాస, కంద వంటి పంటలు వేసుకోవాలి.

అదుపులో శత్రు కీటకాలు
ప్రతి బెడ్‌కు ఒక వైపు రక్షక పంట వేయడం వలన మిత్ర కీటకాల సంఖ్య పెరిగి శత్రు కీటకాలను అదుపులో ఉంచుతాయి. బంతి, చేమంతి వంటి ఎర పంటలు తెగుళ్లను చాలా వరకు నివారించడానికి ఉపయోగపడతాయి. మునగ, పప్పుజాతి మొక్కలు ఆకుల ద్వారా గాలిలోని నత్రజనిని గ్రహించి.. వేళ్ల ద్వారా ఇతర పంటలకు అందిస్తాయి. నాబార్డ్, ‘సెర్ప్’ తోడ్పాటుతో విజయనగరం జిల్లాలో ‘అన్న పూర్ణ’ ప్రకృతి సాగు విధానం ద్వారా ఇప్పటికే ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేల మంది రైతులు పంటలు పండిస్తున్నారు. నాటు పశువుల పేడ, మూత్రంతో సొంతంగా తయారు చేసు కున్న బీజామృతం, జీవామృతం, నీమాస్త్రంలను పంటలకు వాడుతున్నారు. మెట్ట భూముల్లో అర ఎకరం సాగుతో ఇంటి ఆహార అవసరాలు తీర్చుకుంటూనే 4-5 నెలల్లో సగటున రూ.30-50 వేలు, నీటివసతి ఉన్న భూముల్లో రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఆకలి లేని నాడు అసమా నతలుండవు. అసమానతల్లేని నాడు ఆగ్రహాలుండవు. సమతా స్వప్నానికి ‘అన్నపూర్ణ’ పాదులేసి నీరు పోస్తోంది! 
- కె. క్రాంతికుమార్‌రెడ్డి (96032 14455)

స్వయంసమృద్ధే లక్ష్యం!
చిన్న/సన్నకారు రైతు కుటుంబానికి అర ఎకరం భూమిలో సహజాహారాన్ని, ఏడాది పొడవునా అందించే లక్ష్యంతో లోపరహితంగా ‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పద్ధతిని రూపొందించాం. ప్రతి కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆహార భద్రతను అందిస్తుంది. రోజువారీగా ఇల్లు గడవడానికి దేన్నీ కొనాల్సిన అవసరం లేకుండా.. స్వయంసమృద్ధి సాధించాలన్నదే మా లక్ష్యం. 
- పారినాయుడు, ‘అన్నపూర్ణ’ రూపశిల్పి,
‘జట్టు’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు,
94401 64289, 89789 04990

ఆధారము: సాక్షి

గురవయ్య గొర్రు!

అచ్చమైన రైతు ఆవిష్కరణ ‘గురవయ్య గొర్రు’ పొలంలో విత్తనం, ఎరువు, కలుపు మందులను ఏకకాలంలో వేయడం దీని ప్రత్యేకత

చెమట తడిసిన నేల సిరులు కురిపిస్తుందనే విశ్వాసంతో అహర్నిశలు శ్రమించడం, పుడమి తల్లిని పులకింపజేసి పంట సిరులు పండించడం ఆయన దినచర్య. ఏ పట్టాలూ లేవు. శాస్త్ర, సాంకేతిక పదాలు అసలే తెలియవు. తెలిసిందల్లా సేద్యమే. కూలీల కొరతను అధిగమించి, సాగు ఖర్చును తగ్గించేందుకు ఉపయోగపడే అద్భుతమైన గొర్రును కనిపెట్టారు. ఇది ఒకేసారి 5 పనులు చేస్తుంది. పెద్ద చదువులు చదివిన శాస్త్రవేత్తలకూ వల్లకాని పనిని సాధించి దేశవ్యాప్త ఖ్యాతి గడించారు. ఈ రైతు శాస్త్రవేత్త పేరు తొండపి గురవయ్య. ఊరు గుంటూరు జిల్లా పల్నాడులోని రూపెనగుంట్ల.

‘ఈ పని రైతు వల్లనే అవుతుంది..
సుమారు నాలుగేళ్ల క్రితం.. లాం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ యల్లమందారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన రైతుల సమావేశంలో చర్చ గురవయ్యకు ప్రేరణ కలిగించింది. వరి కోతలయ్యాక దుక్కి దున్నకుండా (జీరోటిల్లేజ్) మొక్కజొన్న విత్తడం, పత్తి తీయడం, మిర్చి కాయలు కోయడం.. ఈ మూడు పనులు చేసే యంత్ర పరికరాలు మన దేశంలోనే అందుబాటులో లేవు. వీటిని తయారుచేయడం ఇంకో పదేళ్లకైనా అనుభవజ్ఞులైన రైతులకే సాధ్యం. ఆ పని చేసిన రైతు కోటీశ్వరుడవుతాడన్నది చర్చ సారాంశం. ఈ మాటలు గురవయ్యలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అప్పటికే ఈ దిశగా ప్రయత్నిస్తున్న ఆయనలో పట్టుదల పెరిగింది. తొలుత బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ సహాయ పడింది. పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం పొందిన తర్వాత ఆయన లక్ష్యాన్ని ఛేదించారు.

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్ధ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ‘నిట్’ (వరంగల్) సన్మానించాయి. జాతీయ స్థాయి ‘శాంసంగ్ ఇన్నొవేషన్ కోషియంట్-2012’ పోటీల్లో రూ. 3 లక్షల బహుమతిని గెల్చుకుంది. తాజాగా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అవార్డుకు గురవయ్య ఎంపికయ్యారు.
- షేక్ సైదా, న్యూస్‌లైన్, నకరికల్లు (గుంటూరు జిల్లా)

‘గురవయ్య గొర్రు’ పని చేసేదిలా..
గురవయ్య గొర్రును ట్రాక్టర్‌కు అమర్చి వినియోగించాలి. చాలు వేసి, విత్తనాన్ని, ఎరువును నిర్ణీత దూరంలో, 1.5 సెం.మీ. లోతులో వేసి, వాటిపై మట్టిని కప్పేస్తుంది. అంతేకాదు కలుపు మందును కూడా పిచికారీ చేస్తుంది. వరి కోసిన వెంటనే తడి పొలంలోనే దుక్కి చేయకుండా తక్కువ ఖర్చుతోనే ఈ పనులు చేసుకోవచ్చు. దీని తయారీకి రూ. 90 వేలు ఖర్చవుతుందని గురవయ్య వివరించారు. ఈ ఏడాది పేటెంట్ రానుంది. ఆ తర్వాత ఇది రైతులకు అందుబాటులోకి వస్తుంది.

శాస్త్రవేత్తలు పొలాల్లోకి రావాలి..
రైతులు, కూలీల పిల్లలు వ్యవసాయ పనులు చేయడం లేదు. కూలీల కొరతతో పొలం పనులు సాగడం లేదు.. యంత్ర పరికరాలను వినియోగించి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పనులు చేస్తేనే వ్యవసాయం లాభసాటి అవుతుంది. అందుకే పట్టుదలగా గొర్రును రూపొందించా. శాస్త్రవేత్తలు పొలాల్లోకి వచ్చి రైతుల అనుభవాలను గుర్తించాలి. సలహాలు, సూచనలివ్వాలి. అప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. 
- తొండపి గురవయ్య (99890 87931) రూపెనగుంట్ల, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా- 522615

రైతుల అభిప్రాయాలే గీటురాయి..
గొర్రును రూపొందించే ప్రతి దశలోనూ సహచర రైతులను ఏడుసార్లు సమావేశపరచి, వారి సూచనలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. అందువల్లే నిపుణులు తయారు చేయలేకపోయిన లోపరహితమైన గొర్రును కేవలం 3 నెలల్లో రూపొందించడం సాధ్యమైంది.
- విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం
చైర్మన్, పల్లెసృజన (98660 01678)

ఆధారము: సాక్షి

పరికరం ఒకటే.. పనులు మూడు!

పరికరం ఒకటే.. పనులు మూడు!

ఆరుతడి పంటల్లో కలుపు తీతకు యంత్రాన్ని తయారు చేసిన సృజనాత్మక రైతు విశ్వనాథం
చెరకు, మిరప తదితర పంటలతోపాటు శ్రీవరి పొలాల్లో కలుపు తీతకు, గొప్పు తీయడానికీ అనుకూలం!

ఆరు పదులు దాటిన వయస్సు. అందరిలా కృష్ణా రామా అనుకోకుండా.. మట్టి మీద మమకారం మరింత పెంచుకున్నాడు ఈ పెద్దాయన. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం గ్రామానికి చెందిన పాలచర్ల విశ్వనాథం వయసు మీద పడుతున్నా ప్రాణప్రదంగా వ్యవసాయం సాగిస్తున్నారు. నానాటికీ పెరిగి భారమవుతున్న వ్యవసాయ పెట్టుబడులను తగ్గించే లక్ష్యంతో ఆలోచనలకు పదును పెట్టారు. ఈ ప్రాంతంలో చెరకు సాగు ఎక్కువ. కూలీల కొరతతో పెరిగిన కూలి రేట్లు తడిసి మోపెడవుతున్నాయి. ఎలాగైనా సాగు ఖర్చులు తగ్గించి రైతుకు నాలుగు డబ్బులు మిగిలే దారి వెతకాలని ప్రయత్నించి.. చెరకు పొలాల్లో కలుపు తీత పరికరాన్ని రూపొందించారు. రాజానగరం కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు ఉపయోగించుకున్నారు.

తేలికపాటి నేలల్లో చెరకు సాగు చేసే రైతులను దృష్టిలో పెట్టుకుని విశ్వనాథం కోనోవీడర్‌ను పోలిన పరికరాన్ని రూపొందించారు. కోనోవీడర్‌ను శ్రీవరి సాగులో తడి నేలలో కలుపు తీతకు ఉపయోగిస్తారు. దీని పని విధానం గమనించిన విశ్వనాథం ఆరుతడి పంటలకు ఉపయోగపడే విధంగా, అందుబాటులో దొరికే వస్తువులను వినియోగించుకొని రూ. 1,200 ఖర్చుతో ఈ పరికరాన్ని తయారు చేశారు.

ఎకరం చెరకు తోటలో కలుపు తీయడానికి పది మంది కూలీలు అవసరమవుతారు. విశ్వనాథం తయారు చేసిన కలుపుతీత యంత్రం వినియోగిస్తే ఇద్దరితో పని పూర్తవుతుంది. దీని వలన రైతుకు ఎకరానికి రూ. 3 వేల ఖర్చు తగ్గుతుంది. ఇదే పరికరానికి అదనంగా చిన్నపాటి నాగలిని అమర్చి గొప్పు తీయవచ్చు. దీనికి రొటోవీడర్‌ను అమరిస్తే శ్రీవరి పొలంలోనూ కలుపు తీయవచ్చు. డ్రమ్‌సీడర్‌తో సాగు చేసిన వరి మాగాణిలో కూడా ఈ పరికరాన్ని వినియోగించి కలుపు తీయవచ్చు.

వరి పంట చిరుపొట్ట దశకు వచ్చే వరకు మూడుసార్లు అంతర కృషి చేస్తే.. దుబ్బు విస్తరించి మూడు నుంచి నాలుగు బస్తాల అధిక దిగుబడి సాధించవచ్చని విశ్వనాథం వివరించారు. ఒకే సాధనంతో మూడు పనులు నిర్వహించే వీలుండడంతో చుట్టుపక్కల రైతులు దీనిపై ఆసక్తిని కనబరుస్తున్నారు. వ్యవసాయంలో పలు దశాబ్దాల అనుభవం ఉన్న విశ్వనాథం సృజనాత్మక కృషిని గుర్తించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈయనను సృజనాత్మక రైతుగా ఎంపిక చేసింది. జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లా ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించారు.

చెరకు ముచ్చెలకు బదులు.. మొక్కలు!

తణుకు చక్కెర కార్మాగారం పరిధిలో చెరకు సాగు ఎక్కువగా ఉండడంతో సాగు పరిస్థితిని పరిశీలించిన విశ్వనాథం సాగు ఖర్చులు తగ్గించడానికి చెరకు ముచ్చెలు నాటడానికి బదులు నర్సరీలో మొక్కలు పెంచి నాటే పద్ధతిని పరిచయం చేశారు.

విశ్వనాథం ఇంకా ఇలా వివరించారు.. సాధారణ పరిస్థితిలో ఎకరాలో చెరుకు నాటడానికి 40 టన్నుల చెరుకు అవసరం పడుతుంది. దీనికి రైతు రూ. పది వేలు ఖర్చు చేయాలి. దీనికి బదులుగా ఒంటికన్ను ముచ్చలను ప్రోట్రేలలో పెంచడం ద్వారా ఎదిగిన మొక్కలను నేరుగా నాటుకునే వీలుంటుంది. నర్సరీ పెంచిన తేదీని చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం పైరు నాటిన తేదీగా గుర్తించడం వలన నెల రోజులు ముందుగానే కటింగుకు అందివస్తుంది. దీనికి తోడు సాధారణ పద్ధతిలో చెరకు నాటడానికి 25 మంది కూలీల అవసరం పడుతుంది.

ఎదిగిన మొక్కలు నాటడానికి కేవలం ఆరుగురు కూలీలు సరిపోతారు. కూలీల ఖర్చులో రూ. 5 వేలు ఆదా అవుతాయి. విత్తనం ఖర్చులో రూ. రెండు వేలు మిగులుతుంది. మొక్కలు నాటడం వలన.. పిలకల సంఖ్య పెరిగి ఎకరానికి సుమారు పది టన్నుల దిగుబడి పెరుగుతుంది. మొత్తంగా రైతుకు రూ. పది నుంచి పదిహేను వేలు ఆదా అవుతుంది. ఆరు పదులు దాటినా చురుకుగా వ్యవసాయ పనుల్లో పాల్గొనడమే కాక సాటి రైతులకు సహకారం అందిస్తూ, వినూత్నంగా ఆలోచించే విశ్వనాథం రైతాంగానికి ఆదర్శ ప్రాయుడుగా నిలుస్తున్నారు.

- బూరాడ శ్రీనివాసరావు, పెద్దాపురం రూరల్, తూ. గో. జిల్లా

కావాలంటే తయారు చేసిస్తా..!
పలువురు రైతులకు కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసి ఇచ్చా. ఆసక్తి ఉన్న వారికి దీని తయారీ విధానం తెలియజేస్తా. కావాలన్న వారికి తయారు చేసి ఇస్తా.

- పాలచర్ల విశ్వనాథం (9390479971), సృజనాత్మక రైతు, జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా.

ఆధారము: సాక్షి

‘హైడ్రోపోనిక్స్’తో అంతా ఆదాయే

పాడి పశువుల పోషణకయ్యే ఖర్చులో సుమారు 70% మేత కోసమే వెచ్చించాల్సి వస్తోంది. దీనిలోనూ ఎక్కువ భాగం దాణా పైనే ఖర్చవుతోంది. అయితే పచ్చిమేతలు పుష్కలంగా లభిస్తే దాణపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పచ్చిగడ్డిలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది పాడి పశువుల ఎదుగుదలకు, సంతానోత్పత్తికి, పాల దిగుబడి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించే ప్రతి రైతు పచ్చిమేత పైర్లను సాగు చేయాలి. ఇందుకోసం తనకున్న భూమిలో పదో వంతును కేటాయించాలి. అయితే సాగు నీటి కొరత, కరువు పరిస్థితులతో పాటు పచ్చిమేతల సాగుకు రైతులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి ఎంతో అనువుగా ఉంటుంది.

హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే...

హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల్ని సాగు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కృత్రిమ పద్ధతిలో... విత్తనాలను నానబెట్టి, మొలకెత్తిస్తారు. ఆ మొలకలను 7-10 రోజుల పాటు పాక్షికంగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో (షేడ్‌నెట్ కింద) ఉంచుతారు. స్ప్రింక్లర్లు లేదా ఫాగర్ల ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. దీనికి ప్రధానంగా కావాల్సింది విత్తనాలు, కొద్దిగా నీరు, వెలుతురే.

తేడా ఏమిటి?

సాధారణ పద్ధతిలో రోజుకు 600 కిలోల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలంటే 10,000 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కేవలం 50 చదరపు మీటర్ల స్థలం చాలు. నేల సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎరువులు కూడా అక్కరలేదు. నీరు, విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కూలీల అవసరం కూడా తక్కువే. సాధారణ పద్ధతిలో పచ్చిమేత కోతకు రావడానికి 45-60 రోజులు పడితే ఈ పద్ధతిలో కేవలం వారం రోజులు చాలు. వాతావరణంలో ఒడిదుడుకుల ప్రభావం కూడా ఉండదు.

ఎలా నిర్మించాలి?

హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సూర్యరశ్మిని నియంత్రించడానికి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వెదురు కర్రలు లేదా ఇనుప పైపులతో దానికి ఆధారాన్ని కల్పించాలి. ప్రతి రోజూ 600 కిలోల పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయాలంటే 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేలా షేడ్‌నెట్‌ను నిర్మించాలి. దాని లోపల 3 అడుగుల వెడల్పుతో 2 వరుసల్లో 14 అరలను (ఒక్కో వరుసలో 7 అరలు) ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో దారిని వదలాలి. నీటిని అందించడానికి వీలుగా ప్రతి 2 అడుగులకు ఒక స్ప్రింక్లర్/ఫాగర్‌ను అమర్చాలి.

ఏం చేయాలంటే...

3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అం గుళాల ఎత్తు ఉండే ట్రేలను కొనుగోలు చేయాలి. ఒక్కో ట్రేలో 1.5 కిలోల విత్తనాలను వేయవ చ్చు. ట్రే అడుగు భాగాన రంధ్రాలు ఉంటాయి. ట్రే అడుగున ప్లాస్టిక్ పేపరును పరవాలి. దానికి కూడా అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ట్రేలలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి పశుగ్రాసాల విత్తనాలను వేసుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న విత్తనాలు శ్రేష్టమైనవి. కిలో విత్తనాల నుంచి ఐ దారు కిలోల పుష్టికరమైన మేతను పొందవచ్చు.

ఇలా పెంచండి

మొక్కజొన్న విత్తనాలను 5% కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు వాటిని మండె కట్టాలి. మొలకలను ట్రేలో ప్లాస్టిక్ పేపరుపై సమానంగా పరవాలి. షేడ్‌నెట్‌లో ఏర్పా టు చేసుకున్న అరల్లో పై అరలో ట్రేను ఉంచాలి. పశువుల సంఖ్యను బట్టి ఇలా ప్రతి రోజూ విత్తనాలను ట్రేలో పరిచి, అరల్లో ఉంచాలి. గంటకొకసారి స్ప్రింక్లర్లతో 5 నిమిషాల పాటు ట్రేలపై నీ టిని చిమ్మాలి. ఇందుకోసం టైమర్‌ను అమర్చుకుంటే మంచిది. ఈ పద్ధతిలో కిలో విత్తనాలకు వారం రోజులకు 3 లీటర్ల నీరు సరిపోతుంది. నీటిలో ఎలాంటి పోషకాలను కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలోని పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. ట్రేలలోని మొక్కలు 15-20 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత వాటిని పచ్చిమేతగా వినియోగించొచ్చు.

పోషక విలువలు అధికం

సాధారణ పద్ధతిలో సాగు చేసే పచ్చిమేతల్లో కంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసిన పచ్చిమేతల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి.

ఎలా మేపాలి?

హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన గడ్డిని వేర్లతో సహా పశువులకు మేపవచ్చు. ఈ గడ్డిని ఒక్కో పాడి పశువుకు ప్రతి రోజూ 7-8 కిలోల వరకు మేపితే, పశువులకు రోజూ అందజేసే సమీకృత దాణా మోతాదును కిలో మేరకు తగ్గించుకోవచ్చు. అంతేకాక పాల ఉత్పత్తి 15% పెరుగుతుంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి లేని పాడి రైతులకు, వర్షాభావ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల సాగుకు సంబంధించి మరింత సమాచారం కావాలనుకుంటే యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వారిని (ఫోన్ : 9493619020) సంప్రదించవచ్చు.

ఎ.కృష్ణమూర్తి, పశు పోషణ శాస్త్రవేత్త
జి.ధనలక్ష్మి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్
కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె
కర్నూలు జిల్లా

ఆధారము: సాక్షి

అబ్బురపరిచే ఆవిష్కరణలు!

పంటల సాగులో విపరీతంగా రసాయనాల వినియోగం వల్ల భూసారం, పర్యావరణం నాశనమవుతోంది. సాగు వ్యయం నానాటికీ పెచ్చుమీరి, దిగుబడులు దిగజారుతున్నాయి. ఈ తరుణంలో.. వ్యవసాయ పద్ధతులను ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో సత్ఫలితాలనిచ్చే, ప్రకృతికి హానిచేయని సాంకేతికతలు, యంత్ర పరికరాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఇటువంటి ఆవిష్కరణలను అందించే శాస్త్రవేత్తలకు, రైతు శాస్త్రవేత్తలకు దేశంలో కొదవ లేదు. అయితే, వీటిల్లో చాలా వరకు రైతులకు చేరకుండానే మరుగున పడిపోతున్నాయి. ఈ సమస్యపై దృష్టిపెట్టిన హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి. హెచ్.ఎం.) ఫిబ్రవరి నెల 4-6 తేదీల్లో జాతీయ స్థాయి ప్రదర్శన, వర్క్‌షాప్‌లను నిర్వహించింది. రైతులను ఆకట్టుకున్న కొన్ని ముఖ్య ఆవిష్కరణల వివరాలు క్లుప్తంగా.

ఏ పంటనైనా విత్తగల డ్రమ్‌సీడర్!

  • వరితోపాటు మొక్కజొన్న, అపరాల సాగుకూ ఉపయోగకరం
  • విత్తనంతోపాటే గడ్డి మందు, ఎరువులూ వేయగలదు
  • ఎన్‌.ఐ.పీ.హెచ్‌.ఎం. ప్రదర్శనలో రైతులు, శాస్త్రవేత్తలందరి కళ్లూ దీనిపైనే!

సాధారణ డ్రమ్ సీడర్ వరి విత్తనం వేయడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ బహుళ ప్రయోజనకారి అయిన ఈ డ్రమ్‌సీడర్ వరితోపాటు అనేక ఇతర పంటల విత్తనాలను కూడా విత్తుకోవడానికి ఎంచక్కా పనికొస్తుంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త ధమరశింగి బాబూరావు ఈ వినూత్న డ్రమ్ సీడర్‌ను రూపొందించారు. వ్యవసాయదారుడైన బాబూరావు వెల్డింగ్ వర్క్‌షాపును కూడా నిర్వహిస్తున్నారు. 8 అడుగుల వెడల్పున 3 చక్రాలతో కూడి ఉండే ఈ ఇనుప డ్రమ్‌సీడర్ బరువు 48 కిలోలు. ధర రూ. 32 వేలు. దీనితో మొక్కజొన్న(4 సాళ్లు), వరి, వేరుశనగ, అపరాల విత్తనాల(7 సాళ్లు)తోపాటు గడ్డి మందు కూడా వేయొచ్చు. స్వల్ప మార్పులతో ఘన / ద్రవరూప ఎరువులను కూడా విత్తనాలతోపాటే వేసుకోవచ్చు. చక్రాల దగ్గర అటొకరు, ఇటొకరు నిలబడి దీన్ని లాగాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఎద్దును కట్టి లాగించొచ్చు లేదా 3 హెచ్‌పీ కిరోసిన్ ఇంజిన్‌ను బిగించి నడిపించొచ్చు. దీనితో రెండున్నర గంటల్లో ఎకరం పొలంలో విత్తనాలు వేయొచ్చని బాబూరావు తెలిపారు.

వరితోపాటు ఇన్ని రకాల పంటలు విత్తటానికి, ఎరువు, కలుపు మందు చల్లడానికి పనికొచ్చేదీ.. మనుషులు సులువుగా లాక్కెళ్లే వీలుండే ఇంత మెరుగైన డ్రమ్‌సీడర్ దేశంలోనే మరెక్కడా లేదని ఎన్‌ఐపీహెచ్‌ఎం శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. అందువల్లే ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వివిధ రాష్ట్రాల రైతులను ఇది అమితంగా ఆకట్టుకుంది. ‘కూలీల కొరత రైతులను వేధిస్తోంది. రైతు కష్టాలను తగ్గించడం, సాగు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేస్తున్నా. దీని విడిభాగాలుగా విప్పి దాచి పెట్టుకొని.. అవసరమైనప్పుడు తిరిగి సులువుగా బిగించుకోవచ్చు. ఇనుముతో తయారు చేస్తున్నందు వల్ల దీన్ని బరువు 48 కిలోలైంది. స్టీల్‌ను ఉపయోగించి దీని బరువును 20 కిలోలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు దీన్ని భుజానేసుకొని తీసుకెళ్లొచ్చు. రైతులు, శాస్త్రవేత్తలు మెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు బాబూరావు (94409 40025).

అగ్గిపుల్లే అణ్వస్త్రం!

ఆహార ధాన్యాల నిల్వలో పురుగుల బెడదకు సులువుగా చెక్ బియ్యం/మొక్కజొన్నలు ఇతర ఆహార ధాన్యాల నిల్వలో పురుగులు, ఎలుకల బెడద ఎక్కువ. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఇది తెలిసిందే. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి కొందరు రసాయనిక బిళ్లలను, పొడులను వాడుతుంటారు. బియ్యం వండుకు తినే ముందు కడిగినా ఈ రసాయనాల దుష్ర్పభావం వినియోగదారుల ఆరోగ్యంపై పడక మానదు. ఒంటి పట్టు లేదా ముడి బియ్యానికైతే తెల్లబియ్యం కన్నా తొందరగా పురుగు పడుతుంటుంది. ఈ జటిల సమస్యకు బీహార్ రైతులు చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు. సాధారణ అగ్గిపెట్టెలోని పుల్లలను ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలలో కలిపి.. బస్తాల్లో నిల్వ చేస్తే పురుగులు, ఎలుకల బెడద ఉండటం లేదంటున్నారు. క్వింటాలుకు ఒక అగ్గిపెట్టెలోని పుల్లలు కలిపితే చాలట. ముడి బియ్యంలో రెట్టింపు అగ్గిపుల్లలు కలపాల్సి రావచ్చు. బియ్యం వాడుకునేటప్పుడు అగ్గిపుల్లలను సులువుగా ఏరేయవచ్చు. బీహార్ రైతులు అనేక సంవత్సరాలుగా ఈ పద్ధతిని ఉపయోగిస్తూ కలుషితం కాని ఆహారం తింటున్నారని మహారాష్ట్రకు చెందిన కీటక శాస్త్ర నిపుణుడు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. అవినాశ్ సోలంకి (094222 35816) చెప్పారు. అగ్గిపుల్ల మందులో పొటాషియం క్లోరేట్, రెడ్ ఫాస్ఫరస్ క్రిమిసంహారకాలుంటాయి. ఇవి పురుగులను దరిచేరనీయవని ఆయన అన్నారు.

మందు బిళ్లతో పండీగకు చెక్!

ఉద్యాన పంటల్లో తీవ్ర సమస్యగా మారిన పండీగ(ఫ్రూట్ ఫ్లై)లను అరికట్టడంలో అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే మందు బిళ్ల(ఫ్రూట్ ఫ్లై ల్యూర్ బ్లాక్) అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు దీని రూపకర్త, మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డా. అవినాష్ సోలంకి. దీనిపై కవర్‌ను తొలగించి ఏదైనా డబ్బా లేదా ప్లాస్టిక్ గ్లాస్‌లో ఉంచి తోటలో ఒక చెట్టుకు వేలాడదీయాలి. మరు నిమిషం నుంచే మందు బిళ్లలోని మిథైల్ ఇవోజనల్ అనే రసాయనం వాసనకు పండీగలు మూగి చనిపోతాయని ఆయన చెప్పారు. ఎకరాకు ఒక మందుబిళ్ల సరిపోతుంది. పెట్టిన దగ్గరి నుంచి 90 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని, వర్షానికీ కరగదని అన్నారు డా. సోలంకి. జామ, మామిడిలాంటి అన్ని ఉద్యాన పంటల్లోను దీన్ని వా డిన రైతులు సత్ఫలితాలు పొందారని.. దీన్ని రూ.25కే అందిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు రామస్వామి రాజీవ్ (078426 41626 ఇంగ్లిష్ /హిందీ)ని సంప్రదించవచ్చు.

జీవన ఎరువుల తయారీ సులభతరం

జీవన ఎరువుల వినియోగం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవచ్చు. జీవన శిలీంద్ర నాశకాల ద్వారా చీడపీడలను ప్రకృతికి హాని కలగని రీతిలో నివారించవచ్చు. అజోస్పిరిల్లం, ట్రైకోడెర్మా విరిడి వంటి వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినప్పుడు స్వచ్ఛత, నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా తయారవుతోంది. వీటిని రైతే స్వయంగా, స్వల్ప ఖర్చుతో ఇంటి వద్దే 72 గంటల్లో తయారు చేసుకునే పద్ధతులను, మిత్రపురుగులను పెంపొందించుకోవడాన్ని ఎన్‌ఐపీహెచ్‌ఎం సంస్థ ప్రోత్సహిస్తోంది (రైతుల బృందాలకు ఈ విజ్ఞానాన్ని అందించడానికి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 040 24013346). ఈ పద్ధతులను ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎన్‌.ఐ.పీ.హెచ్‌.ఎం. అసిస్టెంట్ డెరైక్టర్ డా. గిరీష్ (89787 78704 - ఇంగ్లిష్) వివరించారు.

అయితే, జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశకాలను తయారు చేసుకునే పద్ధతిని విశ్రాంత ఇక్రిశాట్ శాస్త్రవేత్త థామస్ నికోడెమస్ (86861 10762 తెలుగు/ఇంగ్లిష్) సులభతరం చేస్తూ ఫెర్మెంటర్ల (విద్యుత్‌తో నడిచే యంత్రాల)ను రూపొందించారు. గ్రామీణ యువత, రైతులు సైతం సులువుగా ఉపయోగించగలిగేలా వీటిని రూపొందించడం విశేషం. 10 లీటర్ల ఫెర్మెంటర్ ధర రూ. 35 వేలు. 20 లీటర్ల ఫెర్మెంటర్ ధర రూ. 80 వేలు. రైతులు, రైతుల బృందాలే కాకుండా జీవన ఎరువులు, క్రిమిసంహారకాల తయారీని స్వయం ఉపాధి కోసం చేపట్టే వారికీ ఫెర్మెంటర్లు ఎంతగానో ఉపకరిస్తాయని థామస్ అంటున్నారు.

రసంపీల్చే పురుగులను మట్టుబెట్టే ‘సోలార్ లైట్ ట్రాప్’

రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు సోలార్ లైట్ ట్రాప్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. దీని రూపకర్త తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ శాస్త్రవేత్త డా. అబ్దుల్ ఖాదిర్ (094885 91915 తెలుగు, ఇంగ్లిష్). దీన్ని పొలంలో నిలబెట్టి.. దీని కింద అమర్చిన బేసిన్‌లో నీళ్లు పోసి.. అందులో ఏదైనా నూనె , షాంపూ లేదా కిరోసిన్‌లను తగు మోతాదులో వేయాలి. ఇందులో అమర్చిన మైక్రోచిప్ వల్ల సాయంత్రం చీకటి పడే వేళకు ఆటోమేటిక్‌గా లైట్ వెలుగుతుంది. రాత్రి పది గంటలు కాగానే దానంతట అదే ఆగిపోతుంది. ఎల్‌ఈడీ లైట్‌ను అమర్చటం వల్ల ఎక్కువ కాంతి వస్తుంది. దీనికి ఆకర్షితమై వచ్చిన శత్రు పురుగులు బేసిన్‌లో ఉన్న నూనె కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి. తద్వారా తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకోవచ్చు. సౌరశక్తితో చార్జింగ్ అవుతుంది. అన్ని కూరగాయ, వాణిజ్య, ఉద్యాన పంటల్లోను వాడుకోవటానికివీలుగా దీన్ని తయారు చేశారు. నిర్వహణ కూడా సులభం. పర్యావరణ హితమైనది. ఎకరాకు ఒక లైట్ ట్రాప్ సరిపోతుంది. దీని ధర రూ. 2,500.

‘పొదుగువాపు’.. 2 రోజుల్లో పరారీ!

అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సంప్రదాయ పశువైద్యుడు బోయ పెద్దరాజన్న తయారు చేసిన పొదుగువాపు వ్యాధిని పారదోలే మూలికల పొడిని పల్లెసృజన సంస్థ (040-27111959) ప్రదర్శనకు ఉంచింది. ఈ మందును వేడినీటిలో కలిపి రెండు రోజులు పొదుగుకు పట్టిస్తే పొదుగు వాపు పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు. నరాల వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోయే (కుందా) వ్యాధి మందు కూడా ఉంది. చిన్న రైతులకు ఉపయోగపడే సోలార్ స్ప్రేయర్ తదితర పరికరాలను సైతం ఈ సంస్థ ప్రదర్శనకు ఉంచింది.

మిత్రపురుగులే రైతు సైన్యం!

రాజు యుద్ధంలో తుది అస్త్రంగా సైన్యాన్ని ప్రయోగిస్తాడు. వ్యవసాయంలో కూడా అంతే.. రైతు పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలేవీ ఫలించని స్థితిలో ఇక మిగిలింది ప్రకృతిసిద్ధమైన మిత్రపురుగుల సైన్యాన్ని ప్రయోగించడమే. కొద్ది నెలల క్రితం సాక్షి సాగుబడి పేజీలో మా సంస్థ గురించి రాస్తూ ‘మిత్రపురుగులే రైతు సైన్యం’ శీర్షిక నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అధికారులు, రైతులతో సమావేశమైన ప్రతిసారీ ఈ శీర్షికను ప్రస్తావిస్తున్నా.

- డాక్టర్ కె.సత్యగోపాల్, డెరైక్టర్ జనరల్,

జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపీహెచ్‌ఎం),

రాజేంద్రనగర్, హైదరాబాద్.

ఆధారము: సాక్షి

చింత తీర్చుతున్న చిన్న ట్రాక్టర్

కాడెద్దుల స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. కానీ ట్రాక్టర్ల ధరలు అధికంగా ఉండటంతో చిన్న రైతులు కొనలేని పరిస్థితి. పెద్ద రైతులు తమ పనులయ్యాక అద్దెకిచ్చే వరకు అదను దాటుతున్నా.. వేచి ఉండక తప్పని పరిస్థితి చిన్న రైతులను వేధిస్తోంది. ఈ సమస్యకు యువ రైతు రమేష్ తనకు తోచిన పరిష్కారం వెతికాడు. విడి భాగాలను కొని తెచ్చి తన అవసరాలకు సరిపోయే చిన్న ట్రాక్టర్‌ను రూపొందించుకొని ఉపయోగిస్తూ పదుగురి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసేందుకు మొదలుకొని, చేతికొచ్చిన పంటను తడవకుండా ఇంటికి చేర్చేవరకూ ప్రతి పనిలోనూ ట్రాక్టర్ అత్యవసరంగా మారింది. దీంతో చిన్న రైతులు తమ పనులు మానుకొని ట్రాక్టర్ల కోసం తిరగాల్సిన పరిస్థితి. ఈ సవాళ్లను అధిగమిస్తూ.. బహుళ ప్రయోజనాలు గల మినీ ట్రాక్టర్ ను రూపొందించా డు గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త పేరం రమేష్.

రమేష్‌ది వ్యవసాయ కుటుంబం. ఐటీఐ(ఎలక్ట్రీషియన్) పూర్తిచేసి తనకున్న రెండెకరాల పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇతరుల ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పొలం ఊరికి 13 కి.మీ. దూరంలో ఉండటంతో ఎద్దులను తోలుకెళ్లడానికి చాలా సమయం పట్టేది. ఎద్దులు కూడా అలసిపోయేవి. ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో మినీ ట్రాక్టర్ తయారీకి సంబంధించిన ఆలోచన రమేష్ మదిలో మెదిలింది. ఆ ఆలోచన ఏడాది కాలంలో కార్యరూపం దాల్చింది. విడిభాగాలు కొనితెచ్చి తొలుత హ్యాండిల్‌తో నడిచే ట్రాక్టర్‌ను తయారు చేశాడు. కొన్ని మార్పులు చేసిన తర్వాత సంతృప్తికరమైన మినీ ట్రాక్టర్ సిద్ధమైందని రమేష్ ఆనందంగా చెప్పాడు. రూ. 40 వేల ఖర్చయింది. రోజూ ఈ ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్లి, పొలం పనులు చక్కబెట్టుకొని వస్తున్నాడు.

ఆటో ఇంజిన్‌తో డీజిల్ ఆదా

ఈ మినీ ట్రాక్టర్ వంద కిలోల బరువుంటుంది. వెడల్పు 26 1/2 అంగుళాలు, ఎత్తు రెండున్నర అడుగులు, పొడవు 3 1/2 అడుగులు ఉంటుంది. ఇది రోడ్డుపై గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని తయారీలో 7.5 హెచ్.పీ ఆటో ఇంజిన్‌ను వాడటంతో మంచి మైలేజీ వస్తున్న దంటున్నాడు రమేష్. ట్రాక్టర్‌కు ముందువైపు స్కూటర్ టైర్లను, వెనుక వైపు ఆటో టైర్లను బిగించాడు. డీజిల్ ఇంజిన్ ట్యాంక్‌ను, ఇంజిన్‌తో గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయడానికి బుల్లెట్ చైన్ స్పాకెట్‌ను వాడాడు. సెల్ఫ్ రేజ్‌పై పొలం దున్నడం దీని ప్రత్యేకత!

రూ. 50 ఖర్చుతో ఎకరంలో పైపాటు

రమేష్ అనుభవం ప్రకారం.. ఈ మినీ ట్రాక్టర్‌తో మెట్ట పైర్లలో విత్తనాలు విత్తేందుకు అచ్చు తోలవచ్చు. గొర్రు, గుంటకలను ఉపయోగించి పైపాటు చేయవచ్చు. నీళ్లు పారించేందుకు బోదెలు తోలవచ్చు. మినీ ట్రాక్టర్ రూ. 50ల డీజిల్ ఖర్చుతో ఎకరంలో పైపాటు చేసుకోవచ్చు. బత్తాయి, జామ, నిమ్మ వంటి ఉద్యాన పంటల్లోని పాదుల్లో కలుపును తొలగించవచ్చు. ఒక బ్రేక్‌ను తొక్కిపట్టి ట్రాక్టర్‌ను చెట్టు చుట్టూ తిప్పుతూ.. కలుపును నిర్మూలించవచ్చు. దీని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పందిరి కూరగాయల తోటల్లోనూ పైపాటు చేయవచ్చు. పెద్ద ట్రాక్టర్‌కుమల్లే ఎక్కువ లోతు దున్నకం చేయవచ్చు. పంప్‌సెట్ బిగించి బావి నుంచి నీరు తోడవచ్చు. ఎకరం పత్తిలో గొర్రు దున్నేందుకు పెద్ద ట్రాక్టర్‌కు మూడు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఈ మినీ ట్రాక్టర్‌కు లీటర్ డీజిల్ సరిపోతుంది. గుంటక తోలడానికి మాత్రం ముప్పావు లీటరు డీజిల్ చాలు. గంటకు ఎకరంన్నర పొలంలో పైపాటు చేయవచ్చు. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవటం తప్ప నిర్వహణ ఖర్చు పెద్దగా ఏమీ లేదు. సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటున్న రమేష్ అభినందనీయుడు.

- మస్తాన్ వలీ, మాచవరం,

గుంటూరు జిల్లా.

వ్యవసాయ పనులన్నీ చేసుకోవచ్చు..!

పెద్ద ట్రాక్టర్లతో పోలిస్తే ఇది చాలా చవక. దాదాపు అన్ని రకాల సేద్యపు పనులు చేసుకోవచ్చు. రైతులెవరైనా కావాలంటే తయారు చేసి ఇస్తాను. స్టీరింగ్, హైడ్రాలిక్ వ్యవస్థను ఏర్పాటు చేయటానికి మరో రూ. 30 వేలు అవసరమవుతుంది. దమ్ము చక్రాలు, సరుకు రవాణా కోసం ట్రక్కుతో పాటు మనుషుల అవసరం లేకుండా విత్తనం, ఎరువులు ఎదబెట్టే పరికరాలను తయారు చేయాలనుకుంటున్నాను.

- పేరం రమేష్ (99899 83705), యువ రైతు శాస్త్రవేత్త, మాచవరం, గుంటూరు జిల్లా.

ఆధారము: సాక్షి

అరక లేకుండానే అంతర కృషి

పత్తి చేను కోసం గొర్రును తయారు చేసుకొని.. రెండేళ్లుగా వాడుతున్న రైతు తెలకపల్లి నరసింహారావు

ఏటా ఎకరాకు రూ. 6 వేల వరకూ అరకల ఖర్చు ఆదా

ఈ గొర్రుంటే కలుపు మందు అవసరం లేదంటున్న శాస్త్రవేత్త డా. మల్లిఖార్జున్ రావు

మనుషులు గుంజే గొర్రును తయారుచేసి రెండేళ్లుగా అరక అవసరం లేకుండానే మూడెకరాల పత్తి పొలంలో పైపాటు(అంతర కృషి) చేస్తున్నారు తెలకపల్లి నరసింహరావు (94403 56925) అనే రైతు.  ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పడమటి లోకారం ఆయన స్వగ్రామం. ఈయనకు సొంత అరకల్లేవు. బాడుగ అరకల కోసం తిరిగి విసిగిపోయి మనుషులు సులువుగా గుంజేందుకు వీలుగా ఉండే గొర్రును తయారు చేయించారు.

వేరే గ్రామంలో ఒక రైతు గొర్రును గుంజుతూ పైపాటు చేస్తుండగా చూసిన నరసింహారావు ఆసక్తిగా వివరాలు తెలుసుకు న్నారు. ఆ గొర్రు 15 కిలోల బరువుంది. భూమిలోకి చొచ్చుకువెళ్లే పాయింట్లు 3 ఉన్నాయి. ఇవి కూడా పెద్దగా ఉన్నాయి. దీన్ని వాడుతున్నప్పుడు భూమిలోకి లోతుగా దిగబడుతున్నది. చాలా బలంగా లాగాల్సి వస్తున్నది. ఇద్దరు మనుషులు కూడా దీనితో పైపాటు చేయటం కష్టంగానే ఉంది.

ఆ గొర్రును పరిశీలనగా చూసిన తర్వాత.. కొన్ని మార్పులు చేస్తే దాన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చన్న ఆలోచన నరసింహరావు మదిలో మెదిలింది. గొర్రు బరువును 5 కిలోలకు తగ్గించాడు. పాయింట్ల సైజు బాగా తగ్గించి, సంఖ్యను 5కు పెంచాడు. రూ. వెయ్యితో గొర్రు తయారైంది. పెద్దగా బలం ఉపయోగించనవసరం లేదు. ఆడవాళ్లు కూడా దీనితో సులభంగా గుంజుతూ అంతర కృషి చేయవచ్చు. దానిపైన 3 కిలోల బరువు ఉంచి ఒక్క మనిషే పైపాటు పని చేసుకోవడా నికి వీలుగా ఉంది. గత రెండేళ్లుగా ఈ గొర్రుతోనే నరసింహారావు తన పత్తి పొలంలో పైపాటు చేస్తున్నారు. గొర్రు గుంజిన తర్వాత మిగిలే కలుపును పూర్తిగా తొలగించడానికి చిన్న గుంటకను కూడా ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లు, అరకతో పైపాటు చేసేటప్పుడు గట్ల వెంబడి మొక్కలు విరిగిపోతాయి. దీనితో ఆ ఇబ్బంది లేదు. పత్తి మొక్కలు బాగా పెరిగాక కూడా కొమ్మలు పక్కకు జరుపుకుం టూ పైపాటు చేయవచ్చు.

మూడెకరాల పత్తిలో ఈ గొర్రుతోనే పైపా టు చేస్తూ నరసింహరావు ఎకరాకు రూ. 6 వేల వరకూ అరకల ఖర్చు తగ్గించుకుంటున్నారు. దీని ప్రయోజనాన్ని గుర్తించిన ఆ గ్రామ రైతులు 30 మంది ఇటువంటి గొర్రులను తయారు చేయించి వాడుతున్నారు.

- ప్రేమ్‌చంద్, వైరా, ఖమ్మం జిల్లా .

చిన్న రైతులకు ఉపయోగం

కలుపు చిన్నగా ఉన్నప్పుడే ఈ గొర్రుతో నిర్మూలిస్తే  కలుపు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. చిన్న  రైతులు అరకల కోసం రోజుల తరబడి ఎదురుచూడకుండా ఈ గొర్రుతో రోజుకు కొంతమేరకు స్వయంగా అంతర సేద్యం చేసుకోవచ్చు.

- డా. మల్లిఖార్జున్‌రావు

(99896 23831),

కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం

ఆధారము: సాక్షి

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free